Jump to content

కిషన్ పెర్షాద్

వికీపీడియా నుండి
మహారాజా
యామీన్-అస్-సల్తనత్
సర్ కిషన్ పెర్షాద్
జి.సి.ఐ.ఈ
30వ హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి
In office
25 నవంబరు 1926 – 18 మార్చి 1937
చక్రవర్తిమీర్ ఉస్మాన్ అలీఖాన్
అంతకు ముందు వారువలీ ఉద్దౌలా బహదూర్
తరువాత వారుఅక్బర్ హైదరీ
In office
1901 – 11 జూలై 1912
చక్రవర్తిమహబూబ్ అలీఖాన్
మీర్ ఉస్మాన్ అలీఖాన్
అంతకు ముందు వారువికార్ అల్ ఉమ్రా
తరువాత వారుమీర్ యూసఫ్ అలీఖాన్, 3వ సాలార్‌జంగ్
వ్యక్తిగత వివరాలు
జననం
కిషన్ పెర్షాద్

1864
హైదరాబాదు, హైదరాబాదు రాజ్యం (ప్రస్తుతకాలపు తెలంగాణ, భారతదేశం)
మరణం1940 మే 13(1940-05-13) (వయసు 75–76)
హైదరాబాదు, హైదరాబాదు రాజ్యం (ప్రస్తుతకాలపు తెలంగాణ, భారతదేశం)
జీవిత భాగస్వామి7

మహారాజా సర్ కిషన్ పెర్షాద్ యామీన్ అస్ సల్తనత్ GCIE (1864 – 13 మే 1940) హైదరాబాదు రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసిన భారతీయ రాజవంశీకుడు.

కిషన్ పెర్షాద్, హైదరాబాదు నిజాముకు బాల్యస్నేహితుడు. జీవితాంతం నిజాముకు నమ్మిన బంటుగా ఉన్నాడు. 1892లో కిషన్ పెర్షాద్, హైదరాబాదు రాజ్యపు పేష్కర్ (ఉప మంత్రి) అయ్యాడు. తొమ్మిది సంవత్సరాల తర్వాత నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఈయన్ను దీవానుగా నియమించాడు. దీవానుగా పనిచేసిన మొదటి పర్యాయంలో, రాజ్యపు ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు, 1908 మూసీ వరదల్లో బాధితులక సహాయపడి మరింత పేరు తెచ్చుకున్నాడు. 1926లో తిరిగి దీవానుగా నియమించినప్పుడు ముల్కీ నిబంధనలను అమలుపరిచాడు. ఈ నిబంధనలు, పాలనా పదవులలో, ఉద్యోగావకాశాలలో, బ్రిటీషు వారి కంటే స్థానికు ప్రజలకే ప్రాముఖ్యత కల్పించాయి.

ఉత్తర భారతదేశంలోని మధ్య మైదానాల సంస్కృతైన, గంగా జమూనా తహజీబ్ ప్రవక్తగా, సూఫీ భావాలతో ప్రభావితుడై, కిషన్ పెర్షాద్ ఉర్దూ, పర్షియన్ కవితలు రాసేవాడు. ఈయన కవిత్వం, చిత్రకళ, సంగీతం వంటి కళలను ప్రోత్సహించాడు. ఈయనకు ఏడుగురు భార్యలు. అందులో కొందరు హిందువులు, మరికొందరు ముస్లింలు.

కిషన్ పెర్షాద్, హైదరాబాదులో చిత్రగుప్త భగవాన్ ఆలయాన్ని నిర్మించాడు.

ఆరంభ జీవితం

[మార్చు]

కిషన్ పెర్షాద్ 1864లో జన్మించాడు. కానీ ఖచ్చితమైన పుట్టిన తేదీ నమోదు చేయబడలేదు. తను సూర్యవంశీ మెహ్రా ఖత్రీ కుటుంబానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు.[1] ఈయన, నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కంటే రెండు సంవత్సరాలు ముందు పుట్టానని చెప్పుకున్నాడు.[2] కిషన్ పెర్షాద్ పూర్వీకుడు, రాయ్ మల్‌చంద్, నిజాం-ఉల్-ముల్క్ ఆసఫ్ జా I తో పాటు ఢిల్లీ నుండి హైదరాబాదుకు వలసవచ్చాడు. ఈయన తాత నరీందర్ పెర్షాద్, మహబూబ్ అలీ ఖాన్ పాలనలో దీవానుగానూ, పేష్కరు (ఉపమంత్రి)గాను పనిచేశాడు.[2]

