Jump to content

కజఖ్‌స్థాన్‌లో హిందూమతం

వికీపీడియా నుండి

కజఖ్‌స్తాన్‌లోని హిందువులు ప్రధానంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అనుచరులు, ప్రవాస భారతీయులు. కజఖస్తాన్‌లోని జనగణన విభాగం హిందూమతాన్ని గుర్తించలేదు. ఒక అంచనా ప్రకారం, కజకిస్థాన్‌లో దాదాపు 500 మంది హరే కృష్ణ భక్తులు ఉన్నారు. [1]

2006 లో హిందూ దేవాలయాన్ని కూల్చివేయాలని కజక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదాన్ని సృష్టించింది. [2] అయితే ఆ కూల్చివేత జరగలేదని, కూల్చినది నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని ప్రైవేటు గృహాలేననీ భారత్‌లో కజఖ్ రాయబారి ప్రకటించాడు. [3]

కజఖ్‌స్తాన్‌లోని సంఘం

[మార్చు]

మధ్య ఆసియాలోని భారతీయ సంఘంలో ప్రధానంగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్మికులు, భారతీయ లేదా విదేశీ కంపెనీల ప్రతినిధులు/ఉద్యోగులు ఉంటారు. నిర్వాహకులు, వ్యవస్థాపకులు, వ్యాపారులు కూడా కొంతమంది ఉన్నారు.

మధ్య ఆసియాలో మొత్తం 2732 మంది ఉన్న భారతీయ డయాస్పోరాలో, 1127 మంది వ్యక్తులు కజఖ్‌స్తాన్‌లో ఉన్నారు. వీరిలో 900 మంది వైద్య విద్యార్థులు. NRI వ్యాపారవేత్త శ్రీ LN మిట్టల్ కొన్న సోవియట్ కాలం నాటి స్టీల్ ప్లాంట్ ఇస్పాత్ ఇంటర్నేషనల్‌లో దాదాపు 127 మంది కార్మికులు/మేనేజర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు భారతీయ నిర్వహణలో ఇస్పాత్ కర్మెట్ అనే ఈ ప్లాంటు ఒక ప్రధాన విజయగాథ. [4]

ఇతర వాణిజ్య కార్యకలాపాలు, ఔషధాల వంటి రంగాలలో కూడా భారతీయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇస్పాత్ కర్మెట్‌తో పాటు, కింది భారతీయ కంపెనీలకు కూడా కజఖ్‌స్తాన్‌లో ప్రతినిధులు ఉన్నారు – అజంతా ఫార్మా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రాన్‌బాక్సీ, కోర్, లుపిన్, IPCA, USV. అదనంగా, కజఖ్‌స్తాన్‌లో మొబైల్ హీటింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ITEC నిధులతో ఒక ప్రాజెక్టు మొదలైంది.


అల్మాటీలోని భారతీయ సాంస్కృతిక కేంద్రం భారతీయ సంస్కృతిని ప్రదర్శించడంలో చురుకుగా ఉంది. ఈ సంస్థ కజఖ్‌స్తాన్‌లో అనేక భారతీయ సాంస్కృతిక ఉత్సవాలను జరిపింది.

మధ్య ఆసియాలోని భారతీయ సమాజం దాని వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యత దృష్ట్యా పెరగడం ఖాయమని కమిటీ భావిస్తోంది. కమిటీ సిఫార్సులు కూడా ఈ ప్రాంతానికి వర్తిస్తాయి. [4]

కజఖ్‌స్తాన్‌లో ఇస్కాన్

[మార్చు]

కజఖ్‌స్తాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని అధికారికంగా గుర్తించింది. [5]

హరే కృష్ణ ఉద్యమానికి ఉన్న 10 సంఘాల్లో కేవలం రెండింటి లోనే - అస్తానాలో, వాణిజ్య రాజధాని అల్మాటీలో - 50 కంటే ఎక్కువ మంది సభ్యులున్నారు. [6]

ముప్పై హరే కృష్ణ కుటుంబాలు - వారిలో ఎక్కువ మంది కజఖ్ పౌరులు - అల్మాటీలో, దాదాపు 60 వేసవి గుడిసెలలో నివసిస్తారు.

