Jump to content

దంపూరు వెంకట నరసయ్య

వికీపీడియా నుండి
దంపూరు వెంకట నరసయ్య
జననందంపూరు వెంకట నరసయ్య
(1849-09-25)1849 సెప్టెంబరు 25
మద్రాసు
మరణం1909 జూన్ 28(1909-06-28) (వయసు 59)
వెంకటగిరి
వృత్తిడిప్యూటి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, ఒంగోలు
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు, సంఘ సంస్కర్త, రచయిత
Notable work(s)నేటివ్ అడ్వొకేట్,
నెల్లూర్ పయొనీర్,
పీపుల్స్ ఫ్రెండ్,
ఆంధ్ర భాషా గ్రామవర్తమాని
మతంహిందూ
భార్య / భర్తరామలక్ష్మమ్మ
పిల్లలురాధాకృష్ణయ్య
తండ్రిఆదినారాయణయ్య
తల్లిఅన్నపూర్ణమ్మ

దంపూరు వెంకట నరసయ్య తొలి తరం పత్రికా సంపాదకుడు. ఇతడు నేటివ్ అడ్వొకేట్ (1867-1869), నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్ (1881-1897) అనే ఆంగ్ల పత్రికలకు, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని (1900-????) అనే తెలుగు పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

నరసయ్య 1849, సెప్టెంబరు 25[1]వ తేదీకి సరియైన సౌమ్య నామ సంవత్సర మహర్నవమి[1] తిథి నాడు మద్రాసు పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఆదినారాయణయ్య. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. ఇతడు ద్రవిడ బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. ఇతడు పచ్చయప్ప సెంట్రల్ స్కూల్‌లో మెట్రిక్యులేషన్, ఎఫ్.ఎ.[1] చదివి అదే విద్యాసంస్థలో అసిస్టెంట్ టీచరు ఉద్యోగం చేశాడు. పనప్పాకం అనంతాచార్యులు ఇతని సహాధ్యాయి[1]. నరసయ్య హయ్యరు గ్రేడు ట్రాన్సులేటరు పరీక్ష పాసయి “హుజూరు ట్రాన్సులేటరు” ఉద్యోగానికి అవసరమైన అర్హతలు సంపాదించాడు[1]. ఇతడు తన 17వ యేటనే తన తొలి ఆంగ్ల గ్రంథం "లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్"ను ప్రచురించాడు.[2] రజస్వలానంతర వివాహం గురించిన వివాదంపై ఇతడు తన అభిప్రాయాలను ఎథీనియం అండ్ డెయిలీన్యూస్‌లో, మద్రాస్ టైమ్స్‌లో సి.వి.రంగనాథశాస్త్రి, గుర్రం వెంకన్నశాస్త్రి, ఎన్.వి.డి అనే పేర్లతో వ్రాసిన లేఖలు ఈ గ్రంథంలో ఉన్నాయి. నరసయ్యకు విద్యార్థిదశలోనే లౌకికభావాలున్న వ్యక్తులతో, బ్రహ్మసమాజం అభిమానులతో పరిచయాలు, స్నేహాలు ఏర్పడ్డాయి. పళ్ళె చెంచలరావు, చుండూరు కోటయ్య సెట్టి, మన్నవ బుచ్చయ్య[2] మొదలైనవారితో ఆత్మీయమైన సంబంధం ఉండేది. మదరాసు బ్రహ్మసమాజ ఉద్యమనాయకుడు శ్రీధరనాయుడు ప్రభావం నరసయ్య మీద పడింది.1869లో ఇతడు వెంకటగిరి సంస్థానం జమిందారు సర్వజ్ఞ కుమార యాచేంద్ర పెద్ద కుమారుడు, రాజగోపాల కృష్ణ యాచేంద్రకు ఇంగ్లీషు నేర్పించడానికి వెంకటగిరి సంస్థానంలో చేరి ఒక సంవత్సరం పనిచేశాడు.[3] తరువాత సంస్థానం కొలువు మానుకొని ప్రభుత్వ అజమాయిషీ ఉన్న ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా కొంత కాలం పనిచేశాడు. తరువాత నెల్లూరు కలెక్టర్ ఆఫీసులో అనువాదకుడిగా కొంత కాలం పనిచేశాడు.[3] 1872లో ఇతడు ఒంగోలులో డెప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగంలో చేరాడు.[4] ఆ ఉద్యోగంలో 1875 వరకూ కొనసాగాడు. ఆ తర్వాత మద్రాసు చేరుకుని 1881 నుండి 1897 వరకూ పీపుల్స్ ఫ్రెండ్ అనే ఇంగ్లీషు వారపత్రికను, పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్ అనే ముద్రణాసంస్థను నిర్వహించాడు.[5] ఆ సమయంలో కందుకూరి వీరేశలింగం, పళ్ళె చెంచలరావు, గణపతయ్య, ఆర్.రఘునాథరావు, మన్నవ బుచ్చయ్య మొదలైన వారితో కలిసి వితంతు పునర్వివాహం వంటి సాంఘీక సంస్కరణలు చేపట్టాడు.[5] ఇతడు తిరిగి 1897లో నెల్లూరు చేరుకుని 1900 నుండి ఆంధ్రభాషా గ్రామ వర్తమాని అనే పత్రికను ప్రారంభించాడు.[6] తన మకామును 1903లో కోడూరు భట్టారం వారి కండ్రికకు, 1906లో కోడూరు గ్రామానికీ మార్చాడు. 1906లో కోడూరులో కాపురం పెట్టి ఆ గ్రామానికి మునసబుగా కొంతకాలం సేవలు చేశాడు. 1907లో వెంకటగిరిలో స్థిరపడి 1909 జూన్ 28వ తేదీకి సరియైన సౌమ్య నామ సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మరణించాడు.[7] ఇతనికి భార్య రామలక్ష్మమ్మ, కుమారుడు భట్టారం రామకృష్ణయ్య ఉన్నారు.

