ఎలైజా ఇంపీ
సర్ ఎలైజా ఇంపీ | |
---|---|
ప్రధాన న్యాయమూర్తి, బెంగాల్ ఫోర్ట్ విలియం ప్రధాన న్యాయస్థానం | |
In office 22 అక్టోబరు 1774[1] – 3 డిసెంబరు 1783 (Effectively). విరమణ 1 నవంబరు 1787[2] | |
సదర్ దివానీ అదాలత్ యొక్క ఏకైక న్యాయమూర్తి | |
In office 24 అక్టోబరు 1780[3] – 5 నవంబరు 1782[4] |
సర్ ఎలైజా ఇంపీ (13 జూన్ 1732 - 1809) బెంగాల్ ఫోర్ట్ విలియమ్ వద్ద సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి, సదర్ దివానీ అదాలత్ ప్రధాన న్యాయమూర్తి, న్యూ రామ్నీకి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన బ్రిటిష్ న్యాయమూర్తి.
జీవితం
[మార్చు]ఎలైజా ఇంపీ, 1732 జూన్ 13న హామ్మర్‌స్మిత్ లోని బట్టర్‌విక్ హౌస్లో జన్మించాడు. ఈయన వ్యాపారస్తుడైన ఎలైజా ఇంపీ (1683-1756), ఆయన రెండవ భార్య మార్తా దంపతులకు జన్మించాడు. మార్తా, జేమ్స్ ఫ్రేజర్ కుమార్తె. ఈయన వారెన్ హేస్టింగ్స్తో పాటు వెస్ట్ మినిస్టర్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ తరువాత 1751లో లింకన్స్ ఇన్న్ లో చేరాడు. 1752లో కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీకి వెళ్లాడు. 1756లో రెండవ ఛాన్సలర్ యొక్క శాస్త్రీయ పతక విజేతగా పట్టభద్రుడయ్యాడు. 1757లో ఫెలో అయ్యాడు. 1756లో ఈయనను న్యాయవాదుల సభకు పిలిచారు. ఆ తరువాత ఈయన వెస్ట్రన్ సర్క్యూట్‌లో పదిహేడు సంవత్సరాలు న్యాయవాద వృత్తిని అభ్యసించాడు. 1768 జనవరి 18న, ఈయన ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన బారోనెట్ కుమార్తె మేరీ రీడ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంపీకి ఎలిజబెత్ కర్బీషైర్తో ఇద్దరు చట్టవిరుద్ధమైన పిల్లలు కూడా ఉన్నారు.[5]
1773లో రెగ్యులేటింగ్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్న బెంగాల్ ప్రభుత్వాన్ని సంస్కరించింది. వారెన్ హేస్టింగ్స్ మొదటి గవర్నర్ జనరల్‌గా బెంగాల్ సుప్రీం కౌన్సిల్‌ను, సుప్రీం కోర్టును స్థాపించింది. 1774 మార్చిలో కలకత్తా కొత్త సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఇంపీ నియమితుడయ్యాడు. ఆ నెల చివర్లో ఈయనకు నైట్ సత్కారం లభించింది. ఈయన అక్టోబర్లో ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కలిసి కలకత్తా చేరుకున్నాడు. భారతదేశానికి వచ్చే మార్గంలో ఈయన బెంగాలీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నాడు. కలకత్తా చేరిన తర్వాత పర్షియన్ భాషను అభ్యసించాడు.[6] ఈయనతో పాటు ఈయన భార్య మేరీ ఇంపీ కూడా వచ్చింది. మేరీ ఇంపీ భారతీయ కళాకారులను ప్రోత్సహించిన తొలి బ్రిటిష్ పోషకులలో ఒకరై.[5] 1770 వ దశకపు మధ్యకాలం నుండి ఇంపీ దంపతులు వివిధ పక్షులు, జంతువులు, స్థానిక మొక్కలను చిత్రించడానికి స్థానిక కళాకారులను నియమించారు. సాధ్యమైనప్పుడల్లా జీవిత పరిమాణంలో సహజ పరిసరాలలో వీటిని చిత్రింపజేశారు. ఈ సేకరణను తరచుగా ఇంపీ ఆల్బమ్ అని పిలుస్తారు.[6]
ఇంపీ నియామకం జరిగిన కొద్దికాలానికే, కొత్తగా ఏర్పడిన వ్యవస్థలోని లోపాలు బెంగాల్ పరిపాలనకు సమస్యలను సృష్టించాయి. సుప్రీం కోర్టు అధికార పరిధి, సుప్రీం కౌన్సిల్ యొక్క అధికారాలు స్పష్టంగా నిర్వచించబడలేదు. ఇది రెండు శాఖల మధ్య వివాదాలకు దారితీసింది. గవర్నర్ జనరల్, నలుగురు కౌన్సిలర్లతో కూడిన కౌన్సిల్ కూడా రెండు శత్రుపక్షాలుగా విభజించబడింది. ఒక పక్షం గవర్నర్ జనరల్ హేస్టింగ్‌కు మద్దతుగా, మరో పక్షం వ్యతిరేకంగా ఉండేది.
