ఆపరేషన్ ట్రైడెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆపరేషన్ ట్రైడెంట్
భారత పాకిస్తాన్ యుద్ధం 1971లో భాగము
తేదీ1971 డిసెంబరు 4-5
ప్రదేశంఅరేబియా సముద్రంలో, పాకిస్తాన్ లోని కరాచీ రేవుకు దక్షిణంగా 26 నుండి 31 కి.మీ. దూరాన
ఫలితంభారత విజయం, పాకిస్తాన్‌పై పాక్షిక నౌకా దిగ్బంధనం
ప్రత్యర్థులు
 India Pakistan
సేనాపతులు, నాయకులు
*అడ్మిరల్ ఎస్ ఎం నందా (నౌకాదళ ప్రధానాధికారి)
  • వైస్ అడ్మిరల్ గులాబ్ మోహన్‌లాల్ హిరనందాని (ఫ్లీట్ ఆపరేషన్స్ ఆఫీసర్)
  • కమాండర్ బబ్రూ భాన్ యాదవ్ (కమాండర్, కరాచీ దాడిదళం)
  • దాడిలో పాల్గొన్న నౌకల కమాండింగ్ ఆఫీసర్లు
దాడిలో ధ్వంసమైన నౌకల కమాండింగ్ ఆఫీసర్లు
బలం
*మూడు విద్యుత్ తరగతి క్షిపణి పడవలు
  • రెండు అర్నాలా తరగతి జలాంతర్గామి విధ్వంసక కార్వెట్‌లు
  • ఒక ఫ్లీట్ ట్యాంకరు
  • కరాచీ తీరప్రాంతంలో మోహరించిన ఓడలు
    ప్రాణ నష్టం, నష్టాలు
    లేవు*మూడు పడవలను ముంచేసారు
  • ఒక ఓడ బాగా దెబ్బతినడంతో, నౌకాదళం నుండి తొలగించారు
  • కరాచీ హార్బరులోని ఇంధన నిల్వ ట్యాంకులను ధ్వంసం చేసారు
  • 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో భారత నావికాదళం పాకిస్తాన్‌ రేవు పట్టణం, కరాచీపై చేసిన దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. ఈ ఆపరేషన్‌కు కొనసాగింపుగా నావికాదళం చేపట్టినది ఆపరేషన్ పైథాన్. నౌకా విధ్వంసక క్షిపణులను వాడిన తొలి యుద్ధం ఈ ప్రాంతంలో ఇదే. డిసెంబరు 4-5 రాత్రి చేపట్టిన ఈ ఆపరేషన్ పాకిస్తాన్ నౌకలు, స్థావరాలకు తీవ్ర నష్టం కలగజేసింది. పాకిస్తాన్ ఒక మైన్ స్వీపరు, ఒక డిస్ట్రాయరు, ఆయుధాలను చేరవేస్తున్న ఒక రవాణా నౌక, ఇంధన నిల్వ స్థావరాన్ని కోల్పోగా, భారత్‌కు ఏమాత్రం నష్టం కలగలేదు. పాకిస్తాన్ యొక్క మరొక డిస్ట్రాయరుకు తీవ్ర నష్టం కలగ్గా దాన్ని తరువాతి కాలంలో దళం నుండి తొలగించారు. విజయవంతమైన ఈ ఆపరేషనుకు గుర్తుగా భారత నౌకాదళం ప్రతి డిసెంబరు 4 ను నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటోంది. 

    నేపథ్యం

    [మార్చు]

    1971 లో, కరాచీ రేవు పాకిస్తాన్ నౌకాదళ కేంద్రంగా ఉండేది. దాదాపు పాకిస్తాన్ నౌకాదళం యావత్తూ కరాచీ రేవులోనే ఉండేది. పాకిస్తాన్ సాగర విపణికి కేంద్రంగా ఉండడంతో కరాచీ దిగ్బంధనం పాకిస్తాన్ ఆర్థిక రంగానికి తీవ్రమైన దెబ్బ తగులుతుంది. కరాచీ రేవు సంరక్షణ పాకిస్తాన్ హైకమాండుకు అత్యధిక ప్రాథమ్యం కావడంతో వైమానిక, నౌకా దాడుల నుండి రక్షణ ఏర్పాట్లు పటిష్ఠంగా ఉండేవి. అక్కడి వైమానిక స్థావరాల్లోని యుద్ధ విమానాల ద్వారా గగనతల రక్షణ కల్పించారు.[1]

