Jump to content

ఎ.జి.కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
అచ్యుతాని గోపాల కృష్ణమూర్తి
ఎ.జి.కృష్ణమూర్తి
జననం(1942-04-28)1942 ఏప్రిల్ 28
వినుకొండ, ఆంధ్రప్రదేశ్, భారత దేశం
మరణం2016 ఫిబ్రవరి 5(2016-02-05) (వయసు 73)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఏజీకే
వృత్తిఅడ్వర్‌టైజింగ్, పబ్లిక్ రిలేషన్స్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ముద్రా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు

ఎ.జి.కృష్ణమూర్తి (అచ్యుతాని గోపాల కృష్ణమూర్తి) ముద్రా కమ్యూనికేషన్స్ సంస్థాపక అధ్యక్షుడు. పదవీ విరమణ తర్వాత కాలమిస్టుగా, రచయితగా ఆంగ్లంలోనూ, తెలుగులోనూ పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించాడు. ఆ పుస్తకాలు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదింపబడ్డాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

కృష్ణమూర్తి 1942, ఏప్రిల్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు.[1] కృష్ణమూర్తి బాల్యం తెనాలి, బాపట్లలో గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బి.ఏ హానర్స్ పట్టాపుచ్చుకున్నారు. ఆయన మొదట బాపట్ల సబ్‌మెజిస్ట్రేట్ కోర్టులో స్టెనోగా ఉద్యోగంలో చేరారు. అనంతరం గుంటూరులో జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర కూడా స్టెనో పనిచేసారు. అనంతరం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో గుమాస్తాగా పనిచేసారు. 1962లో మద్రాసు పోర్టు మ్యూజియంలో యూడీసీగా ఉద్యోగం చేసారు. అయిదేళ్ళు మద్రాసులో పనిచేసిన తర్వాత హైదరాబాద్‌కు బదిలీపై వచ్చారు. తరువాత ఆయన సంవత్సరం తిరగకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్‌బై కొట్టి అహమ్మదాబాద్ వెళ్ళి శిల్పి అడ్వర్టయింజింగ్ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా చేరారు. అది ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్ర పరిశోధకుడు విక్రమ్ సారాభాయ్ వంశానికి చెందిన సంస్థ. క్యాలికో డెరైక్టర్ గీరాబెన్ శరాభాయ్‌తో కలసి పనిచేసారు. 1972లో అదే కంపెనీకి చెందిన వ్యాపార ప్రకటనాసంస్థ అయిన శిల్పా అడ్వర్టైజింగ్ లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా పదోన్నతి పొందాడు. 1976లో రిలయన్స్ సంస్థలకు ఆడ్వర్టైజింగ్ మేనేజరుగా చేరి, నాలుగు సంవత్సరాలు తిరక్కుండానే సొంత వ్యాపార ప్రకటనా సంస్థ ముద్రా కమ్యూనికేషన్స్ ను 1980, మార్చి 25న స్థాపించాడు.[2]

నరోడాలోని రిలయన్స్ సంస్థ ప్రధాన కార్యాల యంలో అడ్వర్టయిజింగ్ డెరైక్టర్‌గా చేరిన ఏజీకే అడ్వర్టయి జింగ్ రంగంలో శిఖర సదృశుడైన ఫ్రాంక్ సియాయిస్‌తో కలసి అద్భుతాలు చేశారు. రిలయన్స్ సంస్థ ఉత్పత్తి చేసిన సిల్కు చీరలూ, ఇతర దుస్తులకూ విమల్ బ్రాండ్‌తో ప్రకటనలు తయారు చేయడంలో ఫ్రాంక్ అనేక విన్యాసాలు చేశాడు. ఆయన విమల్ కోసం తయారు చేసిన మొదటి అడ్వర్టయిజ్ మెంట్ ఇది : A woman expresses herself in many languages, Vimal is one of them. దానికి ఏజీకే చేసిన తెలుగు అనువాదం ఒక స్త్రీకి ఎన్నెన్నో మనోభావాలు. వాటిలో విమల్ ఒకటి. ఈ అడ్వర్టయిజ్‌మెంటు రకరకాల రూపాలు సంతరించుకొని అత్యధికంగా పత్రికలలో, రేడియోలలో వచ్చి విమల్ చీరలకు అసాధారణమైన ఆదరణ తెచ్చింది.[2]

ముద్రా కమ్యూనికేషన్స్

[మార్చు]

‘ఓన్లీ విమల్’ అన్నది అందరికీ, ఎప్పటికీ గుర్తు ఉండే సృజనాత్మక ప్రకటన. ఫ్రాంక్ సియాయిస్ సొంత ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత, రిలయన్స్ ప్రత్యర్థులు ఆయన క్లయింట్లు అయిన కారణంగా రిలయన్స్ స్వయంగా ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నెలకొల్పాలనీ, దానికి ‘ముద్ర’ అని పేరు పెట్టాలనీ ఏజీకే చేసిన సూచనను ధీరూభాయ్ అంబానీ ఆమోదించారు. ఆయన రూ. 35 వేల నగదు తోను ఒకే ఒక క్లయింట్‌ తోను వ్యాపార ప్రకటనా సంస్థ స్థాపించారు. కేవలం తొమ్మిదేళ్ళల్లో ముద్రా భారతదేశంలో ఉన్న పెద్ద వ్యాపార ప్రకటనా సంస్థలలో మూడవ స్థానాన్ని, స్వదేశీ వ్యాపార ప్రకటనా సంస్థలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది. 1980లో ముద్ర వెలిసింది. ఒక వెలుగు వెలిగింది. కార్పొరేట్‌రంగంలో అడ్వర్టయింజింగ్ జీనియస్‌గా ఏజీకే గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా విమల్ షోలు నిర్వహించి విమల్ విజయ పరంపరను కొనసాగిం చడంలో ఏజీకేది అద్వితీయమైన పాత్ర. ‘ఐ లవ్ యూ రస్నా’ కూడా ఆయన సృష్టే.

ప్రభుత్వంలో చిన్న గుమస్థా ఉద్యోగంతో ప్రారంభించిన ఎ. జి. కె. తెలుగువారు గర్వించదగ్గ అతి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ధీరూభాయ్ అంబానీకి అతి చేరువలో ఉండి ఈ సంస్థని ఇంత త్వరగా ఉన్నత స్థాయికి లేవనెత్తి ఆయనచేత శభాష్ అనిపించుకున్నారు.

రచయితగా

[మార్చు]

ఈయన అనుభవాలని పుస్తకాల రూపంలోనూ, పత్రికా శీర్షికల ద్వారానూ రాసి యువతని ఉత్తేజ పరుస్తున్నారు. కృష్ణమూర్తి తెలుగు పత్రికలో వారం వారం అనే శీర్షికను, ఆంగ్ల పత్రికలలో ఏజికె స్పీక్ (AGK Speak) అనే శీర్షికను వ్రాస్తుంటాడు. ఆయన ‘ధీరూభాయిజమ్’ అనే పేరుతో తెలుగులో, ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. ‘ఎదురీత’ పేరుతో మరో పుస్తకం రాశారు. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఆయన రచనలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. ‘ఇదండీ నా కథ’ అనేది ఏజీకే ఆత్మకథ. అదే ఆయన చివరి రచన. అంచెలంచెలుగా ఎదుగుతూ యాడ్స్ రంగ దిగ్గజ వ్యక్తుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కృష్ణమూర్తి తెలుగు, ఆంగ్లంలో 15కి పైగా పుస్తకాలు రచించారు. 2013లో ఇఫ్ యు కాన్ డ్రీమ్ పేరుతో తన ఆత్మకథను పుస్తక రూపంలో విడుదల చేశారు.

మరణం

[మార్చు]

ఇతడు తన 73వ యేట ఫిబ్రవరి 5, 2016న హైదరాబాదులో మరణించాడు.[3] [4]

మూలాలు

[మార్చు]
  1. "About AGK". Archived from the original on 2009-01-19. Retrieved 2008-12-23.
  2. 2.0 2.1 "'ముద్ర' వదిలి వెళ్లిన ఏజీకే". కె.రామచంద్రమూర్తి. సాక్షి. 5 February 2016. Retrieved 5 February 2016.
  3. "ముద్ర యాడ్స్ వ్యవస్థాపక చైర్మన్ కన్నుమూత". Archived from the original on 2016-02-06. Retrieved 2016-02-05.
  4. "A G Krishnamurthy, an outsider by choice". Business Standard. February 5, 2016. Retrieved 5 February 2016.

ఇతర లింకులు

[మార్చు]