Jump to content

ఏక్‌నాథ్ సోల్కర్

వికీపీడియా నుండి
(ఏకనాథ్ సోల్కర్ నుండి దారిమార్పు చెందింది)
ఏక్‌నాథ్ సోల్కర్
దస్త్రం:Eknath Solkar.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఏకనాథ్ ధోండు సోల్కర్
పుట్టిన తేదీ(1948-03-18)1948 మార్చి 18
బొంబాయి
మరణించిన తేదీ2005 జూన్ 26(2005-06-26) (వయసు 57)
ముంబై
మారుపేరుఎక్కి
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగు
  • ఎడమచేతి మీడియం
  • స్లో ఎడమచేతి అనార్థడాక్స్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 123)1969 అక్టోబరు 15 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1977 జనవరి 1 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 8)1974 జూలై 13 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1976 ఫిబ్రవరి 22 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 27 7 189
చేసిన పరుగులు 1,068 27 6,895
బ్యాటింగు సగటు 25.42 4.50 29.34
100s/50s 1/6 0/0 8/36
అత్యధిక స్కోరు 102 13 145*
వేసిన బంతులు 2,265 252 21,721
వికెట్లు 18 4 276
బౌలింగు సగటు 59.44 42.25 29.89
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 10
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1
అత్యుత్తమ బౌలింగు 3/28 2/31 6/38
క్యాచ్‌లు/స్టంపింగులు 53/– 2/– 190/–
మూలం: ESPNCricinfo, 2013 ఫిబ్రవరి 27

ఏక్‌నాథ్ ధోండు సోల్కర్ [1] (1948 మార్చి 18 - 2005 జూన్ 26) 27 టెస్ట్ మ్యాచ్‌లు, ఏడు వన్డే ఇంటర్నేషనళ్ళు ఆడిన భారత ఆల్ రౌండ్ క్రికెటర్. అతను బొంబాయిలో జన్మించాడు. [1] 57 సంవత్సరాల వయస్సులో అదే నగరంలో గుండెపోటుతో మరణించాడు.

సోల్కర్ టెస్టుల్లో ఒక శతకం సాధించిన సమర్ధుడైన బ్యాట్స్‌మన్, వేగంగాను, నెమ్మదిగానూ బౌలింగ్ చేయగల బౌలరు.[1] సోల్కర్ తన అద్భుతమైన క్లోజ్ ఫీల్డింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అతను ఒకసారి "నేను బంతిని మాత్రమే చూస్తాను" అని వ్యాఖ్యానించాడు. [1] అతని క్యాచ్‌లు 1971లో ది ఓవల్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించడంలో భారత్‌కు సహాయపడ్డాయి. ఇది ఇంగ్లాండ్‌లో భారత జట్టుకు తొలి టెస్టు విజయం. [1] ససెక్స్‌లో ఏక్‌నాథ్ సహచరుడు టోనీ గ్రెగ్ ఒకసారి ఇలా అన్నాడు, "నేను చూసిన అత్యుత్తమ ఫార్వర్డ్ షార్ట్ లెగ్ ఫీల్డరతను."[2]


కేవలం 27 మ్యాచ్‌లలో అతని 53 క్యాచ్‌లు ఒక రికార్డు. 20 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన ఆటగాళ్ళలో, వికెట్-కీపర్లు కానివారిలో, ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కి సగటు క్యాచ్‌లకు అది రికార్డు. అతను జెఫ్రీ బాయ్‌కాట్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య, క్రికెట్ కు చెందిన అత్యంత ప్రసిద్ధ కోట్‌లలో ఒకటి. అది: "నేను నిన్ను ఔట్ చేస్తాను." [3]

జీవితం తొలి దశలో

[మార్చు]

సోల్కర్ తండ్రి ముంబైలోని హిందూ జింఖానాలో హెడ్ గ్రౌండ్స్‌మెన్. ఆ మైదానంలో జరిగే మ్యాచ్‌ల కోసం సోల్కర్ స్కోర్‌బోర్డులను మార్చేవాడు. [1] ఏక్‌నాథ్ తమ్ముడు అనంత్ సోల్కర్ కూడా ఫస్ట్ క్లాస్ స్థాయిలో క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు.

