Jump to content

కొబ్బరి బొండాం

వికీపీడియా నుండి
(కొబ్బరిబోండాం (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
కొబ్బరిబోండాం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం రవితేజ కాట్రగడ్డ
నిర్మాణం కె. అచ్చిరెడ్డి, వి. జి. సరోజ (సహ నిర్మాత)
రచన దివాకర్ బాబు (మాటలు), ఎస్. వి. కృష్ణారెడ్డి (కథ, చిత్రానువాదం)
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
నిరోషా
సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి
ఛాయాగ్రహణం ఎన్. సుధాకర్ రెడ్డి
కూర్పు కె. రాంగోపాల్ రెడ్డి
నిర్మాణ సంస్థ మనీషా ఫిల్మ్స్
భాష తెలుగు

కొబ్బరి బోండాం 1991 లో కాట్రగడ్డ రవితేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో రాజేంద్రప్రసాద్, నిరోషా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మొదటిసారిగా కథ, చిత్రానువాదం, సంగీతం అందించిన ఎస్. వి. కృష్ణారెడ్డి తర్వాత దర్శకుడిగా మారి అనేక విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు. రాజేంద్రుడు గజేంద్రుడు ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా మొదటి సినిమా. ఒక పిరికి వాడైన కథానాయకుడిని ఒక ప్రొఫెసరు ఆత్మవిశ్వాసం కలిగేలా చేసి అతని ఇబ్బందులు తొలగేలా చేయడం ఈ చిత్ర కథాంశం.

కాలేజీలో చదివే రాజు అమాయకుడు, పిరికివాడు. స్నేహితులందరూ అతన్ని చిన్నప్పటి ముద్దుపేరైన కొబ్బరి బోండాం పేరుతో ఏడిపిస్తూ ఉంటారు. ఒకసారి రాజు మేఘమాల అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. సర్వనామం, కపూర్ అనే ఇద్దరు కలిసి యువకులకు సినిమాల్లో కథానాయకులుగా చేస్తానని నమ్మించి క్రూరమైన బాక్సింగ్ ఆట ఆడించి అందులో వాళ్ళు దెబ్బలు తిని చనిపోతుంటే వీడియోలో చిత్రీకరించి, వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. మేఘమాల అన్నయ్యను కపూర్ దగ్గర కొంత డబ్బు ఋణం తీసుకుని ఉంటాడు. ఆ డబ్బు సమయానికి చెల్లించలేకపోవడంతో అతన్ని బెదిరిస్తుంటాడు. డబ్బు చెల్లించకపోతే అతని చెల్లెలిని తీసుకెళ్ళిపోతానని బెదిరిస్తుంటాడు. తనను ప్రేమిస్తున్నట్లు వెంటపడుతున్న రాజును మేఘమాల వాళ్ళు పెళ్ళి చేసుకోవాలంటే తన అన్నయ్యను ఒప్పించమంటుంది. అతను తన చెల్లెల్ని పెళ్ళి చేసుకోవాలంటే ఉద్యోగం సంపాదించి దానితో పాటు ఐదు లక్షలు ఇవ్వమని అడుగుతాడు. అంతే కాకుండా అతని దగ్గరకు వచ్చినప్పుడల్లా రాజును ఇంట్లో పనులన్నింటికీ వాడుకుంటూ ఉంటాడు.

ఉద్యోగం సంపాదించడం కోసం సర్వనామం దగ్గరికి వెళతాడు రాజు. సర్వనామం దొంగతనంగా తీసిన వీడియో క్యాసెట్లను వేరే వాళ్ళకు ఇచ్చి డబ్బులు వసూలు చేసే పని అప్పచెబుతాడు. కానీ సర్వనామం కొడుకు సురేష్ రాజును మోసం చేసి ఆ డబ్బును తస్కరిస్తాడు. సర్వనామం ఆ డబ్బు ఎలాగైనా కట్టమని రాజును నిలదీస్తాడు. రాజు ఏమీ చేయలేకపోవడంతో సర్వనామం రాజు తల్లిని పిలిచి అతని ప్రేమ విషయాన్ని చెప్పేస్తాడు. రాజు తల్లి అతన్ని నిలదీస్తుంది. డబ్బు కట్టే దాకా రాజు తల్లి తన దగ్గరే ఉంటుందని చెబుతాడు సర్వనామం. తన దగ్గర సూట్ కేసు డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఎదురైనా తన పిరికితనంతో వారిని ఏమీ చేయలేకపోతాడు రాజు. మేఘమాల కూడా అతని చేతకానితనాన్ని చూసి హేళన చేస్తుంది. నిస్సహాయ స్థితిలో రాజు ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విని లంకె బిందెల ఆచూకీ కోసం పాత పుస్తకాలన్నీ చదువుతాడు. ఒక ప్రాంతం ఆచూకీ తెలుసుకుని సహాయం కోసం కాలేజీలో పనిచేసే తన ప్రొఫెసరు దగ్గరికి వెళతాడు. ఆయన ఆ ప్రాంతం చేరుకోవడం కోసం ఒక మ్యాపు గీసిస్తాడు. రాజు దాన్ని వెతుక్కుంటూ వెళతాడు. అక్కడి లంకెబిందెలేవీ దొరకవు కానీ ఒక పాత నాణెం దొరుకుతుంది. ప్రొఫెసరు ఆ నాణేన్ని పరిశీలించి అది మగధ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక అదృష్ట సూచకమైన నాణెమనీ, అది ఎవరి దగ్గర ఉంటే వారికి కొండంత ఆత్మ విశ్వాసం వస్తుందనీ చెబుతాడు.

