Jump to content

కోహిర్

అక్షాంశ రేఖాంశాలు: 17°36′00″N 77°43′00″E / 17.6000°N 77.7167°E / 17.6000; 77.7167
వికీపీడియా నుండి
కోహిర్
—  రెవెన్యూ గ్రామం  —
కోహిర్ is located in తెలంగాణ
కోహిర్
కోహిర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°36′00″N 77°43′00″E / 17.6000°N 77.7167°E / 17.6000; 77.7167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండలం కోహిర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 15,075
 - పురుషుల సంఖ్య 7,446
 - స్త్రీల సంఖ్య 7,629
 - గృహాల సంఖ్య 3,082
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కోహిర్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3082 ఇళ్లతో, 15075 జనాభాతో 2686 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7446, ఆడవారి సంఖ్య 7629. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3398 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 104. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 573385[3].పిన్ కోడ్: 502210.

పూర్వ చరిత్ర

[మార్చు]

నేడు కోహీర్‌గా పిలుస్తున్న ఈ ఊరు ఒకనాడు ఓంకార పట్టణంగా విలసిల్లింది. ఈనేలపై కొలువైన ఓంకారేశ్వరుడి పేరు మీదనే.. ఊరిపేరు ప్రసిద్ధికెక్కినట్టు చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం 3700 సంవత్సరంలో కపిల వంశీయుడైన శ్రీ సుదర్శన చక్రవర్తి దండకారణ్య రాజ్యాన్ని ఓంకార పట్టణం రాజధానిగా పాలన సాగించాడట. అనేక తరాలు మారిన పిదప.. ఈ పట్టణం కాకతీయుల స్వాధీనంలోకి వెళ్లింది. వారి పాలనలో అద్భుత శిల్పకళా సంపదతో, ముఖ్య పట్టణంగా విలసిల్లినట్టు ఇక్కడ వెలువడిన శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. ఓంకారేశ్వర ఆలయం సమీపంలో ఉన్న వీరగల్లు విగ్రహం.. కాకతీయుల పాలనకు ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడ దొరికిన మరిన్ని శిలాసంపదల్ని పరిశీలిస్తే.. జైనమతం కూడా ప్రాచుర్యంలో ఉన్నట్టు అవగతమవుతుంది.

కోహీర్‌గా మారిన ఓంకారపట్టణం

[మార్చు]

సా.శ. 1323లో ప్రతాపరుద్రుని ఓడించిన ఢిల్లీ సుల్తానులు ఈ ఓంకార పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. అనంతరం హైదరాబాద్ పాలకుడు మహ్మద్ కులీ కుతుబ్‌షా, బీదర్ రాజు అలీబరీర్‌ను ఓడించి.. ఈ ప్రాంతాన్ని జయించాడు. చాలా ఏళ్లపాటు ముస్లిం రాజుల ఏలుబడిలో కొనసాగిన ఓంకార పట్టణం.. కోవూరుగా పేరు మార్చుకుంది. అనంతరం బ్రిటీష్‌వారి కాలంలో కోహీర్ దక్కన్‌గా స్థిరపడిపోయింది. అయితే ఈ పేరు మార్పుపై ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడికి వలసవచ్చిన మౌలానా మొయిజొద్దిన్.. శీతాకాలంలో ఆకులపై పడిన మంచుబిందువులు సూర్యరశ్మికి మెరవడం చూసి.. ఏ కొహర్ కిత్నా అచ్చా హై అని మురిసిపోయాడట. పారశీక భాషలో కొహర్ అంటే తుషారమని అర్థం. ఆ కొహరే, కోహీరుగా మారిందని చెబుతారు.

మహమ్మదీయుల రాక

[మార్చు]

దేవగిరి రాజులు బలహీనపడటంతో మహ్మదీయులు మెల్లగా ఓంకార పట్టణంలోనికి ప్రవేశించారు. ఊరు చివర అనుచరులతో కలిసి నివాసం ఏర్పర్చుకున్న మౌలానా మొయిజుద్దీన్ మరణించాక, ఆయన గుర్తుగా అక్కడ మౌలానా మొయిజుద్దీన్ దర్గా ఏర్పడింది. ఇక్కడ ఏటా ఉర్సు నిర్వహిస్తారు. నిజాం అనుచరుడు సిద్ధిఖ్‌హిలాల్ చేసిన విధ్వంసానికి గుర్తుగా.. నాటి పాలకుడు సదాశివరెడ్డి ఈ దర్గా సమీపంలో నిర్మించిన గాయ్‌గుమ్మజ్‌ను చూడొచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు కోహిర్ హైదారాబాదు సంస్థానంలోని బీదర్ జిల్లాలో భాగంగా ఉండేది. పూర్వం ఈ ఊరికి ఓంకారము, అహంకారపట్టణం అనే పేర్లు ఉండేవి.ముస్లిం పాలనలో ఇది కోహిర్ గా నామకరణం చేయబడింది.ఈ పట్టణంలో అనేక మసీదులతో పాటు ఇద్దరు మహమ్మదీయ సంతుల దర్గాలు కూడా ఉన్నాయి. ప్రసిద్ధ హజరత్ అలీ దర్గాలో ప్రతి సంవత్సరం అక్టోబరు-నవంబరు కాలంలో ఉరుసు నిర్వహిస్తారు. ఈ ఉరుసుకు సుమారు ఐదు వేల దాకా భక్తులు హాజరౌతారు.[4] బహమనీ సుల్తానుల పాలనలో కట్టించిన జమా మసీదు చెప్పుకోదగిన కట్టడం.[5] కోహిర్ అనగానే ఎర్రమట్టి కట్టిన ఇళ్ళు, ఎర్రమట్టి రోడ్లు, ఎర్రని రంగు రాళ్ళు జ్ఞప్తికి వస్తాయి. అంతా ఎరుపు మయమైన ఈ పరిసరాల వళ్ళే కోహిర్ (స్థానిక మాండలికంలో ఎర్రటి వజ్రం అని అర్ధం) అన్న పేరువచ్చింది ఈ ఊరికి. పేరుకు తగ్గట్టుగానే ఈ పాటిమట్టిని నీళ్లతో కలిపితే వజ్రంలా దృఢంగా ఉండే అనేక అంతస్తుల ఇళ్ళు కట్టగల పదార్థం తయారౌతుంది. కోహిర్ మట్టి ఇళ్ళు ఈ ప్రాంతపు తీవ్రవాతావరణాన్ని బాగా తట్టుకొని దృఢంగా ఉన్నాయి. ప్రధానంగా ముస్లింలు నివాసముంటున్న ఈ గ్రామంలో నిజాం కాలంలో కట్టిన హవేలీలు అనేకం ఇప్పటికీ నివాసయోగ్యంగా ఉన్నాయి.