హరే కృష్ణ ఉద్యమం జాతీయ, స్థానిక స్థాయిలలో నమోదైనప్పటికీ, స్థానిక ప్రభుత్వాలు తమను వేధిస్తున్నాయని ఆరోపిస్తారు. అల్మటీ ఓబ్లాస్ట్‌లో మతపరమైన వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్న భూమిని జప్తు చేయాలని కోరుతూ కోర్టుల్లో పదే పదే వ్యాజ్యాలు వేసారు. 1999లో హరే కృష్ణ అనుచరులకు భూమిని అమ్మిన రైతుకు తన పేరిట పట్టా లేనందున, భూమిని కరాసాయి ప్రాంతీయ అకిమత్‌కు అప్పగించాలనే దిగువ కోర్టు నిర్ణయాన్ని 2006 ఏప్రిల్‌లో అప్పీల్ కోర్టు సమర్థించింది. 2006 ఏప్రిల్ 25 న, స్థానిక అధికారులు హరేకృష్ణ అనుచరులను తొలగించడానికి కమ్యూన్‌కి వెళ్లారు. హరే కృష్ణ అనుచరులు శాంతియుతంగా ప్రతిఘటించారు. స్థానిక అధికారులు కూడా వారిని బలవంత పెట్టలేదు. హరే కృష్ణ అనుచరులు తమది సాంప్రదాయేతర మత సంఘం కాబట్టే స్థానిక ప్రభుత్వం తమ కమ్యూన్‌ను టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణలుగా వారు, స్థానిక అధికారుల ప్రకటనలను ఉదహరించారు. 2006 ఏప్రిల్ 25 న ఛానల్ 31కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరాసాయి అకిమత్ అధికారి ఒకరు, హరే కృష్ణ ఉద్యమాన్ని "ఒక మతంగా అంగీకరించరు", వారు దేశానికి ప్రమాదకరమని అతడు పేర్కొన్నాడు. అయితే, స్వతంత్ర మత పరిశీలకులు మాత్రం, ఆ భూమి విలువ 1999 నుండి గణనీయంగా పెరిగిందనీ, ఈ కేసులు ప్రధానంగా భూమిపై ఆర్థికపరమైన ఆశతోనే వేసారనీ నమ్ముతున్నారు. మానవ హక్కుల న్యాయవాదులు, అంతర్జాతీయ పరిశీలకులు ఈ సమస్యను జాతీయ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

భూ జప్తు వ్యాజ్యాలకు ముందు, హరే కృష్ణ అనుచరులు కరాసాయి అకిమత్ అధికారులతో తమ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయని చెప్పారు. దీని ఫలితంగానే సంఘంపై తరచుగా తనిఖీలు చేస్తోందని వారు భావించారు. 2004లో హరే కృష్ణ కమ్యూన్‌పై పోలీసు, ఫైర్ ప్రొటెక్షన్ సర్వీస్, శానిటరీ ఏజెన్సీ, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ల్యాండ్ కమిటీతో సహా వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు పదకొండు సార్లు తనిఖీలు చేశాయి. ఆపై వివిధ ఉల్లంఘనలకు గాను జరిమానాలు విధించారు. US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, హరే కృష్ణ అనుచరులు అనేక ఉల్లంఘనలను అంగీకరించారు. వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించారు. అయితే వారిపై తమ పొరుగువారి కంటే నిశితంగా పర్యవేక్షణ ఉందని పేర్కొంది. [7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Қазақстандағы кришнаиттер".
  2. "Temple razed in Almaty, row starts". Archived from the original on 2008-08-08. Retrieved 2022-01-26.
  3. Staff (2007-02-13). "No temple in Kazakhstan demolished: Envoy". oneindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-26. Retrieved 2022-01-26.
  4. 4.0 4.1 "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-09-29. Retrieved 2007-03-19.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Archived copy". Archived from the original on 2007-09-27. Retrieved 2007-02-22.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. World wide Religious News Archived 2007-09-27 at the Wayback Machine
  7. United States Department of State