వేదగిరి రాంబాబు
వేదగిరి రాంబాబు | |
---|---|
జననం | వేదగిరి రాంబాబు 1952 అక్టోబరు 14 చుండూరు, గుంటూరు జిల్లా |
మరణం | 2018 ఆగస్టు 18[1] హైదరాబాదు | (వయసు 65)
వృత్తి | హైదరాబాదు గ్లోబల్ హాస్పిటల్స్, మీడియా విభాగాధిపతి నిమ్స్‌లో ఒ.ఎస్.డి (మీడియా) |
ప్రసిద్ధి | తెలుగు సీరియల్ రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | సంధ్యారాణి |
పిల్లలు | వేదగిరి విజయచంద్ర (కుమారుడు) జంధ్యాల లక్ష్మీభార్గవి (కుమార్తె) |
తండ్రి | పూర్ణచంద్రరావు |
తల్లి | భార్గవి |
వేదగిరి రాంబాబు తెలుగు రచయిత, తెలుగు సీరియల్ రచయిత, వివిధ పుస్తకాల ప్రచురణ కర్త.[2]
జీవిత విశేషాలు
[మార్చు]వేదగిరి రాంబాబు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చుండూరులో 1952 అక్టోబరు 14న పూర్ణచంద్రరావు, భార్గవి దంపతులకు జన్మించాడు. అతని తండ్రి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగిగా తన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నందువల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు బదిలీ పై వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల రాంబాబు బాల్యం, చదువు అంతా వివిధ ప్రాంతాలలో కొనసాగింది. రాంబాబు నాటకాలలోగానీ, సినిమా ఛాన్సులకోసం ప్రయత్నించడం కానీ అతని తండ్రికి యిష్టముండేది కాదు. డిగ్రీ చదువుతున్నప్పుడే అతనిలో సాహిత్యం పట్ల క్రమంగా అభిరుచి పెరిగింది. సాహితీ కారునిగాఅతనికి యర్రంశెట్టి సాయి రచనలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ప్రముఖ రచయితలైన యర్రంశెట్టి సాయి, ఆదివిష్ణు, విహారిలు లను గురుతుల్యులుగా అతను భావిస్తాడు. 1974 సంవత్సరంలో డిగ్రీ ఫైనలియర్‌లో చదువుతుండగా ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీకి సరదాగా పంపిన తన తొలికథ ‘సముద్రం’ బహుమతి సాధించిపెట్టింది. ఇక అదే క్రమంలో అప్పటి ప్రముఖ వారపత్రికలైన యువ, జ్యోతి, స్వాతి, ఆంధ్రపత్రికలకు వరసగా కథలు పంపిస్తుండేవాడు. కొంతకాలం ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేశాడు.[3]
రాంబాబు కథానికలకు రేడియో ద్వారా మంచి ప్రాచుర్యం లభించింది. ఆయన ఫ్రీలన్స్ జర్నలిష్టుగా వివిధ దినపత్రికలకు అనేక వ్యాసాలను వ్రాసి పంపించేవారు. కొంతకాలం ఆంధ్రభూమి వారపత్రికలో సీనియర్ జర్నలిస్ట్‌గా చేశాడు. పల్లకి వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా తనలోని రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తునే ఉన్నాడు. దూరదర్శన్ అందుబాటులోకి వచ్చాక దృశ్య మాధ్యమాన్ని సామాజిక అస్త్రంగా మలిచి జనాలలో మార్పు తేవాలని ఆశించాడు. ఆ క్రమంలోనే ‘పాపం పసివాడు’ సీరియల్‌ను 52 వారాలపాటు నిరంతరాయంగా దూరదర్శన్‌లో రూపొందించాడు. ఎన్నో కష్టనష్టాలకోర్చి దూరదర్శన్ టెలీ సీరియల్‌ను తన సొంతఖర్చుతోనే భరించి తీర్చిదిద్దాడు.
