Jump to content

అవయవ దానం

వికీపీడియా నుండి
అవయవ దానం కార్డుపై సంతకం చేస్తున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్

అవయవ దానం అనేది మరణించిన లేదా మరణించబోయే వ్యక్తి శరీర అవయవాలు వేరొకరికి అమర్చడానికి ఇవ్వడం. దీని వలన ఆయా అవయవాలు విఫలమై రోగగ్రస్తులైనవారు పునర్జీవితులవుతారు.

రకాలు

[మార్చు]

అవయవ దానం 2 రకాలుగా ఉంటుంది.

  • సజీవ దానం: బతికున్నవారు ఆరోగ్యంగా ఉండి అవయవాన్ని లేదా భాగాన్ని దానం చేయడం. రక్తదానం, ఒక మూత్రపిండం, కాలేయం లో భాగం దానం చేయడం అటువంటిదే. దీనిలో దాత తరువాత కూడా ఆరోగ్యంగా కొనసాగ వచ్చు.
  • జీవన్మృతి (కెడావర్) దానం: దీనిలో వ్యక్తి మరణానంతరం అవయవాలు దానం చేయడం. అయితే వ్యక్తి మరణించిన కారణం అనుసరించి అవయవాలు ఉపయోగించడం ఉంటుంది. దీనికి సిద్ద పడినవారు తమ పేరు నమోదు చేసుకోవలసి వస్తుంది. వ్యక్తి మరణానంతరము కుటుంబ సభ్యులు కూడా అవయవ దానం అంగీకరించవచ్చు.[1]

దానం చేయగల అవయవాలు

[మార్చు]

చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 అవయవాలు, కణజాలాన్ని దానం చేయవచ్చు. కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద పేగు, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి జీవితం ఇవ్వొచ్చు. సహజ మరణం తరువాత ప్రాణవాయువు (ఆక్సిజన్) సరఫరా నిలిచిపోవడంతో కీలక అవయవాలు పనికి రాకుండా చనిపోతాయి. కేవలం కంటి కార్నియా, చర్మం, ఎముక, గుండె కవాటాలు, రక్తనాళాలు వంటి కణజాలాలు ఉపయోగిస్తారు. జీవన్మృతుల (బ్రెయిన్ డెడ్) వ్యక్తుల నుంచి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, క్లోమం, ప్రేగులు వంటి కీలక అవయవాలు సేకరించవచ్చు.[1]
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 'జీవనదానం' కార్యక్రమం మార్గదర్శకాలు రూపొందించే దశలో ఉంది.

ఎప్పుడు సేకరిస్తారు?

[మార్చు]

బతికి ఉన్నప్పుడు సజీవ దానం 18 సంవత్సరాలు నిండినవారు ఎవరైనా చేయవచ్చు. జీవనమృతుల విషయంలో వయస్సు, లింగం వంటి నిర్దేశికాలు లేవు.[1] చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్‌ డెత్‌గా ప్రకటిస్తారు. వీరిని వెంటిలేటర్‌ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు. బయటకు తీసుకొచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు, కాలేయం 8-10 గంటలు, మూత్రపిండాలు 24 గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది.

ఎవరు ఇవ్వొచ్చు?

[మార్చు]

బ్రతికుండగానే అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు. రక్త సంబంధీకులు అంటే అమ్మానాన్న, సోదరి, పాప, బాబు, భార్య. ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. బతికుండగానే బంధు, మిత్రులకు అవయవదానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఆరోగ్యవంతులైన అన్ని వయసులవారు అవయవదానానికి అర్హులే. తన మరణానంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం తెలపవచ్చు. బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు.

బ్రెయిన్ డెడ్ అంటే

[మార్చు]

ప్రమాదాలలో కోలుకోలేని విధంగా తలకి గాయం అయినప్పుడు, ప్రాణవాయువు అందక మెదడు, తలలోని ఇంకా మిగిలిన భాగాలు దెబ్బతింటాయి. ఆ పరిస్థితిలో మెదడు భాగం పని చేయకపోయినా, కీలక అవయవాలు ప్రత్యేక చికిత్స, రక్త సరఫరాతో పని చేస్తుంటాయి. వ్యక్తి ఈ పరిస్థితిలో సాధారణ జీవనం సాగించలేడు. దీనిని బ్రెయిన్ డెత్ అంటారు. ఆ కీలక అవయవాలని ఇతర వ్యక్తులకు అమర్చుతారు.
బ్రెయిన్ డెత్ ను వైద్యుల బృందం అంటే చికిత్స చేస్తున్న వైద్యుడు, వైద్యశాల అధికారి, న్యురాలజిస్ట్, వేరే వైద్యశాలకు చెందిన వైద్యుడు కలిసి నిర్ధారిస్తారు.[1]