కిషన్ పెర్షాద్ యుక్తవయసులో ఉన్నప్పుడు, ఈయన తాత నరీందర్ పెర్షాద్, ఈయన్ను కాదని, కిషన్ పెర్షాద్ తమ్ముడికి వారసత్వమిచ్చాడు. ఆ తర్వాత కిషన్ పెర్షాద్‌ను, మొదటి సాలార్‌జంగ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ చేరదీసి, తన పిల్లలతో పాటు కిషన్ పెర్షాద్ను పాశ్చాత్య పాఠశాలలో చదివించాడు. ఈయన జమా లెక్కలు, వైద్యం, మతవిద్య, జ్యోతిష్యవిద్యతో పాటు సూఫీతత్త్వాన్ని అభ్యసించాడు. ఇవేకాకుండా, పాఠశాలలో యుద్ధవిద్యలు, మొఘలాయి పద్ధతులు, దర్బారు వేశధారణ కూడా నేర్చుకున్నాడు.[3] కిషన్ పెర్షాద్, తానూ హిందువైనందువలన సంస్కృత భాషను అభ్యసించాడు. తమ వంశపారంపర్యంగా సంక్రమించిన రాజకోశాగారపు బాధ్యతలకు అనుగుణంగా జమా లెక్కల విద్యను అభ్యసించాడు.[4]

ప్రజాజీవితం

[మార్చు]

1892లో కిషన్ పెర్షాద్ హైదరాబాదు రాజ్యపు పేష్కరుగా నియమించబడ్దాడు.[5] 1902లో దీవానుగా నియమితుడయ్యాడు. పేష్కరుగా ఉన్న దశాబ్దకాలంలో రాజ్యపు పాలనావ్యవహారాలలో అంతగా చెప్పుకోదగిన పాత్ర పోషించలేదు. నిజాం మంత్రివర్గంలో సైనికమంత్రి అయ్యాడు. దీనితో పాటు పేష్కరుగా తన బాధ్యతలు నిర్వహించాడు. తరచూ నిజాంకు తోడు ఉంటూ, ఆయన రాజలాంఛనాలను పూర్తిచేయటంలో సహాయపడటమే పేష్కరు పని.[6]

1901లో నిజాం, హైదరాబాదు దీవానుగా వికార్-అల్-ఉమ్రా ను తీసివేసి, కిషన్ పెర్షాద్‌ను దీవానుగా నియమించాడు.[7] ఈ సందర్భంగా ఈయనకు యామీన్ ఉస్సల్తనత్ (రాజుకు కుడిభుజం) బిరుదును కూడా కట్టబెట్టబడింది. ఈయన స్థాయిని "రాజా" నుండి "మహారాజా"కు పెంచారు.[3] రాజ్యపు ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరచేందుకు ఈయన మున్సబుదారుల (భూస్వాములు) ఆదాయాన్ని తగ్గించాడు. వ్యవసాయం, రైల్వేలు, కస్టమ్స్ వల్ల వచ్చే ఆదాయాన్ని పెంచాడు. 1908లో మూసీనదికి వరదలు వచ్చి విపరీతమైన ఆస్తినష్టం జరిగింది. దీనికి జవాబుగా, కిషన్ పెర్షాద్ సహాయనిధిని ఏర్పాటు చేసి, బాధితులకు సొంత విరాళాలను అందించాడు. జీతాలను ముందుగానే ఇచ్చి, రుణాలను మాఫీ చేశాడు.[3]

