ఆకాశవాణి కేంద్రం, విశాఖపట్టణం
Appearance
ఆకాశవాణి రేడియో ప్రసారాల కోసం విశాఖపట్టణంలో నెలకొల్పిన కేంద్రం ఇది.
చరిత్ర, పురోగతి
[మార్చు]ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం 1963 జూన్లో రిలే కేంద్రంగా డా. బెజవాడ గోపాలరెడ్డి పవిత్రహస్తాల మీదుగా ప్రారంభమైంది. బాలారిష్టాలు దాటుకొని 1974లో మూడు ప్రసారాలు ప్రారంభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యా సంస్థ ఈ కేంద్రానికి ఊపిరి. తొలినాళ్ళలో A.S.N.మూర్తి, N. రమణమ్మ డైరక్టర్లుగా పనిచేశారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన రతన్ సింగ్, వోరీన్ నక్వీ ఈ కేంద్రం డైరక్టర్లుగా పనిచేసిన ఔత్తరాహులు. శ్రీమతి విజయలక్ష్మీ సౌందరరాజన్, దేవళ్ళ బాలకృష్ణ, దుర్గాభాస్కర్ ఈ కేంద్రం అభివృద్ధికి కృషి చేశారు. డి. ప్రసాదరావు 1994లో కేంద్రనిర్దేశకులయ్యారు.[1]
వందకిలోవాట్ల ప్రసారశక్తితో శ్రీకాకుళం మొదలు రాజమండ్రి వరకు ఈ కేంద్ర ప్రసారాలు శ్రోతల్ని అలరిస్తున్నాయి.
కార్యక్రమాలు
[మార్చు]- నిలయ విద్వాంసుల సంగీత కార్యక్రమం
- వ్యవసాయ కార్యక్రమాలు
ప్రముఖులు
[మార్చు]- ఇక్కడ ప్రవచనశాఖ ప్రయోక్తగా ఒక దశాబ్ది పనిచేసిన పి. విజయ భూషణశర్మ సంస్కృతాంధ్రాలలో నిష్ణాతులు.
- కాటూరి వెంకటేశ్వరరావు కుమారులు విజయసారథి యిక్కడే అకౌంటెంట్ గా పనిచేశారు. ఆయన చక్కని రచయిత. ఆయన 1996 నవంబరులో పరమపదించారు.
- ఇక్కడ ఒకదశాబ్దికాలం కె. ఆర్. భూషణరావు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. సూర్యనారాయణ నాటక ప్రయోక్తగా జాతీయ స్థాయిలో బహుమతులందుకొన్నారు.
- నేదునూరి కృష్ణమూర్తి, అరుంధతీ సర్కార్ వంటి సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు ఈ కేంద్రం నుండి సంగీత కార్యక్రమాలు అందిస్తున్నారు.
- ఇవటూరి విజయేశ్వరరావు ఈ కేంద్రంలో సంగీత విభాగంలో పనిచేశారు.
- వ్యవసాయ కార్యక్రమాలను సుసంపన్నం చేసిన వ్యక్తులలో Y. గంగిరెడ్డి ప్రముఖంగా చెప్పుకోదగినవారు.
- ఇక్కడ రెండు దశాబ్దాలు పైగా కార్యక్రమ నిర్వహణలో సామర్ధ్యం చూపిన వ్యక్తి సలాది కనకారావు. కార్యక్రమ నిర్వాహకులుగా ఈయన పేరు తెచ్చుకొన్నారు. విజయవాడ కేంద్రంలో అతిచిన్న పదవిలో చేరి కార్యక్రమ నిర్వాహకుడుగా 1994లో పదవీ విరమణ చేశాడు. కార్మికుల కార్యక్రమ నిర్వాహకులుగా ఈయన పేరు గడించారు. వీరిని అమెరికాలో సన్మానించారు. కవి, రచయిత అయిన సలాది విశాఖపట్టణంలో స్థిరపడ్డారు.
- ' ఆరవి ' గా పేరు పొందిన ఆచంట సూర్యనారాయణమూర్తిగా ఈ కేంద్ర డైరక్టరుగా చక్కటి కార్యక్రమాల రూపకల్పనకు నాందీ ప్రవచనం చేశారు. ఆచంట సూర్యనారాయణమూర్తిగారు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా హైదరాబాదులో పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ గా విశాఖపట్టణం వెళ్ళారు. అక్కడే డైరక్టరుగా పనిచేశారు. తర్వాత హైదరాబాదు వాణిజ్య ప్రసార కేంద్రం డైరక్టరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని థియోసాఫికల్ సొసైటీ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. వీరు చక్కని రచయిత.
- ఇక్కడ సంగీత విభాగంలో మృదంగ విద్వాంసులు శ్రీ వంకాయల నరసింహం, కొమండూరి కృష్ణమాచార్యులు, శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు ప్రసిద్ధులు.
మూలాలు
[మార్చు]- ↑ ఆర్, ఆర్. అనంత పద్మనాభరావు (1996). ప్రసార ప్రముఖులు. న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్. వికీసోర్స్.