కాజోల్
కాజోల్ | |
---|---|
జననం | కాజోల్ ముఖర్జీ 1974 ఆగస్టు 5 ముంబై, మహారాష్ట్ర, భారత్ |
వృత్తి | సినీ నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1992–2001, 2006–2012 |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
కాజోల్ ఒక భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించింది. షారుక్ ఖాన్, కాజోల్ జోడీ బాలీవుడ్లో హిట్ పెయిర్ గా ఖ్యాతిచెందింది.
నేపధ్యము
[మార్చు]ఈవిడ తల్లి తనూజ. ప్రముఖ నటి. తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన దర్శకనిర్మాత. ఇద్దరూ కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే కావడంతో... చిన్నప్పట్నుంచీ చుట్టూ సినిమా వాతావరణమే. కానీ తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటంతో ముంబైలోని పాంచ్‌గనిలో సెంట్ జోసెఫ్ కాన్వెంట్ బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. క్లాస్‌లో హెడ్‌గాళ్. చదువు కంటే ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి. డ్యాన్స్ నేర్చుకొంది. ఫిక్షన్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకొంది. అవే జీవితంలో ఎదిగేందుకు దోహదపడ్డాయని చెబుతుంటుంది. ఫిక్షన్ నవలలు చదవడం వల్ల కష్టాల్ని అలవోకగా అధిగమించానని చెబుతుంటుంది.
కాజోల్ తల్లిదండ్రులు మాత్రమే కాదు, వారి కుటుంబమంతా సినిమా పరిశ్రమలోనే ఉంది. నూతన్, శోభన్ సమర్థ్, రతన్ బాయి, జాయ్‌ముఖర్జీ, దేవ్‌ముఖర్జీ, శశిధర్ ముఖర్జీ... ఇలా కాజోల్ బంధువులంతా సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. కాజోల్ కజిన్స్ కూడా సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. రాణీముఖర్జీ, షర్వాణీ ముఖర్జీ, మోనిష్ భెల్, దర్శకుడు అయాన్‌ముఖర్జీ... ఇలా అందరూ కూడా పరిశ్రమలో రాణిస్తున్నారు. కాజోల్‌కి స్వయానా ఓ చెల్లి ఉంది. ఆమె పేరు తనీషా. తెలుగులోనూ నటించింది.
సినీరంగ ప్రవేశము
[మార్చు]తల్లిదండ్రులిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు కావడంతో పదహారేళ్లకే తొలి అవకాశం వచ్చింది. రాహుల్ రవైల్ దర్శకత్వంలో 'బెఖుడి'లో నటించే అవకాశాన్ని సంపాదించింది. వేసవి సెలవులు కావడంతో స్కూల్‌కి ఇబ్బంది కలగకుండా సినిమా పూర్తి చేసింది. అయితే ఆ సినిమా పరాజయాన్ని చవిచూసింది. అయినా... కాజోల్ నటన, అందం చూసి అప్పటికే 'బాజీగర్' సినిమా కోసం ఎంపిక చేసుకొన్నారు. 1993లో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాజీగర్' వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సొంతం చేసుకొంది. దీంతో బాలీవుడ్ దృష్టిలో పడింది. చదువులు పూర్తి కాకమునుపే స్కూల్‌కి గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయిలో సినిమాపై దృష్టిపెట్టింది.
1994లో 'ఉదార్ మే జిందగీ' అనే చిత్రంలో జితేంద్రకి మనవరాలిగా నటించింది. ఈ చిత్రం తెలుగులో విజయవంతమైన 'సీతారామయ్యగారి మనవరాలు'కి రీమేక్‌గా తెరకెక్కింది. ఆదరణకు మాత్రం నోచుకోలేదు. ఆ వెంటనే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో 'యే దిల్లగీ' చేసింది. అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ సరసన నటించింది. 1995లో ' కరణ్ అర్జున్ ', 'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే' చిత్రాలు చేశాక ఇక కాజోల్‌కి వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. ఆ చిత్రాలు సంచలన విజయాలు సొంతం చేసుకోవడంతో కాజోల్ పేరు మార్మోగిపోయింది.
ప్రేమకథలకీ, కుటుంబ కథా చిత్రాలకే పరిమితమైపోతోంది. ఇతరత్రా కథలకు ఆమె న్యాయం చేయలేదేమో అనుకొంటున్న దశలోనే... కాజోల్ కీలకమైన నిర్ణయాలు తీసుకొంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలవైపు అడుగులేసింది. అందులో భాగంగా 'గుప్త్'లో నటించింది. ఆ చిత్రంలో వ్యతిరేక ఛాయలున్న పాత్ర పోషించింది. నటిగా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత మళ్లీ తనదైన శైలిలో అడుగులేస్తూ 'ప్యార్ కియాతో డర్నా క్యా', 'ప్యార్ తో హోనా హై తా', 'కుచ్ కుచ్ హోతా హై'లాంటి సినిమాలు చేసింది. మధ్యలో 'దుష్మన్' కూడా చేసింది. అందులో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకొంది.
