రఘుపతి వేంకటరత్నం నాయుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, బ్రహ్మర్షిగా ఆంధ్రదేశాన పేరుపొందిన వ్యక్తి, ఆచార్య రఘుపతి వెంకటరత్నం నాయుడు ( అక్టోబరు 1, 1862 - మే 26, 1939). సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు కందుకూరి వీరేశలింగం పంతులు తో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే.

రఘుపతి వేంకటరత్నం నాయుడు
రఘుపతి వేంకటరత్నం నాయుడు

జీవిత విశేషాలు[మార్చు]

రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1మచిలీపట్నం లో సుప్రసిద్ద తెలగ నాయుళ్ళ ఇంట జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి హైదరాబాదు బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాలను గురించి పట్టించుకోరాదు అనే వారామె.


ఎం.ఏ. కాగానే మద్రాసు పచ్చయప్ప కళాశాలలో ఇంగ్లీషు ఆచార్యునిగా పనిచేసాడు. 1904 లో కాకినాడ లోని పిఠాపురం రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు. 1911 లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు. 1925 లో మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేసాడు. 1927 లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.

ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - వేమూరి రామకృష్ణారావు జంటని తప్పకుండా చెప్పుకుంటారు.


1884 లో బి.ఏ చదువుతూ ఉండగానే నాయుడుకు పెళ్ళయింది. 1889 లో భార్య మరణించిన తరువాత మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా, జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించాడు. ఆయనను శ్వేతాంబర ఋషి అనేవారు. పేద విద్యార్థులను, అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవాడు. తన నెలసరి ఆదాయంలో కొద్దిభాగం ఉంచుకుని మిగతాది బీద విద్యార్థులకే వినియోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డా.మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో పదివేల రూపాయలతో ఒకనిధిని ఏర్పాటు చేసాడు.

1939 మే 26 న రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణించాడు.

ప్రముఖ సినిమా నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు అయిన రఘుపతి వెంకయ్య, నాయుడు సోదరుడే.

సంఘ సంస్కరణ[మార్చు]

మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు. బ్రహ్మసమాజంలో చేరి, కాకినాడ లో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన 'కులవ్యవస్థ నిర్మూలన'కు కృషిచేసాడు. మద్యనిషేధం కొరకు శ్రమించాడు. 1923 లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడిచేసాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు. శుభకార్యాలలో భోగం మేళాల సాంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్స్ అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు. 'అపర సోక్రటీసు' గా ఆంధ్ర ప్రజల మన్ననలందుకున్న రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు సంపూర్ణ జీవితం గడిపి 1939 మే 26వ తేదీన దివంగతులయ్యారు.

రఘుపతి వేంకటరత్నం చిత్రపటం

బిరుదులు[మార్చు]

రఘుపతి వెంకటరత్నం నాయుడుకు ఎన్నో బిరుదులు ఉండేవి. వివిధ రంగాల్లో ఆయన కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు కూడా ఆయనకు లభించాయి. వాటిలో కొన్ని:

  • బ్రహ్మర్షి
  • శ్వేతాంబర ఋషి
  • అపర సోక్రటీసు
  • కులపతి
  • దివాన్ బహదూర్
  • కైజర్-ఇ-హింద్
  • సర్

మూలాలు, వనరులు[మార్చు]

  • జానమద్ది హనుమచ్ఛాస్త్రి రచించిన సుప్రసిద్ధుల జీవిత విశేషాలు
  • అమరావతి పబ్లికేషన్సు వారి తెలుగు వెలుగులు

బయటి లింకులు[మార్చు]