కొప్పర్రు కైఫియత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటూరు జిల్లా చింతపల్లి తాలూకా వేలూరు సబ్ డివిజను నాదెండ్ల సమితికి చెందిన కొప్పర్రు గ్రామం యొక్క సంగతుల్ని కొప్పర్రు కైపియత్తు గా పేర్కొంటారు. ఇది 1812 లో ఆ ఊరి కరణం చేత రాయబడింది.

ఈ గ్రామం పూర్వం నుంచి కూడా "కొప్పర్రు" అనే పేరుతోనే ప్రసిద్ధిగాంచింది. శాలివాహన శకం ప్రారంభమైన తర్వాత కొందరు రాజులు దీన్ని పరిపాలించారు. ఆ తరువాత యిది అశ్వపతి, నరపతి, గజపతి అనే మూడు సింహాసనాలుగా ఏర్పడింది. గజపతి సింహాసనాన్ని అలంకరించిన గజపతి మహారాజు గారు శాలివాహన శకం 1056 (1134 AD) మొదలుకొని ధర్మవంతుడై రాజ్యాన్ని పాలించాడు. వీరి దగ్గర ప్రధానిగా పనిచేసిన గోపరాజు రామన్న గారు శాలివాహన శకం 1067 (1145 AD) అంటే రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య మంగళవారం సూర్యగ్రహణం సమయంలో రాజుగారి నుండి ఈ ప్రాంతాన్ని దానంగా స్వీకరించి బ్రాహ్మణులకు వంశపారంపత్యపు గ్రామకరణీకపు హక్కులు నిర్ణయించగా యీ కొప్పర్రుకు యజుశ్శాఖాధ్యయనులైన "కొప్పర్తి" వారికి ఒక కరణీకం, "పుణ్యమూర్తి" వారికి ఒక కరణీకం మొత్తం మీద రెండు కరణీకాలుగా ఏర్పాటు చేయబడ్డది. ఈ రెండు కరణీకాలకు చెందిన ఆరువేల నియోగులకు సమభాగాలుగా మిరాశీ (వంశపారంపర్యపు హక్కు) యిచ్చారు. కాబట్టి అప్పటి నుండి ఈ రెండు వంశాలకు చెందినవారు కరణీకం అనుభవిస్తున్నారు.

పైన పేర్కొనబడ్డ గణపతి మహారాజు గారి కుమారులైన కాకతి గజపతి గారు పరిపాలించిన తర్వాత వారి పుత్రులైన కాకతీయ రుద్రదేవ మహారాజు గారు శాలివాహన శకం 1060 (1138 AD) నుంచి పరిపాలించారు. ఆ కాలంలో ఈ స్థలానికి (కొప్పర్రు గ్రామానికి) ఉత్తరం వైపు శివాలయం కట్టించి మల్లేశ్వర స్వామి అనే లింగమూర్తిని ప్రతిష్ఠించారు.

తదనంతరం శాలివాహన శకం 1241 (1319 AD) లగాయతు ఈ ప్రాంతానికి రెడ్లు ప్రభువులుగా వచ్చారు. వారు కొండవీడు మొదలైన వాటి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ గ్రామంలో విష్ణు దేవాలయం లేకపోవడాన్ని గమనించి, పైన పేర్కొన్న మల్లేశ్వర స్వామి దేవాలయానికి దక్షిణంగా మధ్యలో విష్ణు దేవాలయం కట్టించి ఆ దేవస్థానానికి ప్రత్యేక సదుపాయాలు చేసి, ఉత్సవాలు జరిగేటట్లు ఆజ్ఞాపించారు.

ఒరియా, కర్ణాటక ప్రభుత్వాలు[మార్చు]

శాలివాహన శకం 1500 (1578 AD) వరకు కొనసాగిన తర్వాత మొగలాయి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు దేశముఖి, దేశపాండ్య మొదలైన 12 రకాల గుమస్తాగిరీలు ఏర్పాటుచేసి, ప్రభుత్వ సమితులలో కొన్ని గ్రామాలను అటూ యిటూ (బదలాయింపులు) చేసేటప్పుడు ఈ గ్రామం నాదెండ్ల సమితిలో దాఖలు చేయబడ్డది కాబట్టి ఇది వేరే ప్రత్యేక అధికారి కింద లేదు. దేశపాండ్యాల (ఒక గుమస్తా హోదా) ద్వారా ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహింపజేశారు.