1775లో గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ పై అవినీతి ఆరోపణలు చేసిన ప్రముఖ భారతీయుడు మహారాజా నందకుమార్ చుట్టూ జరుగుతున్న చట్టపరమైన ప్రక్రియలలో ఇంపీ చిక్కుకున్నాడు. హేస్టింగ్స్‌ను నిందించిన తరువాత, నందకుమార్ స్వయంగా 1769లో ఫోర్జరీకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నందకుమార్ పై ఆరోపణలు అతని భారతీయ శత్రువులచే ముందుకు తీసుకువెళ్లబడినప్పటికీ, వాటితో హేస్టింగ్‌కు ప్రత్యక్ష సంబంధం ఉన్నదని ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, వాటిని హేస్టింగ్స్ సన్నిహిత స్నేహితులలో ఒకరు ప్రోత్సహించారు. ఫోర్జరీని మరణశిక్ష వేయదగిన నేరంగా చేసిన బ్రిటిష్ చట్టం ప్రకారం, నందకుమార్‌కు మరణశిక్ష విధించబడింది. ఇంపీ ఉరిశిక్షను వాయిదా వేయడానికి లేదా నిలిపివేయడానికి నిరాకరించాడు. .[5] తరువాత ఈయన తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, తప్పు జరిగినట్టూ సాక్ష్యం చాలా స్పష్టంగా ఉందని, శిక్షను వాయిదా వేయడం లేదా నిలిపివేయడం, కోర్టు అధికారాన్ని బలహీనపరుస్తుందని పేర్కొన్నాడు. అయితే, హేస్టింగ్స్, ఇంపీల కుట్ర ఫలితంగా ఈ ఉరిశిక్ష అమలు చేయబడిందని సమకాలీన ఆరోపణలు వచ్చాయి. తరువాత, చరిత్రకారుడు థామస్ బాబింగ్టన్ మెకాలే హేస్టింగ్స్ పై తను వ్రాసిన వ్యాసంలో ఈ ఆరోపణలను పునరావృతం చేశాడు. ఇది ఇంపీ పక్షపాత న్యాయమూర్తిగా ప్రజలలో ఉన్న అవగాహనను మరింత బలోపేతం చేసింది. ఈ సిద్ధాంతాన్ని సాధారణంగా ఆ తరువాతి చరిత్రకారులు తిరస్కరించారు కానీ, ఇంపీ మరణశిక్షను తాత్కాళికంగా నిలిపివేయడానికి నిరాకరించడం విమర్శించబడింది.[5] ఫోర్జరీపై తెచ్చిన బ్రిటిష్ శాసనం ఆ సమయంలో భారతదేశంలో వర్తిస్తుందో లేదో కూడా స్పష్టంగా తెలియలేదు.[7]
1790లో ఇంపీ న్యూ రామ్నీ నియోజకవర్గానికి సభ్యుడిగా బ్రిటీషు పార్లమెంటుకు తిరిగి వచ్చాడు. ఏడు సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన తర్వాత, పదవీ విరమణ చేసి, బ్రైటన్ సమీపంలోని న్యూవిక్ పార్కులో నివసించాడు. ఈయన 1809లో అక్కడే మరణించాడు. లండన్లోని హామ్మర్‌స్మిత్ లోని సెయింట్ పాల్స్ చర్చి వద్ద ఉన్న కుటుంబ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు. పీటర్ రౌ చేత చర్చి గోడపై ఈయన, ఈయన భార్యకు స్మారకం చేయబడింది. ఈయన 18 జనవరి 1768న ఆక్స్‌ఫర్డ్‌షైర్లోని షిప్టన్ కోర్టుకు చెందిన 5 వ బారోనెట్ సర్ జాన్ రీడ్ కుమార్తె మేరీని వివాహం చేసుకున్నాడు. వారికి ఐదుగురు కుమారులు ఉన్నారు.
1795లో రాయల్ సొసైటీ ఫెలోషిప్ కోసం ఆయన చేసిన దరఖాస్తు తిరస్కరించబడింది.
వారసత్వం
[మార్చు]జోహన్ జోఫానీ రూపొందించిన ఇంపీ చిత్రం కోల్కతా హైకోర్టులో వేలాడుతోంది.[6] టిల్లీ కెటిల్, థామస్ లారెన్స్, విలియం బీచీలు కూడా ఈయన్ను చిత్రీకరించారు.
ఈయన భార్య మేరీ ఇంపీ పేరును ఇంపేయన్ ఫెసెంట్ (లోఫోఫోరస్ ఇంపేజానస్) పేరుతో స్మరించుకుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ Curley p 194
- ↑ Curley p 485
- ↑ Curley p 313
- ↑ Curley p 344
- ↑ 5.0 5.1 5.2 5.3 మూస:Cite ODNB
- ↑ 6.0 6.1 6.2 Dalrymple, William (30 November 2019). "The forgotten Indian artists of British India". BBC News. Retrieved 30 November 2019.
- ↑ మూస:Cite ODNB
సూచనలు
[మార్చు]మరింత చదవండి
[మార్చు]- Impey, Elijah Barwell (1846). Memoirs of Sir Elijah Impey, Knt., First Chief Justice of the Supreme Court of Judicature, at Fort William, Bengal; with Anecdotes of Warren Hastings, Sir Philip Francis, Nathaniel Brassey Halhed, Esq., and Other Contemporaries; Compiled from Authentic Documents, in Refutation of the Calumnies of the Right Hon. Thomas Babington Macaulay. Simpkin, Marshall, and Co. ఇది మెకాలే, వారెన్ హేస్టింగ్స్ పై వ్రాసిన వ్యాసాలలో ఇంపీ పై జరిగిన దుష్ప్రచారానికి వ్రాతపూర్వక సమాధానంగా, ఇంపీ కుమారుడు వ్రాసిన ఎలైజా ఇంపీ జీవిత చరిత్ర.
- Stephen, James Fitzjames (1885). The Story of Nuncomar and the Impeachment of Sir Elijah Impey. London: Macmillan. 2 volumes (vol. 1, vol. 2).
బయటి లింకులు
[మార్చు]- *ఆక్స్ఫర్డ్ లోని అష్మోలియన్ మ్యూజియంలో "లేడీ ఇంపీస్ ఇండియన్ బర్డ్ పెయింటింగ్స్" ప్రదర్శన (14 ఏప్రిల్ 2013 వరకు)