ఒక యోగి ఆత్మకథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక యోగి ఆత్మ కథ
ఒక యోగి ఆత్మకథ-300x450.jpg
రచయితపరమహంస యోగానంద
దేశంభారతదేశం
భాషతెలుగు , మొదటి తెలుగు ముద్రణ 1986 (జైకో)
Subjectఆత్మకథ
శైలినాన్-ఫిక్షన్
ప్రచురణ కర్తయోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా
ప్రచురణ తేది1946

ఒక యోగి ఆత్మకథ (ఆంగ్లం: Autobiography of a Yogi) ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది.[1] ఇప్పటి దాకా దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

సారాంశం[మార్చు]

ఈ పుస్తకంలో ప్రధానంగా యోగానంద తన గురువు కోసం అన్వేషణ, ఆ ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలు, అప్పట్లో పేరు గాంచిన ఆధ్యాత్మిక వేత్తలైన థెరెసా న్యూమన్, శ్రీ ఆనందమయీ మా, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీతయైన సి.వి. రామన్, అమెరికాకు చెందిన శాస్త్రవేత్త లూథర్ బర్బాంక్ మొదలైన వారితో గడిపిన ముఖ్యమైన ఘట్టాలు నిక్షిప్తం చేయబడ్డాయి. ఆయన గురువైన యుక్తేశ్వర్ గిరితో అనుబంధం, గురు శిష్యుల మధ్య సంబంధాల గురించి కూడా వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఆయన ఈ పుస్తకాన్ని వీరికే అంకితం చేశాడు.

యోగానంద గురువైన యుక్తేశ్వర్ గిరి, తనకు గురువైన లాహిరీ మహాశయులు వెల్లడించిన భవిష్యవాణి గురించి శిష్యుడికి తెలియజేశాడు.[2] లాహిరీ మహాశయులు ఈ విధంగా అంటుండగా యుక్తేశ్వర్ వినడం తటస్థించింది. "నేను గతించిన యాభై సంవత్సరాల తర్వాత పాశ్చాత్యుల్లో యోగా పట్ల ఏర్పడే ఉత్సుకత ఫలితంగా నా జీవితం గురించి రాస్తారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాభల్యం పెరుగుతుంది. అందరి పుట్టుకకూ కారణమైన ఒకే పరమాత్మ గురించిన ఆలోచన సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది". 1895లో లాహిరీ మహాశయుల మరణించిన సరిగ్గా యాభై సంవత్సరాలకు అంటే 1945లో ఒక యోగి ఆత్మకథ (ఆంగ్లం) పుస్తకం మొదటి సారిగా ప్రచురణకు సిద్ధం అయింది.

యోగానంద పిన్న వయసులోనే భారతదేశంలోని గొప్ప యోగులను కలవడం తటస్థించింది. ఉన్నత పాఠశాల విద్య పూర్తి కాకముందే ఆయన కనబరిచిన అనేక ఆధ్యాత్మిక శక్తులను, గురువు దగ్గర ఆయన శిక్షణ గురించిన విశేషాలు యోగానంద తమ్ముడైన సనంద లాల్ ఘోష్ రచించిన పుస్తకంలో సవివరంగా వివరించబడ్డాయి.

  • బాల్యంలోనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు
  • ఆధ్యాత్మిక ప్రభావాలు, వారసత్వం
  • గురుశిష్య సంబంధాలు
  • క్రియాయోగం

స్పందన[మార్చు]

ఈ పుస్తకం, ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ లాంటి వారిలో స్ఫూర్తిగా నిలిచింది. వాల్టర్ ఐజాక్సన్ అనే కథకుడి ప్రకారం స్టీవ్ జాబ్స్ ఈ పుస్తకాన్ని మొట్టమొదటి సారిగా టీనేజ్ లో ఉన్నపుడు చదివాడు. తర్వాత ఆయన భారతదేశానికి వచ్చినపుడు చదివాడు. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చదివే వాడని తెలియజేశాడు.[3] భారత దేశము ప్రముఖ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా ఈ పుస్తకం తనకి ఎంతగానో ఉపయోగపడింది అని ఒకసారి అని ఉన్నాడు.[ఆధారం చూపాలి]

పునర్ముద్రణలు[మార్చు]

ఆయన జీవిత కాలంలో ఈ పుస్తకం మూడు ఎడిషన్లు వెలువడింది. మొదటిది 1946లో, రెండవది 1949లో, మూడవది 1951లో వెలువడ్డాయి.[4]

మూలాలు[మార్చు]

  1. Bowden, Henry Warner (1993). Dictionary of American Religious Biography. Greenwood Press. ISBN 0-313-27825-3. p. 629.
  2. Chapter 32 – Rama is Raised from the Dead
  3. Isaacson, Walter (2001). Steve Jobs: A Biography. Simon & Schuster. p. 527. ISBN 978-1-4516-4853-9.
  4. భారత డిజిటల్ లైబ్రరీలో ఒక యోగి ఆత్మకథ 1951 ప్రతి.