ఆకెళ్ళ రవిప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకెళ్ళ రవిప్రకాష్

ఆకెళ్ళ రవిప్రకాష్ ఐ.ఎ.ఎస్. అధికారి, రచయిత. పుదుచేరి గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో నాలుగేళ్ల పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సహకార సంస్థ (జిసిసి) వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సాంస్కృతిక, శిక్షణ, పరిశోధన మిషన్ ( టి.సి.ఆర్ & టి.ఎం.) మిషన్ డైరెక్టర్ గా పనిచేసారు. ఇసక గుడి, ప్రేమ ప్రతిపాదన వంటి కవితా సంకలనాలను రచించారు.

ఆకెళ్ళ రవిప్రకాష్ రచనా పాటవం పై ప్రముఖ రచయిత రామతీర్ధ ప్రజాశక్తి దినపత్రికలో రాసిన వ్యాసం :

కొత్త మొహంజదరో, ఇసుక గుడి, ప్రేమ ప్రతిపాదన కవితా సంకలనాలను లోగడ వెలువరించిన కవి ఆకెళ్ళ రవి ప్రకాష్‌. కవిత్వంలో సామాజికత సహజ లక్షణమే తప్ప, పైనుంచి తెచ్చుకునే అంశం కాదని రవిప్రకాష్‌ కవితలు చెప్తాయి. ఉత్తమమైన కవిత్వం అనువాదానికి లొంగదని అనువాద కళ ఎరగని వారు చెప్తారు. భావంలో గాఢత, భాషలో సరళత, ఆధునిక కవి లక్షణాలు. ఈ లక్షణాలతో నేటి మంచి కవిత్వం, ఇతర భాషల్లో కూడా చక్కగా పలుకుతుంది. కవిత్వం ఒక బలమైన అనుభూతి నుంచి నిర్మాణం జరుగుతుంది. ఆ పొదరింట అలసిసొలసిన మనిషి సేదదీరవచ్చు. మంటల పందిరి కూడా అవుతుంది కవిత్వం. అలాగే ఆంగ్లంలో సాహిత్య వాతావరణంలో వాడే ఒక మాట 'పొయిటిక్‌ అప్రీసియేషన్‌'. ఈ అప్రీసియేషన్‌ అంటే ఏమిటి? అభినందన, ప్రశంస, మెచ్చుకోలు... ఇవేవీ కావని చెప్పవచ్చు. మొదటగా ఈ మాటకి గల వ్యతిరేక పదం చూద్దాం. అది డిప్రీసియేషన్‌. అంటే దేని విలువ అన్నా తగ్గడం. స్టాక్‌ మార్కెట్లో ఈ మాటకు విస్తారమైన అర్థం ఉంది. అలాగే అప్రీసియేషన్‌ అంటే పెరగడం. విలువ, స్థాయి, సార్థకత పెరగడం. ఈ పెరగడాన్ని సాహిత్య భాషలో తీసుకుంటే, పైన చెప్పినవి, మనం తెలుగులో వాడేవీ, అభినందన, ప్రశంస, మెచ్చుకోలు, ఇవేవీ అప్రీసియేషన్‌ కాదని చెప్పగలం. అప్రీసియేషన్‌ అంటే ఉన్నతీకరణ. విలువల ఇనుమడింపు. దీనికోసం పరిశీలన, విమర్శ ఉపయుక్త పద్ధతులు, ప్రక్రియలు. ఇలా ఒక పరిశీలన, విమర్శలో కవిత/ కథ/ నవల/ నాటకం.. ఇలా ఉదాహృత రచన ఉన్నతీకరణ జరగాలి. అదీ అప్రీసియేషన్‌ అంటే! ప్రపంచ సాహిత్యంలో ఎక్కడైనా విషయం ఎత్తుకుని ఇలా ఉన్నతీకరణ చేయడమే, విలువల పెంపొందింపు అనే తీరులో, వారి వ్యవహార శైలి, అకడెమిక్‌ పద్ధతులూ ఉన్నాయి. అప్రీసియేషన్‌ అనే మాటకు అంతర్జాతీయ సాంప్రదాయంలో ఉన్నతీకరణను సాహిత్యార్థంగా చెప్పుకోవాలి.

