సునీల్ గవాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీల్ గవాస్కర్
2012 లో సునీల్ గవాస్కర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సునీల్ మనోహర్ గవాస్కర్
పుట్టిన తేదీ (1949-07-10) 1949 జూలై 10 (వయసు 74)
బొంబాయి
మారుపేరుసన్నీ, లిటిల్ మాస్టర్ {టెండూల్కర్‌కు కూడా ఈ పేరు ఉంది}
ఎత్తు5 ft 4 in (163 cm)[1]
బ్యాటింగుకుడి చేతి వాటం
పాత్రఓపెనింగు బ్యాట్స్‌మన్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 128)1971 మార్చి 6 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1987 మార్చి 13 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 4)1974 జూలై 13 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1987 నవంబరు 5 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1967–1982Bombay
1980సోమర్సెట్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 125 108 348 151
చేసిన పరుగులు 10,122 3,092 25,834 4,594
బ్యాటింగు సగటు 51.12 35.13 51.46 36.17
100లు/50లు 34/45 1/27 81/105 5/37
అత్యుత్తమ స్కోరు 236* 103* 340 123
వేసిన బంతులు 380 20 1,953 108
వికెట్లు 1 1 22 2
బౌలింగు సగటు 206.00 25.00 56.36 40.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/34 1/10 3/43 1/10
క్యాచ్‌లు/స్టంపింగులు 108/– 22/– 293/– 37/–
మూలం: CricketArchive, 2008 సెప్టెంబరు 5

1949 జూలై 10న జన్మించిన సునీల్ మనోహర్ గావాస్కర్ (ఆంగ్లం: Sunil Manohar Gavaskar) (హిందీ:सुनील् मनोहर गावसकर) భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ 1970', 1980' దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. డిసెంబరు 2005లో మనదేశానికే చెందిన సచిన్ టెండుల్కర్ ఈ రికార్డును అధికమించాడు.125 టెస్టు మ్యాచ్ లు ఆడి మొత్తం 10122 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన అలాన్ బోర్డర్ ఈ రికార్డును అధికమించిననూ టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్ గా ఇతని రికార్డు మాత్రం ఎవరూ చెరపలేనిది. తొలిసారిగా వెస్ట్‌ఇండీస్ పర్యటనలో ఒకే సీరీస్ లో 774 పరుగులు చేసినప్పటి నుంచి చివరగా పాకిస్తాన్తో బెంగుళూరు టెస్టులో 96 పరుగులు చేసే వరకు అతని క్రీడాజీవితంలో ఎన్నో మైళ్ళురాళ్ళు. బ్యాట్స్‌మెన్లను గడగడలాడించే అరవీర భయంకర బౌలర్లను ఎదుర్కొని సుదీర్ఘ టెస్టు క్రికెట్ జీవితంలో 51.12 సగటుతో 34 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు సాధించడం సామాన్యం కాదు. ఆ సమయంలో తిరుగులేని జట్టుగా నిల్చిన వెస్ట్‌ఇండీస్ పైనే సెంచరీలపై సెంచరీలు సాధించి 65.45 సగటు పరుగులు సాధించడం అతని పోరాట పటిమను తెలియజేస్తుంది. కెప్టెన్ గా అతను అంతగా విజయం సాధించక పోయినా క్రీడాకారుడిగా అతని విజయాలు అమోఘమైనవి. మైకేల్ హోల్డింగ్, ఆంబ్రోస్, ఆండీ రాబర్ట్స్, జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీ, ఇమ్రాన్ ఖాన్ ల బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని భారత జట్టుకు అపురూప విజయాలు సాధించిన గావాస్కర్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లభించడం భారత జట్టుకు వరం లాంటిది. గావాస్కర్‌కు, కపిల్‌దేవ్‌కు మధ్య నాయకత్వ పోటీ ఏర్పడే సమయంలో టెస్టు జట్టు నుంచి నిష్క్రమించాడు. 1983 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడే కాకుండా 1984లో ఆసియా కప్ గెల్చిన భారత జట్టుకు ఇతడు నాయకత్వం వహించాడు.

