Jump to content

కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు

వికీపీడియా నుండి
(కంతానపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు నుండి దారిమార్పు చెందింది)
కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు
అధికార నామంపి.వి.నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు
దేశంభారత దేశం
ప్రదేశంతుపాకుల గూడెం, తెలంగాణ
ఆవశ్యకతసాగు నీరు, తాగు నీరు
స్థితిUnder construction
నిర్మాణ వ్యయంరూ. 2,121 కోట్లు
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంBarrage
పొడవు1,132 మీటర్లు
Elevation at crest71 మీ.
Spillways48
Spillway capacity30 లక్షల క్యూసెక్కులు
జలాశయం
పరీవాహక ప్రాంతం2,68,000 చ.కి.మీ.[1]

కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా తుపాకుల గూడెం గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.[2] ప్రాజెక్టు అధికారిక నామం పి.వి.నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు. తొలుత ఈ ప్రాజెక్టును కంతనపల్లి వద్ద నిర్మించాలని తలపెట్టారు. అయితే తరువాతి కాలంలో ప్రాజెక్టును ప్రస్తుత స్థలానికి మార్చి, పునఃరూపకల్పన చేసారు. ఇది ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషను) పథకం.

ఈ ప్రాజెక్టు వలన కొత్తగా ఆయకట్టు ఏర్పడదు. దేవాదుల, శ్రీరామసాగర్ మొదటి, రెండవ దశల ప్రాజెక్టుల ఆయకట్టులో ఉన్న భూములకు నీటి అందుబాటును స్థిరీకరిస్తుంది. 100 టిఎమ్‌సి ల వినియోగ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు నీటిలో 50 టిఎమ్‌సిలు ప్రస్తుతమున్న ఆయకట్టు స్థిరీకరణకూ, మిగతా 50 టిఎమ్‌సిలు తాగునీటికీ వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టుకు 1.5 మె.వా. విద్యుత్తు అవసరం.[3] ఈ ప్రాజెక్టు వలన జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొందుతాయి.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాజెక్టును తొలుత కంతనపల్లి గ్రామం వద్ద నిర్మించాలని ప్రతిపాదించారు. 2009 ప్రతిపాదన ప్రకారం ఈ ప్రాజెక్టు శ్రీరామసాగర్ ప్రాజెక్టు మొదటి, రెండవ దశల కింద ఉన్న 7,51,000 ఎకరాల స్థిరీకరణకు మాత్రమే ఉద్దేశించింది. కంతనపల్లి వద్ద బ్యారేజీ కట్టి, అక్కడి నుండి 50 టిఎమ్‌సిల నీటిని కాకతీయ కాలువ లోకి ఎత్తిపోయాలనేది ఆ ప్రతిపాదన. 2009 ఫిబ్రవరిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 10,409 కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అందులో బ్యారేజీకి రూ. 981 కోట్లను కేటాయించారు. 2009 ఫిబ్రవరి 19 న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసాడు.[4] 2009 మేలో బ్యారేజీ నిర్మాణానికి టెండర్లు పిలవగా దానికి సంస్థలేవీ బిడ్ వెయ్యలేదు. ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికలో చెప్పింది.[5]

ఆ తరువాత 2013 లో ప్రాజెక్టు రూపకల్పనలో కొన్ని మార్పులు చేసి తదనుగుణంగా బ్యారేజీ నిర్మాణ (తాజా రేట్ల ప్రకారం రూ. 2345 కోట్లు) ప్రతిపాదనకు ప్రభుత్వం 2013 ఏప్రిల్లో అనుమతి ఇచ్చింది. తదనుగుణంగా టెండర్లు పిలిచారు, కాంట్రాక్టును ఇచ్చారు.

అయితే, 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, కొత్త రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలను సవరించింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు స్థలాన్ని ముందు అనుకున్న స్థలం కంటే 17 కి,మీ. ఎగువన, తుపాకుల గూడెం వద్ద నిర్మించాలని ప్రతిపాదించారు. తద్వారా ఈ ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టుకు ఉపయోగపడుతుంది అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భావించాడు.[6] ఈ ప్రాజెక్టును కంతనపల్లి వద్ద నిర్మిస్తే నదికి ఇరువైపులా 11,500 ఎకరాల ఆదివాసీల భూములు ముంఫుకు గురౌతాయని, చత్తీస్‌గఢ్‌తో అంతర్రాష్ట్ర వివాదం వచ్చే అవకాశం ఉందనీ, తుపాకుల గూడెం వద్దనైతే ఈ రెండు సమస్యలూ ఉండవని ముఖ్యమంత్రి 2016 మార్చి 31 న శాసనసభలో తెలంగాణా నీటి ప్రాజెక్టులపై తానిచ్చిన మల్టీమీడియా ప్రదర్శనలో ప్రకటించాడు.[7] అలాగే, ఈ ప్రాజెక్టుకు కొద్ది దూరంలో ఎగువన నిర్మించిన దేవాదుల ప్రాజెక్టుకు ప్రస్తుతం తగినంత నీటి లభ్యత లేదనీ, ఈ ప్రాజెక్టును తుపాకుల గూడెం వద్ద నిర్మిస్తే ఆ సమస్య కూడా తీరుతుందనీ కూడా ముఖ్యమంత్రి చెప్పాడు.[8]

