అలూఫ్‌ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అలూఫ్‌ ఖాన్ కర్నూలు నవాబులు రాజవంశంలో మూడవ పరిపాలకుడు. ఆయన మునవర్‌ఖాన్ 1 కుమారుడు. మునవర్‌ఖాన్ మరణానంతరం పరిపాలన ప్రారంభించారు.

రాజకీయ నేపథ్యం[మార్చు]

కర్నూలు నవాబులు మొదటి నుంచీ అస్వతంత్రులుగానే కొనసాగుతూ వచ్చారు. అలూఫ్ ఖాన్ పెదతండ్రి ఆరంబించిన ఈ రాజవంశం, కర్ణాటక యుద్ధాల్లో భాగంగా జరిగిన కర్నూలు ముట్టడిలో కర్నూలు ఓటమి చెందడంతో ఇతని తండ్రి చేతికి వచ్చింది. తండ్రి మునవర్ ఖాన్ 1 మూడవ పరిపాలన సంవత్సరమైన 1755లో మైసూరు సైనికనేత హైదర్ అలీ చేసిన యుద్ధంలో ఓటమి చెందడంతో కర్నూలు మైసూరు సామ్రాజ్యానికి సామంత రాజ్యమైంది. ఆపైన మైసూరు సామ్రాజ్యానికి బ్రిటీష్ వారికీ నడుమ తీవ్రమైన పోరాటాలు వేర్వేరు ప్రాంతాల్లో సాగినాయి. వీటికే మైసూరు యుద్దాలని పేరు. ఇటువంటి స్థితిలో మునవర్ ఖాన్ 1 తన 40వ పరిపాలన సంవత్సరంలో మైసూరు సామంతునిగా 1792లో మరణించారు[1].

పాలనకాలం[మార్చు]

1792లో తండ్రి మరణించిన తర్వాత అలూఫ్ ఖాన్ కర్నూలు నవాబు అయ్యారు. అతను నవాబుగా ఉండగానే 1796-99 దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన రాజకీయ పరిణామాలు జరిగాయి. వీటిలో భాగంగా మైసూరు సామ్రాజ్య పాలకుడు టిప్పు సుల్తాన్ మూడవ మైసూరు యుద్ధంలో ఓటమి పాలయ్యారు. మైసూరు సామ్రాజ్యానికి సామంత రాజ్యమైన కర్నూలు సహా వివిధ ప్రాంతాలను యుద్ధంలో విజయం సాధించిన ఈస్టిండియా కంపెనీ, నిజాం నవాబు పంచుకున్నారు. ఈ పంపకంలో భాగంగా బళ్ళారి, అనంతపురం, కడప మొదలైన జిల్లాలు సహా కర్నూలు రాజ్యం కూడా నిజాం పాలికి వచ్చింది. అంతట కొన్నేళ్ళు అలూఫ్ ఖాన్ నిజాం నవాబుకు సామంతుడు అయ్యారు. 1799లో టిప్పుసుల్తాన్ ఫ్రెంచివారిని రహస్యంగా కలిసి మరో తిరుగుబాటుకు ప్రయత్నం చేయడం బయటకు పొక్కడంతో ఈస్టిండియా కంపెనీ వారు శ్రీరంగపట్నంపై యుద్ధానికి వెళ్ళారు. ఈ యుద్దంలో ఓటమి చెందడమే కాక, టిప్పుసుల్తాన్ మరణించారు. ఆయన మరణంతో దక్షిణ భారతదేశంలో ఈస్టిండియా కంపెనీకి ఎదురులేని స్థితి వచ్చింది. దీనితో 1800లో నిజాం నవాబుపై సైనిక వ్యయం తాలూకా బాకీని మోపి, అతనికి మూడవ మైసూరు యుద్ధంలో పంచియిచ్చిన కర్నూలు సహా కడప, అనంతపురం, బళ్ళారి మొదలైన ప్రాంతాలను బాకీ కింద జమకట్టుకున్నారు. ఈ పరిణామతో కర్నూలు నవాబు నిజాం నుంచి ఈస్టిండియా కంపెనీకి సామంతునిగా మారారు. ఈ పరిణామాలన్నీ అలూఫ్ ఖాన్ 8వ పాలన సంవత్సరంలోపు పూర్తయ్యాయి.

వారసత్వం[మార్చు]

అలూఫ్‌ఖాన్ తాను జీవించివుండగానే గులాం రసూల్ ఖాన్ను నవాబును చేశారు. అలూఫ్ ఖాన్ తన ఆరుగురు కొడుకుల్లో చివరవాడైన గులాంరసూల్‌ఖాన్ మీద ఉన్న ప్రేమ వల్ల తన బదులుగా అతడిని నవాబును చేసేందుకు అంగీకరించమని గవర్నర్ మింటోను ప్రార్థించారు. అతని కోరిక మేరకు అందుకు అనుగుణంగా యిచ్చిన ఫర్మానాతో చివరి కొడుకు గులాం రసూల్ ఖాన్ ను నవాబును చేశారు. మళ్ళీ అతనికి మారుగా కొంతకాలం మునవర్‌ఖాన్, ఆపైన ముజఫర్‌ఖాన్ నవాబులు అయ్యారు. క్రీ.శ.1815లో అలూఫ్‌ఖాన్ మరణించడంతో కంపెనీ ప్రభుత్వాధికారులు ముజఫర్ ఖాన్‌ని తొలగించి మునవర్ ఖాన్‌నే నవాబు చేశారు. 1823 సంవత్సరంలో గులాం రసూల్‌ఖాన్ నవాబు అయ్యారు.

మూలాలు[మార్చు]

  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014. CS1 maint: discouraged parameter (link)


ఇంతకు ముందు ఉన్నవారు:
మునవర్‌ఖాన్ 1
కర్నూలు నవాబులు
17921815
తరువాత వచ్చినవారు:
గులాం రసూల్ ఖాన్ (మధ్యలో మునవర్ ఖాన్ 2, ముజఫర్ ఖాన్‌లు నవాబులయ్యారు)