ఫసలీ సంవత్సరం 1122 (1712 AD) లో కొండవీటి సీమ మూడు భాగాలుగా విభజింపబడి జమిందార్లకు పంపిణీ అయింది. ఈ గ్రామం నాదెండ్ల సమితిలో చేరినందువల్ల సర్కారు మజుమ్దారయిన మాసూరి వెంకన్న పంతులు గారి వంతులోకి వచ్చింది. నాదెండ్ల సమితి చిలకలూరిపేట తాలూకాలో చేర్చబడ్డది. ఆ కారణం చేత వెంకన్న పంతులు గారు పరిపాలిస్తూ ఉండగా ఆర్థిక ఒత్తిడి కారణంగా వేలూరు వగైరా తొమ్మిది గ్రామాలను ఒక గుంపుగా చేసి వాసిరెడ్డి పద్మనాభుని గారికి విక్రయించారు. అందుచేత పద్మనాభుని గారు, చంద్రమౌళి నాయుడు గారు, పెద్ద రామలింగన్న గారు, నర్సన్న గారు మారన్న గారు, చిన్న నరసయ్య గారు, చిన్న రామలింగన్న గారు ఫసలీ సంవత్సరం 1173 (1763 AD) వరకు ప్రభుత్వం చేశారు. ఆ తర్వాత జగ్గయ్య గారు చిన్న రామలింగన్న గారి కాలంలో ప్రభుత్వాన్ని చేపట్టి ఫసలీ సంవత్సరం 1173 నుండి ఫసలీ సంవత్సరం 1175 (1765 AD) వరకు మూడు సంవత్సరాలు కొనసాగారు.

పిమ్మట రామన్న గారు ఫసలీ సంవత్సరం 1176 (1766 AD) లో ప్రభుత్వానికి వచ్చి సర్కారు జమిందారులైన మాణిక్యారావు గారితో వచ్చిన శత్రుత్వం పెరిగిపోయి కలత కలిగించగా తమకు సహాయం చేయడం కోసం అద్దంకి ప్రభువులైన మందపాటి వారి సంస్థానంలో సర్దారులుగా ఉన్న కమ్మవారు బొల్లెపల్లి, మేదరమెట్లకు చెందిన వారైన నరహరిగారు, బత్తని శింగరప్ప గారు, బత్తిని నర్సన్న గారు, మేదరమిట్ట గోపన్న గారు, బొల్లెపల్లి తిరువెంగళప్ప గారు మొదలైన గొప్ప పరాక్రమవంతులను రప్పించుకొని వారికి సర్దారీ హోదాలిచ్చి (నాయకత్వమిచ్చి) తన కార్యకలాపాలలో సహాయపడేటందుకు 50 మంది కమ్మవారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామంలో ఉండే తమ స్థావరాలకు, సిబ్బంది మున్నగువారి జీతాలకు బాధ్యత వహించే విధంగా గ్రామకట్టడి చేసి వారికి, వారి కాపురాలకు గ్రామంలో అవకాశమిచ్చి ఫసలీ సంవత్సరం 1192 (1782 AD) వరకు పరిపాలించి పైన రాసిన విధంగా అమలుచేశారు.

తదనంతరం రాజా వెంకటాద్రి నాయుడు గారు ఫసలీ సంవత్సరం 1193 (1783 AD) లో ప్రభుత్వానికి వచ్చి పైన పేర్కొనబడ్డ కమ్మవారికి రామన్న గారు నిర్ణయించిన ప్రకారం మూడు సంవత్సరాలు అమలుచేసి, ఆ తర్వాత అమలు చేయలేదు. ఫసలీ 1207 (1797 AD) లో చిన్న వేలూరి సబ్ డివిజన్ గ్రామాదులకు ప్రభుత్వం తరపున వ్యవహారాల్ని నిర్వహిస్తున్న కొలిపాక బ్రహ్మాజీ ద్వారా పైన పేర్కొన్న గ్రామంలో ఉండే మల్లేశ్వర స్వామి వారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయించి నిత్య నైవేద్య దీపారాధనల కోసం ఒక భూమి మాన్యంగా యిప్పించారు. అంతేగాక గోపాలస్వామి వారిని కూడా పునఃప్రతిష్ఠ చేయించి నిత్య నైవేద్య దీపారాధనలకు గాను ఒక భూమి యిప్పించి, ఉభయ దేవస్థానాలకు కూడా రెండు కుచ్చెలు అంటే రెండు ధాన్యపు రాశులు యీనాంగా యిప్పించి పరిపాలిస్తూ ఉండేవారు. ఫసలీ సంవత్సరం 1218 (1808 AD) లో శిథిలమై ఉన్న గోపాలస్వామి వారి ఆలయాన్ని కూడా పైన తెల్పబడ్డ మేదరమెట్ట గోపన్న గారు విప్పించి తిరిగి కట్టించి స్వామివారికి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఫసలీ సంవత్సరం (1221 (1811 AD) వరకు వెంకటాద్రి నాయుడు గారు పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు.

ది 28 ఫిబ్రవరి క్రీ. శ. 1812 సంవత్సరం...