కొలాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొలాములు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదిమజాతి తెగ. వాళ్ళ భాషలో "కొలావర్లు"(kolavars) అని వ్యవహరిస్తారు. తెలుగు ప్రాంతాలలో వీరిని మన్నెవార్లు అని, మారాఠీ ప్రాంతాలలో కొలాములు అని వ్యవహరిస్తారు. కొలాములు గోండి భాషకు దగ్గరగా ఉండే మధ్య ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన కొలామీ భాషను మాట్లాడతారు. గోండులతో, పరధానులతో మాట్లాడేటప్పుడు కొలాములు గోండీలో మాట్లాడతారు. కొలాములలో చాలా మందికి గోండీ భాషపైన మంచి పట్టు వుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని తూర్పు ప్రాంతపు కొలాములు ఇప్పుడు వాళ్ళ భాషను పూర్తిగా వదిలేసి తెలుగులోనే మాట్లాడుతుంటారు. అలాగే మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకాలోని కొలాములు మరాఠీ మాట్లాడతారు.

కొలాములు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 1981 జనగణన ప్రకారం మహారాష్ట్రలో నివసించే కొలాముల జనాభా 1,18,073. అందులో 58,772 మంది స్త్రీలు, 59,301 మంది పురుషులు. కొలాములు ప్రధానంగా యావత్మల్, నాందేడ్, చంద్రపూర్, ఘడ్‌చిరోలీ, వార్ధా జిల్లాలలోనూ నివసిస్తున్నారు. అందులో కూడా 86% జనాభా యావత్మల్, నాందేడ్ జిల్లాలలోనే కేంద్రీకృతమై ఉన్నారు.[1] 1991 జనగణన ప్రకారం అదిలాబాదు జిల్లాలో వీరి జనాభా 41,254.[2]

కొలాములు తాము మహాభారతంలో పాత్రలైన భీముడు, హిండింబిల సంతతని భావిస్తారు. కొలాములు హిడింబిని తమ కులదైవతగా, భీముని ఆదిదేవునిగా పూజిస్తారు. భీముని కళ్యాణాన్ని (భీమ్యక్ లగ్న) పండగగా జరుపుకుంటారు. వీరికి అదిలాబాదు జిల్లా ప్రాంతాలలో నివసించే ఇతర తెగలైన గోండులు, ప్రధానులు, తోటీలతో పరస్పర సత్సంబంధాలు ఉన్నాయి.[2]

సామాజిక జీవనం[మార్చు]

కొలాములు ప్రధానంగా ఆ సమూహంలో ఉన్న వాళ్ళను కాకుండా, బయటి సమూహాలకు చెందిన కొలాములనే పెళ్ళి చేసుకుంటారు (Exogamy). కొలాముల గణదేవత "ఆయక", గోండీలో "భీమల్" అని వ్యవహరిస్తారు. సంరక్షిత అటవీప్రాంతాల పేరుతో బలవంతంగా గెంటేసిన ఆదివాసుల్లో కొలాములు కూడా వున్నారు.[3] అలా చెల్లాచెదురైన కొలాములు ఏ పండుగకో, పబ్బానికో సంరక్షిత అటవీప్రాంతంలోని వీరి గత జీవితానికి అవశేషాలుగా మిగిలిపోయిన ఆయక గణదేవత ఆలయంలో కలుసుకుంటారు. ప్రార్థనలు మన్నించి, ఆపదలలో ఆదుకొనే దేవతగా కొలాములు ఆయక గణదేవతను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ దేవాలయాల సంరక్షణ ఆ సమూహంలోని పూజారి బాధ్యత. దేవతల కోపాలు చల్లార్చడంలో, జరగబోయేది ముందుగా చెప్పడంలో కొలాములు ఆరితేరిన వారని గోండ్లు నమ్ముతారు. అందుకే తమ పండుగలు, కృతువులు, కొండదేవత, అడవిదేవత పూజలు జరిపించే బాధ్యతను కొలాములకే అప్పజెప్పుతారు. ఈ కారణంగానే కొలాము తెగను గోండులు "పూజారి" అని వ్యవహరిస్తారు.

కొలామీ భాష[మార్చు]

కొలాములు మాట్లాడే కొలామీ భాష, మధ్య ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాష. ఈ భాషకు ప్రస్తుతానికి లిపి లేదు. కొలామీ భాషను ఒక ప్రత్యేక ద్రవిడ భాషగా తొలుత భాషావేత్త జి.ఏ.గ్రియర్‌సన్ గుర్తించాడు. మధ్య ద్రవిడ భాషగా కొలామీ, గదబ, నాయికీ మరియు పర్జీ భాషలకు దగ్గరగా ఉంటుంది.[4] కొలామీ భాషలో నాలుగవ వంతు పదాలు మరాఠీ నుండి అరువు తెచ్చుకున్నప్పటికీ, ఈ భాషకు తెలుగు, కన్నడ భాషలతో సారూప్యత ఉన్నది. కొన్ని విషయాలలో ఇది తెలుగును, మరికొన్ని విధాలుగా కన్నడను పోలి ఉంటుంది. గ్రియర్‌సన్, మండావ్‌కర్ వంటి భాషావేత్తలు కొలామీ భాష కన్నడ, తెలుగు భాషలకు ఉమ్మడి మాతృక అయిఉండవచ్చని భావిస్తున్నారు.[5] ఈ భాషకు ముఖ్యంగా మూడు మాండలికాలు ఉన్నాయి. అవి అదిలాబాదు, నాయిక్రీ, వార్ధా మాండలికాలు.[4] కొలామీ భాష యునెస్కో ప్రకటించిన అంతరించిపోతున్న భాషల్లో ఒకటి.[6] కొలామీ మాతృభాషగా మాట్లాడే వారి సంఖ్య క్రమంగా క్షీణిస్తుంది. నాగరికత వ్యాప్తి వలన కొలామీలు హెచ్చుసంఖ్యలో మరాఠీ, తెలుగు భాషలను ఉపయోగిస్తున్నారు.

కొలామీ భాషపై పరిశోధన చేసి పగిడి సేతుమాధవరావు 1950లో కొలామీ భాష యొక్క వ్యాకరణాన్ని ప్రచురించాడు. ఆ తరువాత 1950-51లలో ఆక్స్‌ఫర్డుకు చెందిన ఆచార్యుడు టి.బర్రో మరియు ఆంత్రొపాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి చెందిన సిద్ధిభూషన్ భట్టాచార్యలు అనేక గ్రామాలలో కొలామీ భాషా పదాలను సేకరించారు[7] ఎమెనూ 1937-38లో వార్ధాకు 19 మైళ్ల దూరంలో ఉన్న మండ్వా గ్రామంలో ఈ భాషకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాడు. అందుకే ఆయన సేకరించిన మాండలికానికి వార్ధా మాండలికం అని పేరుబడింది. ఎమెనూ వార్ధా మాండలికంతో పాటు సేతుమాధవరావు సేకరించిన అదిలాబాదు మాండలికం యొక్క వివరాలతో పాటు, బర్రో, భట్టాచార్యలు సేకరించిన సమాచారం ఆధారంగా కిన్వట్, పంఢర్‌కవ్రా మాండలికాల సమాచారాన్ని పొందుపరచాడు.[4] ముర్రే ఎమెనూ 1955లో కొలామీ - ఏ ద్రవిడియన్ లాంగ్వేజ్ అనే పుస్తకంగా ప్రచురించాడు.[7]

మూలాలు[మార్చు]

  • ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు
"https://te.wikipedia.org/w/index.php?title=కొలాములు&oldid=2035314" నుండి వెలికితీశారు