ఆభేరి
ఆరోహణ | స గ2 మ1 ప ని2 స' |
---|---|
అవరోహణ | స' ని2 ద2 ప మ1 గ2 రి2 స |
ఆభేరి దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో వినిపించే ఒక రాగం. ఇది ఒక జన్య రాగం అనగా, కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో ఒకటి/కొన్ని రాగాల ఆధారంగా పుట్టిన(జననం పొందిన) రాగం. రాగనిధి ప్రకారం ఈ రాగం 20వ మేళకర్త రాగమైన నాటభైరవికి జన్యరాగం. ఈ రాగం హిందుస్తానీ పద్ధతిలోని రాగ్ అభీర్ కు దగ్గరగా ఉంటుండి.[1]
రాగ స్వరూపం
[మార్చు]ఈ రాగం ఆరోహణలో రిషభం, నిషాదం ఉండవు. ఇవి వర్జ్య స్వరాలు. అవరోహణలో మొత్తం 7 స్వరాలు ఉంటాయి. అందుకని ఈ రాగం ఔధవసంపూర్ణ జతి కలిగి ఉంటుంది.
ఈ రాగంలోని ప్రముఖ కృతులు
[మార్చు]ఆభేరి రాగంలో అందరికీ సుపరిచితమైన కృతి త్యాగరాజు రచించిన "నగుమోము గనలేని". మైసూరు వాసుదేవాచార్య రచించిన భజరే రే మనసా, గోకుల నిలయ కృపాలయ కృతులు ఈ రాగంలో కూర్చినవే. ముద్దుస్వామి దీక్షితులు వినభేరి అనే కృతిని ఆభేరి లో రచించినా, అప్పటి ఆభేరికి నేటి ఆభేరికీ వ్యత్యాసం ఉంది. మల్లీశ్వరి సినిమాలోని "ఆకాశ వీధిలో" పాట ఈ రాగంలో వచ్చినదే. ఈమాట వెబ్ పత్రికలో కింద తెలిపిన సినిమా పాటల్లో ఆభేరి రాగం వినిపిస్తుందని తెలిపారు:[2]
- ఊరకే కన్నీరు నింప కారణ మేమమ్మా… (లవకుశ)
- నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ)
- నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం)
- వెన్నెల లోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు)
- చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు)
- రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి)
- చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు)
- కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి)
- నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్)
- ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్.. (భట్టి విక్రమార్క)
- నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు)
- నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు)
- ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే)
- రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ)
- తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు)
- ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ)
- నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ)
- సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
- నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు)
- ఉయ్యాల జంపాల లూగరావయా… (చక్రపాణి)
- పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం)
- కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు)
- కళ్లు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్)
- రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ప్రైవేటు రికార్డ్)
- హాయమ్మ హాయి మా పాపాయి… (ప్రైవేటు రికార్డ్ )
- బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్)
- కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్)
- క్రొంజికురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్ పద్యం)
- ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు)
- తెలవారదేమో స్వామీ (శ్రుతిలయలు)
వనరులు
[మార్చు]- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
- ↑ రాగలహరి: ఆభేరి