Jump to content

ఇసన్నపల్లి కాలభైరవ దేవాలయం

వికీపీడియా నుండి
ఇసన్నపల్లి కాలభైరవ దేవాలయం
ఇసన్నపల్లి కాలభైరవ దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:కామారెడ్డి
ప్రదేశం:ఇసన్నపల్లి, బిక్నూర్ మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:భైరవుడు
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

ఇసన్నపల్లి కాలభైరవ దేవాలయం తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, బిక్నూర్ మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఉన్న దేవాలయం.[1] కాశీ దేవాలయం తరువాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ దేవాలయం.[2] శునకాన్ని వాహనంగా చేసుకున్న 8 అడుగుల ఎత్తున్న దిగంబర కాలభైరవ స్వామి మూల విగ్రహం ఇక్కడ దర్శనమిస్తోంది.

చరిత్ర

[మార్చు]

16వ శతాబ్దంలో కాశీ నుంచి స్వామివారి విగ్రహాన్ని ఎడ్లబండిపై తీసుకొస్తున్న సమయంలో ఇసన్నపల్లి శివారుకు వచ్చేసరికి రాత్రి అవడంతో అక్కడే విశ్రమించారు. కొంత సమయం తరువాత భారీ శబ్దం వచ్చి బండి విరిగిపోయి స్వామివారి విగ్రహం నిటారుగా నిలబడింది. దాంతో ఆ ప్రదేశంలోనే దేవాలయాన్ని నిర్మించారని పూర్వీకుల ద్వారా తెలుస్తోంది.

దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించబడింది. ఈ గుడిలోని దిగంబర కాలభైరవుని విగ్రహం సా.శ.13వ శతాబ్ధ కాలం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం.[3] ఈ గ్రామంలో అష్టభైరవులు వెలసినట్లు అక్కడివారు చెబుతుంటారు. పూర్వం కరువు వచ్చినపుడు కాలభైరవుని విగ్రహానికి పేడ పూసేవారు. తర్వాత ఆ పేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా కురిసేవని స్థానిక ప్రజల నమ్మకం.

1974లో దేవాదాయశాఖ ఈ గుడిని తమ అధీనంలోకి తీసుకుంది. భక్తులు ఇచ్చిన రూ.50 లక్షల విరాళాలతో 2001లో దేవాలయం నిర్మించి, రేకుల షెడ్డులో ఉన్న స్వామి విగ్రహాన్ని దేవాలయానికి మార్చారు. రూ.6 లక్షలతో దీనికి పక్కనే 2009లో శనైశ్చరాలయం, రూ.20 లక్షలతో వసతి గదులు, మాజీ ఎంపీ ఆలె నరేంద్ర ఇచ్చిన రూ.10 లక్షలతో భోజనశాలలు నిర్మించారు.[4]

ఉత్సవాలు

[మార్చు]

కార్తీక బహులాష్టమి సందర్భంగా ఇక్కడ కాలభైరవ స్వామి జయంతి ఘనంగా జరుపుకుంటారు. బెల్లం, కొబ్బరి నైవేద్యంగా పెడతారు. ఉత్సవాలలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంతతధారాభిషేకం, అగ్నిప్రతిష్ఠ, గణపతిహోమం, రుద్రహవనం, బలిహారణం అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. తొలిరోజు లక్షదీపార్చన, రెండవరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, మూడవరోజు ధ్వజారోహణ, మహాపూజ, సింధూరపూజ, డోలారోహణం, అన్నదానం, సాయంత్రం ఎడ్ల బళ్ల ఊరేగింపు, రాత్రి భద్రకాళిపూజ, పల్లకీసేవ, రథోత్సవాలు జరుగుతాయి. నాలుగవరోజు అగ్నిగుండాలు నిర్వహిస్తారు.[5]

ఇతర వివరాలు

[మార్చు]

చేతబడి చేయబడిని వారు ఈ గుడిలో 21 రోజులు లేదా 41 రోజులు నిద్ర చేయడంతోపాటు, గుడి ప్రాంగణంలోని కోనేరులో స్నానం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుందని భక్తుల నమ్మకం.

మూలాలు

[మార్చు]
  1. ":: SREE KALABHAIRAVA SWAMY ISANNAPALLI (RAMAREDDY) VILLAGE ::". www.sreekalabhairavaswamy.com. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
  2. "శ్రీ కాల భైరవ స్వామి ఆలయం ఇసన్నపల్లి (గ్రామం) రామారెడ్డి (మండలం). | జిల్లా కామారెడ్డి, తెలంగాణా ప్రభుత్వం | India". www.kamareddy.telangana.gov.in. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
  3. "కాలభైరవ స్వామి ఆలయంలో బాలకృష్ణ కుటుంబీకులు". andhrajyothy. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
  4. ఈనాడు, అనుబంధం ఆదివారం సంచిక, 2011 నవంబరు 20.
  5. "బ్రహ్మోత్సవ భైరవుడు". Sakshi. 2019-11-17. Archived from the original on 2020-11-28. Retrieved 2021-11-10.