కిషన్ పెర్షాద్ హైదరాబాదు దీవానుగా ఉన్న కాలంలో, రాజ్యపు నిధుల నిల్వలు నాలుగింతలయ్యాయి. కానీ బ్రిటీషు చరిత్రకారులు, ఈ విషయానికి బ్రిటీషువాడైన ఆర్ధికమంత్రి కాస్సాన్ వాకర్ కారణమని చెబుతుండగా, స్థానిక సాంపద్రాయ చరిత్రలో కిషన్ పెర్షాదే కారణమని చెబుతున్నాయి. ఈయన హైదరాబాదులోని బ్రిటీషు రెసిడెంటుతో కూడా సత్సంబంధాలు నెరపాడు.[8] 1911లో నిజాం మహబూబ్ అలీఖాన్ మరణించిన తర్వాత, ఉస్మాన్ అలీఖాన్ నిజామయ్యాడు. ఈయన పాలనలో దీవానుగా ఉండటం కష్టంగా అనిపించి కిషన్ పెర్షాద్ 1912లో ఆ పదవి రాజీనామా చేశాడు.[5]

1926 నవంబరులో, తిరిగి దీవానుగా నియమితుడై 1927 మార్చి వరకు కొనసాగాడు.[9] ఈయన రెండవ పర్యాయంలో కిషన్ పెర్షాద్‌కు వాకర్‌కు మధ్య రాజకీయ నియామకాలపై ఘర్షణ ఏర్పడింది. వాకర్ పరిపాలనా పదవులకు బ్రిటీషు వారిని నియమించాలని అనుకుంటే, కిషన్ పెర్షాద్‌ స్థానికులను (ముల్కీలు) ఈ పదవుల నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని భావించాడు. వాకర్ యొక్క బ్రిటీషు ప్రాధాన్యతకు, స్థానికులలో అలజడి మొదలయ్యింది. తమకు చిన్నచిన్న ప్రాముఖ్యతలేని పదవులుకూడా దక్కవని భావించారు. వాకర్‌కు కిషన్ పెర్షాద్ మధ్య ఈ విషయంపై ఘర్షణ నిరంతరంగా కొనసాగి, దీని ప్రభావం అనేక ప్రభుత్వ విభాగాలపై పడింది.[8] తత్ఫలితంగా కిషన్ పెర్షాద్ ముల్కీ నిబంధనలను ప్రవేశపెట్టాడు. ఈ నిబంధనల ప్రకారం సమర్ధవంతమైన ముల్కీ అభ్యర్ధులు ఉన్న ఏ పదవికైనా బయటివారిని నియమించకూడదని శాసించింది. ఉద్యోగ నియామకాల్లో కుటుంబ నేపథ్యం కంటే విద్యార్హతలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. అంతే కాకుండా ఉద్యోగ విరమణ వయసును యాభై ఐదు సంవత్సరాలుగా స్థితపరిచింది.[5][10]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వివాహాలు

[మార్చు]
(ఎడమ నుండి కుడికి): మనవడు రాజా రతన్‌గోపాల్ సైంచర్, కూతురు రాణీ సుల్తాన్ కన్వర్ బీబీతో కిషన్ పెర్షాద్
1935లో తన పిల్లలతో కిషన్ పెర్షాద్

కిషన్ పెర్షాద్‌కు ఏడుగురు భార్యలు. అందులో ముగ్గురు హిందువులు, నలుగురు ముస్లిం మహిళలు. అందులో కొంతమంది షియా ముస్లింలు కూడా. ముస్లిం భార్యలతో ముగ్గురు కొడుకులు, హిందూ భార్యలతో తొమ్మిదిమంది కొడుకులు కలిగారు. ఈయన భార్యలు వారివారి సొంత మతాన్నే అవలంబించారు. వారికి పుట్టిన సంతానం తల్లి యొక్క మతాన్ని పాటిస్తూనే పెరిగారు. ముస్లిం భార్యల సంతానానికి ఇస్లామిక్ పేర్లు, హిందూ భార్యల సంతానానికి హిందూ పేర్లు పెట్టాడు.[11][12][13]