రాంబాబు తీసిన టెలిఫిల్మ్‌కు ఉత్తమ నిర్మాత, దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తరపున బంగారు నంది అవార్డు దక్కింది. కృష్ణమోహన్ టైటిల్‌సాంగ్‌కి కూడా నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ‘అడవి మనిషి’ సీరియల్‌కు రజిత నంది వచ్చింది. దూరదర్శన్‌లో శైలజాసుమన్, రమణీసన్యాల్ వంటివారితో కలిసి ఇన్‌హౌస్ సీరియల్ని చేశాడు.తర్వాత దాదాపు రెండు సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి జైలు అధికారుల అనుమతి తీసుకుని రాష్ట్రంలోని పలు జైళ్లలో పరిస్థితుల ప్రభావంచేత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల యథార్థగాథలను తీసుకుని వాటినే తన కథావస్తువులుగా చేసుకుని ‘జైలుగోడల మధ్య’ సీరియల్ ను రూపొం దించాడు. అంతకుముందే అది స్వాతి వారపత్రికలో దాదాపు 60-70 వారాలపాటు పాఠకులను అలరించింది. రాంబాబు రాసిన ‘జైలుగోడల మధ్య’ పుస్తకరూపంలో దాదాపు చాలా భాషల్లో ప్రచురితమైంది. బాలసాహిత్యంలోనూ బాలల కోసం ఆయన చేసిన కృషి అజరామరం. "ఇంద్రధనుస్సు" అనే బాలల తొలి వీడియో మేగజైన్‌కు తొలి ఎడిటర్‌గా పనిచేశాడు.
ఇదంతా నాణానికి ఒకవైపే...తెలుగు కథానికలపై వాటిని చిన్నచూపు చూసే వారిపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉండేవాడు. ఏనాటికైనా వాటికి కూడా జాతీయస్థాయి గుర్తింపు తేవాలని ఆయన ఉద్దేశం. గ్లోబల్ ఆసుపత్రి మీడియా ఇన్‌ఛార్జిగా పనిచేస్తూ తనవద్దకు సాయం కోసం వస్తే వాళ్లకు ఉదారంగా తనకు సాధ్యమైనంతలో వారికి తక్కువ ఖర్చుతోనే వైద్యసేవలు చేయిస్తూ ఇతోధిక సేవలందిస్తుండేవాడు.
కథానిక శతజయంతి ఉత్సవం
[మార్చు]వంద కథానికల పూర్తి వివరాలతో ’తెలుగు కథానిక డాట్ కామ్’ కూడా ప్రారంభించాడు. 23 జిల్లాల కథానిక తీరుతెన్నులగూర్చి పోటీపెట్టి వ్యాసాల్ని సేకరించాడు. ఈ వ్యాస సంకలనాలను జయంతి సభలో ఆవిష్కరించాడు. అలాగే రచయిత ల చిరునామాలతో ఒక డైరెక్టరీని తీసుకొచ్చాడు. శ్రవ్య, దృశ్య మాధ్యమాల్లో కూడా ఈ సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని చూపించడానికి కృషి చేసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఎవరు, ఎక్కడ ఎటువంటి కథానిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా తన వంతు సహకారాన్ని అందిస్తుంది శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ . ఇది కథానిక కోసం అవతరించిన సంస్థ. కథానికకే అంకితమైన సంస్థ. ’కథానిక కొత్త కదలిక కదులిక’ అనేది ఈ సంస్థ నినాదం! ఈ కార్యక్రమాలన్నీ ఎవర్నించీ ఎటువంటి సహాయం స్వీకరించక కేవలం తన సొంత సంపాదనతో నిర్వహిస్తున్నారు. తప్పక చదవాల్సిన వంద కథానికలు అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించారు.
రచనలు
[మార్చు]కథానికలు
[మార్చు]- ప్రవృత్తిపరంగా కథానికా రచన సాగిస్తూనే, కథానికాభ్యుదయానికి అంకితమై కొత్త కథ, సరికొత్త కథ, నవతరం కథ, పంచనప్తతి - డైరక్ట్ సంపుటాల్ని వెలువరించాడు.
- తెలుగు కథానికా శతజయంతి ఉత్సవాలు విజయనగరంలో ప్రారంభించి, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాల్లో ముందు సాహిత్య వాతావరణాన్ని నెలకొల్పడానికి, తరువాత మరోసారి కథానిక శతజయంతి జరపడానికి రెండుసార్లు కథా సదస్సులు నిర్వహించి ముగింపు సభని హైదరాబాద్ లో జరిపాడు. 23 జిల్లాల కథానికా చరిత్రపై వ్యాసాలు రాయించి, పారితోషికాలు పంచి, ఆ వ్యాసాల్ని సంపుటీకరించాడు. "వందేళ్ళ తెలుగు కథానిక", అలాగే రచయితలకు కథానికా రచనా పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేయటామే కాక, కొత్త రచయితలకు ప్రోత్సాహకరంగా "అద్దం" పేర వారి కథల్ని సంకలనంగా తెచ్చాడు.