1988లో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలనుకున్న గవాస్కర్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 20వేల చదరపు అడుగుల భూమిని కేటాయించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఆ కారణంగా ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగిచ్చేస్తున్నట్టు 2022 మే నెలలో గవాస్కర్ ప్రకటించారు.[2]

ప్రారంభ క్రీడా జీవితం[మార్చు]

చిన్న వయసులోనే క్రికెట్ బ్యాట్ చేతపట్టిన గావాస్కర్ 1966లో దేశంలోనే బెస్ట్ స్కూల్ బాయ్ గా నిల్చాడు. ఆ సంవత్సరం ఇంగ్లాండు స్కూల్ బాయ్ కు విరుద్ధంగా 246*, 222, 85 పరుగులు సాధించాడు. 1966-67లో వజీర్ సుల్తాన్ కోల్ట్స్ XI తరఫున తొలి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినాడు. రంజీ ట్రోఫీలో 1968-69లో కర్ణాటక పై ఆడి డకౌట్ అయ్యాడు. భారత మాజీ వికెట్ కీపర్, బొంబాయి సెలక్షన్ కమీటీ సభ్యుడైన తన మామ మాధవ మంత్రి సిఫార్సు పైనే ఎన్నికైనాడనే విమర్శను ఎదుర్కొన్నాడు. కాని రెండో మ్యాచ్ లో రాజస్థాన్కు విరుద్ధంగా 114 పరుగులు సాధించి విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానం చెప్పినాడు. ఆ తర్వాత మరో రెండు శతకాలు సాధించి 1970-71 లో వెస్ట్‌ఇండీస్లో పర్యటించే భారత జట్టుకు ఎన్నికైనాడు.

టెస్ట్ క్రీడా జీవితం[మార్చు]

వెస్ట్‌ఇండీస్ పర్యటనకు ఎంపికైన గావాస్కర్ తొలి టెస్ట్ లో స్వల్ప గాయం కారణంగా ఆడలేకపోయాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన రెండో టెస్టులో 65, 67* సాధించి భారత జట్టు విజయానికి చేయూతనిచ్చాడు. ఇది వెస్ట్‌ఇండీస్ పై భారత్ కు తొలి టెస్ట్ విజయం కావడం గమనార్హం. జార్జి టౌన్లో జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 116 పరుగులు సాధించి తన తొలి శతకం సాధించాడు. బ్రిడ్జి టౌన్లో జరిగిన నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్సులో 117* పరుగులు సాధించి మరో శతకం జోడించాడు. సీరీస్ లోని ఆఖరి మ్యాచ్ ట్రినిడాడ్లో తొలి ఇన్నింగ్సులో సెంచరీ (124), రెండో ఇన్నింగ్సులో డబుల్ సెంచరీ (220) సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే వాల్టర్స్ (Doug Walters) తర్వాత ఈ ఘనత వహించిన రెండో బ్యాట్స్‌మెన్. అంతేకాదు ఒకే సీరీస్ లో 4 శతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయుడుగానూ రికార్డు సృష్టించాడు. ఒకే టెస్టులో రెండు శతకాలు సాధించడంలో విజయ్ హజారే తర్వాత ఇతను రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వరుసగా 3 ఇన్నింగ్సులలోనూ సెంచరీలు సాధించడంలో వారిలో విజయ్ హజారే, పాలీ ఉమ్రీగర్ ల తర్వాత మూడో భారతీయుడు. సీరీస్ లో అతను సాధించిన మరో ఘనత ఒకే సీరీస్ లో 700 పరుగులు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించడం. ఈ సీరీస్‌లో గావాస్కర్ 154.8 పరుగుల బ్యాటింగ్ సరాసరితో నిలవడం కూడా అతని క్రీడాజీవితంలోని ఒక మరిచిపోలేని ఘట్టం.

సునీల్ గవాస్కర్

అదే సంవత్సరంలో 3 టెస్టుల సీరీస్ కై ఇంగ్లాండ్ పర్యటించిన భారత జట్టుకు ఎంపికైననూ ఈ సీరీస్‌లో 2 అర్థ శతకాలు మినహా చెప్పుకోదగ్గ రికార్డులు సాధించలేడు. సీరీస్ ప్రారంభానికే ముందు అతని తొలి సీరీస్ విజయాలపై అక్కడి పత్రికలు ప్రముఖంగా వ్రాయడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. ఈ సీరీస్ లో అతను 24 పరుగుల సరాసరితో మొత్తం 144 పరుగులు మాత్రమే సాధించాడు.