పత్రికారంగం

[మార్చు]

నేటివ్ అడ్వొకేట్

[మార్చు]

ఈ పత్రికను దంపూరు వెంకట నరసయ్య అతని సోదరులు కృష్ణయ్య, పార్థసారథి శాస్త్రిలతో కలిసి నెలకొల్పాడు. ఈ ఆంగ్ల వారపత్రికకు నరసయ్య సంపాదకుడిగా, డి.కృష్ణయ్య బ్రదర్స్ ప్రొప్రైటర్స్‌గా వ్యవహరించారు. 1867-1870 మధ్య కాలంలో ఈ పత్రిక నడిచింది. ఈ పత్రిక సామాజిక విషయాలకు, సంస్కరణ భావాలకు అంకితమై వెలువడింది.[8]

నెల్లూర్ పయోనీర్

[మార్చు]

ఈ పత్రికను నరసయ్య నెల్లూరు నుండి రెవెన్యూ శాఖలో గుమాస్తాగా పనిచేస్తున్న నంబెరుమాళ్ళయ్యతో కలిసి నడిపాడు. ఈ పత్రిక వెలువడిన తేదీ విషయంలో స్పష్టత లేదు. 1860 దశకం చివరిలో ఈ పత్రిక ఒక సంవత్సరం మాత్రం వెలువడినట్లు తెలుస్తున్నది. ఇది వారపత్రికా, పక్షపత్రికా అనే విషయం కూడా తెలియడం లేదు.[9]

పీపుల్స్ ఫ్రెండ్

[మార్చు]

ఈ పత్రిక 1881 ఏప్రెల్ నెలలో ప్రారంభమయ్యింది. ప్రతి శనివారం సాయంత్రం ఈ వార పత్రిక వెలువడెడిది. ఈ పత్రికకోసం నరసయ్య ప్రభుత్వోద్యోగం చేసిన కాలంలో కూడబెట్టిన డబ్బంతా వెచ్చించి ముద్రణాలయాన్ని స్థాపించాడు. ఇతడు పీపుల్స్ ఫ్రెండ్ ప్రజల పత్రికని, అతి సామాన్యులైన గుమాస్తాలకు సైతం అందుబాటులో ఉండాలని భావించాడు. పత్రిక పై భాగంలో "A Cheap Journal published every Saturday evening" అని ప్రకటించుకొన్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా, స్టేట్స్‌మన్, హిందూ మొదలైన పత్రికలలో ప్రచురించబడిన వార్తలు ఈ పత్రికలో ధారాళంగా పునర్ముద్రణ పొందాయి. విద్యావంతులైన స్థానికులు రాసిన వార్తలు, వ్యాసాలు, లేఖలు ఈ పత్రికలో ప్రచురింపబడేవి. ఈ పత్రిక 1883 నాటికి 1200 కాపీల సర్క్యులేషన్ కలిగి ఉంది. ఈ పత్రికలో రఘుపతి వేంకటరత్నం నాయుడు రచనలు చేసేవాడు. ఇంకా ఈ పత్రికలో కన్యాశుల్కం నాటకంపై సమీక్ష కూడా వెలువడింది. ఈ పత్రిక 1897 జూలై నెలలో మూతపడింది.[5]