కిషన్ పెర్షాద్‌ అత్యంత ప్రీతిపాత్రమైన భార్యలలో గౌసియా బేగం ఒకర్తె. ఈమె సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో పుట్టి కఠినమైన పరదా పద్ధతిని పాటించినా, ఒకరితో ఒకరు మారు వేషాల్లో కలుసుకొని ప్రేమాయణం సాగించారు. ముస్లిం చట్టం ప్రకారం, ముస్లింలకు, హిందువులకు మధ్య వివాహం నిషిద్ధం. గౌసియా బేగంను పెళ్ళిచేసుకోవటానికి, కిషన్ పెర్షాద్‌ ఇస్లాం మతం స్వీకరించడానికి సిద్ధమయ్యాడు.[14] అయితే, నిజాం మహబూబ్ అలీఖాన్ తనకు ముస్లిం పేష్కరు వద్దని, ఈ మతమార్పిడిని వ్యతిరేకించాడు.[ఆధారం చూపాలి]

ఇష్టాలు, నమ్మకాలు

[మార్చు]

కిషన్ పెర్షాద్‌, షాద్ (తెలుగులో సంతోషం) అనే కలంపేరుతో పర్షియన్, ఉర్దూ భాషలలో కవిత్వం రాశాడు. ఈయన కవిత్వంపై సూఫీ తత్త్వపు ప్రభావం మెండుగా ఉన్నది. ఈయన గంగా-జమునీ తెహజీబ్ (హిందూ ముస్లింలు కలిసిమెలిసి సహజీవం చేస్తున్న సంస్కృతి) ను గట్టిగా నమ్మాడు.[15][16] He wrote

I am neither Hindu nor a Muslim
My faith reposes in every religion
Shad alone knows of his religious beliefs
As none but the free can fathom the essence of freedom.[15]

కిషన్ పెర్షాద్‌ కళా పోషకుడు. కవిత్వాన్ని, చిత్రకళను, సంగీతాన్ని పెంచి పోషించాడు. స్థాయికి అతీతంగా అనేకమంది చిత్రకారులు, రచయితలు, సంగీతకారులను ప్రోత్సహించాడు. భారతదేశపు వివిధ ప్రాంతాలనుండే కాకుండా, పర్షియా, అరబ్ దేశాల వంటి సుదూర ప్రదేశాల నుండి కళాకారులు ఉదయాన్నే ఈయన్ను దర్శించుకోవాడానికి వచ్చేవారు.[17] ఈయన "మహబూబ్ అల్ కలమ్" అనే కవితాపత్రికను కూడ ముద్రించేవాడు. అందులో ప్రచురించిన మొదటి ఘజల్‌ను నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ వ్రాయగా, తక్కినవి కిషన్ పెర్షాద్‌ వ్రాశాడు. ఈ ఘజల్లు ఇద్దరు ప్రేమికుల మధ్య సంభాషణాల్లాగా సాగుతాయి.[17]

కిషన్ పెర్షాద్ వ్యాపకాల్లో చిత్రలేఖనం, సితార్ వాయించడం, ఫోటోగ్రఫీ, శిల్పాలను చెక్కడం కూడా ఉన్నవి. ఈయన నిజాంకు బాల్యస్నేహితుడు. జీవితాంతం నిజాంకు నమ్మినబంటుగానే ఉన్నాడు.[5]

టైమ్స్ ఆఫ్ ఇండియా ఈయన గురించి వ్రాస్తూ:

ఈయన ఆకట్టుకునే వ్యక్తిత్వం, గొప్ప హుందాతనం బహుళ ప్రజానీకానికి ఈయన్ను ప్రీతిపాత్రున్ని చేసింది. ఈయనలో ఉట్టిపడే గొప్పతనం, అప్పటి హైదరాబాదు రాజ్యంలోని మంచితనాన్నంతా ప్రతిఫలించి, మహారాజా అంటే కిషన్ పెర్షాదే తప్ప మరెవరూ గుర్తుకు రాని విధంగా చేసింది.[15]

వ్యక్తిత్వం

[మార్చు]

అప్పటి హైదరాబాదీ సమాజం ఫ్యూడల్ జమీందారీ పద్ధతిలో నడిచినప్పటికీ, కిషన్ పెర్షాద్ సమాజపు అగ్రవర్గానికి చెందినప్పటికీ, ఆయన మంత్రిగా పాలన చేసిన రోజుల్లో, ఆయన అనుయాయుల్లో అన్ని వర్గాల, కులాల ప్రజలు ఉండేవారు. ఈయన కుటుంబసభ్యుల చెప్పినదాని ప్రకారం, ఈయన ఒకొక్కప్పుడు, బిచ్చగాళ్ళను తెచ్చి హాళ్లోని సోఫాలో కూర్చోబెట్టి టీ అందించేవాడు.[18] ఇలాంటి చర్యలను విమర్శించినప్పుడు, ఈయన "ఎవరినీ తూలనాడకూడదు, ఏమో, భగవంతుడే ఆ బిచ్చగాడి రూపంలో వచ్చాడేమో" అని సమాధానం చెప్పేవాడు.[18]