    1971 చివరికి వచ్చేసరికి భారత పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగసాగాయి. నవంబరు 23 న పాకిస్తాన్ అంతర్గత ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాక, భారత నౌకాదళం కరాచీకి దగ్గరలోని ఓఖా వద్ద మూడు విద్యుత్ తరగతి క్షిపణి పడవలను నిఘా కోసం మోహరించింది .పాకిస్తాన్ నౌకలు కూడా అదే జలాల్లో తిరుగుతూంటాయి కాబట్టి, భారత నౌకాదళం ఒక హద్దు రేఖను గుర్తించి, తమ నౌకలను అది దాటకుండా చూసుకుంది. తరువాతి కాలంలో, ఈ మోహరింపు ఆ జలాల్లో అనుభవం గడించడానికి ఉపకరించింది. డిసెంబరు 3 న సరిహద్దు వెంబడి ఉన్న భారత వైమానిక క్షేత్రాలపై పాకిస్తాన్ దాడి చేసిన తరువాత భారత పాకిస్తాన్ యుద్ధం అధికారికంగా మొదలైంది.[2]

    ఆపరేషన్

    [మార్చు]

    నాంది

    [మార్చు]

    ఢిల్లీ లోని భారత వైమానిక దళ ప్రధాన స్థావరం, పశ్చిమ నౌకాదళ కమాండుతో కలిసి కరాచీ రేవుపై దాడికి ప్రణాళిక రచించింది. ఇందుకోసం పశ్చిమ నౌకాదళ కమాండు కింద ఒక దాడి దళాన్ని ఏర్పాటు చేసారు. ఈ దాడి దళాన్ని ఓఖా వద్ద మోహరించిన మూడు విద్యుత్ తరగతి క్షిపణి పడవల చుట్టూ మోహరిస్తారు. అయితే, ఈ నౌకల రాడార్ పరిధి పరిమితంగా ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు, ఈ దళానికి మద్దతు నౌకలను సమకూర్చాలని నిశ్చయించారు. డిసెంబరు 4 న, కరాచీ దాడి దళాన్ని ఏర్పాటు చేసారు. దీనిలో మూడు విద్యుత్ తరగతి క్షిపణి పడవలు -  ఐఎన్‌ఎస్ నిపాత్, ఐఎన్‌ఎస్ నిర్ఘాత్, ఐఎన్‌ఎస్ వీర్‌లు ఉన్నాయి. వీటిలో సోవియెట్ నిర్మిత స్టిక్స్ క్షిపణులు నాలుగేసి ఉన్నాయి. ఈ క్షిపణుల పరిధి 74 కి.మీ. ఈ నౌకలతో పాటు దాడి దళంలో రెండు అర్నాలా తరగతి జలాంతర్గామి విధ్వంసక కార్వెట్ట్‌లు -ఐఎన్‌ఎస్ కిల్టాన్ఐఎన్‌ఎస్ కచాల్‌లు, ఐఎన్‌ఎస్ పోషక్ అనే  ఒక ఫ్లీట్ ట్యాంకరు కూడా ఉంటాయి. ఈ దళాన్ని 25వ క్షిపణి పడవల స్క్వాడ్రన్ కమాండరైన కమాండర్ బబ్రూ భాన్ యాదవ్ నేతృత్వంలో ఉంచారు.[3]

    దాడి

    [మార్చు]

    అనుకున్నట్లుగానే, డిసెంబరు 4 న దాడి దళం, కరాచీ తీరానికి 460 కి.మీ. దక్షిణంగా చేరుకుని, ఆ పగలంతా అక్కడే, పాకిస్తాన్ వైమానిక దళ నిఘాకు దూరంగా, వేచి ఉంది. పాకిస్తాన్ యుద్ధ విమానాలకు రాత్రిపూట దాడి చేసే సామర్థ్యం లేనందువలన, దాడిని ఆ సాయంత్రం, మరుసటి తెల్లవారు ఝాము మధ్య చెయ్యాలని తలపెట్టారు.[4] రాత్రి 10.30 పాకిస్తాన్ సమయానికి దళం తానున్న స్థలం నుండి కరాచీకి దక్షిణంగా 130 కి.మీ. దూరానికి చేరుకుంది. పాకిస్తాన్ యుద్ధ నౌకలు తమ నుండి 130 కి.మీ. దూరంలో వాయవ్యం, ఈశాన్యాల మధ్య ఉన్నట్లు దళం గుర్తించింది.