జాగ్రత్తలు

[మార్చు]

అయితే బ్రతికుండగా మూత్రపిండం వంటి దానం చేసినవారు క్రమం ప్రకారం వైద్యులను సంప్రదించడం, ఆరోగ్యమైన జీవన శైలి అలవరుచుకోవాలి. అవయవ గ్రహీతలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడవలసి వస్తుంది.[1]

అవగాహన, ప్రచారం

[మార్చు]

2017లో ఫ్రాన్స్ అవయవదానాన్ని తప్పనిసరి చేసింది. ఇష్టం లేదని ప్రభుత్వానికి ముందు తెలియచేయక పొతే వైద్యులు అవయవాలు సేకరిస్తారు. మిగిలిన దేశాలు కూడా అనుసరిస్తున్నాయి . భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన పెంపొందించడానికి, నమోదు వంటి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటున్నాయి . రకరకాల అపోహల వలన, కుటుంబసభ్యులు ముందుకు రాకపోవడముతో అవయవదాతల కొరత తీవ్రంగా ఉంది. 1994లో మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం తెచ్చారు . 2011లో దానికి సవరణలు చేసారు. అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్.ఓ.టి.టి.ఓ) పర్యవేక్షిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో అవయవ దానానికి జీవన్ దాన్, ఇంకా మరికొన్ని స్వచ్చంద సంస్థలు దశాబ్దం పైగా కృషి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అవయవాలను త్వరితగతిని తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు దాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని నిర్ణయించింది, దీనికి కలెక్టర్ లేదా ప్రభుత్వ ప్రతినిధి హాజరు అవుతారు. [2]

దాతల నమోదు

[మార్చు]

అవయవదానం చేయడలచుకున్నవారు జాతీయ స్థాయిలో నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ అసోసియేషన్ (National Organ and Tissue Transplant Organization-NOTTA), ప్రాంతీయ స్థాయిలో జీవనదాన్ కార్యక్రమంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ లో వివరాలు పొందుపరచిన తరువాత ప్రత్యేక సంఖ్యతో డోనార్ గుర్తింపు కార్డు వస్తుంది. ఈ నమోదు సంగతి వ్యక్తి తన కుటుంబ సభ్యులకు తెలియ చేయాలి.[1]

గణాంకాలు

[మార్చు]
  • ఎన్.ఓ.టి.టి.ఓ ప్రకారం 2014 లో 6916 అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. 2022 నాటికి 16000కి చేరాయి.
  • 83% కేసులలో అవయవాలను జీవించిఉన్న వ్యక్తులనుంచి సేకరిస్తున్నారు .
  • మరణించిన దాతలు 2014లో 408 మంది, 2023లో 1000 పైగా [2]

రియల్ హీరో

[మార్చు]

టాలీవుడ్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు 2022 ఫిబ్రవరి 12న తన 60వ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2022 ఫిబ్రవరి 11న ఏర్పాటు చేసిన అవయవదాన అవగాహన సదస్సుకు చీఫ్ గెస్టుగా విచ్చేసిన జగపతిబాబు తన మరణాంతరం అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించారు. వంద మంది అభిమానులు సైతం ప్రమాణపత్రంపై సంతకం చేసారు.[3]

జాతీయ అవయవదాన దినోత్సవం

[మార్చు]

1954లో మొట్టమొదటి సారిగా డాక్టర్‌ జోసఫ్‌ ముర్రే అనే వ్యక్తి అవయవ మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. రొనాల్డ్‌ లీ హెరిక్‌ అనే వ్యక్తి తన మూత్రపిండంను తన కవల సోదరుడికి ఇచ్చాడు. అప్పటినుంచి ప్రపంచ వ్యాప్తంగా వైద్య విజ్ఞానం అభివృద్ధి చెంది అవయవాల మార్పిడి చేపట్టారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 13వ తేదీన నిర్వహిస్తున్నారు. [4]

బాహ్య లింకులు

[మార్చు]
  1. నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ అసోసియేషన్ (National Organ and Tissue Transplant Organization - NOTTO)
  2. జీవనదాన్ (Jeevandaan)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 డా.జి., స్వర్ణలత (13 August 2024). "మరణం నుంచి జననం". ఈనాడు.
  2. 2.0 2.1 ఆద్య (16 August 2024). "మరణించినా జీవించాలంటే ...". ఈనాడు.
  3. "అవయవదానానికి జగపతిబాబు సమ్మతి". EENADU. Retrieved 2022-02-12.
  4. మరణించినా సజీవమే. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. 23 August 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=అవయవ_దానం&oldid=4354425" నుండి వెలికితీశారు