Jump to content

ఊటుకూరు రంగారావు

వికీపీడియా నుండి
(ఊటుకూరి రంగారావు నుండి దారిమార్పు చెందింది)
ఊటుకూరు రంగారావు
జననం(1929-12-08)1929 డిసెంబరు 8
సత్యనారాయణపురం, మధిర తాలూకా, ఖమ్మం జిల్లా
మరణం1963 మార్చి 11(1963-03-11) (వయసు 33)
మరణ కారణంగుండెపోటు
జాతీయతభారతీయుడు
వృత్తిగ్రంథపాలకుడు, విజ్ఞాననికేతనం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత, అనువాదకుడు, కాంగ్రెస్ కార్యకర్త
గుర్తించదగిన సేవలు
శరధార, మలిగిన దీపం

ఊటుకూరు రంగారావు (1929-1963) తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి, రచయిత, అనువాదకుడు, జర్నలిస్టు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1929, డిసెంబర్ 8న ఖమ్మం జిల్లా, మధిర తాలూకా సత్యనారాయణపురంలో జన్మించాడు. ఇతని ఇంట్లో తల్లి, తండ్రి, సోదరులు, సోదరీ అందరూ సాహిత్య సృజన చేసినవారే. ఇతడు ఉర్దూ మాధ్యమంగా మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పైచదువు అక్కడితో ఆగిపోయింది. ఇతనికి తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషల్లో నైపుణ్యం ఉంది. ఇతడు తన 16వ యేట నుండి అటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు జమలాపురం కేశవరావు, హీరాలాల్ మోరియా తదితరుల ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొనేవాడు. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా దాని ప్రార్థనా గీతం ఇతడే పాడేవాడు. ఖమ్మంలోని విజ్ఞాన నికేతనం గ్రంథపాలకుడిగా 1950-55 మధ్య కాలంలో పనిచేశాడు. ఆ తర్వాతా, అంతకు ముందు హైదరాబాద్ బులిటెన్, ప్రజాపత్రిక, సారథి, ఆంధ్రపత్రిక విలేకరిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ అవతరణానంతరం ఖమ్మంలో ‘హిందీ ప్రేమీ మండలి’ని స్థాపించి, భాషా ప్రచారాన్ని మోరియా ప్రభావంతో చేసినాడు. అలాగే అంతకు ముందు ‘తెలంగాణ రచయితల సంఘం’ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశాడు. ఇతని పెళ్ళి ముహూర్త సమయానికి రంగారావు తండ్రి చనిపోవడంతో ఆ పెళ్ళి ఆగిపోయింది. ఆ తర్వాత పూర్వం నిశ్చితార్థమైన అమ్మాయినే 1955 ఆగస్టు 4న వివాహమాడాడు. వీరిద్దరికీ 1963 ఫిబ్రవరి 19న ఒక కుమారుడు జన్మించాడు.[1]

రచనలు

[మార్చు]

ఇతడు 1949వ సంవత్సరం నుండి రచనలు చేశాడు. ఇతని కవితలు "శరధార" పేరుతో అచ్చయ్యాయి. ఇవే కాకుండా అనేక విడి కవితలు తెలుగు స్వతంత్ర, ఆంధ్రజ్యోతి, సారథి, నవ్యాంధ్ర పత్రికల్లో అచ్చయ్యాయి. ఉర్దూలో హీరాలాల్ మోరియా, కవిరాజమూర్తి రాసిన అనేక కథలను ఇతడు తెలుగులోకి అనువదించాడు. వారి కవిత్వాన్ని తెలుగువారికి తెలియ చేశాడు. "మలిగిన దీపం" ఇతని అముద్రిత నవల.

రచనల నుండి ఉదాహరణ

[మార్చు]

ఇతని భావజాలాన్ని అర్థం చేసుకోవడానికి వట్టికోట ఆళ్వారుస్వామి ఆధ్వర్యంలోని దేశోద్ధారక గ్రంథమాల 1953లో ప్రచురించిన ఉదయ ఘంటలు కవితా సంకలనంలో ప్రచురితమైన బతుకు కిటుకు అనే కవిత ఇక్కడ చదవండి.[2]

బతుకు కిటుకు
దుస్సాహసం చేయకు
నిస్సహాయుడవై చావకు
చీకటి ముసుగును ధరించి
లోకంలో తిరిగే రక్తపాయ శార్దూలం
మీసాలను పట్టి లాగి చెరలాడకు
బలికోసం ఉష్ణరక్త మర్పించకు
ఎదిరించకు మదగజాల గుంపుని
విదిలించకు గొప్పగొప్ప తలలని
పదునెక్కించకు నీ బుర్రకి
వ్యధతో గుండెపగిలి మరణించకు
కదిలించకు భువన సౌధపు పునాదుల్ని
ఖండించకు సనాతన వృక్ష మూలాన్ని
కత్తిరించకు ప్రభువుల శ్వేతకేశాలను
వెక్కిరించకు విస్తృత ప్రజాస్వామ్యాన్ని
అనుభవాలకందని ఆదర్శాలతో
అక్కరకు రాని వ్యవసాయం చేస్తూ
చేతి చమురు భాగోతం మొదలెట్టకు
చేతికి దొరికిందేదో విడనాడకు
సరదాగా పదిరోజులు బ్రతకాలంటే
మురిక్కాలువలు శుభ్రం చేసే ప్రయత్నం చేయకు
నిజంగా నీవు బాగు పడాలంటే
నిజంగా నీవు గొప్పవాడివి కావాలంటే
చేరదీయి కొన్ని నరమృగాలను
చీకట్లో తిరిగే పెద్దపులులను
ఆనందంతో, భక్తితో పూజించు
అన్యాయాలను, అక్రమాలనూ
ఏ 'ఇజ 'మైతేనేం?
మన బుజం బరువు తగ్గితేసరి,
ఇది నిజం

మరణం

[మార్చు]

కవిగా, రచయితగా, జర్నలిస్టుగా, నవలాకారుడిగా, సంగీతం తెలిసిన పాటగాడిగా, బహిరంగ సభల్లో ఉపన్యాసకుడిగా, హక్కుల కార్యకర్తగా, కాంగ్రెస్ అభిమానిగా, సంస్థల నిర్వాహకుడిగా, లైబ్రేరియన్‌గా, తెలంగాణ రచయితల సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించిన ఊటుకూరు రంగారావు 1963, మార్చి 11న ఖమ్మం జిల్లా వైరాలో గుండెపోటుతో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. సంగిశెట్టి శ్రీనివాస్ (1 January 2018). "ధిక్కార కవి ఊటుకూరు రంగారావు". మన తెలంగాణ దినపత్రిక. Archived from the original on 10 ఏప్రిల్ 2020. Retrieved 10 April 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. వట్టికోట ఆళ్వారుస్వామి. ఉదయ ఘంటలు : బతుకు కిటుకు (1953 డిసెంబర్ ed.). హైదరాబాదు: దేశోద్ధారక గ్రంథమాల. pp. 79–80. Retrieved 10 April 2020.

బయటిలింకులు

[మార్చు]