1972-73లో 5 టెస్టుల సీరీస్ లో పాల్గొనడానికి వచ్చిన ఇంగ్లాండు జట్టుపై తొలి 3 టెస్టులలో పేవలమైన ఆటతీరును ప్రదర్శించాడు. 5 ఇన్నింగ్సులలో మొత్తం 60 పరుగులు మాత్రమే సాధించాడు. అయిననూ అప్పటికి భారత జట్టు 2-1 తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత రెండు టెస్టులలో 2 శతకాలు నమోదు చేసాడు. ఇది ఇంగ్లాండుతో టెస్టు సీరీస్ విజయానికి దోహదపడింది. సొంతగడ్డపై అతను ఆడిన తొలి సీరీస్ లో 24.89 సగటుతో 224 పరుగులు సాధించాడు. 1974లో ఇంగ్లాండులో భారత జట్టు పర్యటనలో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన తొలి టెస్టులో 101, 58 పరుగులు సాధించాడు. భారత జట్టు 3-0 తో చిత్తుగా ఓడి సీరీస్ కోల్పోయిననూ అతను ఈ సీరీస్ లో 37.83 పరుగుల సరాసరితో 227 పరుగులు సాధించాడు.

1974-75 లో భారత్ లో వెస్ట్‌ఇండీస్ పర్యటన సమయంలో గావాస్కర్ కేవలం మొదటి, ఐదవ టెస్ట్ మ్యాచ్ లోనే ఆడే అవకాశం లభించింది. ఈ సీరీస్ లో 27 పరుగుల సగటుతో 108 పరుగులు సాధించాడు. ముంబాయిలో జరిగిన ఆఖరి టెస్టులో 86 పరుగులు సాధించి సొంత మైదానంలో పరవాలేదనిపించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా 106 టెస్టు మ్యాచ్ లు ఆడి రికార్డు సృష్టించడానికి ఆ టెస్ట్ ప్రారంభ వేదికగా నిల్చింది.

1975-76 లో న్యూజీలాండ్తో 3 టెస్టుల సీరీస్, వెస్ట్‌ఇండీస్ తో 4 టెస్టుల సీరీస్ లో ప్రాతినిధ్యం వహించాడు. బిషన్ సింగ్ బేడీ గాయపడటంతో 1976 జనవరిలో న్యూజీలాండ్ పై జరిగిన ఆక్లాండ్లో జరిగిన టెస్టులో తొలి సారిగా భారత జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 116, 35* పరుగులతో భారత్ 8 వికెట్లతో గెలవడానికి సహకారమందించాడు. సీరీస్ లో మొత్తం 266 పరుగులు 66.33 సగటుతో సాధించాడు. వెస్టీండీస్ పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన రెండో, మూడో టెస్టులలో 156, 102 పరుగులతో సెంచరీలు సాధించాడు. తన తొలి సీరీస్ లోనే ఈ మైదానంలో 2 శతకాలు సాధించాడు. మూడో టెస్టులో అతను సాధించిన 102 పరుగులతో భారత్ సాధించిన 4 వికెట్లకు 406 పరుగులు నాల్గవ ఇన్నింగ్సులో విజయం సాధించిన అత్యధిక పరుగుల రికార్డుగా నిల్చింది. గావాస్కర్ ఈ సీరీస్ లో 390 పరుగులను 55.71 సగటుతో సాధించాడు.

రచనలు[మార్చు]

గావాస్కర్ యొక్క ప్రముఖ రచనలు

  • Sunny Days (ఆత్మకథ)
  • One Day Wonders
  • Idols
  • Runs 'n' Ruins

బిరుదులు, గుర్తింపులు[మార్చు]

  • భారత ప్రభుత్వము చే పద్మభూషణ్ అవార్డు పొందినాడు.
  • 1994లో ముంబాయి నగర షరాఫ్ (Sheriff) గా నియమించబడ్డాడు.
  • అతని పేరు మీదుగా భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ విజేతకు బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ ప్రధానం చేయబడుతుంది.
  • క్రికెట్ కామెంటరీ వ్యాఖ్యాతగా, పలు పత్రికలకు కాలమ్స్ వ్రాయుటలో మంచి గుర్తింపు లభించింది.

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Rising to great heights". ESPN. 3 May 2011. Sachin is a smidgeon taller than his predecessor as India's pint-sized batting colossus, Sunil Gavaskar (5ft 4in).
  2. "ముప్పై ఏండ్లయినా కానరాని అకాడమీ.. రాష్ట్ర ప్రభుత్వానికి భూమిని తిరిగిచ్చేసిన దిగ్గజ క్రికెటర్". web.archive.org. 2022-05-04. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)