అసమర్థుని జీవయాత్ర
అసమర్థుని జీవయాత్ర | |
కృతికర్త: | త్రిపురనేని గోపీచంద్ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | |
విడుదల: | 1947 |
ప్రముఖ తెలుగు నవలా రచయిత త్రిపురనేని గోపీచంద్ కి నవలా సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సాధించి పెట్టిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మెట్టమొదటి మనో వైజ్ఞానిక నవల. ఈ నవల 1945-46లో రాశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారపు సాహిత్యానుబంధాలలో సీరియల్ నవలగా వెలువడింది.
1947లో రచించబడిన ఈ నవలను సాహితీ విమర్శకుడు డి.ఎస్.రావు ఆంగ్లములో ది బంగ్లర్ - ఎ జర్నీ త్రూ ద లైఫ్ (The Bungler - A Journey Through Life) గా అనువదించాడు.[1]
నవల నేపథ్యం
[మార్చు]గోపీచంద్ తొలి కథ రాసిన పదేళ్ల తర్వాత ఆయన మొదటి నవల రాశారు. అసమర్ధుని జీవయాత్ర ఆయన రెండవ నవల. దీనిని గోపీచంద్ తన తండ్రి రామస్వామికి అంకితం చేశారు 'ఎందుకు? ఎందుకు?' అని ప్రశ్న నేర్పినందుకు. త్రిపురనేని రామస్వామి (1887-1943) తెలుగు నాట పేరు మోసిన హేతువాది, నాస్తికుడు, కుల, మతాలని చీల్చి చెండాడిన వాడు. మూఢనమ్మకాల మీద అలుపులేని పోరు సాగించినవాడు.
నవల సమీక్ష
[మార్చు]ఈ రచనలో అప్పటి మన పల్లెటూళ్లు, మానవ సంబంధాలు, అన్నీ తారసపడతాయి. ఆస్తి అంతస్తులు తమ వికృత రూపంలో మనకి సాక్షాత్కరిస్తాయి. వీటికి ఈ నవల అద్దం పట్టింది. జమీందారీ వ్యవస్థ ఎలా బీటలు వారుతుందో, మన సమాజంలో పెట్టుబడిదారీ బీజాలు ఎలా నాటుకుంటున్నాయో విశదపరిచాడు గోపీచంద్. నవల కనీసం ఒక తరం జీవితాన్నయినా కళ్లకు కట్టాలంటారు సాహితీవేత్తలు. ఈ నవల ఆ పనిచేసిందనీ, మన జీవితాలని మనకి ఎరుక పరిచిందనీ చెప్పవచ్చు. అందుకే ఈ నవల ఇంకా నిలబడి ఉంది. ఎన్నో ముద్రణలకు నోచుకుంది. ఈ నవలలోని సీతారామారావు ధీరోదాత్తుడూ, సకల గుణాభిరాముడూ కాదు. అంతర్ముఖుడు. గోరంతలు కొండంతలు చేస్తాడు. పరిసరాలని పట్టించుకోకుండా ఊహాలోకాల్లో తేలిపోతూ వుంటాడు. ఇతడు ఊహాశాలి. అంతేకాదు ఉన్మత్తుడు కూడా. దీనికి దాఖలాలు నవల పొడుగూతా కనిపిస్తాయి. అన్నిటికంటే తిరుగులేని సాక్ష్యం అసమర్ధుని అంతిమయాత్రే. అది బీభత్సరసప్రధానం. పిశాచగణ సమవాకారం. మానవ మనుగడలోని కీలకాంశాలను రచయిత చాలా ఒడుపుగా మనకు విశదపరిచాడు. కనకనే ఈ నవలది తెలుగు సాహిత్యంలో చెక్కు చెదరని స్థానం. దీనికి ఎంత మాత్రం వాసి తగ్గదు. ఇది నిస్సందేహంగా నిజం. 'అసమర్ధుని జీవయాత్ర' తెలుగులో మనోవైజ్ఞానిక నవలగా పేరు పొందింది. సీతారామారావు పాత్ర విచ్ఛిన్నమౌతున్న వ్యక్తిత్వానికి ప్రతీకగా నిల్చిపోయింది.
నవలా నిర్మాణం
[మార్చు]జ్ఞానం అనేది నిత్యం సముద్రం లోకి ప్రవహించే కొత్త నీరులాంటిది అని తెలుసుకోకుండా, అసమగ్రమని ముందే తేల్చేసిన పాత సిద్ధాంతాల్ని అర్థం చేసుకున్న జ్ఞానంతో తాను జీవిస్తున్న ప్రస్తుత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, తనకు మాలిన ధర్మానికి పోయి, సర్వం కోల్పోయి తన చాతకానితనాన్ని అసంబద్ధతర్కంతో సమర్థించుకోవడం వంటి వాటి వల్ల ఎలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవల్సి వస్తుందోనన్న విషయాన్ని రచయిత ఈ నవలలో చెప్పదల్చాడు.
యిందుకుగానూ ఆయన ఎన్నుకున్న ఇతివృత్తం, దాన్ని నిర్వహించిన శిల్పం, పాత్రల మనస్తత్వాన్ని పట్టించే వర్ణన, నాటకీయత మధ్య సాగే ముగింపు...యివన్నీ గోపీచంద్ ప్రతిభను, ప్రయోగదీక్షతను, సృజనాత్మకతను, సమర్థతనూ చాటుతున్నాయి.
సీతరామారావు పాత్రలో కనిపించే ఆధిక్యతా, ఆత్మన్యూనతా భావాలు వివిధ రకాలైన మానసిక చిత్తప్రవృత్తుల దృష్ట్యా యిది ఫ్రాయిడ్, ఆడ్లర్ సిద్ధాంతాల ప్రభావంతో వచ్చిన మనోవైజ్ఞానిక నవల అని చెప్పవచ్చును.
యిందులో (సీతారామారావు) అసమర్థుడుగా మారటం అన్న ఆరంభం నుండి అతను కడతేరే వరకు సీతారామారావు జీవితాన్ని ఆరుభాగాలుగా విభజించి రచించాడు గోపీచంద్.
- అసమర్థుడు
- అసమర్థుని భార్య
- అసమర్థుని ఆదర్శం
- అసమర్థుని మేనమామ
- అసమర్థుని ప్రతాపం
- అసమర్థుని అంతం
ఆ ఆరుభాగాలూ సీతారామారావులోని పరిణామ క్రమాన్ని చూపుతాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఇండియాక్లబ్.కాం లో అసమర్థుని జీవయాత్ర ఆంగ్ల అనువాదము యొక్క సమీక్ష". Archived from the original on 2007-05-16. Retrieved 2006-12-19.