ఖలీల్ జిబ్రాన్
ఖలీల్ జీబ్రాన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | జుబ్రాన్ ఖలీల్ జుబ్రాన్ 1883 జనవరి 6 బ్షార్రీ, లెబనాన్ ముతసర్రిఫేట్ పర్వతం, ఒట్టోమాన్ సిరియా |
మరణం | 1931 ఏప్రిల్ 10 న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ | (వయసు 48)
వృత్తి | కవి, చిత్రకారుడు, రచయిత, తత్త్వవేత్త, ధార్మికవేత్త, విజువల్ ఆర్టిస్టు |
జాతీయత | లెబనీస్, అమెరికన్ |
రచనా రంగం | కవిత్వం, పారాబుల్ (దీర్ఘ వచనం), చిన్న కథ |
సాహిత్య ఉద్యమం | మహ్జార్ |
గుర్తింపునిచ్చిన రచనలు | ది ప్రాఫెట్, బ్రోకెన్ వింగ్స్ |
ఖలీల్ జిబ్రాన్ (/dʒɪˈbrɑːn/;[1] పూర్తి అరబిక్ పేరు జిబ్రాన్ ఖలీల్ జిబ్రాన్ (జుబ్రాన్ ఖలీల్ జుబ్రాన్ అనీ పలకవచ్చు) (అరబ్బీ: جبران خليل جبران / Jubrān Khalīl Jubrān or Jibrān Khalīl Jibrān) (1883 జనవరి 6 – 1931 ఏప్రిల్ 10) లెబనీస్-అమెరికన్ రచయిత, కవి, చిత్రకారుడు.
జిబ్రాన్ ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని లెబనాన్ ముతసర్రిఫేట్ పర్వత ప్రాంతం (ప్రస్తుతం లెబనాన్‌లో భాగం) బ్షార్రీ పట్టణంలో[2] ఖలీల్ జిబ్రాన్, కమిలా జిబ్రాన్ (రహ్మెహ్) దంపతులకు జన్మించాడు. చిన్నవయసులోనే జిబ్రాన్ తన కుటుంబంతో పాటు అమెరికా వలసవెళ్ళి అక్కడ కళను అభ్యసించి, ఆంగ్ల, అరబిక్ భాషల్లో సాహిత్య రచన ప్రారంభించారు. అరబ్ ప్రపంచంలో, జిబ్రాన్ సాహిత్యంలోనూ, రాజకీయంలోనూ తిరుగుబాటుదారునిగా పేరొందాడు. అతని కాల్పనికవాద శైలి ఆధునిక అరబిక్ సాహిత్య పునరుజ్జీవనంలో కేంద్ర స్థానం పొందింది. అప్పటివరకూ ఉన్న సంప్రదాయ శైలి నుంచి ఖలీల్ జిబ్రాన్ శైలి విడిపోయి ప్రత్యేక మార్గాన్ని ఏర్పరిచింది. లెబనాన్‌లో ఆయనను ఇప్పటికీ సాహిత్యంలో హీరోగా భావిస్తారు.[3]
1923లో వెలువడ్డ ఖలీల్ జిబ్రాన్ రచన ద ప్రాఫెట్ (అనువాదం: ప్రవక్త) అతనికి ఆంగ్ల-భాషా ప్రపంచంలో ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. ద ప్రాఫెట్ పుస్తకం ఆంగ్ల సాహిత్యంలో స్ఫూర్తిదాయకమైన కల్పనాత్మక రచనలకు తొలినాళ్ళ ఉదాహరణగా నిలుస్తోంది. దీనితోపాటుగా కవితాత్మకమైన ఆంగ్ల వచనంలో అతను రాసిన తాత్త్విక వ్యాసాలు ప్రాచుర్యం పొందాయి. విమర్శకులు పుస్తకం పట్ల పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా మంచి పాఠకాదరణ పొందింది. 1930ల్లోనూ, తిరిగి 1960ల నాటి కౌంటర్ కల్చర్‌లోనూ ద ప్రాఫెట్ బాగా ఆదరణ పొందింది.[3][4] షేక్స్‌పియర్, లోజీల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతిఎక్కువగా అమ్ముడైన పుస్తకాలు రాసిన కవుల్లో జిబ్రాన్‌ది మూడోస్థానం.[4]
జీవితం, వృత్తి
[మార్చు]తొలినాళ్ళ జీవితం
[మార్చు]జిబ్రాన్ అప్పటికి ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని పాక్షిక స్వయంపాలిత ప్రాంతమైన ఉత్తర మౌంట్ లెబనాన్ ప్రాంతంలో చారిత్రక పట్టణమైన బ్షార్రీలో మారోనైట్ కేథలిక్ కుటుంబంలో జన్మించాడు.[5] అతని తల్లి కమిలా ఒక మతాచార్యుడి కూతురు, జిబ్రాన్ జన్మించేనాటికి ఆమెకు ముప్పై సంవత్సరాలు. జిబ్రాన్ తండ్రి ఖలీల్ ఆమెకు మూడవ భర్త.[6][7] కుటుంబం పేదరికంతో కునారిల్లుతూండడంతో లెబనాన్‌లో గడిపిన రోజుల్లో ఖలీల్ పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు.[8] ఐతే మతాచార్యులు తరచుగా అతని వద్దకు వచ్చి బైబిల్, అరబిక్ భాష నేర్పుతూ ఉండేవారు.