    ఐఎన్‌ఎస్ నిర్ఘాత్ వాయవ్య దిశగా ముందుకు వెళ్ళి పాకిస్తాన్ డిస్ట్రాయరు నౌక ఖైబర్ పై మొదటి స్టిక్స్ క్షిపణిని ప్రయోగించింది. ఆ క్షిపణిని భారత యుద్ధ విమానాలు ప్రయోగించినట్లు భావించిన ఖైబర్, తన విమాన విధ్వంసక వ్యవస్థలను చేతనం చేసింది. ఈ క్షిపణి రాత్రి 10:45 సమయంలో ఖైబర్ యొక్క కుడివైపున తాకి, గాలీకి కింద పేలింది. దీంతో మొదటి బాయిలర్ గది పేలిపోయింది. దాంతో ఓడ చోదకశక్తిని కోల్పోయి, అంతా పొగతో నిండిపోయింది. ఓడ నుండి పాకిస్తాన్ నౌకాదళ ప్రధాన స్థావరానికి "శత్రు విమానం 020 FF 20 ప్రదేశంలో దాడి చేసింది. బాయిలర్ 1 దెబ్బతింది. ఓడను ఆపేసాము" అనే ఎమర్జెన్సీ సిగ్నలును పంపించారు. పేలుడు అనంతరం తలెత్తిన గందరగోళంలో, వాళ్ళు ఓడ ఉన్న స్థలాన్ని తప్పుగా పంపించారు. దీంతో ఓడ రక్షక బృందాలు రావడం ఆలస్యమైంది. ఓడ ఇంకా తేలుతూనే ఉండడం గమనించిన నిర్ఘాత్, ఖైబర్‌పై మరొక క్షిపణిని ప్రయోగించి, దాని రెండవ బాయిలరును కూడా పేల్చేసి, ఓడను ముంచేసింది ఓడలోని నావికులు 222 మంది కూడా మరణించారు.[5]

    దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్తాన్ నౌకాదళ డిస్ట్రాయరు షాజహాన్ - బ్రిటిషు నౌకాదళంలో హెచ్‌ఎమ్‌ఎస్ చారిటీగా ఉన్నప్పుడు.

    కరాచీకి వాయవ్యంగా రెండు లక్ష్యాలను గమనించిన నిపాత్, 11:00 గంటలకు రెండు క్షిపణులను ప్రయోగించింది. ఒకటి రవాణా నౌక ఎమ్‌వి వీనస్ చాలెంజరు పైన, మరొకటి దాని రక్షక నౌక షాజహాన్ పైనా ప్రయోగించగా, వీనస్ చాలెంజర్‌ను క్షిపణి కొట్టగానే పేలిపోయి కరాచీకి దక్షిణంగా 43 కి.మీ. దూరంలో మునిగిపోయింది. రెండవ క్షిపణి దాడిలో షాజహాన్ తీవ్రంగా దెబ్బతింది. 11.20 గంటలకు, ఐఎన్‌ఎస్ వీర్ పాకిస్తాన్ మైన్‌స్వీపర్  ముహాఫిజ్‌పై ఒక క్షిపణిని ప్రయోగించగా, అది ఓడకు ఎడమవైపున తాకింది. పాకిస్తాన్ నౌకాస్థావరానికి సిగ్నలు పంపించేలోపే ముహాఫిజ్ మునిగిపోయింది. అందులో 33 నావికులు మరణించారు.

    ఈలోగా, ఐఎన్‌ఎస్ నిపాత్ కరాచీ దిశగా సాగిపోయి, కరాచీ రేవుకు 26 కి.మీ. దూరాన నిలబడి, కెమారి ఇంధన నిల్వ ట్యాంకులకు గురిపెట్టింది. రెండు క్షిపణులను ప్రయోగించగా, ఒకటి గురి తప్పింది. రెండవది ఇంధన ట్యాంకులను పూర్తిగా నాశనం చేసింది. తదుపరి, దాడి దళంలోని నౌకలన్నీ దగ్గరిలోని భారత రేవులకు చేరుకున్నాయి.

    ఖైబర్‌లో జీవించి ఉన్నవారిని కాపాడేందుకు, పాకిస్తాన్ నౌకాదళ ప్రధాన కార్యలయం రక్షక దళాన్ని పంపించింది. ముహాఫిజ్ నౌక సిగ్నలు పంపించేలోపే మునిగిపోయినందున, దాని పరిస్థితి దానినుండి బతికి బైటపడ్డవారి ద్వారా మాత్రమే తెలిసింది. రక్షక నౌకలు, మునిగిపోయిన నౌకల శకలాలు తేలుతున్న చోట వీరిని రక్షించారు.

