మిర్జా మొహమ్మద్ హషీమ్
మిర్జా మొహమ్మద్ హషీమ్ | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1971-1977 1977-1980 | |||
ముందు | బకర్ అలీ మిర్జా | ||
---|---|---|---|
తరువాత | పి.శివశంకర్ | ||
నియోజకవర్గం | సికింద్రాబాదు | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1990-1996 | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1962-1965 1967-1971 | |||
నియోజకవర్గం | అసఫ్‌నగర్ | ||
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1978- | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అక్టోబరు 21, 1921 హైదరాబాదు | ||
మరణం | 2013 డిసెంబరు 22 బాల్టిమూరు, అమెరికా | (వయసు 92)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేస్ | ||
జీవిత భాగస్వామి | శ్రీమతి కుర్షీద్ | ||
సంతానం | ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు |
మిర్జా మొహమ్మద్ హషీమ్, భారతీయ రాజకీయనాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోం శాఖామంత్రిగా పనిచేశాడు. 1971 నుండి 1980 వరకు లోక్‌సభలో సికింద్రాబాదు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.[1]
మొహమ్మద్ హషీం, 1921, అక్టోబరు 21న హైదరాబాదులో జన్మించాడు. ఈయన తండ్రి ఎం.ఏ.జావేద్. 1943, డిసెంబరు 23న కుర్షీద్‌ను వివాహం చేసుకున్నాడు.[1] హషీం నిజాం సైన్యంలో పనిచేశాడు.
మొహమ్మద్ హషీం, హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్లో, మల్లేపల్లి విభాగానికి కార్పోరేటరుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1960లో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో, ఎం.ఐ.ఎంలో అప్పుడే వర్ధమాన నాయకుడిగా ఎదుగుతున్న సలావుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయాడు. ఆ పరాజయంతో, తన దృష్టిని ఆసిఫాబాదు శాసనసభ ఎన్నికలపై మరల్చి, 1962, 1967లో రెండుపర్యాయాలు అసఫ్‌నగర్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.[2] అలా మొదలైన హషీం, ఒవైసీల రాజకీయ వైరం చాలాకాలం కొనసాగింది. 1962లో హషీం, ఎం.ఐ.ఎం అభ్యర్థిని ఓడించి, శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1964లో ఒవైసీ కూడా శాసనసభకు పోటీ చేసినప్పుడు, హషీం ఆయన ప్రత్యర్థి అయిన ఇమాదుద్దీన్‌కు మద్దతునిచ్చాడు. కానీ ఆ ఎన్నికలలో హషీం బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడు.[3]
మొహమ్మద్ హషీం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, నాయకత్వం వహించాడు. తెలంగాణ ఉద్యమ ఊపులో 1971లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా సికింద్రాబాదు నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తెలంగాణ ప్రజాసమితి కాంగ్రేసు పార్టీలో విలీనమైన తర్వాత, కాంగ్రేసు అభ్యర్థిగా తిరిగి సికింద్రాబాదు నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మొహమ్మద్ హషీం, మర్రి చెన్నారెడ్డికి రాజకీయ సన్నిహితుడు. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు, మొహమ్మద్ హషీం ఆయన మంత్రివర్గంలో హోంశాఖా మంత్రిగా పనిచేశాడు. 1989లో చెన్నారెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు, తన పిల్లల వద్ద అమెరికాలో ఉంటున్న హషీంను పిలిపించి రాజ్యసభ సభ్యున్ని చేశాడు.[4]
1990వ దశకంలో క్రియాశీలక రాజకీయాలనుండి వైదొలగి, కుటుంబంతో సహా శాశ్వతంగా అమెరికాలో స్థిరపడ్డాడు. ఈయన సంతానమంతా అమెరికాలోనే స్థిరపడ్డారు.
మిర్జా మొహమ్మద్ హషీం, అమెరికాలోని బాల్టిమూర్ నగరంలో 2013, డిసెంబరు 22న మరణించాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "6th Lok Sabha - Member Profile". Lok Sabha. Retrieved 13 December 2017.
- ↑ "Former AP Home Minister MM Hashim passes away". Two Circles. December 23, 2013. Retrieved 14 December 2017.
- ↑ Smith, Donald Eugene (Dec 8, 2015). South Asian Politics and Religion. Princeton University Press. pp. 123–124. ISBN 9781400879083.
- ↑ "Veteran Cong leader M M Hashim dies in US". The Times of India. Dec 24, 2013. Archived from the original on 3 July 2018. Retrieved 14 December 2017.