ఈ తృతీయ సహస్రంలో కవిత్వ ఉన్నతీకరణ నేటి తరాల కవిత్వాభిమానులు శ్రద్ధతో చేయవల్సిన పని. అలా ఉన్నతీకరణకు నిలబడ్డదే సంపన్నవంతమైన రచన. శ్రీశ్రీ 'కవితా ఓ కవితా', ఆరుద్ర 'త్వమేవాహం' రచనలపై ఈ అప్రీసియేషన్‌ జరిగిన సందర్భాల్లో, అందుకు మొజాయిక్‌ సాహిత్య సంస్థ పవర్‌ పాయింట్‌ వంటి సాఫ్ట్‌ వేర్‌ ఉపకరణాలు ఉపయోగించి కొత్త వొరవడి సృష్టించింది. అలా పరిశీలన చేయవల్సిన ఇటీవలి ఒక కవిత రవి ప్రకాష్‌ రాసిన 'రైలు ప్రయాణం'. కవిత్వ పాఠశాలకు అంశంగా ఈ కవిత నిలుస్తుంది. కవిత్వ రచనలో సాధించాల్సిన వస్తువు, కాలం, స్థలం... వీటి ఐక్యత ఒక లక్ష్యం కోసం జరగడం, మంచి కవిత లక్షణం. రైలు ప్రయాణం అలాంటి ఒక బహుళ అనుభవం. పలు స్తరాలలో (లెవెల్స్‌)లో అర్థం సార్థకంగా పరివ్యాప్తం కావడం కూడా చూస్తాం.

'ఒక్కోసారి తెలియని భాషల్ని తెలుసుకోవడం బానే ఉంటుంది/ ఒకానొక రైలు ప్రయాణంలో నేను తప్ప చుట్టూరా అందరూ/ అనర్గళంగా ఒక అపరిచిత భాష మాట్లాడుతూ...' అన్నది ఈ కవిత మొదలు. అవటానికి రైలు ప్రయాణమే, అనుభవం అక్కడిదే. కానీ ఈ కవిత, భాషల గురించి కూడా మాటలాడుతుంది. రైలు ప్రయాణంలో మనకి తెలీని భాష ఏదో మాట్లాడే వారి మధ్య కూచుని ప్రయాణించడం వద్ద మొదలవుతుంది. రైలుపెట్టెలో అర్థం కాని భాషలో అందరూ గడబిడగా మాట్లాడేసుకుంటుంటే, బాగానే ఉంటుంది అంటున్న కవికి, కాసేపటికి, ఆ భాష పలకడంలో కొంత కళ్ల సంగీతం వలె అనిపిస్తుంది. కొంత అర్థం కావడం మొదలవుతుంది. రైలు కదిలి వెళ్తూ ఉంటుంది, బయట కిటికీలో కనిపించే భిన్న దృశ్య పరంపర వలె, భాష కూడా ఎత్తులు, పల్లాలు, రంగుల కుప్పలు, మబ్బు దూది ఉండల్లా ఉంటుందని కవి చెప్పడు, కానీ పైన కనిపిస్తున్న భిన్న ఆకృతుల్లా లోపల భిన్నమైన వేటినో సూచిస్తున్నాడు అని చదువరులకు ఒక ఎరుక మొదలవుతుంది.