ఆ కాలంలోనే బడి, పొగబండి..

[మార్చు]

కోహీర్ దక్కన్ మీదుగా 1920లోనే రైలు కూత పెట్టింది. బీదర్- వికారాబాద్ మధ్య రైలు మార్గాన్ని బ్రిటీషువారు వేశారు. ఎక్కువగా గూడ్సు రైళ్లకోసమే ఈ లైన్‌ను ఉపయోగించేవారట. కాలక్రమంలో అనేక ఎక్స్‌ప్రెస్‌రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఈ మార్గం ద్వారా వెళ్లడం ప్రారంభించాయి. 1952లో ఈ పరగణాలో ఉన్నత పాఠశాల ఏర్పడింది. హోంశాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్, మాజీ ఎంపీ ఎం.బాగారెడ్డి, కర్ణాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు తదితర ప్రముఖులు ఇక్కడ విద్య అభ్యసించారు.

ఇక్కడి ఎర్రమన్ను ప్రత్యేకత

[మార్చు]

కోహీరు మన్ను కోహీనూరు వజ్రమంత దృఢమైందని అంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఇక్కడి మట్టికి అంతటి జిగి.. పకృతి వరంగా అబ్బినదే. ఇక్కడ పండించే అల్లం కూడా నేటికీ కోహీర్ అల్లంగానే మార్కెట్‌లో ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడి ఎర్ర జామపండుకున్న టేస్టు మరెక్కడా దొరకదు. కోహీర్ జామపండుగా ప్రపంచమంతా అది సుపరిచితమే!

మంజీరాకు ప్రతిరూపం నారింజ..

[మార్చు]

జిల్లావ్యాప్తంగా పరవళ్లు తొక్కే మంజీరా నదికి ప్రతిరూపమైన నారింజవాగు.కోహీర్ పరిసరాల్లోనే పుట్టడం విశేషం. బిలాల్‌పూర్‌లో వెలిసిన మునేశ్వరుడి పాదాల దగ్గర పుట్టిన నారింజవాగు, కోహీర్ చుట్టూ అర్ధచంద్రాకారంలో ప్రవహించి.అనంతరం కర్ణాటకలోకి ప్రవేశించి మంజీరాలో కలుస్తుంది.కోహిర్ పట్టణంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి, వారం వారం జరిగే మార్కెట్, వ్యవసాయ సరఫరా కేంద్రం, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, మండల కార్యాలయం వంటి సదుపాయాలు ఉన్నాయి.కోహిర్ మామిడిపండ్లకు, జామ పండ్లకు ప్రసిద్ధి.కోహిర్ పేరు మీద కోహిర్ అనే మామిడిరకం, జామరకం కూడా ఉన్నాయి.[6]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల జహీరాబాద్లోను, ఇంజనీరింగ్ కళాశాల సంగారెడ్డిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల సంగారెడ్డిలోను, పాలీటెక్నిక్ రంజొలెలోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం సంగారెడ్డిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

కోహిర్లో ఉన్న మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఆరుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

కోహిర్లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

కోహిర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 190 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2496 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2428 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 67 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

కోహిర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 67 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

కోహిర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమిలో వాణిజ్య పంటలైన అల్లం ఆలుగడ్డ అరటి చెరుకు మొక్కజొన్న వంటి పంటలను పుష్కలంగా పండిస్తున్నారు ఇక్కడి తోటలలో పండే మామిడి మరియు జామ బీదర్ హైదరాబాదు వంటి నగరాలలో భాగ ప్రసిద్ధి నీటి సౌకర్యం లేని భూభాగాలలో వర్షాదారిత పంటలైన కంది మినుము పెసర పత్తి వంటి పంటలను విరివిగా పండిస్తున్నారు

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

నూనె

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-09.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. http://www.indiatours.org.in/tourist-destinations/andhra-pradesh.html
  5. Imperial gazetteer of India ..., Volume 15 By Sir William Wilson Hunter, Sir Richard Burn, Great Britain. India Office
  6. Underutilized and Underexploited Horticultural Crops:, Volume 3 By K.V. Peter

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోహిర్&oldid=4342623" నుండి వెలికితీశారు