అనిమా చౌధురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిమా చౌదరి
ప్రాంతము అస్సాం
వృత్తి గాయని, సంగీతకారిణి, ప్రొఫెసర్
క్రియాశీలక సంవత్సరాలు 1970–present

అనిమా చౌధురి (జననం 28 ఫిబ్రవరి 1953) అస్సాంకు చెందిన గాయని. ప్రధానంగా ఆమె అస్సామీస్ జానపద, ఆధునిక పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది. [1] ఆమె అస్సామీస్ సంగీతానికి చేసిన సేవలకు గాను రాష్ట్ర స్థాయి సంగీత, సాంస్కృతిక పురస్కారాలు, బిరుదులు పొందింది. ఆ బిరుదుల్లో "లూయిట్ కువారి", "జన్ దిమాలి" ముఖ్యమైనవి. ఆమె పాడిన పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో 'దిఖౌ నోయిర్ పరోరే', 'లోగ్ దియార్ కోతా అసిల్', 'ఇ ప్రాణ్ గోపాల్' వంటివి ఉన్నాయి.

అనిమా చౌధురి సంగీత రంగంలో రాణించడంతో పాటుగా గౌహతి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొంది ప్రొఫెసర్ గా పనిచేసింది.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

అనిమా చౌధురి 1953 ఫిబ్రవరి 28న దండిరామ్ చౌధురి, హేమలతా చౌధురి దంపతులకు అస్సాంలోని నల్బారి జిల్లాలో నిజ్ పకోవా అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె ఏడుగురు తోబుట్టువులున్న కుటుంబంలో ఐదవ సంతానంగా పెరిగింది. ఆమె తండ్రి నాగోన్‌లో చాలా కాలం పాటు ప్రభుత్వ అధికారిగా పనిచేయడంతో ఆమె ప్రాథమిక విద్య, సంగీత పాఠాలు అక్కడే ప్రారంభమయ్యాయి. అనిమాకి ఇంట్లోనే సంగీతం పట్ల ఆసక్తి, మౌలికమైన అవగాహన ప్రారంభమైంది. ఆమె తల్లి సాంప్రదాయ అస్సామీ సంగీతంపై ఆమెకు ప్రాథమిక అవగాహన కల్పించింది. ఆమె తండ్రి భారతీయ శాస్త్రీయ సంగీత ప్రియుడు. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకొమ్మని ఆమెను ప్రోత్సహించాడు.[2]

ఆమె సుశీల్ బెనర్జీ సంగీత పాఠశాలలో సంగీతంలో తన ప్రారంభ శిక్షణ పొందింది. 1963లో తన తండ్రికి గౌహతి బదిలీ అవడంతో అక్కడ హిరేన్ శర్మ వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందడం ప్రారంభించింది. తన సంగీత శిక్షణ కొనసాగించి చివరికి శాస్త్రీయ సంగీతంలో విశారద్‌ పట్టాను సాధించింది. హిరేన్ శర్మ మరణం తరువాత, ఆమె దామోదర్ బోరా వద్ద శిక్షణ పొందసాగింది. నిరోద్ రాయ్, నృపేన్ గంగూలీ వంటివారు కూడా ఆమెకు గురువులుగా వ్యవహరించారు.[2]

విద్యా రంగంలో[మార్చు]

1972లో అనిమా చౌధురి గౌహతిలోని కాటన్ కాలేజీ నుండి చరిత్ర అంశంలో ఆనర్స్‌తో పట్టభద్రురాలైంది. ఆమె చరిత్ర అంశంలోనే గౌహతి విశ్వవిద్యాలయం నుండి 1974లో ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీని, 1999లో డాక్టరేట్ (PhD) డిగ్రీని పొందింది. "గౌహతి, దాని చుట్టుపక్కల దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు - సామాజిక శాస్త్ర, జానపద అంశాల అన్వేషణ" అనే అంశంపై ఆమె థీసిస్ సమర్పించి డాక్టరేట్ పొందింది. 2013లో ఆమె పదవీ విరమణ చేసే వరకు, ఆమె అస్సాంలోని కామరూప్‌లోని ఛాయ్‌గావ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గానూ, తరువాత చరిత్ర విభాగానికి అధిపతిగా వ్యవహరించింది.[3][2]

ఆమె అనేక అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి సెమినార్‌లకు ఆహ్వానం అందుకుని సంస్కృతికి, సంగీతానికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనా పత్రాలను సమర్పించింది.[4][5]

సంగీత రంగంలో[మార్చు]

