క్లియోపాత్రా
క్లియోపాత్రా VII ఫిలోపేటర్ (జనవరి 69 BC - 10 లేదా 12 ఆగస్టు 30 BC) ఈజిప్టులోని టోలెమిక్ రాజ్యానికి రాణి. 51 నుండి 30 BC వరకు తండ్రి నుండి అధికారాన్ని పొందిన క్లియోపాత్ర రాణిగా 20 ఏళ్లు ఈజిప్టు రాజ్యాన్ని పాలించింది. ఆమె ఈజిప్టుకు చిట్టచివరి ఫారో(Pharaoh).[1]
క్రీ. పూ. 69లో రాజవంశంలో పుట్టింది క్లియోపాత్ర. ఆమె తండ్రి ఈజిప్టు రాజు 12వ టాలెమీ. టోలెమిక్ రాజవంశానికి చెందిన ఆమె మరణం తరువాత, ఈజిప్ట్ రోమన్ సామ్రాజ్యం ప్రావిన్స్‌గా మారింది. ఆమె మాతృభాష కొయిన్ గ్రీకు, ఈజిప్టు భాషను నేర్చుకున్న ఏకైక టోలెమిక్ పాలకురాలు ఆమె.
జీవిత చరిత్ర
[మార్చు]రోమన్లు క్లియోపాత్రా తండ్రి టాలెమీని బందీ చేసి ఈజిప్టుని ఆక్రమించారు. దాంతో ఆయన పెద్ద కూతురు బెరినైస్ రోమన్ల సహకారంతో వారి సామంతరాణి అయ్యింది. ఇలా తండ్రిని మోసం చేసినందుకు తన చెల్లెలు క్లియోపాత్రా తనకు పక్కలో బల్లెమవుతుందేమోనని బెరినైస్కి భయం పట్టుకుంది. అందకుని తన సోదరిని అంతఃపురంలో బంధించి కట్టుదిట్టం చేసింది. కానీ అనూహ్యంగా తిరిగి రోమన్ల బిక్షతో టాలెమీ రాజయ్యాడు. ఆ వెంటనే రాజద్రోహానికి పాలుబడ్డ బెరినైస్ తలని నరికించాడు.
తండ్రి, అక్కల మధ్య సాగిన రాజకీయ చదరంగాన్ని కళ్లారా చూసినా క్లియోపాత్రా భయపడలేదు. తానూ రాణిని అవ్వాలని కలలు కన్నది. అయితే పర్యవసానం ఎలా ఉంటుందో తెలిసి ఈ విషయన్ని క్లియోపాత్రా అత్యంత గోప్యంగా ఉంచింది. రోమన్సైన్యం ఈజిప్టులో కవాతు చేసే సమయంలో రోమన్ యోధుడు, అందగాడైన మార్క్ ఆంటోని పై మనసుపడ్డా క్లియోపాత్ర బయటపడలేదు.
క్రీ.పూ. 51లో క్లియోపాత్రా తండ్రి 12వ టాలెమీ మరణించాడు. ఇక రాణి కావడానికి క్లియోపాత్రాకి మార్గం సుగమమం అయింది. అయితే ఈజిప్షియన్ రాజవంశ ఆచారం ప్రకారం తన తమ్ముడు 13వ టాలెమీని పెళ్లి చేసుకొని పాలనా పగ్గాలు ఇవ్వాల్సిరావడం క్లియోపాత్రకి అసలు నచ్చలేదు.
అయినా తమ్ముణ్ణి వివాహమాడి తాను రాణై, అతడు రాజై పాలన ప్రారంభించింది. కానీ పెత్తనమంతా తనదే కావాలని తమ్ముణ్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. అంతేకాకుండా ఈజిప్టు అంతా తనకే కావాలని రోమన్లపైనే ఎదురు తిరిగింది. కానీ ఇది బెడిసికొట్టి రోమన్ సైనిక దళాలు క్లియోపాత్రను గద్దెదించాయి. పైగా 13వ టాలెమీకి సకల అధికారాలూ అందాయి.
ఇక అక్కడ బానిసగా బతకడం ఇష్టం లేక తన అనుచరులతో కలిసి ఆమె ఈజిప్టుని వదిలి పారిపోయింది. రాజ్యాన్ని భోగాన్ని వదిలి భీకర వాతావరణంలో తిండి తిప్పలు లేకుండా గడిపింది. ఓటమిని అంగీకరించే వ్యక్తికాదామె. అందుకే నేరుగా రోమన్ అధినేత జులియస్ సీజర్‌కే వలవేయాలనుకుంది. దానికోసం క్లియోపాత్రా ఓ పన్నాగంపన్నింది.
తన సహచరులను ఓ అందమైన తివాచీ తెమ్మంది. అందులో ఆమె పడుకొని చాపలా తనను చుట్టమంది. ఆ తివాచీని జులియస్ సీజర్ వద్దకు చేర్చమంది. ఒక్కో పొరనూ విప్పుకొంటూ ఆయన కాళ్లదగ్గర మోకరిల్లింది. ఆ సౌందర్యరాశిని చూసేసరికి జులియస్ సీజర్ పరవశుడైపోయాడు. ఆమె అందానికి బానిసైపోయాడు. ఆమె చెప్పిన మాటలకు తల ఆడించడం మొదలుపెట్టాడు.
ఇదే అదనుగా టాలెమీపై యుద్ధం ప్రకటించడం, అతన్ని ఓడించడం, చివరకు మరణించేలా 22 ఏళ్ళ క్లియోపాత్రా చేసింది. ఆ తరువాత ఆమె ఈజిప్టు అధినేత్రి.అవడమేకాక రోమన్ చక్రవర్తి జులియస్ సీజర్‌కి భార్య కూడా అయింది.
అయితే అప్పుడే తెలుసుకుంది తన తొలి ప్రియుడు ఆంటోనీ ఎవరో కాదు - తన భర్తకి కుడి భుజం అని! కాలక్రమంలో క్రీ. పూ. 44లో జులియస్ సీజర్ని కుట్రదారులు చంపేశారు. రోమన్ ప్రాంతానికి ఆంటోనీ రాజయ్యాడు. సైనిక సాయం కావాలంటూ ఈజిప్టు రాణి క్లియోపాత్రాకి వర్తమానం పంపించాడు. సరిగ్గా 14 ఏళ్ళ కిందటి తన ప్రియుడు - తనంతట తానే స్నేహహస్తం సాచినట్టయింది. దీంతో ఆమె సువర్ణ తాపడాలతో, జిగేల్మనే అలంకరణలతో, సంగీత మేళాలతో, లెక్కలేనన్ని బహుమతులతో, పిల్లంగ్రోవి వాద్యకారులతో కూడిన ఓడలో అక్కడికి చేరింది. ఓడదిగి రతీదేవిలా నడిచి ఆంటోని ఎదుట నిలిచింది.
రెప్పపాటు కాలంలో ఆమెకు పరవశుడైపోయాడు. జీవితాంతమూ ఆమెకు బానిసైపోయాడు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. ఆంతరంగిక శత్రువులు ఆంటోనీపై పగబట్టారు. చేసేది లేక ఆంటోని కత్తితో తనను తాను పొడుచుకొని, ఆమె ఒడిలో కన్నుమూశాడు. ప్రియుడు లేనిదే జీవితం లేదనుకున్న 39 వయసులో క్లియోపాత్రా తాచుపాముతో తన వక్షస్థలంపై కాటు వేయించుకొని కన్నుమూసింది.
చిత్రమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Cleopatra | Biography, Beauty, History, Death, & Facts | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-14.