    పర్యవసానాలు

    [మార్చు]

    ఈ దాడికి ప్రతీకారంగా, పాకిస్తాన్ వైమానిక దళం ఓఖా హార్బరుపై దాడి చేసి ఇంధన ట్యాంకును, ఆయుధ డంపును, ఒక జెట్టీని పేల్చివేసింది.[6] ఈ దాడిని ముందే ఊహించిన భారత నౌకాదళం, క్షిపణి పడవలను అక్కడినుండి తరలించింది. అయితే, ఇంధన ట్యాంకును పేల్చివేయడంతో మూడు రోజుల తరువాత ఆపరేషన్ పైథాన్ చేపట్టేవరకు భారత నౌకాదళం ఎటువంటి దాడినీ చెయ్యలేదు.[7]

    ఈ దాడి ఫలితంగా పాకిస్తాన్ సాయుధ బలగాలన్నిటినీ హై అలర్ట్ స్థాయిలో పెట్టారు. భారత నౌకలు కరాచీ తీరం దగ్గరలో ఉన్నట్టుగా అనేక సార్లు తప్పుడు అలారములు మోగించారు. అలాంటి ఒక సందర్భంలోనే 1971 డిసెంబరు 6 న, పాకిస్తాన్ నౌకాదళానికి చెందిన ఒక ఫ్రిగేట్‌ను భారత నౌకగా పొరబడిన పాకిస్తాన్ నిఘా విమానం తమ స్థావరానికి సందేశం పంపింది. పాకిస్తాన్ నౌకాదళ ప్రధాన కార్యాలయం, దాన్ని పేల్చివేయమని ఆదేశాలిచ్చింది. పాకిస్తాన్ సమయం ఉదయం 6.45 కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఆ ఫ్రిగేట్‌పై దాడి జరపుతూండగా అది తమ నౌక జుల్ఫికర్‌గా గుర్తించి, తమ పొరపాటును గ్రహించాయి. ఈ దాడి కారణంగా నౌక దెబ్బతిని, కొంత ప్రాణనష్టం కూడా జరిగింది.[8]

    భారత్ పక్షాన ప్రాణ నష్టమేమీ జరగలేదు. ఆధునిక నౌకా యుద్ధ చరిత్రలో, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అత్యంత విజయవంతమైన ఆపరేషన్‌గా దీన్ని భావిస్తారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని, డిసెంబరు 4 ను భారత నౌకాదళం నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటోంది.

    పురస్కారాలు

    [మార్చు]

    ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భారత నౌకాదళ యోధు లనేకమందికి శౌర్య పురస్కారాలు ప్రసాదించారు. ఆపరేషన్ ప్రణాళిక రచించినందుకు, అప్పటి ఫ్లీట్ ఆపరేషన్స్ ఆఫీసరు కెప్టెన్ (తరువాతి కాలంలో వైస్ అడ్మిరల్ అయ్యారు) గులాబ్ మోహన్‌లాల్ హిరనందానికి నవసేనా మెడల్, దాడిని నిర్వహించినందుకు దాడిదళ కమాండరు యాదవ్‌కు మహావీరచక్ర, నిర్ఘాత్, నిపాత్, వీర్‌ల కమాండర్లైన లెఫ్టినెంట్ కమాండర్లు బహదూర్ నారిమన్ కవీన, ఇందర్జిత్ శర్మ, ఓంప్రకాశ్ మెహతాలకు, నిర్ఘాత్‌లోని మాస్టర్ ఛీఫ్ ఎం ఎన్ సింఘాల్‌కు వీరచక్ర బహూకరించారు.

    మూలాలు

    [మార్చు]
    1. "In 1971, The Indian Navy Attempted One Of The World's Most Daring War Strategies On Karachi". Scoop Whoop (in ఇంగ్లీష్). 9 July 2016. Archived from the original on 9 December 2016. Retrieved 20 November 2016.
    2. Commander Neil Gadihoke. "40 Years Since Operation Trident". Indian Defence Review. Retrieved 20 November 2016.
    3. Commander Neil Gadihoke. "40 Years Since Operation Trident". SP's Naval Forces. Archived from the original on 21 నవంబరు 2016. Retrieved 21 November 2016.
    4. Kuldip Singh Bajwa. "How west was won". Tribune India.
    5. Sushant Singh (4 December 2015). "December 4, 1971: When Navy got credit for IAF's strikes on Karachi oil tanks". The Indian Express.
    6. Captain S. M. A. Hussaini. "Illustrations: Trauma and Reconstruction 1971–1980". PAF Falcons. Archived from the original on 30 ఆగస్టు 2011. Retrieved 21 November 2016.
    7. "Indo-Pakistani War of 1971". Global Security. Retrieved 21 November 2016.
    8. Sqn Ldr Shuaib Alam Khan. "The Fighter Gap 2". Defence Journal (Pakistan). Archived from the original on 1 జనవరి 2012. Retrieved 21 November 2016.