అయ్యదేవర పురుషోత్తమరావు
అయ్యదేవర పురుషోత్తమరావు ప్రసిద్ధి చెందిన నటుడు. నాటకాలలో శ్రీకృష్ణుడి పాత్రకు పేరెన్నిక గన్నవాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అయ్యదేవర పురుషోత్తమరావు 1933, జూన్ 30వ తేదీ ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెంలో జన్మించాడు.[1] ఈయన తల్లిదండ్రులు దుర్గాంబ, రామనరసింహారావులు. ఇతని ఇంటిపేరు జమలాపురం. ఈ పేరు వినగానే సర్దార్ జమలాపురం కేశవరావు గుర్తుకొస్తారు. అంతటి స్వాతంత్య్రసమరవీరుల వంశంలో జన్మించిన పురుషోత్తమరావును మూడో సంవత్సరంలో అయ్యదేవర రంగనాయకమ్మ, లక్ష్మీనరసింహులు చేరదీసి పెంచుకోవడంతో జమలాపురం కాస్తా అయ్యదేవరగా మారింది. సంప్రదాయ కుటుంబం కావడంతో పినతల్లి రంగనాయకమ్మ పనీపాట చేసుకుంటూ పాడే పాటలు, భజన కీర్తనలు, సంప్రదాయ కీర్తనలు, పారాయణం చేసే గ్రంథాల ప్రభావం ఈయనపై ప్రబలంగానే పడింది. పురుషోత్తమరావు విద్యాభ్యాసం అంతా విజయవాడలో జరిగింది. కళలకు కాణాచి అయిన విజయవాడ ఈయన కళాతృష్ణను ఇంకా కొంచెం పెంచింది. పురుషోత్తమరావు పెద్దమ్మ కుమారుడు మీనవోలు వెంకటేశ్వరరావు పద్యాన్ని ఎలా పాడాలో తాను స్వయంగా పాడుతూ ఇతనికి నేర్పడం విశేషం. ఓ పర్యాయం వెంకటేశ్వరరావుతో కలసి పురుషోత్తమరావు సి.ఎస్.ఆర్. కృష్ణుడిగా నటించిన భీష్మ చిత్రం చూశాడు. ఆ సినిమాలో కృష్ణుడు కర్ణుడిని దెప్పిపొడుస్తూ చదివే పద్యం ఒకటుంది. ఆ పద్యం విన్న అయ్యదేవర ఆనందంతో పులకించిపోయారు. ఆనాటినుంచీ సి.ఎస్.ఆర్. అభిమానిగా మారి ఆయన చిత్రాలు చూశాడు. ఆయన నాటకాలు ఎక్కడ ఆడుతున్నా వెళ్లిచూశాడు. ఆయన హావభావాలు, విరుపులు, పద్యపఠనం తీరు, సంభాషిణల తీరు- మొత్తం అవగతం చేసుకొన్నాడు.
నటనారంగం
[మార్చు]అయ్యదేవర తొలిసారిగా 1943లో అభిమన్యుడిగా ముఖానికి రంగు వేసుకున్నాడు. ఆ తర్వాత చదువు మీద దృష్టిసారించాడు. మళ్లీ 1959లోనే నటనవైపు మొగ్గాడు . హైదరాబాదులో శ్రీరామనవమినాడు అర్జునుడి పాత్ర ధరించాడు. ఇక అప్పట్నించీ సాంఘికాల్లో ఎన్నో పాత్రలు ధరించినా పౌరాణికాల్లో మాత్రం రాముడు, శ్రీకృష్ణుడి వేషాలే వేశాడు. అయ్యదేవర పురుషోత్తమరావు హైదరాబాదు భారతీయ బ్యాంకులో ఉద్యోగి కాబట్టి ఈయనని అందరూ బ్యాంకు కృష్ణుడు అనేవారు. ఇతడు ద్రౌపదీ వస్త్రాపహరణం, గయోపాఖ్యానం, నర్తనశాల, పాండవోద్యోగం, వీరాభీమన్యు, మహారధికర్ణ, పాండవవిజయం, పాదుకాపట్టాభిషేకం, భక్తరామదాసు, తులాభారం, చింతామణి, తుకారాం, వెంకటేశ్వర మహాత్మ్యం వంటి నాటకాల్లో ప్రధాన పాత్రలైన రాముడు, కృష్ణుడు, హరిశ్చంద్రుడు, శ్రీనివాసుడు, విశ్వామిత్రుడు, తుకారాం, కృష్ణదేవరాయలు, రాజరాజనరేంద్రుడు, బిల్వమంగళుడు వంటి పాత్రల్ని పోషించాడు. దివాకర్ల వెంకటావధాని రూపొందించిన అనేక సాహిత్య రూపకాల్లో కూడా నటించి పేరుపొందాడు. ‘భువనవిజయం’లో శ్రీకృష్ణ దేవరాయలు, ‘కనకాభిషేకం’లో ప్రౌఢదేవరాయలు, ‘‘ఆంధ్రభారతావతరణం’లో రాజరాజనరేంద్రుడిగా ఆ రూపకాలను రాష్ట్రంలోనేకాక, రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల ప్రదర్శించడం విశేషం.
రచనలు
[మార్చు]అయ్యదేవర నటుడేకాక రచయిత కూడా. ‘యువభారతి’ సంచికల్లో ఎన్నో రచనలు చేశాడు. సృజనాత్మక సాహిత్యం ద్వారా కూడా పేరు పొందాడు. అనేక నవలలు, కవితలు, కథలు రాశాడు. ఇతడు ప్రచురించిన పుస్తకాలలో కొన్ని:
- అక్షతలు
- మరదలు
- గణపతిదేవ చక్రవర్తి
- శ్రీకృష్ణ దేవరాయలు
- దాశరథి రామకథా సుధ
సాంస్కృతిక రంగం
[మార్చు]అయ్యదేవర జంటనగరాల్లో పలు సంస్థల్ని స్థాపించాడు. 1960లో విజ్ఞాన దీపిక, 1961లో విద్యానగర నాట్యమండలి, 1967లో ఆంధ్రనాట్య విజ్ఞానసమితి, 1973లో సి.ఎస్.ఆర్. కళామందిరం వంటి సంస్థలను నెలకొల్పాడు. హైదరాబాదు త్యాగరాయ గానసభ సంయుక్తాధ్వర్యంలో అయ్యదేవర పురుషోత్తమరావు నాటకాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రతి ఏడాది సి.ఎస్.ఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తూండడం మరో విశేషం.
బిరుదులు
[మార్చు]- నటసారథి
- అభినవకృష్ణ
మరణం
[మార్చు]ఇతడు 2020, సెప్టెంబర్ 15వ తేదీన మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ [https://web.archive.org/web/20160221043053/http://eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=maha168 Archived 2016-02-21 at the Wayback Machine ‘అభినవకృష్ణ’ అయ్యదేవర పురుషోత్తమరావు] - చీకోలు సుందరయ్య