Jump to content

కె.ఎన్. మల్లీశ్వరి

వికీపీడియా నుండి
కె.ఎన్. మల్లీశ్వరి
జననండిసెంబరు 21, 1970
కొక్కిరపాడు, పశ్చిమ గోదావరి జిల్లా
నివాస ప్రాంతంవిశాఖపట్టణం
విద్యఎం.ఎ; ఎం.ఫిల్, పి.హెచ్ డి.
వృత్తిపోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ (ఆంధ్ర విశ్వవిద్యాలయం)
ప్రసిద్ధిస్త్రీవాద రచయిత్రి, సామాజిక కార్యకర్త

డా. కె.ఎన్. మల్లీశ్వరి స్త్రీవాద రచయిత్రి, సామాజిక కార్యకర్త. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌గా పనిచేస్తున్న మల్లీశ్వరి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.

జీవిత విషయాలు

[మార్చు]

మల్లీశ్వరి 1970, డిసెంబరు 21న పశ్చిమ గోదావరి జిల్లాలోని కొక్కిరపాడు గ్రామంలో జన్మించింది. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటోంది. ఎం.ఎ; ఎం.ఫిల్ (కేతు విశ్వనాథరెడ్డి సాహిత్యం), పి.హెచ్ డి. (ఓల్గా సాహిత్యం) పూర్తిచేసి ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగు భాషా సాహిత్యాలలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేస్తోంది. తెలుగు సాహిత్య బోధన, పరిశోధన, కార్యనిర్వహణపై వృత్తిరీత్యా ఆంధ్ర విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, షిప్ యార్డ్ డిగ్రీ కళాశాల, ఆదిత్య పీజీ కళాశాల, టి.ఎస్సార్ అండ్ టిబికే డిగ్రీ కళాశాలలో పనిచేసింది.[1]

సామాజిక కార్యక్రమాలు

[మార్చు]

రచయిత్రులను ఒక వేదిక మీదకు తీసుకురావడం కోసం మనలో మనం అనే కార్యక్రమం చేసింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండువందల మంది మహిళలు హాజరయ్యారు. విశాఖపట్టణం ఏజెన్సీలో మాడుగుల మండలంలోని వాకపల్లి గ్రామ మహిళల పోరాటానికి మద్దతుగా వ్యాసాలు రాస్తూ, వాకపల్లి సంఘటనను జాతీయ వేదిక మీదకు తీసుకెళ్ళింది. క్షేత్ర పర్యటనల ద్వారా ప్రజా ఉద్యమాలను, సామాజిక సమస్యలను అధ్యయనం చేసి, సామాజిక, రాజకీయ వ్యాసాలు రాసి, విద్యార్థులు, స్త్రీలు, బాలికల సమస్యలకు పరిష్కారాలు దొరికేలా కృషి చేస్తోంది. విద్యార్థులలో పరిశోధనాభిలాష కలిగించేందుకు వివిధ కార్యక్రమాలు, విద్యార్థుల కోసం గోస్తనీ గోడ పత్రిక వంటి ప్రయోగాలు, నవతరంతో యువతరం వంటి కార్యశాలలు కూడా నిర్వహిస్తోంది.[2]

సాహిత్యరంగం

[మార్చు]

1991లో మెర్సీకిల్లింగ్‌ కథాంశంగా మరణం నా నేస్తం అనే కథ రాసింది. ఐదారేళ్ళు సమాజాన్ని అధ్యయనం చేసి 2017లో నీల నవల రాసింది. మల్లీశ్వరి రచనలపై ఇద్దరు ఎం.ఫిల్; ఒకరు పిహెచ్.డి పరిశోధనలు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ, దక్షిణ భారత భాషల విభాగం (మైసూర్), తెలుగురాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలు, ప్రపంచ తెలుగు మహాసభలు (సింగపూర్, తెలంగాణ) వంటి అనేక వేదికల మీద అతిథిగా, వక్తగా పలు ప్రసంగాలు చేసింది. సెమినార్లు, వర్కుషాపులలో పత్ర సమర్పణలు చేసింది.

రచనలు

  1. లేడీ స్కాలర్ (నవల) 2000
  2. ప్రేమించడం ఒక కళ (నవల) 2000
  3. భారతంలో స్త్రీ (నవల) 2002
  4. అట్టడుగు స్వరం (నవల) 2005
  5. జీవితానికో సాఫ్ట్ వేర్ (నవల) 2007
  6. నీల (నవల) 2017[3]
  7. పెత్తనం (కథా సంపుటి) 2005
  8. జాజిమల్లి (బ్లాగ్ కథల సంపుటి) 2011
  9. సి బాచ్ అమ్మాయి (కథా సంపుటి) 2015
  10. పెద్దక్కప్రయాణం (స్మృతి రచన) 2014
  11. కేతు విశ్వనాథ రెడ్డి కథా సౌందర్యం (లఘు సిద్ధాంత గ్రంథం) 2012
  12. ఓల్గా నవలలు – ప్రభావశీలత (సిద్ధాంత గ్రంథం) 2012
  13. మల్లీస్వరం (సాహిత్య విమర్శ, కాలమ్స్) 2013
  14. ఉత్తరాంధ్ర కథా స్థానీయత (సాహిత్యవిమర్శ వ్యాసాల సంపుటి) 2013
  15. నవతరం తెలుగు కథ (సంపాదకత్వం)
  16. పి.సత్యవతి కథలు (సంపాదకత్వం)
  17. అనేక ఆకాశాలు (సంపాదకత్వం)
  18. పండువెన్నెల (సంపాదకత్వం)
  19. నవలా నాయికలు (సంపాదకత్వం)
  20. సాహిత్య సాన్నిహిత్య ఓల్గా (సంపాదకత్వం)

పురస్కారాలు

[మార్చు]

మల్లీశ్వరికి వచ్చిన అవార్డులు, పురస్కారాలు[4]

  1. తానా నవలా బహుమతి – 2017 (నీల నవల)
  2. లాడ్లీ మీడియా అవార్డ్ – 2017 (జర్నలిజంలో)
  3. వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ అవార్డ్ (15 ఏప్రిల్, 2015)
  4. శ్రీమతి వెంకట సుబ్బు మెమోరియల్ అవార్డ్ (2015)
  5. తిరుపతి కళా పురస్కారం (2012)
  6. రంగవల్లి విశిష్ట కథానికా పురస్కారం (2008)
  7. అనిల్ అవార్డ్ – 2007
  8. శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ఉత్తమ కథాసంపుటి బహుమతి (2006)

మూలాలు

[మార్చు]
  1. The Hans India, Women (9 August 2015). "A woman's view of life". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 15 July 2020. Retrieved 15 July 2020.
  2. సాక్షి, ఫ్యామిలీ (23 September 2018). "వాకపల్లి పదేళ్లుగా పోరుపల్లి". Sakshi (in ఇంగ్లీష్). వాకా మంజులారెడ్డి. Archived from the original on 15 July 2020. Retrieved 15 July 2020.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (18 March 2019). "కొలిమిలో కాలి మెరిసే ఆభరణం 'నీల'". andhrajyothy.com. శ్రుతకీర్తి. Archived from the original on 15 July 2020. Retrieved 15 July 2020.
  4. The Hans India, Featured (28 January 2018). "Sensible approach towards societal problems". www.thehansindia.com (in ఇంగ్లీష్). Ramachandra Sharma Gundimeda. Archived from the original on 15 July 2020. Retrieved 15 July 2020.

ఇతర లంకెలు

[మార్చు]