నీటి నిల్వ సామర్థ్యం, అంతర్రాష్ట్ర వివాదాలు, హైడ్రాలజీ, స్థలసేకరణ వంటి అనేక కీలకమైన అంశాల్లో ఉన్న లోటుపాట్లను సవరించేందుకు గాను, తెలంగాణలో గత ప్రభుత్వాలు తలపెట్టిన 5 ప్రాజెక్టులను సమీక్షించి, తిరిగి రూపకల్పన చేసామని, అలా చెయ్యకపోతే ఆ ప్రాజెక్టులు ప్రయోజనకరం కావనీ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు 2018 లో చెప్పాడు.[9] ఈ ప్రాజెక్టులు - అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి, జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్టు, పి వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి, సీతారామా ఎత్తిపోతల పథకం.

ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని గతంలో కాంట్రాక్టు పొందిన సంస్థకే అప్పగించాలని ప్రభుత్వం నిశ్చయించింది.

కొత్త రూపకల్పన

[మార్చు]

కొత్త రూపకల్పన ప్రకారం కంతనపల్లి ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కన్నాయిగూడెం మండలం లోని తుపాకుల గూడెం గ్రామం వద్ద, జె. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుకు 3 కి.మీ. దిగువన గోదావరి నదిపై నిర్మిస్తారు. ఈ స్థలం వద్ద గోదావరి నది రెండు గట్లూ తెలంగాణ రాష్ట్రం లోనే ఉంటాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు నది ఎడమ గట్టు నుండి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రాజెక్టు స్థలం శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఆనకట్టకు దిగువన 200 కి.మీ. దూరంలో ఉంది. ప్రాజెక్టుకు దిగువన 105 కి.మీ. దూరంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు ఉంది.

ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 1,132 మీటర్ల పొడవైన బ్యారేజీని నిర్మిస్తారు. 48 స్పిల్‌వేలు ఉండే ఈ బ్యారేజీ గుండా వెళ్ళగలిగే నీటి ప్రవాహ పూర్తి సామర్థ్యం 30 లక్షల క్యూసెక్కులు. ఈ స్పిల్‌వేలకు 48 రేడియల్ గేట్లు అమర్చుతారు. బ్యారేజీకి కుడివైపున 11 స్లూయిస్ గేట్లను అమర్చుతారు.

ఏటూరు నాగారం అభయారణ్యానికి, నూగూరు, పేరూరు అడవులకూ దగ్గర లోనే ఈ ప్రాజెక్టు స్థలం ఉంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం ఈ అటవీప్రాంతాల్లో జరగదు. జలాశయ పూర్తిమట్టం 77 మీటర్ల వద్ద ఈ ప్రాజెక్టుకు 674.18 హెక్టార్ల స్థలం మాత్రమే కావాలి. అందులో కూడా నదీ గర్భమే 580.18 హెక్టార్లు ఉంటుంది. మిగతా 94 హెక్టార్ల ప్రైవేటు భూమి సేకరించాల్సి ఉంటుంది.[3]

ఈ కొత్త ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 13 న అనుమతి ఇచ్చింది. 2019 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇచ్చింది.[10]

ప్రయోజనం పొందే ప్రాంతాలు

[మార్చు]

కంతనపల్లి ప్రాజెక్టు వలన కొత్తగా ఆయకట్టు ఏర్పడదు. ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరిస్తుంది. జె. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు కింద (6,21,000 ఎకరాలు), శ్రీరామసాగర్ ప్రాజెక్టు మొదటి, రెండవ దశల కింద (7,51,000 ఎకరాలు) ఉన్న 13,72,000 ఎకరాల మొత్తం ఆయకట్టులో నీరు అందించలేకపోతున్న భూమికి నీటిని అందిస్తుంది. 100 టిఎమ్‌సి ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు నీటిలో 50 టిఎమ్‌సిలు ప్రస్తుతమున్న ఆయకట్టు స్థిరీకరణకూ, మిగతా 50 టిఎమ్‌సిలు తాగునీటికీ వినియోగిస్తారు. ఈ ప్రాజెక్టుకు 1.5 మె.వా. విద్యుత్తు అవసరం.[3] కంతనపల్లి ప్రాజెక్టు వలన ప్రయోజనం పొందే ప్రాంతాల సంఖ్య కింది పట్టికలో ఉంది:[11]

