Jump to content

కొడాలి గోపాలరావు

వికీపీడియా నుండి
కొడాలి గోపాలరావు
శత నాటక కర్త కొడాలి గోపాలరావు
జననం1925
పెదరావూరు గ్రామం, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా
మరణం1993
సంస్థతెనాలి - జనతా ఆర్ట్ థియేటర్ వ్యవస్థాపకులు
ప్రసిద్ధితెలుగు నాటక రచయిత
మతంహిందువు

కొడాలి గోపాలరావు (1925 - 1993) ప్రముఖ తెలుగు నాటక రచయిత. వీరు దాదాపు వందకు పైగా నాటకాలు, నవలలు రచించారు.[1]

జననం

[మార్చు]

కొడాలి గోపాలరావు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకాలోని పెదరావూరు గ్రామంలో జన్మించారు. గ్రామంలోని శివాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి వరకు చదువుకున్నారు.

విశేషాలు

[మార్చు]

దొంగవీరడు, ఛైర్మెన్, లంకెల బిందెలు వంటి నాటకాలు తెలుగు నాటక రంగంలో సంచలనాన్ని కలిగించినవి. ఈ నాటకాల రచయిత కొడాలి గోపాలరావు. తెలుగు నాటకరంగంలో శతనాటక కర్తగా, వేగవంతమైన రచయితగా కొడాలి గోపాలరావుకి పేరు ప్రఖ్యాతలున్నాయి. ఈ గ్రామీణ నాటకాలు రచించడంలో అందెవేసిన చేయి కొడాలి గోపాలరావు. గ్రామీణ ప్రజలు, వారిలో జమిందార్లు, రాజకీయ నాయకులు, వడ్డీ వ్యాపారస్తులు, కూలీలు, పేదలు వంటివారిని తన నాటకాలలో పాత్రలుగా, వారి జీవన చిత్రాన్ని, వారి మధ్య ఏర్పడే సంఘటనలు, సంఘర్షణలు అంతే సహజంగా రంగస్థలంపై ఆవిష్కరించిన ఘనత కొడాలిది. వీరు తెనాలిలోని జనతా ఆర్ట్ థియేటర్ వ్యవస్థాపకులు. వీరు అనేక నాటక పరిషత్తులలో 170కి పైగా బహుమతులను గెలుచుకున్నారు.

సహజంగానే తెనాలి ప్రాంతంలో నాటక కళ పట్ల ఆదరణ ఎక్కువ. ప్రతి ఒక్కరిలో నాటకం పట్ల కనీస అవగాహన, ఆసక్తి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో పుట్టిన కొడాలి సహజంగానే నాటకం పట్ల అవగాహన, ఆసక్తి కలిగించింది.

రచనలు

[మార్చు]
  • పేదరైతు (1952) (నాటకం)[2]
  • కూలి (1952)
  • తిరుగుబాటు (1954)
  • దొంగవీరడు (1958) (నాటకం)
  • లంకెల బిందెలు (1959)(నాటకం)
  • చేసిన పాపం కాశీకి పోయినా (1960)
  • వైకుంఠ భవనం (1960)(నాటకం)
  • ఆత్మద్రోహులు
  • చెరపకురా చెడేవు
  • చైర్మన్ (నాటకం)
  • శోభనపు రాత్రి గది
  • శ్రీమంతులు
  • రైతు బిడ్డలు (నాటకం)
  • విశ్వనాథ విజయం
  • కొడుకూలూ-కోడళ్లూ
  • కొత్తగడ్డ
  • నటశ్రీ
  • బందిపోట్లు (నవల)
  • తెలుగు గంగ (యక్షగానం)
  • మన కల నిజమైతే
  • ప్రేమకానుక
  • మధుమాల (ఖండకావ్యం)
  • నిరుద్యోగి (నాటకం)
  • రక్త సంబంధాలు (నాటకం)
  • ఆకలి చావులు (నాటిక)
  • అగ్ని పరీక్ష (నాటిక)
  • త్యాగమూర్తి (నాటిక)

ఇక కొడాలి రచనల గురించి చెప్పాలంటే ఆయనకున్న శతనాటకకర్త అనే బిరుదు ద్వారా ఆయన వందకు పైగా నాటకాలు రచించారు అనేది విదితమే. అయితే ఆయన శతాధిక నాటకకర్త అనేది ఆయన శిష్యులు, ఆయనపై పరిశోధన చేసిన పరిశోధకుల మాట. కళాప్రపూర్ణ, శతనాటకకర్త వంటి బిరుదులు కొడాలికి ఉండేవి.

1930 – 1990 మధ్యకాలంలో గ్రామీణ నాటక రచయితగా, శతనాటకకర్తగా, తెలుగు నాటకరంగ కడలికెరటం అంటూ ఆకాశానికి ఎత్తేయబడిన కొడాలి గోపాలరావు పేరు నేడు అసలెవరికీ పట్టనట్టుగా, మరుగున పడి ఉంది. అది ఎంతలా అంటే కొడాలి స్వగ్రామం పెదరావూరు వెళ్ళి ఆయన గురించి అడిగితే కొడాలి గోపాలరావు ఎవరు ... అని ఆ ఊరి గ్రామస్థలు మనల్నే ఎదురు ప్రశ్న వేసేంతలా... తన పుస్తకాలు, రచనలు ప్రింట్ అవుతున్నాయా... లేదా ... అని కొడాలి ఆలోచించకపోవడం, ఎవరాడినా నాటకం బ్రతుకుతుంది అనే అభిప్రాయంతో అడిగిన వారికల్లా నాటకాలు రచించి ఇవ్వడం మరలా వాటి గురించి పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివాటితో పాటు కొడాలి కుటుంబ సభ్యులు, శిష్యులు, నేటి తెలుగు నాటకరంగం, నేటి పరిశోధకులు ఎవరూ ఆయన గురించి పట్టించుకోక పోవడం వల్ల కొడాలితో పాటు ఆయన రచలనలు కూడా మరుగున పడి ఉన్నాయి. ఇలాగే మరికొంత కాలం గడిస్తే నేడు దొరుకుతున్న పుస్తకాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు సాంఘిక, సంక్షేమ శాఖ వారి సహకారంతో నిర్మితమైన కల చెదిరింది చిత్రానికి దర్శకత్వం వహించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. కొడాలి గోపాలరావు, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 500-1.
  2. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
  3. "కలచెదిరింది - కొడాలి గోపాలరావు".