కానుకొల్లు చంద్రమతి
కానుకొల్లు చంద్రమతి | |
---|---|
జననం | చంద్రమతి 1901 ఆగస్టు 28 మద్రాసు, తమిళనాడు రాష్ట్రం |
మతం | హిందూ |
భార్య / భర్త | కానుకొల్లు మాధవరావు |
పిల్లలు | ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు |
తల్లి | కొటికలపూడి సీతమ్మ |
కానుకొల్లు చంద్రమతి ఆంధ్ర నియోగి బ్రాహ్మణ కుటుంబంలో 1901 వ సంవత్సరం, ఆగష్టు 28 వ తేదీన మద్రాసులో జన్మించింది. ఈమె తల్లి కొటికలపూడి సీతమ్మ. ఆమె కందుకూరి వీరేశలింగం పంతులు అనుయాయి. స్తీవిద్యకై ఆ కాలంలో కృషి చేసింది. ఆమె సాధురక్షణ శతకము, అహల్యాబాయి, ఉపన్యాసమాలిక, ఉన్నత స్త్రీవిద్య, కందుకూరి వీరేశలింగం చరిత్ర, గీతాసారము మొదలైన గ్రంథాలు రచించిన రచయిత్రి. కానుకొల్లు చంద్రమతి తన తల్లి వద్దనే స్త్రీలకు కావలసిన చక్కని విద్య గడించింది. సంస్కృతము, తెలుగుతో పాటుగా ఇంగ్లీషు కూడా కొంత వరకు తన తల్లి వద్ద నేర్చింది. తర్వాత కాకినాడ పి.ఆర్.కాలేజీలో చదివింది. ఆ కళాశాలలో ఇంగ్లీషు చదివిన మొదటి బ్యాచ్‌లో ఈమె ఒకరు. ఈమె భర్త కానుకొల్లు మాధవరావు పిఠాపురం హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె కుమారుడు కె.కృష్ణమూర్తి న్యూఢిల్లీలో ఉన్నతోద్యోగం చేశాడు. ఈమెకు తన 60 యేట గృహలక్ష్మి స్వర్ణకంకణము ప్రదానం చేశారు.
రచనలు
[మార్చు]ఈమె రచించిన మంగళహారతులు భక్తి దాయకమై, హృదయంగమమై ఆంధ్ర పాఠకలోకాన్ని ఆకట్టుకున్నాయి. చంద్రమతి చక్కని కవితలు అల్లగలిగిన విదుషీమణి. ఈమె వ్రాసిన పద్యాలు వినసొంపుగా, సనాతనాధునాతన భావాల మేలుకలయికగా ఉండి రంజింప చేస్తాయి. ఈమె 'సరళాప్రభాకరము' లేదా 'హిందూగృహము' అనే సాంఘిక నవలను 1949లో రచించింది. ఈ నవలను తన తల్లి కొటికలపూడి సీతమ్మకు అంకితం చేసింది. ఈ నవలలో భారతనారి పాతివ్రత్యమును వర్ణిస్తూ వ్రాసిన పద్మావతి కథ చక్కగా ఇమిడింది. ఈ నవలలో హిందూ సంఘము యొక్క ఉత్కృష్టత, స్త్రీకి గల ఉన్నత స్థానము, ఆదర్శవంతమైన గృహిణికి కావలసిన ఉత్తమ గుణములు మొదలైనవి ఈమె వివరించింది. 1960లో 'రాణీ చిన్నమ్మ కథ' (పిఠాపురం మహారాణి చరిత్ర సంగ్రహము) చక్కని శైలిలో రచించింది.