క్ర.సం ప్రాజెక్టు పేరు జిల్లాల సంఖ్య మండలాల సంఖ్య గ్రామాల సంఖ్య
1 జె. చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు 8 37 364
2 శ్రీరామసాగర్ ప్రాజెక్టు మొదటి దశ 3 11 81
3 శ్రీరామసాగర్ ప్రాజెక్టు రెండవ దశ 3 7 73

అటవీ ప్రాంతం

[మార్చు]

బ్యారేజీ స్థలం ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యానికి అతి దగ్గరలో ఉంది. ఈ కేంద్రం 80,600 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ పొడి ఆకురాలు అడవులు ఉంటాయి. ఈ అడవి గుండా దయ్యం వాగు అనే వాగు ప్రవహిస్తూ ఈ అడవిని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఈ సంరక్షణ కేంద్రంలో పులి, చిరుత, అడవిదున్న, కడితి, దుప్పి, మనుబోతు, కృష్ణ జింక, నాలుగు కొమ్ముల జింక, మొసలి, తాచుపాము, కొండచిలువ, కట్లపాము వంటివి ఉన్నాయి.

వృక్ష జంతు జాలాలు

[మార్చు]

బ్యారేజి స్థలం వద్ద 39 రకాల వృక్ష జాతులున్నాయి. వీటితో పాటు 76 రకాల ఔషధ మొక్కలు, 10 రకాల పొదలూ, 4 రకాల తీగ మొక్కలూ ఉన్నాయి. ఈ జాతులన్నీ ఈ ప్రాంతంలో సామాన్యంగా ఉండేవే. వీటిలో అరుదైనవి గానీ, అంతరించే ప్రమాదంలో ఉన్నవి గానీ లేవు.[12]

బ్యారేజీ స్థలంలో 61 రకాల స్థానిక పక్షి జాతులున్నాయి. 46 జాతుల సీతాకోకచిలుకలూ ఉన్నాయి. కలివికోడి వంటి అంతరించే ప్రమాదంలో ఉన్న జాతులు వీటిలో ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వ అటవీ శాఖ" (PDF). అటవీ శాఖ అనుమతి. Archived from the original (PDF) on 2020-07-10. Retrieved 2020-07-10.
  2. కంతానపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  3. 3.0 3.1 3.2 "DRAFT ENVIRONMENTAL IMPACT ASSESSMENT REPORT FOR CONDUCTING PUBLIC HEARING" (PDF). తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ. Archived (PDF) from the original on 2020-07-10. Retrieved 2020-07-10.
  4. "సాక్షి కరెంట్ ఎఫెయిర్స్ స్పెషల్ - 2009 రాష్ట్రీయ సంఘటనలు" (PDF). సాక్షి ఎడ్యుకేషన్. Archived (PDF) from the original on 2020-07-10. Retrieved 2020-07-10.
  5. "ఆంధ్రప్రదేశ్ జలయజ్ఞం ప్రాజెక్టులపై నివేదిక" (PDF). కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. p. 93. Archived from the original (PDF) on 2020-07-11. Retrieved 2020-07-11.
  6. "కంతానపల్లి బ్యారేజీ స్థలం మార్పు". m.andhrajyothy.com. 2015-07-15. Archived from the original on 2020-07-10. Retrieved 2020-07-10.
  7. Apr 1, TNN |; 2016; Ist, 07:50. "KCR holds sway over house with PowerPoint on projects | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-10. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
  8. "YouTube". www.youtube.com. Retrieved 2020-07-10.
  9. "Five irrigation projects re-designed by Telangana govt". ఔట్‌లుక్ ఇండియా. Archived from the original on 2020-07-10. Retrieved 2020-07-10.
  10. "Green Panel Gives Nod to Telangana's Rs 2,121 Cr Dam Project On Godavari". NDTV.com. Archived from the original on 2020-07-10. Retrieved 2020-07-10.
  11. "భారత ప్రభుత్వ పర్యావరణ శాఖ" (PDF). పర్యావరణ శాఖ పర్యావరణ అనుమతి. Archived from the original (PDF) on 2020-07-10. Retrieved 2020-07-10.
  12. "పర్యావరణంపై ప్రభావం - నివేదిక". తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ. Archived from the original on 2020-07-10. Retrieved 2020-07-10.