అతను 1964లో పాఠశాల క్రికెటర్‌గా ఉన్న రోజుల్లో శ్రీలంకలో పర్యటించాడు. 1965-66లో లండన్ స్కూల్స్‌తో జరిగిన భారత పాఠశాలల జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. [1] ఈ జట్టులో భావి భారత ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, మొహిందర్ అమర్‌నాథ్ కూడా ఉన్నారు. [1] అతను 1969, 1970లో సస్సెక్స్ సెకండ్ XI తరఫున ఆడాడు. ఫస్ట్ XI కోసం ఆడటానికి అర్హత సాధించాడు. కానీ ఆ జట్టులో ఒకే ఒక మ్యాచ్‌ ఆడాడు. [1]

కెరీర్

[మార్చు]

సోల్కర్ 1969-70లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో తొలి ఆడ ఆడాడు. షార్ట్-లెగ్‌లో ఫీల్డింగ్ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి భారత టెస్టు క్రికెటరు అతడు. అతను అదే సీజన్‌లో ఆస్ట్రేలియాపైన, 1971లో వెస్టిండీస్‌పైన ఆడాడు. 1971లో ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై అబిద్ అలీతో కలిసి బౌలింగ్‌ను ప్రారంభించేందుకు ఎంపికయ్యాడు. ఆ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్‌లో, అతను 67 పరుగులు చేశాడు. గుండప్ప విశ్వనాథ్‌తో కలిసి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది భారత్‌కు మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించడంలో సహాయపడింది. ఓవల్‌లో జరిగిన మూడో టెస్టులో, అతను మొదటి ఇన్నింగ్స్‌లో 3/28తో తిరిగి 44 పరుగులు చేసి, రెండు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. తద్వారా భారత విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 1972-73లో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో, అతను ఢిల్లీలో జరిగిన మొదటి టెస్టులో 75 పరుగులు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో 12 క్యాచ్‌లు అందుకున్నాడు.

అతను 1974లో ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై బాగా ఆడలేదు. కానీ మూడు వరుస ఇన్నింగ్స్‌లలో (ఇండియా vs యార్క్‌షైర్, ఇండియా vs MCC - ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు) జెఫ్రీ బాయ్‌కాట్‌ను అవుట్ చేశాడు. అతను 1975లో ముంబైలో వెస్టిండీస్‌పై తన ఏకైక టెస్టు సెంచరీని సాధించాడు. 27 టెస్టుల్లో అతని 53 క్యాచ్‌లు పట్టడమే కాకుండా, అతను 25.42 సగటుతో 1,068 పరుగులు చేశాడు. 59.44 సగటుతో 18 వికెట్లు సాధించాడు. [1] అతని 16 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 29.27 సగటుతో 6,851 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఉన్నాయి, 30.01 సగటుతో 276 వికెట్లు తీశాడు. 190 క్యాచ్‌లు తీసుకున్నాడు. [1] టెస్ట్ క్రికెట్‌లో, బౌలర్‌గా అతని పని ఏమిటంటే, భారత స్పిన్నర్లు బౌలింగుకు వచ్చేలోపు 4-5 ఓవర్లు బౌలింగ్ చేసి, వీలైనంత వరకు కొత్త బంతి మెరుపు తగ్గించడం.

1976 చివరిలో, 26 టెస్టుల్లో 52 క్యాచ్‌లతో సోల్కర్ 50 కంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టిన ఏకైక వికెట్‌కీపర్‌గా నిలిచాడు. ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు సగటున 2 క్యాచ్‌లు అందుకున్నాడు. కానీ అతని 27వ, చివరి టెస్ట్‌లో, ఒక క్యాచ్ మాత్రమే పట్తడంతో, 27 టెస్టుల్లో 53 క్యాచ్‌లతో అతని సగటు మ్యాచ్‌కు రెండు కంటే కొంచెం తక్కువకు పడిపోయింది.

ముంబై రంజీ ట్రోఫీ జట్టు కోసం అతను అబ్దుల్ ఇస్మాయిల్‌తో కలిసి ఓపెనింగ్ బౌలింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 1973 రంజీ ఫైనల్‌లో, అతను టర్నింగ్ పిచ్‌పై స్పిన్ బౌలింగ్ చేసి, వెంకట్, VV కుమార్, శివల్కర్‌ల స్పిన్ బౌలింగ్‌తో ఆధిపత్యం చెలాయించిన మ్యాచ్‌లో ముంబైకి ప్రసిద్ధ విజయాన్ని అందించడంలో ఐదు వికెట్లు పడగొట్టాడు. [4]

మూలాలు

[మార్చు]
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 "Obituary: Eknath Solkar". The Guardian. 14 September 2005. Retrieved 7 January 2014.
  2. "Not stars but heroes".
  3. "Ghost-Spoken – Cricinfo".
  4. "Ranji Trophy, 1972/73, Final". Cricinfo. Retrieved 17 November 2022.