కొండవీటి గుర్నాథరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండవీటి గుర్నాథరెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు. ఈయన స్వస్థలం నల్గొండ జిల్లా, మునుగోడు మండలం, పలివెల గ్రామం.

భారత స్వాతంత్ర్యోద్యమము లోనూ, తెలంగాణ సాయుధ పోరాటం లోనూ పిడికిలెత్తిన ఉద్యమకారుడు... వందలాది ఎకరాల భూమిని పంచి తుదిశ్వాస విడిచేదాకా నిరాడంబర జీవనం సాగించిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, నిస్వార్థ సేవకుడు.

పదహారేండ్ల వయస్సులోనే 1938లో హైదరాబాద్‌లో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దేశ నాయకులైన గాంధీ, నెహ్రూ ఉపన్యాసాల కోసం హైదరాబాద్ నుంచి ముంబై వరకు 18 రోజుల పాటు కాలినడక సాగించారు. నిజాం నిరంకుశపాలన, కట్టు బానిసత్వం, వెట్టి చాకిరీలకు చలించి 1942లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు.

స్వామి రామానందతీర్థ పిలుపు మేరకు 1947లో వంద మంది దళ సభ్యులను చైతన్య పరచి సాయుధ పోరాట ఉద్యమాన్ని సాగించారు. పిత్రార్జితంగా వచ్చిన వ్యసాయ భూములను పేదలకు పంచారు. దొరల పెత్తంధార్ల బెదిరింపులకు లొంగకుండా ఊరూరా ఎర్రజెండాలను నాటి వెట్టి చాకిరికి వ్యతిరేఖంగా ఉద్యమించారు. ఆ సమయంలో తొమ్మిది నెలల పదిహేను రోజుల జైలు జీవితం అనుభవించి చిత్రహింసలకు గురయ్యారు.

రాజకీయ ప్రవేశం[మార్చు]

1948లో యావత్ తెలంగాణను దిగ్భ్రాంతికి గురిచేసిన, రజాకారులు పలివెల గ్రామాన్ని భస్మీపటలం చేసే ఘటనను ఈయన ముందుగానే ఊహించారు. ప్రజలను సురక్షిత పరచడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 1953లో పలివెల గ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1962లో నల్లగొండ జిల్లాలోని చిన్నకొండూరు కేంద్రంగా గల మునుగోడు అసెంబ్లీ నియోజవర్గం నుంచి సీపీఎం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండా లక్ష్మణ్ బాపూజీ పై గెలుపొందారు.

1973లో సీపీఐ (ఎంఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గంలో చేరి నాలుగేళ్ల పాటు అజ్ఙాత జీవితం గడిపారు. భారత్-చైనా మిత్రమండలి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసారు. 1982 అక్టోబరులో ఉమ్మడి రాష్ట్రం నుంచి చైనా పర్యటనకు వెళ్లిన ఆరుగురు సభ్యులు గల బృందంలో ఈయన ఒకరు. 21 రోజలు పాటు చైనాలో పర్యటించారు.

ఓ వైపు సాయుధ పోరాటంలో, మరోవైపు సంఘ సేవా కార్యక్రమలో పాల్గొంటూనే 30 ఏళ్ల పాటు రాత్రి పాఠశాలలు నడిపారు. సైన్స్, గ్రంథ పఠనంపై తనకున్న ఆసక్తిని ప్రజలకు పంచేందుకు గెలిలీయో పేరిట ప్రజల విరాళాలతో విజ్జాన గ్రంథాలయాన్ని నిర్మించారు.

ఆయన భుజంపై ఎప్పుడు చూసినా ఓసంచి, తెల్లటి దోవతి, లాల్చి ఆయన ఆహర్యం. వృద్ధాప్యం బాధిస్తున్నా చనిపోయేవరకు పలు మండలాల్లోని పాఠశాలల్లోని విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవారు. ప్రభుత్వం నిర్వహించే సభలకు, సమావేశాలకు స్వచ్ఛందంగానే హాజరయ్యేవారు.

మరణం[మార్చు]

గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... 31 ఆగష్టు, 2014 ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం స్వగ్రామమైన పలివెల నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచారు. ఈయనకు ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా నల్లగొండ, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తాను మాత్రం స్వగ్రామంలోనే ఉంటున్నారు.

మూలాలు[మార్చు]