అహ్మద్ జాన్ తిరఖ్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పద్మభూషణ్ అహ్మద్ జాన్ తిరఖ్వా ( 1892 - 1976 ) 20 వ శతాబ్దపు ఒక గొప్ప తబలా విద్వాంసుడు. అతడు 'లలియాని పరంపర' కు చెందిన ఫరూఖాబాద్ ఘరానాకు చెందిన వాడు. అహ్మద్ జాన్ తిరఖ్వా ఉత్తర్ ప్రదేశ్ లోని, మొరాదాబాద్లో ఒక సంగీత కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసులోనే ఉస్తాద్ మిఠూఖాన్ వద్ద గాత్రం నేర్చుకోవడం మొదలు పెట్టాడు. తండ్రి, హుసేన్ బక్ష్ ద్వారా కూడా కొన్ని సారంగి పాఠాలు నేర్చుకొన్నాడు ; ఉస్తాద్ మునీర్ ఖాన్ తబలా వాదన విన్న తరువాత, తబలా వైపు ఆకర్షితుడైనాడు. తొలి పాఠాలు తన మామలైన షేర్ ఖాన్, ఫయాజ్ ఖాన్, బశ్వాఖాన్ ల నుండి నేర్చుకొన్నాడు. తన 12 వ ఏట, మునీర్ ఖాన్ శిష్యుడైనాడు. ప్రతిరోజూ 16 గంటలు రియాజ్ ( సాధన ) చేసేవాడు.

తిరఖ్వా అనే పేరు అతడికి గమ్మత్తుగా వచ్చింది. ఒకసారి అహ్మద్ గురువు మునీర్ ఖాన్ తండ్రి, కాలేఖాన్, అహ్మద్ తబలా వాయిస్తుండగా, అతని చేతివేళ్ళు తబలాపై ఒక వింతశోభతో నర్తిస్తుండడం చూసి, 'తిరఖ్వా' అన్నాడు. ఉర్దూలో 'తిరఖ్' అంటే 'మెరుపుతో కూడిన ఉరుము' అని అర్థం.

తిరఖ్వా తన మొదటి తబలా కచేరీ ముంబాయి లోని ఖేత్‌బాడిలో, తన 16 వ ఏట ఇచ్చాడు. అప్పటి నుండి ఉత్తరభారతం అంతటా, తబలా కచేరీలు ఇవ్వడంలో పూర్తిగా మునిగిపోయాడు. తిరఖ్వా 1936 లో రాంపూర్ ఆస్థాన విద్వాంసుడిగా నియమించబడ్డాడు. తన 30 ఏళ్ళ సంగీత ప్రస్థానంలో అతడు ఎందరో గొప్ప సంగీత విద్వాంసులతో కలిసి, కచేరీల నిచ్చాడు. తరువాత భాత్ఖండే సంగీత కళాశాలలో, చాలాకాలం ప్రధాన అధ్యాపకుడిగా పనిచేశాడు. తిరఖ్వా అన్ని ఘరానా ల సంగీత శైలులను తబలాపై వాయించేవాడు. తబలాపై అతడు అలౌకిక సంగీతాన్ని ఆవిష్కరించే తీరు, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసేది. అందుకే అతడిని తబలా హిమాలయశిఖరం అన్నారు.

విదేశాలలో పర్యటించి ప్రదర్శనలివ్వటానికి అనేక సాంస్కృతిక బృందాలలో అవకాశమొచ్చినా, విమానప్రయాణం చేయటానికి ఇష్టపడని తిరఖ్వా వాటిని తిరస్కరించాడు. జీవితాంతం లక్నో నివాసి అయినా తిరఖ్వా మరణించే ముందు కొన్నేళ్ళపాటు బొంబాయిలో నివసించాడు. ఆయన స్ఫూర్తితోనే నిఖిల్ ఘోష్ సంగీత పాఠశాల స్థాపించబడింది. నేషనల్ సెంటర్ ఆఫ్ ఫర్మార్మింగ్ ఆర్ట్స్ లో విసిటింగ్ ఫ్రొఫెసర్ గా పనిచేశాడు. అయితే జనవరి 8 న "మై హమేషా లక్నో మే రహతా హూం" (నేనెప్పుడూ లక్నోలోనే ఉంటాను") అన్న మాటను నిలబెట్టుకోవటానికి లక్నోకు తిరిగివచ్చాడు. 1976 జనవరి 13 ఉదయం బొంబాయి మెయిల్ రైలు అందుకోవటానికి చార్‌భాగ్ రైల్వేస్టేషనుకు రిక్షాలో వెళుతుండగా కుప్పకూలి మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]