ఆంధ్ర భాషా గ్రామవర్తమాని

[మార్చు]

ఈ వారపత్రిక 1900 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ పత్రిక గ్రామ సమస్యలమీద, ప్రత్యేకంగా కోడూరు గ్రామ సమస్యల మీద దృష్టి పెట్టింది. వారంవారం ఆంధ్రభాషా గ్రామవర్తమాని 150 ప్రతులు మాత్రం అచ్చయ్యేవి. దంపూరు నరసయ్య పత్రిక నిర్వహణలో సంపాదకుడు, విలేకరి, ప్రూఫ్‌రీడరు అన్నీ తానే అయి వ్యవహరించాడు. ఈ పత్రికలో గ్రామాలలో రోడ్డు సమస్యలు, శ్రోత్రియం భూములను, మాన్యాలను ఆక్రమించుకొని అనుభవిస్తున్న భూస్వాములకు వ్యతిరేకంగా, గ్రామీణ పాఠశాలల ఆవశ్యకత, గ్రామన్యాయస్థానాలు, రైతు పక్షపాతం, రెవెన్యూ వ్యవస్థ, జమాబంది, గ్రామాధికారులు, గ్రామ కరణాలు, గ్రామసేవకులు, భూముల సర్వే, స్థానిక సమస్యలు, ఉప్పుపన్ను, రైతు సంఘాలు, జైలు సంస్కరణలు, సాహిత్య విషయాలు మొదలైన అనేక విషయాలు ప్రచురితమయ్యాయి.[6]

రచనలు

[మార్చు]
  • లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్[2]
  • హిస్టారికల్ స్కెచెస్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్[10]
  • ఎసన్షియల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్[11]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF) (1 ed.). నెల్లూరు: సొసైటీ ఫర్ సోషియల్ ఛేంజ్. p. 12-14. Retrieved 24 June 2022.
  2. 2.0 2.1 2.2 కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF). నెల్లూరు: సొసైటీ ఫర్ సోషియల్ ఛేంజ్. pp. 19–361. Retrieved 24 June 2022.
  3. 3.0 3.1 కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF) (1 ed.). నెల్లూరు: సొసైటీ ఫర్ సోషియల్ ఛేంజ్. pp. 41–43. Retrieved 24 June 2022.
  4. కాళిదాసు పురుషోత్తం. ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF) (1 ed.). సొసైటీ ఫర్ సోషియల్ ఛేంజ్. pp. 47–49. Retrieved 24 June 2022.
  5. 5.0 5.1 5.2 కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF) (1 ed.). నెల్లూరు: సొసైటీ ఫర్ సోషియల్ ఛేంజ్. pp. 56–104. Retrieved 24 June 2022.
  6. 6.0 6.1 కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF) (1 ed.). నెల్లూరు: సొసైటీ ఫర్ సోషియల్ ఛేంజ్. pp. 105–130. Retrieved 24 June 2022.
  7. కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF). నెల్లూరు. p. 140. Retrieved 24 June 2022.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  8. కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF) (1 ed.). నెల్లూరు. pp. 38–40. Retrieved 24 June 2022.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  9. కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF) (1 ed.). నెల్లూరు: సొసైటీ ఫర్ సోషియల్ ఛేంజ్. pp. 45–47. Retrieved 24 June 2022.
  10. కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF) (1 ed.). నెల్లూరు: సొసైటీ ఫర్ సోషియల్ ఛేంజ్. p. 40. Retrieved 24 June 2022.
  11. కాళిదాసు పురుషోత్తం (2007). ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య (PDF) (1 ed.). నెల్లూరు: సొసైటీ ఫర్ సోషియల్ ఛేంజ్. p. 47. Retrieved 24 June 2022.
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: