Jump to content

ఆలు లేదు, చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం.

వికీపీడియా నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కథలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు


ఏమీ లేకుండా గాలిలో మేడలు కట్టేవారిని గురించి ఇలా అంటారు.

ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే అసలు పెళ్ళి చేసుకోకుండా, ఆవిడకి కడుపు రాకుండానే, కొడుకు పుట్టక ముందే వాడికి ఏమి పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు అని భావము.

కథ

సామెతకు ఒక కథ చెబుతారు (చాలా రూపాంతరాలున్నాయి)

ఒకడు ఒక మట్టిముంతలో పెట్టుకొని పేలాల పిండి అమ్మడానికి వెళుతున్నాడు. దారిలో ఒకచెట్టుక్రింద ఆగి విశ్రాంతి తీసుకుంటూ పగటికలలు కనసాగాడు.

ఈ పేలపిండి అమ్మితే నాకింత డబ్బొస్తుంది. దానితో మరింత పిండి కొని, అమ్మి బాగా డబ్బు సంపాదిస్తాను. ఆ డబ్బుతో ఒక ఆవునుకొని, పాల వ్యాపారం చేసి, గొప్ప పశుసంపదను సాధిస్తాను. ఇంకా వ్యాపారాలు చేసి, బాగా ధనవంతుడనై మేడలూ, మిద్దెలూ, వస్తువాహనాలూ కూర్చుకొంటాను.

అప్పుడు నాకు చక్కని చుక్కతో పెళ్ళి అవుతుంది. మాకు పుట్టే కొడుకుకు సోమలింగం అని పేరు పెట్టుకుంటాను. ఎప్పుడైనా నా భార్య కొడుకును కోప్పడితే, దానిని ఇలా కొడతాను. - అనుకొంటూ వాడు తన కాలును జాడించాడు. దాంతోపేలపిండి ముంత కాస్తా ముక్కలయ్యింది.