అటు నటన, ఇటు అందం... రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ప్రయాణాన్ని కొనసాగించింది. వైవిధ్యమైన కథల్ని ఎంచుకొంటూ విజయాల్ని సొంతం చేసుకొంది. 'కుచ్ కుచ్ హోతా హై' తర్వాత ఆమెకి సరైన సినిమాలు పడలేదు. 'కభీ ఖుషీ కభీ ఘమ్'తో మళ్లీ పుంజుకొంది. ఆ తర్వాత 'కల్ హో న హో', 'ఫనా', 'కభీ అల్విద న కెహనా', 'యు మి ఔర్ హమ్', 'రబ్ నే బనాదీ జోడీ', 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రాలు మళ్లీ మునుపటి కాజోల్‌ని గుర్తుకు తెచ్చాయి. వివాహానంతరం మధ్యలో ఆచితూచి సినిమాలు చేసింది. మంచి కథ దొరికినప్పుడు మాత్రం వదిలిపెట్టలేదు.
వ్యక్తిగత జీవితము
[మార్చు]'గుండారాజ్'లో నటిస్తున్నప్పుడు అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడింది. 1994లో మొదలైన ప్రేమాయణం 1999దాకా కొనసాగింది. 1999 ఫిబ్రవరి 24న మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం అజయ్ దేవగణ్ ఇంట్లో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య నిరాడంబరంగా పెళ్ళి జరిగింది. అజయ్ దేవగణ్, కాజోల్ జోడీ గురించి అప్పట్లో రకరకాల చర్చలు సాగాయి. ఇద్దరిదీ సరైన జోడీ కాదంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాజోల్ కెరీర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో పెళ్ళి చేసుకోవడం పట్ల కూడా విమర్శలొచ్చాయి. అయితే ఇద్దరూ వాటిని బేఖాతరు చేశారు. ఓ ఇంటివారై కలిసి నడిచారు. ఆ జంటకి ఇద్దరు పిల్లలున్నారు. నైసా అనే అమ్మాయితో పాటు, యుగ్ అనే అబ్బాయి ఉన్నాడు.
సామాజిక సేవ
[మార్చు]పెళ్ళి తర్వాత ఎక్కువగా అతిథి పాత్రల్లో కనిపిస్తున్న కాజోల్... సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. చిన్నారులు, వితంతువుల సంక్షేమం కోసం పలు స్వచ్ఛందే సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఆ విషయంలో కాజోల్‌కి కర్మవీర్ పురస్కారం లభించింది.
అభిరుచులు
[మార్చు]- ముద్దు పేరు కాడ్స్ అని పిలుస్తుంటారు.
- ఇష్టమైన నటులు అంటూ ఎవ్వరూ లేరు. ఇష్టమైన నటి అమ్మ తనూజ.
- పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. సైన్స్ ఫిక్షన్, హార్రర్ నవలల్ని బాగా చదువుతుంది.
- ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది.
- తెలుపు రంగు అంటే ఎంతో మక్కువ. ఈమె దుస్తుల్లో ఆ రంగువే ఎక్కువగా ఉంటాయి.
- సంగీతం అంటే ఇష్టమే. ఖాళీ సమయాల్లో పాత హిందీ పాటలు, ఖవాలీ పాటలు, పాప్ గీతాలు వింటుంది.
- ఇష్టమైన ప్రదేశం ఐరోపా.
- జీవితంలో ఓ గొప్ప మలుపు అంటే... ఈవిడ పెళ్ళి అనే చెబుతుంది. మార్గదర్శనం లేని జీవితాన్ని గడిపేదాన్ని. పెళ్ళితో ఈవిడ జీవితం ఓ కొత్తదారిలోకి అడుగుపెట్టింది అని అభిప్రాయపడింది.
- సెట్స్‌పై ఈవిడ బాగా ఇబ్బంది పడిన సందర్భం ఒకటే ఒకటి. 'మెరుపు కలలు' సినిమాలో ప్రభుదేవాతో కలిసి నటిస్తున్నప్పుడు. ఆయనతో కలిసి డ్యాన్స్ వేయడం కోసం బోలెడన్ని టేకులు తీసుకొనేది.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కాజోల్ పేజీ
- Commons category link from Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1974 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- హిందీ సినిమా నటీమణులు
- తమిళ సినిమా నటీమణులు
- ఫిలింఫేర్ అవార్డుల విజేతలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు