Jump to content

ఓరుగంటి మహాలక్ష్మమ్మ

వికీపీడియా నుండి

1920లో మహాత్మా గాంధీ సహాయనిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు, యావత్ దేశం ఒకే గొంతుకతో లేచి నిలబడి బ్రిటీష్ వస్తువులు, సంస్థలను బహిష్కరించింది. పన్ను చెల్లించేందుకు నిరాకరించింది.

నా మాతృభూమి అయిన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఈ ఉద్యమానికి నిర్భయ నారి శ్రీమతి ఓరుగంటి మహాలక్ష్మమ్మ నాయకత్వం వహించారు. స్ఫూర్తిని రగిలించే వారి ప్రసంగాలు పినాకిని ప్రాంతంలోని మహిళా శక్తిని సహాయనిరాకరణ ప్రచారంలో పాల్గొనే దిశగా ప్రోత్సహించాయి. ఫలితంగా ఆ రోజుల్లోనే 2 లక్షల రూపాయలు దాటే నెల్లూరు ఎక్సైజ్ ఆదాయం రెండు వందల రూపాయలకు పడిపోయింది.

దీన్ని కేవలం ఆదాయం తగ్గడంగా మనం భావించకూడదు. బ్రిటీష్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా భావించాలి.

స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో భారతదేశాన్ని వలసపాలకుల కబంధ హస్తాల నుంచి బయట పడేసేందుకు ఎంతో మంది మహిళా మణులు ఉన్నతమైన త్యాగాలను చేశారు. అయితే వారి గాథలు మాత్రం చరిత్ర పుటల్లో మనకు కనిపించవు.

విస్మరించజాలని మహిళా స్వాతంత్ర్య సమరయోధుల గురించి నా మనోగతాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ స్త్రీ మూర్తుల ఉన్నతమైన గాథలను ఆవిష్కరించడం ద్వారా వారి దివ్యస్మృతికి నివాళులు అర్పించే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. తద్వారా దేశప్రజలు ముఖ్యంగా యువత స్వాతంత్ర్య సంగ్రామంలో వారు పోషించిన ఉన్నతమైన పాత్ర గురించి తెలుసుకుంటారని భావిస్తున్నాను.

1884లో సంపన్నుల కుటుంబంలో జన్మించిన ఆమె, శ్రీ తూములూరి శివకామయ్య, శ్రీమతి రమణమ్మ దంపతుల చిన్న కుమార్తె. ఆమె చిన్నతనంలో పాఠశాల విద్యను అభ్యసించకపోయినప్పటికీ, ఇంటి నుంచే చదువుకుని, ఉన్నత విద్యావంతురాలిగా స్వయంకృషితో ఎదిగారు. అంతే కాకుండా సాహిత్యం పట్ల ఆసక్తితో ఆనేక పుస్తకాలను చదవడం ద్వారా అనేక విషయాలు తెలుసుకోగలిగారు.

మహాలక్ష్మమ్మ గారికి శ్రీ ఓరుగంటి వెంకట సుబ్బయ్య గారితో వివాహం జరిగింది. ఆయన కుటుంబం దేశభక్తి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. భర్త అడుగు జాడల్లో ఆయన చేసే సామాజిక కార్యకలాపాల్లో మహాలక్ష్మమ్మ గారు కూడా పాలుపంచుకునే వారు. పేదవారి కోసం అన్నదాన సత్రాలను వారు నడిపే వారు. అందుకోసం ఇంట్లోనే తరచూ ఆహారాన్ని తయారు చేసేవారు.

ఆత్మగౌరవంతో పాటు మాతృభూమి పట్ల ఉన్న ప్రేమతో 1899లోనే ఓరుగంటి మహాలక్ష్మమ్మ గారు విదేశీ దుస్తులను బహిష్కరించి, ఖాదీ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చారు. వారు కుటుంబం వరకే ఖాదీ వాడకాన్ని పరిమితం చేయలేదు. కావలిలో ఖాదీ మార్కెట్ ను నెలకొల్పి, ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఆర్థికంగా ఉన్నత శ్రేణికి చెందిన వారు అయినప్పటికీ, వడికిన ఖాదీని తన భుజాల మీద వేసుకుని, నగరమంతా తిరిగి అమ్ముతూ దేశభక్తి గీతాలు పాడుతూ, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేవారు. ఈ సందర్భం ఒక్కటి చాలు, ఆమె దేశభక్తి, నిరాడంబరతను తెలియజేస్తుంది. వారి గొప్ప వ్యక్తిత్వాన్ని మన కళ్ళకు కడుతుంది.

1905లో బెంగాల్ విభజన తర్వాత, బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా స్వరాజ్య పోరాటాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళవలసిన అవసరాన్ని మహాలక్ష్మమ్మ, ఆమె భర్త గ్రహించారు. సంగీత సమాజం, భజన మండలిని ఏర్పాటు చేసి, స్వదేశీ వస్తువులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, స్వరాజ్య సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి అనేక చోట్ల ఉత్తేజకరమైన బహిరంగ ప్రసంగాలు, ప్రదర్శనలు ఇచ్చేవారు. పెద్ద నగరాల్లో ఇది సాధారణ విషయంలానే కనిపించవచ్చు గానీ, కావలి లాంటి చిన్న పట్టణంలో ఇదో విజయవంతమైన ప్రయోగం.

స్వరాజ్య సంగ్రామంలో మహిళా భాగస్వామ్య ప్రాధాన్యతను గ్రహించిన మహాలక్ష్మమ్మ మహిళా సమాజాన్ని స్థాపించారు. స్త్రీ విద్యకు మరింత ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో 1912లో కావలిలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. సొంత ఇంటిలో ఓ రాత్రి బడిని కూడా ప్రారంభించడం మహిళా విద్య పట్ల ఆమె నిబద్ధతకు నిదర్శనం.

కావలి వంటి చిన్న పట్టణంలో ఆ రోజుల్లో మహిళా సాధికారత కోసం మరో మహిళామూర్తి పని చేయడమంటే అదో అసాధారణమైన చొరవగానే చెప్పుకోవాలి. అది మహాలక్ష్మమ్మ గారి ఆత్మవిశ్వాసంతో పాటు, మహిళల పురోగతి, స్వరాజ్య సాధన పట్ల వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 1914-15లో కర్నూలుకు చెందిన ముతరాజు వెంకట కృష్ణయ్య తన వింతతు కుమార్తెకు తిరిగి వివాహం చేశారు. ఈ వార్తను విన్న మహాలక్ష్మమ్మ ఎంతో ఆనందపడ్డారు. ఈ ప్రగతిశీల చర్యను ప్రచారం చేయాలనే ఉద్దేశంతో, వారిని కావలికి ఆహ్వానించి సత్కరించారు. ఈ సంఘటన సమాజంలో సంప్రదాయ కట్టుబాట్లను పాటించే ఎంతో మందికి నచ్చలేదు. ఫలితంగా మహాలక్ష్మమ్మ కుటుంబాన్ని వారు బహిష్కరించారు. ఈ సంఘటన ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు సరికదా, ఆమె కుమారుల్లో ఒకరికి వితంతువును ఇచ్చి వివాహం చేసి, తాను బోధించిన ఆదర్శాలను ఆచరణలో కూడా చూపించి ఆమె చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

అనిబిసెంట్ హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు, 1917లో ఆమె కుటుంబం నెల్లూరుకు మకాం మార్చింది. మహాలక్ష్మమ్మ గారు, ఆమె భర్త కలిసి నెల్లూరులో హోమ్ రూల్ లీగ్ ప్రాంతీయ విభాగాన్ని ప్రారంభించారు. హోమ్ రూల్ లీగ్ బ్యాడ్జి ధరించి, ఈ బృహత్కార్యం ఉద్దేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. జాతీయ ఉద్యమంలో చేరడానికి మహిళలను ప్రోత్సహించేందుకు 1921లో నెల్లూరులో కాంగ్రెస్ మహిళా విభాగాన్ని స్థాపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమెతో పాటు శ్రీమతి పొణకా కనకమ్మ (నెల్లూరు ప్రాంతంలోని సంపన్న కుటుంబానికి చెందిన మరో స్వాతంత్ర్య సమరయోధురాలు) ఈ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామ్యం వహించారు. వారిద్దరూ కలసి కస్తూరి దేవి విద్యాలయాన్ని స్థాపించారు. ఈ సంస్థ మహాత్మా గాంధీ నుంచి ప్రశంసలు కూడా అందుకుంది.

1930లో ఉప్పుసత్యాగ్రహం ప్రారంభమైనప్పుడు, మహాలక్ష్మమ్మ, ఆమె భర్త దాన్ని ముందుండి నడిపించారు. బ్రిటీష్ వారు వారిద్దరినీ ఆరెస్టు చేసి ఆరు నెలలు రాయవేలూరు జైలుకు పంపారు.

జైలు శిక్ష ఆమె ఆత్మవిశ్వాసం, దేశభక్తి ముందు ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. జైలు నుంచి తిరిగి విడుదలైన తర్వాత ఆమె మరింత ఉత్సాహంతో స్వరాజ్య ఉద్యమంలో పాల్గొనడం కొనసాగించారు. హరిజనుల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలనలో కూడా ఆమె చురుగ్గా పాల్గొన్నారు. శాసనోల్లంఘన ఉద్యమం 1932లో రెండవ సారి విస్తృతమైంది. మహాలక్ష్మమ్మ గారి ఉత్తేజిత ప్రసంగాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ, స్వాతంత్ర్యేచ్ఛను రగిలిస్తున్నాయి. ఆమె నెల్లూరులో ఓ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో, భయాందోళనలకు గురైన బ్రిటీష్ ప్రభుత్వం ఆమెను మరోసారి అరెస్టు చేసి, ఒక ఏడాది పాటు రాయవేలూరు జైలుకు పంపింది. ఈసారి జైలుశిక్ష ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫలితంగా ఆమె ఆ తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారు.

మహాలక్ష్మమ్మ గారి బిడ్డలు సైతం దేశభక్తితో స్వరాజ్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఆమె ఇద్దరు కుమారులు జైలు పాలయ్యారు. ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో 1942లో ఆమె భర్తకు మూడవసారి జైలు శిక్షపడింది. ఆ సమయాన్ని ముందుకు సాగించడం ఆమెకు మరింత కష్టంగా మారింది. మాతృభూమి స్వేచ్ఛ కోసం, మహిళల అభ్యున్నతి కోసం పోరాడి, భారతదేశం స్వాతంత్ర్యం సముపార్జించడానికి రెండేళ్ళ ముందు 1945లో దివంగతులయ్యారు. ఓరుగంటి మహాలక్ష్మమ్మ వంటి స్వాతంత్ర్య సమరయోధులు చేసిన గొప్ప త్యాగాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఆమె బహుముఖ ప్రజ్ఞ కలిగిన మహిళా మూర్తి, దయాగుణం కలిగిన సామాజిక కార్యకర్త, నిరాడంబర నాయకురాలు. అన్నింటికీ మించి భారతమాత ప్రియపుత్రిక.

ఇలాంటి విస్మరించజాలని స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిదాయక గాథలను మన చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. తద్వారా ముందు తరాలు ముఖ్యంగా యువత వారి గురించి తెలుసుకుని ప్రేరణ పొందగలుగుతారు.