- సాహిత్య చరిత్రలోనే అపూర్వ ప్రయోగమనదగిన కథానికా సమీక్షల్ని ఏటా వచ్చే 3000 కథానికల మీద చేయించి 1994, 95, 96, 97 సంవత్సరాల వారీగా ప్రచురించాడు. అన్ని తెలుగు పత్రికల్లో వెలువడిన శతాధిక కథల్ని ప్రముఖ కథకుల చేత, విమర్శకుల చేత పరిశీలింపజేసి చేసిన ఆ ప్రయత్నాల్ని సాహితీలోకం "నభూతో నభవిష్యతి" ఆ పరిగణించి అభినందించింది.
- 1997 లో కేంద్ర సాహిత్య అకాడమీ పక్షాన నిర్వహించిన కథానికా రచయితల ఐదు రోజుల కార్యగోష్టికి సమన్వయకర్తగా వ్యవహరించి, ఆ కార్యక్రమాన్ని సంచలనాత్మకంగా నిర్వహించాడు. ఫలితంగా అకాడామీ వేదగిరి రాంబాబు, వాకాటి పాండురంగారావు గార్ల సంపాదకత్వం "బంగారు కథలు" సంకలనం ప్రచురించింది.
- బుచ్చిబాబు పురస్కారాన్ని నెలకొల్పి ఏడుగురు సుప్రసిద్ధ కథానికా రచయితల కథానికా సంపుటుల్ని - ఒక రచయిత మరో రచయిత పేరు మీద, ఇంకో రచయిత సమగ్ర కథానికా సంపుటిగా ప్రచురించడం జరిగింది. వారు భమిడిపాటి జగన్నాథరావు, డి వెంకట్రామయ్య, శివరాజు సుబ్బలక్ష్మి, అరిగే రామారావు, ఇచ్చాపురపు జగన్నాథరావు, రావి.ఎస్.అవధాని, వీరాజీ గార్లు. ఆయా రచయితల కథానికా సంపుటాల్ని అతని ఖర్చుతో వెలువరించి అందజేసాడు.
- గురజాడ శతజయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన గురజాడ సర్వస్వం, మార్గదర్శి, ఆధునిక ధృవతార గ్రంథాలకి సంపాదకత్వం వహించి, ప్రచురించడం జరిగింది. గిడుగు రామమూర్తి 150 జయంతిని అతను ఎక్కువకాలం జీవించిన పర్లాకిమిడి నుండి అతను జీవించిన విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తణుకు, కొవ్వూరు, చివరిగా మరణించిన చెన్నై వరకు అన్ని ప్రదేశాలలో డా. సామల రమేశ్ బాబు గార్లతొ కలసి సదస్సులు నిర్వహిస్తూ, అన్ని ప్రదేశాలలో అతని రచనలని సేకరించడం జరిగింది. పాడైపోతున్న వాటిని భద్రపరచి డా. పోరంకి, విహారి లాటి వారితో కలసి మొదటి గిడుగు రచనా సర్వస్వం గ్రంథాన్ని తెలుగు అకాడమీ ద్వారా ప్రచురించడం జరిగినది. రెండవ సంపుటి "సవర సంబంధి" ని వేదగిరి కమ్యూనికేషన్స్ ద్వారా ప్రచురించాడు.
- గురజాడ 100వ వర్థంతి సందర్భంగా "తప్పక చదవాల్సిన వంద కథానికలు", "అక్షరం" (150కి పైగా కవితల సంకలనం) గురజాడకి అంకితం చేస్తూ ప్రచురించాడు.
- మనసు ఫౌండేషన్ బెంగళూరు వారు ప్రచురించిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సర్వస్వం నాలుగు సంఫుటాల సంపాదకులలో అతను ఒకరు.
- రాజమండ్రి కోటిపల్లి బస్ స్టేషన్ లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకొని ఆ నిర్మాణాత్మక కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తిచేసాడు.
