ఖడ్గవీరుడు (1962 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖడ్గ వీరుడు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ఆర్. రఘునాధ్
తారాగణం శివాజీ గణేశన్,
జమున ,
కరుణానిధి,
కన్నాంబ,
శ్రీరామ్
సంగీతం ఎస్.వి. వెంకట్రామన్
నిర్మాణ సంస్థ గణేశ్ ప్రసాద్ మూవీస్
భాష తెలుగు

ఇది ఒక డబ్బింగ్ సినిమా. మారుత నట్టువీరన్ అనే తమిళ సినిమా దీనికి మూలం. ఈ సినిమా 1962, ఫిబ్రవరి 2న విడుదలయ్యింది.

నటీనటులు[మార్చు]

  • శివాజీ గణేశన్ - రవీంద్ర
  • జమున - రత్న
  • కన్నాంబ - రవీంద్ర తల్లి
  • వీరప్ప - వీరకేశి
  • శ్రీరామ్‌ - ప్రతాప్
  • కరుణానిధి - రవీంద్రుని స్నేహితుడు
  • సంధ్య - మహారాణి
  • ఎం.సరోజ
  • ఎల్.విజయలక్ష్మి
  • శాంతి
  • జ్యోతి

సాంకేతికవర్గం[మార్చు]

  • మాటలు, పాటలు: ఆరుద్ర
  • సంగీతం: ఎస్.వి.వెంకట్రామయ్యర్
  • ఛాయా గ్రహణం:ఆర్.సంపత్
  • దర్శకుడు:టి.ఆర్.రఘునాథ్

కథ[మార్చు]

ఓరుగల్లు సమీపంలో రవీంద్రుడనే వీరుడు నివస్తిస్తుంటాడు. అతని తండ్రి ఓరుగల్లు కోటలో ప్రభుత్వోద్యోగిగా పనిచేసి యుద్దరంగంలో వీరస్వర్గమలంకరించాడు. తండ్రి ఆశయాలను రవీంద్రుడు ఆచరణలో పెట్టదలచి, తల్లి ఆశీర్వాదంతో తన దేశభక్తిని ప్రకటించుకోవడానికి సైన్యంలో చేరనిశ్చయించుకుంటాడు. రాజధానిలో అడుగుపెడుతూనే రవీంద్రుని చూసిన రాజకుమారి రత్న అతడిని ప్రేమిస్తుంది. ఆమె సహాయంతో కొలువులో ఉద్యోగం సంపాదిస్తాడు. రాజుగారి రెండవభార్య తమ్ముడు వీరకేశి రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి పరదేశపు రాజులతో కుట్రలు పన్నుతుంటాడు.

స్వర్ణగిరిని పాలిస్తున్న అల్లావుద్దీన్‌ను అతని తమ్ముడు బహావుద్దీన్ పదవీభ్రష్టున్ని చేసి సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. అల్లావుద్దీన్, తన కుమార్తె ఆషాతో కలిసి ఓరుగల్లు చేరుకుని రవీంద్రుని ఇంటిలో దాచుకుంటాడు.

తన అన్న అల్లావుద్దీన్‌ను పట్టి అప్పగిస్తే తాను ఓరుగల్లుపై దండయాత్ర చేసి సింహాసనం వీరకేశికే ఇవ్వగలనని బహావుద్దీన్ మంతనాలు ప్రారంభిస్తాడు. దానికి వీరకేశి అంగీకరిస్తాడు.