తన కెరీర్ తొలినాళ్ళలో రికార్డింగ్ స్టూడియోలో ఉన్న అనిమా చౌధురి

1969లో, అనిమా చౌధురి కాటన్ కళాశాల ఇంటర్ కాలేజ్ సంగీత పోటీలో పాల్గొంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ప్రతిభ సంగీత దర్శకుడు రామెన్ బారువా దృష్టిని ఆకర్షించింది. 1970లో బారువా ఆమెకు అస్సామీ సినిమా అయిన ముకుతాలో నేపథ్య గాయనిగా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాలో ఆడగొంతుతో పాడాల్సిన పాటలన్నీ అనిమాతోనే పాడించాడు. ఈ పాటలు అస్సాం అంతటా మంచి ప్రాచుర్యాన్ని సంపాదించాయి, ప్రత్యేకంగా "ఇ ప్రాణ్ గోపాల్, పాటిలా మాయారే ఖేలా" పాట. సినిమా విజయం తర్వాత, రికార్డ్ కంపెనీ HMV తమ లేబుల్‌కు పాటలు, ఆల్బమ్‌లను పాడమని అనిమా చౌధురిని ఆహ్వానించింది. ఆమె అనేక అస్సామీ ఆధునిక పాటలతో పాటుగా కామ్‌రూపీ లోక్‌గీత్ అని పిలిచే కామ్‌రూప్ ప్రాంతపు జానపద గేయాలను హెచ్‌ఎంవీకి రికార్డ్ చేసింది.[6] ఆమె పుతలాఘర్, ప్రేమ్ జనమే జనమే, అగ్నిబ్రిస్తి (వీడీఓ ఫిల్మ్), మోర్ మరమెరే (వీసీడి), సిబా మహిమ (వీసీడీ) వంటి ఇతర అస్సామీ చిత్రాలలో నేపథ్య గానం చేసింది. త్రిధర (2013) వంటి బెంగాలీ సినిమాలకు నేపథ్య గాయనిగానూ, మా మానసా, దేవి, వందనాంద్ వంటి సీరియళ్ళకు గాత్ర కళాకారిణిగానూ కూడా ఆమె వ్యవహరించింది.[6]

తన చిన్నతనం నుండి ఆమె ఆల్ ఇండియా రేడియోలో ఆలపించేది. 1972లో ఆమె ఆలిండియా రేడియో ఆమోదిత కళాకారిణి అయింది. ప్రస్తుతం ఆమె ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ల 'A-గ్రేడ్' కళాకారిణి. ఆ రెండు సంస్థల కోసం క్రమం తప్పకుండా ప్రదర్శనలు ఇస్తుంది. ఆమెను ఇతర ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు కూడా ఆహ్వానిస్తాయి. 1989లో కటక్ దూరదర్శన్ నిర్వహించిన దూరదర్శన్ జాతీయ కార్యక్రమంలో అస్సాంకు ప్రాతినిధ్యం వహించింది. అస్సామీ సంగీత సంస్కృతికి రాయబారిగా ప్రదర్శన ఇవ్వడానికి యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా భారతీయ/అస్సామీ సంస్థలు ఆమెను ఆహ్వానించాయి.[7]

అవార్డులు, గుర్తింపు[మార్చు]

2016లో "లుయిత్ కువారి" బిరుదు అందుకుంటున్న అనిమా చౌధురి
  • 2016లో జాన్ పబ్లికేషన్ ఆమెను "లూయిత్ కువారి" బిరుదుతో సత్కరించారు. [8]
  • 2016లో దేర్గావ్ కేంద్రీయ రంగాలి బిహు ఉత్సవ్ సందర్భంగా "డాక్టర్ ఉపేన్ కకోటి సోవరాణి బోటా". పురస్కారంతో సత్కరించారు.[9]
  • 2016లో "గ్జాంగ్‌ఖాధ్వానీ సమ్మాన్" అందుకుంది. [10]
  • బాషాంతర్ ఎదిన్ వారి 2019 జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకుంది.

మూలాలు[మార్చు]

  1. Mirza, Abbas. ASSAM: The Natural and Cultural Paradise. Assam.
  2. 2.0 2.1 2.2 "Revitalising Cultural Traditions". The Sentinel, Saturday Fare Edition: 1. 2023. {{cite journal}}: Unknown parameter |month= ignored (help)
  3. Session, North East India History Association (1993). Proceedings of North East India History Association (in ఇంగ్లీష్). The Association.
  4. Choudhury, Anima (1998). "Saivism in Assam". Proceedings of North East India History Association. Assam. p. 118.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  5. Choudhury, Anima (2007). "Saktism". Journal of the Assam Research Society. Assam. p. 89.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  6. 6.0 6.1 Goswami, Stuti (2010-04-20). "down the corridors of time: An enamouring songstress..." down the corridors of time. Retrieved 2024-02-03.
  7. "Assamese Get-Together, San Francisco: A Report" (PDF). Posoowa. July 2006. Archived from the original (PDF) on 16 December 2017. Retrieved 30 August 2016.
  8. "Jaan Dimali to Anima Choudhury". Purvanchal Prahari. Associated Press. 11 January 2016. Archived from the original on 1 April 2023. Retrieved 15 January 2016.
  9. "Dergaon Kendriya Rangali Bihu". Asomiya Pratidin. Associated Press. 21 April 2016. p. 8. Retrieved 25 April 2016.
  10. "Xangkhadhwani Sanman to Anima Choudhury". Niyomiya Barta. Associated Press. 24 June 2016. Archived from the original on 1 September 2016. Retrieved 25 June 2016.