స్వీయ రచనలు - కథానికా సంపుటాలు
[మార్చు]- సముద్రం
- వయసు కథలు
- విముక్తి
- కస్తూరి
- ఈ కాలమ్ కథలు
- పేచీ కథలు
- వేదగిరి రాంబాబు కథానికలు
- వ్యంగ్య కథానికలు
- అవయవదాన కథానికలు
- మరణం నుండి మరణం దాకా
పరిశోధనా గ్రంథాలు
[మార్చు]- జైలు గోడల మధ్య
- పాపం పసివాళ్ళు
- అగ్నిసాక్షి
- వీళ్ళేమంటారు?
చరిత్ర గంథాలు
[మార్చు]- నాలుగు శతాబ్దాల నగరం
- ఆంధ్రుల చరిత్ర
బాలల గ్రంథాలు
[మార్చు]- బాలరాజు (రెండు పిల్లల నవలలు)
- చిన్ని కథలు
- అలవాట్లు పొరపాట్లు
- ఐదు కథలు
- మన హైదరాబాద్
- బాలల బొమ్మల గురజాడ
- విజయచంద్ర (పిల్లల నవల)
- బుజ్జి కథలు
- ఆబాల గోపాలం
జర్నలిజం
[మార్చు]- వెలుగుదారిలో తెలుగు పత్రికలు
- తెలుగు పత్రికలు - రచనా థోరణులు (సిద్ధాంత గ్రంథం)
- ప్రజలను ప్రభావితం చేస్తున్న మాధ్యమాలు
వైద్య గ్రంథాలు
[మార్చు]- అందరికీ ఆరోగ్యం
- ఆరోగ్యానికి మార్గాలు
- గుండె గుట్టు
- ఊపిరితిత్తుల ఊసు
- మూత్రపిండాల మర్మం
- మెదడుమాట
- కీళ్ళు కండరాలు
- జీర్ణం జీర్ణం
- శతాధికంగా వ్యాసాలు, పరిచయాలు
- "మన ఆరోగ్యం" మాసపత్రికకు గౌరవ సంపాదకత్వం.
ఆధ్యాత్మిక గ్రంథాలు
[మార్చు]- ఆధ్యాత్మిక అడుగు జాడలు
- ఒక మంచిమాట
విమర్శ గ్రంధాలు
[మార్చు]- తెలుగు కథానిక తేజోరేఖలు
- సాహితీ రేఖలు
- తెలుగు కథానికకు వందేళ్ళు
- కథనరంగం
- కథా సదస్సు కొత్త కదలిక
- కథానిక లక్ష్యం - లక్షణాలు
జీవిత రేఖా చిత్ర గ్రంథాలు
[మార్చు]- మన గురజాడ
- ఆధునిక ధృవతార
- గిడుగు పిడుగు
- సౌందర్యాధకుడు బుచ్చిబాబు
- పాలగుమ్మి పద్మరాజు
- వెయ్యిన్నొక్క నవలల కొవ్వలి
- తెలుగు పత్రికలు
- ఆధునిక తెలుగు కథానిక
సంపాదకత్వం
[మార్చు]- నరసరావు పేట 200 ఏళ్ళ ప్రత్యేక సంచిక, సంకలనం
- కడప 200 ఏళ్ళ చరిత్ర ప్రత్యేక సంచిక "కడప కౌస్తుభ"
- ఎన్.బి.టి ప్రచురణ "శ్రీపాద ఉత్తమ కథలు"
- రచయితలు ప్రోత్సహించాలనే తలంపుతో సింగమనేని నారాయణ, శాంతి నారాయణ, ఆజాద్ (కర్నూలు) ప్రతాప రవిశంకర్, కాటూరి రవీంద్ర త్రివిక్రం, అమ్మిని శ్రీనివాసరాజు, కాలువ మల్లయ్య, శిరంశెట్టి కాంతారావు మొదలైన ఎందరో రచయితల సంపుటాలను శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ స్వీకరించి ఉచితంగా ప్రచురించింది.