రవీంద్రునిపై అన్యాయంగా రాజద్రోహం ఆరోపించి ఉరిశిక్ష విధించేలా వీరకేశి పన్నాగం పన్నుతాడు. రవీంద్రుని ఇంటిలో ఉన్న అల్లావుద్దీన్ వీరకేశికి చిక్కుతాడు. కానీ రవీంద్రుడు చెర నుండి తప్పించుకుని ఆషాను, అల్లావుద్దీన్‌ను కాపాడి నది అవతలి ఒడ్డుకు తీసుకుపోతాడు. వాళ్ళను అప్పగించకపోతే తల్లిని నదిలోకి తోస్తానని వీరకేశి బెదిరించినా రవీంద్రుడు లొంగకపోవడంతో ఆమెను నదిలోనికి త్రోసివేస్తాడు. రవీంద్రుడు తల్లిని కాపాడుకునేందుకు నదిలోకి దూకుతాడు కానీ తల్లి కనిపించలేదు. దుఃఖంతో ఒడ్డుకు చేరుకున్న రవీంద్రుని అల్లావుద్దీన్, ఆషాలు ఓదారుస్తారు. ముగ్గురూ మారువేషాలలో పల్నాటి ప్రభువు ప్రతాప్ దగ్గరికి చేరి ఉద్యోగాలు సంపాదిస్తారు. ప్రతాప్‌కు వారి అసలు రూపాలు తెలిసి వారికి అభయమిస్తాడు. వీరకేశి రాకుమారి రత్నను ప్రతాప్‌కు ఇచ్చి వివాహం చేయ నిశ్చయిస్తాడు. రవీంద్ర రత్నలు ప్రేమించుకున్న సంగతి తెలిసిన ప్రతాప్ అందరి కళ్ళూ కప్పి వారిద్దరికి వివాహం చేస్తాడు. కానీ ఆ విషయం ఆ ముగ్గురికి తప్ప ఎవరికీ తెలియదు. ప్రతాప్ రత్నలు పల్నాడు వెళుతుండగా దారికాసి ప్రతాప్‌ని చంపి రత్నను చెరబట్టవచ్చని బహావుద్దీన్‌కు కబురు చేస్తాడు వీరకేశి. ప్రతాప్, మారువేషంలో ఉన్న ఆషాతో పల్లకీలో బయలుదేరుతాడు. ఈ సంగతి తెలియని బహావుద్దీన్ సేన ఆషాను ఎత్తుకుపోయి బహావుద్దీన్‌కు సమర్పిస్తారు. అన్నకూతురు ఆషాను చూసి బహావుద్దీన్ మండిపడతాడు. వీరకేశిని నిందిస్తాడు. ప్రతాప్‌ని చెరసాలలో బంధించి అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారన్న వార్త విని రవీంద్ర పల్నాడు బయలుదేరుతాడు. రవీంద్ర లేని సమయం చూసుకుని గర్భవతి అయిన రత్నను పతిత అని నిందమోపి దేశ బహిష్కరణ చేస్తాడు వీరకేశి. అల్లావుద్దీన్ ద్వారా మహారాజు నిజం తెలుసుకుంటాడు. వీరకేశి మహారాజుని చంపి అక్కను, అల్లావుద్దీన్ ను చెరసాలలో బంధించి తనే రాజు అని ప్రకటించుకుంటాడు. అతనికి కుట్రలో సహాయం చేసిన ఉద్యోగిని కూడా చంపబోతే అతడు చనిపోతూ మహారాణికి వీరకేశి కుట్రలు బయటపెట్టి, అల్లావుద్దీన్ పెంపుడు కూతురైన ఆషా ఆమె కుమార్తె అని పుట్టగానే చంపివేయమని వీరకేశి ఇవ్వగా అల్లావుద్దీన్‌కు ఇచ్చినట్లు చెప్పి మరణిస్తాడు.

ఇంత కథ నడిచేసరికి రత్న బెస్తగూడెంలో బిడ్డను ప్రసవిస్తుంది. రవీంద్రుని తల్లి కూడా రక్షింపబడి ఆ గూడెంలోనే ఉంటుంది. అక్కడికి రవీంద్ర కూడా చేరుకొనే లోపల వీరకేశి రవీంద్ర తల్లిని గాయపరచి రత్నను, బిడ్డను ఎత్తుకుపోతాడు. సంగతి తెలిసిన రవీంద్ర మండిపడతాడు. అతని తల్లి అతని నుదుట రక్తతిలకం దిద్ది కోడలిని రక్షించమని కోరి మరణిస్తుంది. రవీంద్ర, ప్రతాప్‌లు కలిసి వీరకేశిని తుదముట్టిస్తారు. చివరకు అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమౌతుంది[1].

పాటలు[మార్చు]

  1. అందముగా ముచ్చటగా - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆరుద్ర
  2. పరువం పలుకరించు - ఘంటసాల - రచన: ఆరుద్ర
  3. వలపుల బాట కమ్మగ పూచె - ఘంటసాల, సుశీల - రచన: ఆరుద్ర
  4. సమానత్వమే ఎపుడు - ఘంటసాల - రచన: ఆరుద్ర
  5. కన్నీరే మున్నీరై తనవారే పగవారై .. అంతా విధిలీలా అమ్మా - పి.బి.శ్రీనివాస్
  6. తీరనిదొక సందేహం తీర్చు అమ్మణీ అది తీరకున్న - అప్పారావు, కె. రాణి
  7. మృదువైనవాడు ఒక వన్నెకాడు కనువిందు చేసి వలపించునే - పి.సుశీల
  8. సలాం సలాం హే షాహింషా చిన్నది నటించును వన్నెలు - పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. ఎస్. (11 February 1962). "ఖడ్గవీరుడు చిత్ర సమీక్ష". ఆంధ్రప్రభ దిన పత్రిక. Retrieved 19 February 2020.[permanent dead link]