రైలు తొలి అడుగుల పిల్లాడిలా మెల్లని అడుగులుగా, తరువాత వేగంగా వెళ్తోంది అన్నప్పుడే, కవి ఈ కవితలో చేస్తున్న 'అంతర్‌బహిర్‌ ముగ్ధారావం' తన పరిచయాన్నందిస్తుంది. రైలు ప్రయాణంలో భాషల వికాసాలు చెప్పడం, పోలికల్లో సామరస్యం కవి చేస్తున్న నిర్మాణంలో దాగి పలకరిస్తుంది. రైలు చక్రాలు గుండ్రంగా అక్షరాల్లా పొడవాటి రైలు పట్టాల మీద సాగి పోతున్నాయి అన్నది, చక్రాలు, అక్షరాలు, పట్టాలు, భాషలు, ఈ పద సందోహం ఒక కాలగతిని చెప్తోందా - (వృత్తాకార అక్షర మాలతో / పట్టాలతో / పొడుగుగా సంభాషిస్తున్న ప్రయాణం) అయితే అది చదువరులే కనిపెట్టాలి.. ఇదిగో ఈ కవితలో ఈ విన్యాసం చేస్తున్నాను అని ఎక్కడా కవి చెప్పడు. అక్షరాలు గుండ్రాలుగా ఉండడం, ప్రాచీన బ్రాహ్మీలిపి లక్షణం.( ఇప్పుడిది మనకు ఒడియా భాష లిపిలో కనిపిస్తుంది) అయన రేఖల మీద రాత్రి, పగళ్ళుగా కాలగమనం, భూమి భ్రమణం ఎంతగా విజ్ఞానశాస్త్రం చెప్పే భౌగోళిక సత్యాలో, భాషల పుట్టుక, వివర్తనం, ఇవి కూడా అంతే గమనశీలమైనవి అని రైలు ప్రయాణం కవితలో గుట్టుగా చెప్పేసి, 'ఇదంతా కదిలే రైలు, మెదిలే భాషల గురించే కదా' అనుకునే లోపలే, కవిత్వం పచ్చ జెండా ఊపుతూ స్టేషన్లలో కనిపిస్తోంది అంటాడు కవి.

బండి లోపలి వాళ్ళ పరిచిత అపరిచిత భాషలో ఒక శబ్ద సంచయం, పైన దృశ్యాలు దృశ్యాలుగా దొర్లిపోతున్న లోకం, ఈ రెంటినీ, ఒక సూది ఏదో పైన ఉన్నదాన్ని, లోపల (అంటే బండి లోపలా, కవి లోపలా?) ఉన్న దాన్ని కలిపి కుడుతూ ఉంటుంది. ఇస్మాయిల్‌ గురువు వద్ద నేర్చిన మాంత్రిక ప్రాకృతికత, రవి ప్రకాష్‌ కవితలో రంగుల జలపాతం అవుతుంది. భావన సాంద్రమై సుదూర గుడారాల్లోంచి, గుండె గుమ్మాల వద్దకు వస్తుంది కవిత్వ భిక్షతో కరుణిస్తూ. అలా రాసిన పద చిత్రాలు పచ్చి రంగుల్లో ఉంటాయి ఇలా.. 'రాత్రి పక్షి ఆకాశాన్ని / చిట్టచివరి గుటకలో / ఎలా మింగేస్తోందో చూడు'. రాత్రంతా రైలులో గడిచిందా అన్న ప్రశ్న ఇక్కడ వేయకూడదు. రైలు లోపల, బయటా, భాష బయట లోపలా, కాలంలో, కవిత్వంలో, మనిషిలో, ఇప్పుడిక కవితనిండా పండిన వరిచేలలా పక్వమైన బరువులు. రైలు, భాష, వేగం, కాలం, దృశ్యాలు, సమాజాలు, వీటన్నిటినీ కలిపి కుట్టిన సూది కవిత్వం. అది కవినే కాదు లోకాలను కూడా కలిపి నిలిపే ఒక సూఫీ చింతన. సర్వ మానవ సమానత్వ భావనతో, లోకదర్శనం చేసే సహనశీలత. బండి బహుశక్తుల అనేక వచనం. అది సమాజమే. అందరితో కూచుని ఒక అపరిచిత భాష వినడం, ఇందులో కేవల సందర్భమే కాదు, ఈ లోకంలోకి వచ్చిన పసివారి శైశవగీతం కూడా అదే దశలో ఉంటుంది. మెల్లగా ఎన్నో నేర్వడం! నవలా రచయిత ఘండికోట బ్రహ్మాజీరావు గారు 'పరుగులిడే చక్రాలు, ప్రవహించే జీవన వాహిని' అని ఒక నవలకు కాస్త పెద్దదే అయినా ఇంచుమించు కవిత్వ చరణం అనిపించే పేరు పెట్టారు. అలా ఈ రైలు ప్రయాణం కవితలో కూడా కవి ఇదే సాంద్ర చిత్రాన్ని పెయింట్‌ చేస్తున్నాడు.

