Jump to content

ఆంధ్ర ప్రకాశిక

వికీపీడియా నుండి
ఆంధ్ర ప్రకాశిక
సంపాదకులుఎ.సి. పార్థసారథి నాయుడు
తరచుదనంవార పత్రిక
ముద్రణకర్తఎ.సి. పార్థసారథి నాయుడు
మొదటి సంచిక1888
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆంధ్ర ప్రకాశిక, మద్రాసు నగరం నుండి 19, 20 శతాబ్దాలలో వెలువడిన తెలుగు వార పత్రిక.

ఆంధ్ర ప్రకాశికను 1888 లో ఎ.సి. పార్థసారథి నాయుడు మద్రాసులో వారపత్రికగా ప్రారంభించాడు.[1] అతను కాంగ్రెసువాది, దేశభక్తుడు. 25 సంవత్సరాల పాటు వారపత్రికగా నడిచి ఆ తరువాత వారానికి రెండుసార్లు వచ్చే పత్రికగా మారింది. కొద్దికాలానికే మళ్ళీ వార పత్రికగా మారింది. దాదాపు 42 సంవత్సరాల పాటు ఈ పత్రిక నడిచి, మూతపడింది.

పత్రిక విశేషాలు

[మార్చు]

పత్రికలో రాజకీయ వార్తలకు ప్రాధాన్యత ఉండేది. ఆనాటి బ్రిటిషు ప్రభుత్వ విధానాలను తన పత్రికలో నిర్భీతిగా విమర్శించేవాడు. సైన్యంలో జరిగే దౌర్జన్యాలపై ఈ పత్రికలో వార్తలు వచ్చేవి.[2] తెలుగులో వచ్చిన తొలి రాజకీయ వార పత్రిక అనీ, సాధారణ తెలుగు పాఠకులకు రాజకీయాలపై ఆసక్తి కలిగించిన పత్రిక అనీ వేదగిరి రాంబాబు పేర్కొన్నాడు.[2] ప్రసిద్ధ పాత్రికేయుడు సత్తిరాజు సీతారామయ్య ఈ పత్రిక ద్వారానే పత్రికారంగం లోకి ప్రవేశించాడు.

ప్రకటనలు

[మార్చు]

ఆంధ్ర ప్రకాశికలో వ్యాపార ప్రకటనలు కూడా వచ్చేవి. కేసరి కుటీరం అధినేత కోట నరసింహం తన ఆత్మకథ చిన్ననాటి ముచ్చట్లులో, తన ఆయుర్వేద ఔషధానికి ఈ పత్రికలో ప్రకటన ప్రచురించేందుకు 5 రూపాయలు ఇచ్చానని రాసాడు.[3]

పత్రికపై సమీక్ష

[మార్చు]

ఆంధ్ర ప్రకాశిక పత్రికపై అప్పటి ప్రఖ్యాత పాత్రికేయుడు దంపూరు వెంకట నరసయ్య తన పీపుల్స్ ఫ్రెండ్ ఇంగ్లీషు పత్రికలో సమీక్ష రాసాడు. 1888 ఫిబ్రవరి 25 న వెలువడిన ఈ సమీక్షలో, మద్రాసు ప్రెసిడెన్సీలో వెలువడుతున్న ఈ తెలుగు వారపత్రికను, ఇంగ్లీషు వారపత్రికల పద్ధతిలో ప్రచురిస్తున్నారని రాసాడు. ఇంగ్లీషు రాని పాఠకులు ఈ పత్రిక ద్వారా దేశపరిస్థితులనూ, రాజకీయాలనూ తెలుసుకోవచ్చని రాసాడు. పాఠకులకు ఆసక్తి కలిగించే ఎన్నో విశేషాలు ఈ పత్రికలో ఉన్నాయని కూడా ఈ సమీక్షలో రాసాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. రాంబాబు, చేదగిరి (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు అకాడమి. p. 23.
  2. 2.0 2.1 రాంబాబు, చేదగిరి (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు అకాడమి. p. 92.
  3. కె.ఎన్., కేసరి (1999). చిన్ననాటి ముచ్చట్లు. చెన్నై: కేసరి కుటీరం ప్రై. లిమిటెడ్. p. 26.
  4. కాళిదాసు, పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య. నెల్లూరు: సొసైటీ ఫర్ సోషల్ ఛేంజ్. p. 95.