రాజు ఆ నాణెం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో తన దగ్గర డబ్బు దొంగిలించిన దొంగలను మట్టి కరిపించి సురేష్ ను నేరం ఒప్పుకునేలా చేస్తాడు. సర్వనామం మాత్రం తన కొడుకు డబ్బు దొంగిలించాడని ఒప్పుకోడు. సర్వనామాన్ని బెదిరించి తల్లిని తీసుకెళ్ళాలని చూస్తాడు రాజు. ఆమె మాత్రం అతనికివ్వాల్సిన డబ్బు ఇచ్చేసి తనను తీసుకెళ్ళడం న్యాయమని చెబుతుంది. రాజు ప్రొఫెసరు సలహాతో సర్వనామం దగ్గర్నుంచి తెలివిగా డబ్బు కొట్టేసి ఆ దొంగతనాన్ని సురేష్ మీదకి నెట్టేస్తాడు. ఆ డబ్బుతో తన తల్లిని విడిపించుకుని తీసుకువచ్చి ప్రొఫెసరు ఇంట్లో ఉంచుతాడు.

రాజు మేఘమాల అన్నయ్య దగ్గరకు వెళ్ళి డబ్బు లేకుండానే అతని చెల్లెల్నిచ్చి పెళ్ళి చేయాల్సిందేనని పట్టుపడతాడు. అతన్ని ఒప్పించేందుకు రాజు తనకు ముందుగా జరగోబోయేవి తెలుసనీ అతని చావు తేదీ చెబుతానంటూ నానా రకాలుగా ఇబ్బందులు పెడతాడు. ఈలోపు కపూర్ వచ్చి రాజును బాక్సింగ్ ఆటలో చంపించి ఆ వీడియోను సొమ్ము చేసుకుందామని సర్వనామంతో చెబుతాడు. సర్వనామం తన కొడుకును పంపి రాజును ఒప్పించాలని ప్రయత్నిస్తాడు కానీ రాజు అందుకు ఒప్పుకోడు. కపూర్ మేఘమాల అన్నయ్యకు ఫోన్ చేసి ఒక్క రోజులో తనకివ్వాల్సిన ఐదు లక్షలు ఇవ్వమంటాడు. దాంతో మేఘమాల అన్నయ్య ఎప్పుడో తాము కపూర్ కు బాకీ ఉన్న విషయం గురించి, అందుకు అతను బెదిరిస్తున్న విషయం ఇద్దరికీ చెబుతాడు. బాకీ తీర్చడం కోసం రాజు సర్వనామం దగ్గరికి వెళ్ళి వీడియోలో నటించడానికి ఒప్పుకుంటాడు. ఈ లోపు సురేష్ రాజు దగ్గర ఉన్న అదృష్ట నాణేన్ని తస్కరించి స్నేహితులు అడగబోతే దానిని మింగేస్తాడు.

ఆత్మవిశ్వాసంలో బరిలోకి దిగిన రాజు నాణెం తన దగ్గర లేదనే విషయం తెలియగానే నీరుగారిపోయి చావు దెబ్బ తింటాడు. ఈలోపు నాణేన్ని మింగిన సురేష్ ప్రొఫెసర్ కంటబడటంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని పరుగున వెళ్ళి మరో నాణేన్ని రాజుకిచ్చి అదే అతని అదృష్ట నాణెంగా నమ్మిస్తాడు. దాంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రాజు అవలీలగా శత్రువును మట్టికరిపిస్తాడు. ఈలోపు పోలీసులు వచ్చి సర్వనామాన్ని, కపూర్ ను అదుపులోకి తీసుకుంటారు. అసలు ఆ నాణెంలో అసలు ఏ శక్తీ లేదనీ కేవలం రాజులో ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి అలా అబద్ధం చెబుతానని రాజుకు చెబుతాడు ప్రొఫెసరు. రాజు ఆ నాణేన్ని పక్కకు విసిరేసి తన స్వశక్తిని నమ్ముకుంటానని చెబుతాడు. మేఘమాల, రాజు పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో పాటలు భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాటలు పాడారు.

  • అందాల మేఘమాల , రచన: భువన చంద్ర, గానం. కె ఎస్ చిత్ర
  • కొ క్కొ కొబ్బరి బోండాం , రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • గంగిగోవు లాంటి వాణ్ణి , రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర స్వామి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • చల్ల చల్లని గాలుల్లో , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,కె యస్ చిత్ర
  • జానా బెత్తెల , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

మూలాలు

[మార్చు]
  1. "యూట్యూబులో కొబ్బరి బోండాం సినిమా". youtube.com. Retrieved 23 October 2017.