కీర్తి ఆజాద్
కీర్తి ఆజాద్ అని సంక్షిప్తంగా పిలువబడే కీర్తివర్థన్ భగవత్ ఝా ఆజాద్ (Kirtivardhan Bhagwat Jha Azad) 1959, జనవరి 2న బీహార్ లోని పూర్ణియలో జన్మించాడు. ఇతడు భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1980 నుంచి 1986 వరకు 7 టెస్టులలో, 25 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతని క్రీడాజీవితంలో అతిపెద్ద విజయం 1983లో భారత జట్టు విశ్వవిజేతగా నిలవడం.
1984 డిసెంబర్లో పాకిస్తాన్తో ఢిల్లీలో జరిగిన వన్డేలో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 197 పరుగులు చేయగా తరువాత ఆడిన భారత్ ఒక వికెట్టు తేడాతో విజయం సాధించింది. కీర్తి ఆజాద్ వేగంగా 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతోనే భారత్‌కు విజయం లభించింది. ఇదే ఇన్నింగ్సులో పాకిస్తాన్ పేస్ బౌలర్ జాలాలుద్దీన్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తరువాత కీర్తి ఆజాద్ టెలివిజన్లో క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగిననూ సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిల వలె ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయాడు.ఇటీవలి కాలంలో మ్యాచ్ అనంతరం హిందీ చాట్ షోలో తన స్వంత అభిప్రాయాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు.
ఆయన బీహార్‌లోని దర్భంగా నియోజకవర్గం 2009 నుండి 2019 వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.