Jump to content

ఆర్.వేదవల్లి

వికీపీడియా నుండి
ఆర్.వేదవల్లి
జననంనవంబరు 1935 (age 89)
మన్నార్ గుడి, మద్రాసు ప్రెసిడెన్సీ, భారతదేశం
వృత్తిభారత శాస్త్రీయ గాత్ర విద్వాంసురాలు
క్రియాశీల సంవత్సరాలు1953–
జీవిత భాగస్వామిడి.ఆర్.సంతానం
తల్లిదండ్రులురామస్వామి అయ్యంగార్ (తండ్రి)
పద్మాసని అమ్మాళ్ (తల్లి)
పురస్కారాలు

ఆర్.వేదవల్లి (జననం 1935) ఒక కర్ణాటక గాత్ర సంగీత విదుషీమణి.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఈమె 1935 నవంబర్ 9వ్ తేదీన రామస్వామి అయ్యంగార్, పద్మాసని అమ్మాళ్ దంపతులకు తమిళనాడు, తిరువారూర్జిల్లా, "దక్షిణ ద్వారక"గా పిలువబడే మన్నార్‌గుడి అనే పుణ్యక్షేత్రంలో జన్మించింది.

వృత్తి

[మార్చు]

ఈమె 5సంవత్సరాల చిన్నవయసులోనే ఈమె ప్రతిభను గుర్తించిన మదురై శ్రీరంగం అయ్యంగార్ ఈమెకు సంగీత పాఠాలు నేర్పించసాగాడు. కొంతకాలానికి ఈమె కుటుంబం మద్రాసుకు తరలి వచ్చింది. అక్కడ ఈమె ముదికొండన్ వెంకట్రామ అయ్యర్ వద్ద శిక్షణను తీసుకుంది.

ఈమెకు టి.ముక్త వద్ద పదములు, జావళీలలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడానికి, ముదికొండన్ వెంకట్రామ అయ్యర్ వద్ద పల్లవులలో ప్రత్యేకత సాధించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఉపకార వేతనం లభించింది. ఈమె పిన్నవయసు నుండే కచేరీలు చేసినప్పటికీ, అరియకుడి రామానుజ అయ్యంగార్ సూచన మేరకు తన 18వ యేట నుండి సంగీతాన్ని తన వృత్తిగా స్వీకరించింది. ఈమె భారతదేశంలో అన్ని ప్రాంతాలతో బాటుగా, ఉత్తర అమెరికా, అగ్నేయ ఆసియా, గల్ఫ్ దేశాలను సందర్శించి అక్కడ తన సంగీత ప్రదర్శనలను, ఉపన్యాసాలను ఇచ్చింది.

ఈమె మద్రాసు సంగీత అకాడమీ వారి సంగీతోపాధ్యాయుల కళాశాలలో అనేక సంవత్సరాలు అధ్యాపకురాలిగా పనిచేసింది. అంతకు ముందు అడయార్‌లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా బాధ్యతలను నిర్వహించింది. ఈమె ఎంతో మంది శిష్యులను సంగీతంలో విద్వాంసులుగా తయారు చేసింది. ఈమెకు వీణావాదనంలో కూడా పరిచయం ఉంది. ఈమెకు తమిళ, సంస్కృత, తెలుగు భాషలపై మంచి పట్టు ఉంది కనుక ఆయా భాషల కీర్తనలను ఆలాపించినప్పుడు వాటి అర్థాన్ని, భావాన్ని బాగా ఆకళింపు చేసుకుని పాడేది. ఈమె ప్రస్తుతం చెన్నైలో తన భర్త డి.ఆర్.సంతానం, తల్లి పద్మాసని అమ్మాళ్‌లతో కలిసి నివసిస్తున్నది.

ఈమె సోదాహరణ ప్రసంగాలనన్నింటినీ "సంప్రదాయ సంగీతం" అనే పేరుతో గ్రంథరూపంలో ప్రకటించింది.[1]

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]

ఈమె పిన్నవయసు నుండే అనేక బహుమతులు, అవార్డులు గెలుచుకుంది. ఆల్ ఇండియా రేడియో కర్ణాటక సంగీత పోటీలలో ప్రథమ బహుమతిని గెలుచుకుని భారత రాష్ట్రపతి చేతులమీదుగా బహుమతిని అందుకుంది. 1995లో కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి కర్ణాటక సంగీతం గాత్రం విభాగంలో అవార్డును గెలుచుకుంది. 2000లో మద్రాసు సంగీత అకాడమీ, చెన్నై వారి నుండి సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకుంది. ఈమె 1995లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై వారి నుండి సంగీత కళాశిఖామణి అనే బిరుదును కూడా పొందింది.[2]

శిష్యులు

[మార్చు]

ఈమె శిష్యులు ఎందరో ప్రస్తుతం సంగీత విద్వాంసులుగా, పరిశోధకులుగా, అధ్యాపకులుగా, రచయితలుగా రాణిస్తున్నారు. సుమిత్రా వాసుదేవ్, శుశ్రుతి సంతానం మొదలైన వారు ఈమె శిష్యులు.

మూలాలు

[మార్చు]
  1. శంకరనారాయణ, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్టు. p. 27. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022.
  2. web master. "R. Vedavalli". SANGEET NATAK AKADEMI. Government of India. Archived from the original on 18 సెప్టెంబరు 2020. Retrieved 20 February 2021.

బయటి లింకులు

[మార్చు]