ఆధునిక కవిత అప్రీసియేషన్‌ అంటే, కవి సూతుడు చెప్పే లెవెల్‌లో అది రైలు ప్రయాణమే అయినా, కవితా సూత్రం అర్థం చేసుకునే స్థాయిల్లో, కవి చేతిలో, రైలు భాషై, భాష ద శ్యమై, దృశ్యం సామరస్య శ్రుతిలో అనుభవాల పాదరసమై, ప్రతీకలు సృజనశీలంగా పరుగులు పెట్టిన తీరు ఉన్నతీకరణకు తగినది. అలా అని వస్తు, కాల, స్థల సమన్వయం లేకుండా, ప్రయోగ లక్షణంతోనే కొత్తదనాల వెంట పరుగులు తీయకుండా, ఈ కవితలో నిర్వహించిన ప్రయాణ వస్తువు, (మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని అన్నట్టుగా) ప్రయాణంతో ఆరంభం, ప్రయాణంతో నిర్వహణ, ప్రయాణంతో ముగింపు.. ఇదొక సనాతన భారతీయ సాహిత్య సంప్రదాయం. దీన్ని ఆధునిక కాలపు కవిత్వంలో కూడా రవి ప్రకాష్‌ నిర్వహించిన తీరు అప్రీసియేషన్‌ కు తగిన సందర్భం. కవిత ఇలా ముగుస్తుంది. 'అనుకోని మజిలీలన్నిటిలో/ గమ్యం తెలీకుండా సాగడం కూడా/ ఒక్కోసారి మనల్ని మనకే / కొత్తగా పరిచయం చేస్తుంది'.

'చూశావా ఆరుద్రా ఒక తమాషా, సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా' (సాహిత్యోపనిషత్‌లో) అన్నప్పుడు శ్రీశ్రీ, వెనక్కి చూసే గుడ్డి సంప్రదాయ ప్రేమికుడు కాదు, సాంప్రదాయంలో ఉన్న మేలు లక్షణాలు, కాలంలో నిలిచి, వర్తమానానికి బలమై, భవిష్యత్తుకి ప్రోద్బలమవుతాయన్న స్పృహ గల కళాకారుడు. అప్రీసియేషన్‌ గనుక ఇలా నిర్వహిస్తే, కవిత్వ సృజన కానీ, ఇంకే ప్రక్రియలో సృజన కానీ, ఎన్నో విషయాలను విశదపరుస్తూ, ఉన్నతీకరణకు దారి తీస్తుంది. ఆధునిక కవిత్వంలో ఈ సంపన్న దక్షత లోపిస్తే, అవి అప్రీసియేషన్‌ ఉన్నతీకరణ ప్రక్రియకు నిలబడలేవు. అటువంటి మంచి కవిత 'రైలు ప్రయాణం' అందచేసిన కవి, ఆకెళ్ళ రవి ప్రకాష్‌, త్వరలో (జులై 16న) 'భూమి పుట్టినరోజు' అన్న తన నాలుగో కవిత్వ సంపుటి వెలువరిస్తున్నారు. ఈ కవిత ఆ సంపుటిలో ఉంది.

అలాగే, మొజాయిక్‌ సాహిత్య సంస్థ గత మూడేళ్లుగా ప్రదానం చేస్తున్న వార్షిక సాహిత్య పురస్కారాలు 'అక్షర గోదావరి' కవిత్వ అవార్డు, 2018కి గాను ఆకెళ్ళ రవిప్రకాష్‌కు ప్రకటించడం జరిగింది. ఇదే అవార్డుల వేదికపై జులై 17న, విశాఖలో, కథకు గంటేడ గౌరునాయుడు, విమర్శ ప్రక్రియకు సీతారాం, ఈ అక్షరగోదావరి పురస్కారాలు స్వీకరిస్తున్నారు. ప్రసరించే ఈ కవిత్వ రవి ప్రకాశం, మరింతగా విభాప్రభాతాలకు దారితీయాలని సాహిత్యలోకం ఆశిస్తోంది.

Source : http://m.prajasakti.com/Article/NetiPratyekam/2053049