సత్తిరాజు సీతారామయ్య
సత్తిరాజు సీతారామయ్య | |
---|---|
జననం | |
మరణం | 1945 మార్చి 17 |
వృత్తి | న్యాయవాది |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సంపాదకుడు దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని |
తల్లిదండ్రులు |
|
సత్తిరాజు సీతారామయ్య ప్రముఖ పాత్రికేయుడు, రచయిత.
విశేషాలు
[మార్చు]ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం (నాటి తణుకు తాలూకా) కంతేరు గ్రామంలో సత్తిరాజు రామన్న, సీతమ్మ దంపతులకు 1864, డిసెంబరు 11వ తేదీన జన్మించాడు. ఇతడు ఆరువేల నియోగి. హరితస గోత్రీకుడు. పత్రికల ప్రచురణ ద్వారా దేశానికి ఎంతో సేవ చేయవచ్చని ఇతడు భావించాడు. 1891లో మద్రాసు నుండి ఎ.సి.పార్థసారథి నాయుడు నడిపిన ఆంధ్ర ప్రకాశికలో జర్నలిస్టుగా అడుగుపెట్టాడు. 1893లో దేశోపకారి వారపత్రికను, 1902లో హిందూ సుందరి మాసపత్రికను ప్రారంభించాడు. ఇతడు న్యాయవాద వృత్తిని చేపట్టి బాగా సంపాదిస్తున్న సమయంలో పత్రికలను నడపాలన్న ధ్యేయంతో తన వృత్తిని సైతం వదిలివేశాడు. దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని పత్రికల సంపాదకునిగా రోజుకు 18 గంటలు పనిచేసేవాడు. ఆ రోజులలో హిందూసుందరి పత్రికకు 800 మంది చందాదారులు ఉండేవారు. ఒక దశాబ్దానికి పైగా తన జీవితాన్ని ఈ పత్రికలు నడపడానికి ధారపోశాడు. ఇతడు ఏలూరు మునిసిపల్ కౌన్సిలర్‌గా, కంతేరు గ్రామ పంచాయితీ ప్రెసిడెంటుగా, తాలూకా బోర్డు మెంబరుగా వివిధ హోదాలలో తన సేవలను అందించాడు. ఇతడు కంతేరు గ్రామపంచాయితీ ప్రెసిడెంటుగా చేసిన సేవలను అప్పటి కలెక్టర్ రూథర్‌ఫర్డు, లోకల్ బోర్డుల రిజిస్ట్రారు గోపాలస్వామి అయ్యంగార్లు గుర్తించి ఆ గ్రామం సందర్శించి దానిని మోడల్ గ్రామపంచాయితీగా తీసుకుని బులెటిన్‌లో ప్రకటించారు. ఇతడు అనేక తాళపత్ర గ్రంథాలను, శాసనాలను, వ్రాతప్రతులను సేకరించి మద్రాసు మ్యూజియంకు ఇచ్చాడు.[1]
రచనలు
[మార్చు]రచయితగా ఇతడు అనేక గ్రంథాలను ప్రకటించాడు. వాటిలో ముఖ్యమైనవి:
- వంటలక్క
- విప్రకులదర్పణం
- వినోదవాహిని మొదలైనవి.
మరణం
[మార్చు]ఇతడు 1945, మార్చి 17వ తేదీ కంతేరులో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ తణుకు తళుకులు. తణుకు: కానూరి బదరీనాథ్. 17 December 2010. p. 21.