Jump to content

కేశి నారాయణస్వామి

వికీపీడియా నుండి
కేశి నారాయణస్వామి
వ్యక్తిగత సమాచారం
మూలంపలమనేరి, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తికర్ణాటక సంగీత విద్వాంసురాలు, వేణుగాన కళాకారిణి
వాయిద్యాలువేణువు

కేశి నారాయణస్వామి(1918-2015) ఒక కర్ణాటక సంగీత వేణుగాన విద్వాంసురాలు.[1] [2] ఈమెకు 1997లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.


ఆరంభ జీవితం

[మార్చు]

ఈమె 1918, మార్చి నెలలో మద్రాసు (ప్రస్తుతం చెన్నై)లో ఒక సంప్రదాయ బద్ధమైన కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ఎస్.వైద్యనాథ అయ్యర్ ఒక న్యాయవాది. తల్లి గృహిణి. ఈమెకు ఐదుగురు సోదర సోదరీమణులు. ఈమె తన ఐదవ యేటనే నాగపట్నంలో సంగీతం నేర్చుకోసాగింది. ఈమె కుటుంబం తంజావూరుకు బదిలీ అయిన తర్వాత ఈమె ఎస్.సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద, పి.స్వామినాథ అయ్యర్ వద్ద వేణుగాన విద్యను నేర్చుకుంది. ఆ తర్వాత టి.ఆర్.మహాలింగం[2] వద్ద గాత్ర సంగీతంలో టి.బృంద వద్ద మరింత తర్ఫీదును పొందింది.

ఈమె తన స్వగ్రామం పలమనేరికి చెందిన పి.ఎ.నారాయణస్వామిని 1934లో వివాహం చేసుకుంది.

వృత్తి

[మార్చు]

ఈమె తన గురువు టి.ఆర్.మహాలింగంతో కచేరీలలో పాల్గొన్నది. ఈమె అనేక సోలో ప్రదర్శనలు ఇవ్వడమే కాక అనేక మంది కళాకారులకు సహకారాన్ని అందించింది. ఆకాశవాణిలో కర్ణాటక శైలిలో వేణుగానం చేసిన మొట్టమొదటి మహిళగా ఈమె గణుతికెక్కింది. ఆకాశవాణి జాతీయ కార్యక్రమంలో ఈమె కచేరీలు 12కు పైగా ప్రసారమయ్యాయి. దూరదర్శన్ చెన్నై, న్యూఢిల్లీ కేంద్రాల నుండి కూడా ఈమె వేణుగాన కచేరీలు ప్రసారమయ్యాయి. ఈమె ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఏ గ్రేడు కళాకారిణి.

ఈమె బ్రిటన్, ఫ్రాన్సు, రోము, స్విట్జర్లాండు, బల్గేరియా, యుగోస్లేవియా, జర్మనీ, శ్రీలంక, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ వంటి పలుదేశాలలో వేణుగాన కచేరీలు చేసింది. ఈమె రుక్మిణీదేవి అరండేల్, కమల, కృష్ణవేణి లక్ష్మణన్ వంటి భరతనాట్య కళాకారుల ఆర్కెస్ట్రాలో సహవాద్య సంగీతాన్ని అందించింది. ఈమె ఎన్నో గ్రామఫోను రికార్డులను, ఆడియో కేసెట్లను రికార్డు చేసింది. ఈమె ఎందరికో శిక్షణనిచ్చి వీణాగాన కళాకారులుగా తయారు చేసింది. వారిలో వాసంతి శేఖర్, జి.శ్రీధర్, నవీన్ అయ్యర్, హరినారాయణన్ రామచంద్రన్, కౌశిక్ వంటి వారు ఉన్నారు.

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]
  • 1975లో ఈమెకు "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" కళైమామణి పురస్కారం అందించింది.[1]
  • 1996లో శ్రీ కంచి కామకోటి పీఠం ఈమెకు శంకరాచార్య పురస్కారాన్ని ప్రదానం చేసింది.
  • 1997లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈమెకు కర్ణాటక సంగీతం వాద్యపరికరాల కేటగరీలో అవార్డును అందజేసింది.
  • ఈమె తమిళనాడు సంగీత కళాశాలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. అనేక సంగీత పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.

మరణం

[మార్చు]

ఈమె 2015, జూన్ 16వ తేదీన మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 web master. "Kesi Narayanaswamy". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 6 March 2021.[permanent dead link]
  2. 2.0 2.1 Rajagopalan, N. Another Garland - Biographical Dictionary of Carnatic Composers and Musicians, Book II, Carnatic Classicals, 1992, p. 159.

బయటి లింకులు

[మార్చు]