ఈయనకున్న సత్సంబంధాలతో, కిషన్ పెర్షాద్ సమాజపు అన్ని వర్గాల అభిప్రాయాలను అర్ధం చేసుకోగలిగేవాడు. హైదరాబాదు రాజ్యపు ప్రధానిమంత్రి అయిన తర్వాత కూడా, ఈయన పాఠశాలలు, ఆసుపత్రుల ప్రారంభోత్సవాలు వంటి ప్రజాకార్యక్రమాల్లో పాల్గొనటం, సర్కస్‌కు ప్రధాన అతిధిగా రాయటం కొనసాగించాడు. పెళ్ళిళ్ల కాలంలో, ఈయన పేద, ధనిక భేదం లేకుండా పిలిచినవాళ్ళందరి పెళ్ళిళ్ళకు హాజరయ్యేవాడు.[18]

నైట్‌హుడ్ ప్రదానం

[మార్చు]

కిషన్ పెర్షాద్ కు బ్రిటీషు ప్రభుత్వం 1903 జనవరిలో నైట్స్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (కె.సి.ఐ.ఈ) [19] 1910లో నైట్స్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (జి.సి.ఐ.ఈ) [20] ప్రదానం చేసింది.

మరణం

[మార్చు]

కిషన్ పెర్షాద్, 1940, మే 13న హైదరాబాదులో మరణించాడు.[21] ఈయన మరణించినప్పుడు నిజాం ఉస్మాన్ అలీఖాన్, "సమాజం, మొఘల్ సామ్రాజ్యపు చివరి అవశేషం వదిలి వెళ్ళడం చూస్తున్నది" అని చెప్పాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sajjad Shahid (Feb 9, 2014). "Kishen Pershad — people's Maharaja | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-05-11.
  2. 2.0 2.1 Ronken Lynton 1992, p. 107.
  3. 3.0 3.1 3.2 Syeda Imam (2008). The Untold Charminar. Penguin. ISBN 9788184759716.
  4. Ronken Lynton 1992, p. 108.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 Shahid, Sajjad (14 November 2011). "The last icon of the Mughal way of life". The Times of India. Retrieved 28 March 2019.
  6. Ronken Lynton 1992, p. 111.
  7. Ronken Lynton 1992, p. 115.
  8. 8.0 8.1 Ronken Lynton 1992, p. 117.
  9. "Princely States of India A–J". World Statesmen. Retrieved 28 March 2019.
  10. Ronken Lynton 1992, p. 119.
  11. Syeda Imam (2008). The Untold Charminar. Penguin. ISBN 9788184759716.
  12. Rajendra Prasad (1984). The Asif Jahs of Hyderabad: Their rise and decline. Vikas Publishing House Private, Limited. p. 128. ISBN 9780706919653.
  13. Narendra Luther (1955). Hyderabad: Memoirs of a City. Orient Longman. p. 223. ISBN 9788125006886.
  14. Ronken Lynton 1992, p. 122.
  15. 15.0 15.1 15.2 Shahid, Sajjad (9 February 2014). "Kishen Pershad – people's Maharaja". The Times of India. Retrieved 28 March 2019.
  16. Alka Patel; Karen Leonard (2011). Indo-Muslim Cultures in Transition. BRILL. p. 185. ISBN 9789004218871.
  17. 17.0 17.1 Ronken Lynton 1992, p. 126.
  18. 18.0 18.1 18.2 Ronken Lynton 1992, p. 112.
  19. "To be Knight Commanders". The London Gazette. 30 December 1902. p. 3.
  20. "To be a Knight Grand Commander". The London Gazette. 23 June 2010.
  21. "Sir Kishen Pershad passes away". The Indian Express. 14 May 1940. Retrieved 28 March 2019.