- బలివాడ కాంతారావు జయంతి ప్రత్యేక సంచిక
- కథాకేళి బహుమతి కథనికల సంకలనమ్
- "పది కాలాలు నిలిచే పది కధానికలు"
గురజాడ పురస్కారం
[మార్చు]మహాకవి గురజాడ అప్పారావు 153వ జయంతి పురస్కరించుకుని సెప్టెంబర్ 21 2015 న గురజాడ పురస్కారం అందజేసారు. ఆయన సుమారు రెండు వేలకు పైగా గురజాడకు సంబంధించిన కథలు, కథానికలు రచించారు. తొలిసారిగా ఆధునిక కథ ఆయనే రచించారని చెప్పారు.[4]
పురస్కారాలు
[మార్చు]- సముద్రం గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కథానిక సంపుటి పురస్కారమ్
- పాపం పసివాళ్ళు ధారావాహికం - రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది
- అడవి మనిషి - టెలిఫిల్ం - రజత నంది
- ఆకాశవాణిలో జింగిల్స్ కి ప్రసారభారతి పురస్కారం
- రాష్ట్ర ప్రభుత్వం నుండి గురజాడ స్మారక పురస్కారం
- గిడుగు పురస్కారం
- కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.[5]
వేదగిరి రాంబాబు సాహితీ పురస్కారం
[మార్చు]వేదగిరి రాంబాబు పేరు మీద అతని జన్మదినం అక్టోబర్ 14 2018 న తెలుగు బాషా సాంస్కృతిక శాఖ, సింహ ప్రసాద్ సాహిత్య సమితి సంయుక్త ఆద్వర్యం లో రవీంద్ర భారతి లో జరిగే సభలో ‘వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారా’న్ని పత్తిపాక మోహన్[6], ‘వేదగిరి రాంబాబు యువ కథానికా పురస్కారా’న్ని జడా సుబ్బారావు అందుకున్నారు.[7][8]
స్ఫూర్తిపథం పుస్తకావిష్కరణ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, లేఖిని మహిళా సాహిత్య సాంస్కృతిక సమాఖ్య, సాధన సాహితీ స్రవంతి సంయుక్తాధ్వర్యంలో వేదగిరి రాంబాబు కథానికలతో ఒక సాయంత్రం పేరిట రాంబాబు నివాళి ప్రత్యేక సంచిక "స్ఫూర్తిపథం" పుస్తకావిష్కరణ 2018 అక్టోబరు 14న రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ముఖ్యాతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా డా.వాసా ప్రభావతికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసారు.
చిత్రమాలిక
[మార్చు]-
స్ఫూర్తిపథం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో (ఎడమ నుండి కుడికి) సాదన నరసింహాచారి, సుధామ, వేదగిరి విజయ్ చంద్ర, అతని కుమార్తె కీర్తన, విహారి, మామిడి హరికృష్ణ, వీరాజి, కె.బి.లక్ష్మీ, వాసా ప్రభావతి, శ్రీపాద గోపాలకృష్ణ
-
వేదగిరి రాంబాబు యువకథాపురస్కారం - 2018 (ఎడమ నుండి కుడికి) డా.పత్తిపాక మోహన్, వేదకుమార్,విహారి, దేవులపల్లి ప్రభాకర్, మామిడి హరికృష్ణ,వాణిశ్రీ, సుధామ
-
వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం - 2018 (ఎడమ నుండి కుడికి) వాణీశ్రీ, డా.జాడ సుబ్బారావు, వేదకుమార్, డా.పత్తిపాక మోహన్, దేవులపల్లి ప్రభాకర్, విహారి, సుధామ, మామిడి హరికృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ "వేదగిరి రాంబాబు కన్నుమూత".[permanent dead link]
- ↑ "Writers, poets rally behind Gurajada family".
- ↑ వేదరిరి రాంబాబు జీవిత చరిత్ర[permanent dead link]
- ↑ ప్రముఖ రచయిత వేదగిరికి గురజాడ పురస్కారం[permanent dead link]
- ↑ పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
- ↑ "Writing books for children isn't easy, says author Mohan Pathipaka".
- ↑ "వేదగిరి రాంబాబు సాహిత్య పురస్కారాలు - 2018".[permanent dead link]
- ↑ "ప్రతిభా వంతుడైన రచయిత డాక్టర్ వేదగిరి రాంబాబు".[permanent dead link]
ఇతర లింకులు
[మార్చు]- రాంబాబు, వేదగిరి. చిన్ని కథలు.
- All articles with dead external links
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- కృష్ణా జిల్లా రచయితలు
- తెలుగు రచయితలు
- నంది ఉత్తమ దర్శకులు
- 1952 జననాలు
- 2018 మరణాలు
- కృష్ణా జిల్లా పుస్తక ప్రచురణకర్తలు
- కొండేపూడి సాహితీ సత్కార గ్రహీతలు