జిబ్రాన్ తండ్రి మొదట్లో ఔషధాలు తయారుచేసే అపోతెకారీగా పనిచేసేవాడు, కానీ జూదం వల్ల చేసిన అప్పులు తీర్చలేక, స్థానిక ఒట్టోమాన్ ప్రభుత్వ అధికారి వద్ద ఉద్యోగంలో చేరాడు.[9][10] 1891లో ఆ అధికారి పనితీరుకు ఆగ్రహించిన ప్రజల ఫిర్యాదుల వల్ల అధికారిని తొలగించి, అతని ఉద్యోగులపై విచారణ చేపట్టారు.[11] జిబ్రాన్ తండ్రిని అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణపై ఖైదుచేశారు,[4] అతని కుటుంబ ఆస్తులను అధికారులు జప్తుచేశారు. కమిలా జిబ్రాన్ సోదరుడు అమెరికా వెళ్తూండడంతో అతన్ని అనుసరించాలని నిర్ణయించుకుంది. కమిలా తన కొడుకు ఖలీల్, పీటర్ (అరబిక్‌లో బత్రస్, ఇతను ఖలీల్ సవతి అన్న) కూతుళ్ళు మారియానా, సుల్తానాలతో పాటు 1895 జూన్ 25న న్యూయార్క్ బయలుదేరింది. ఖలీల్ తండ్రి 1894లోనే జైలు నుంచి విడుదలైనా కమిలా అమెరికాకు తన భర్త నుంచి విడిపోయి వెళ్ళాలనే నిశ్చయించుకుంది.[9]
ఖలీల్ కుటుంబం బోస్టన్ రాష్ట్రపు దక్షిణాదిన స్థిరపడింది, ఆ ప్రాంతంలో ఆ కాలాన రెండవ అతిపెద్ద సిరియన్-లెబనీస్-అమెరికన్ సమాజం స్థిరపడింది.[12] స్కూల్లో ఒక పొరపాటు వల్ల అతని పేరు "ఖహ్లీల్ జిబ్రాన్"గా నమోదయ్యింది.[13] అతని తల్లి కుట్టుపనిచేస్తూ[11] లేసులు, లెనిన్‌లు ఇంటింటికి తిరిగి అమ్మే చిల్లర వ్యాపారిగా పనిచేసేది. జిబ్రాన్ 1895 సెప్టెంబరు 30న బోస్టన్‌లో స్కూలులో చేరాడు. స్కూలు వాళ్ళు విదేశాల నుంచి వలస వచ్చిన పిల్లలకు ఆంగ్లం బోధించే ప్రత్యేక తరగతిలో చేర్చారు. జిబ్రాన్ దగ్గరలోని డెనిసన్ హౌస్ అనే కళల పాఠశాలలోనూ చేరాడు. దాని ద్వారా వినూత్న శైలికి చెందిన బోస్టన్ కళాకారుడు, ఫోటోగ్రాఫర్, ప్రచురణకర్త ఫ్రెడ్ హాలండ్ డే పరిచయం అయ్యాడు.[4] జిబ్రాన్‌ను సృజనాత్మక కృషి సాగించడానికి హాలండ్ ప్రోత్సహించాడు. 1898లో ఒక ప్రచురణకర్త జిబ్రాన్ వేసిన బొమ్మలను ముఖపత్రానికి వాడాడు.
జిబ్రాన్ ఒకపక్క పాశ్చాత్య కళలకు, పాశ్చాత్య రససిద్ధాంతానికి ఆకర్షితుడవుతూండగా, దానితో పాటుగా అతడు, అతని అన్న పీటర్‌లు వారి లెబనాన్ సంస్కృతిని కూడా గ్రహించాలని అతని తల్లి ఆశిస్తూండేది.[14] దాంతో అతను 15 ఏళ్ళ వయసులో లెబనాన్ తిరిగివచ్చి బెయిరుట్‌లో మారొనైట్ చర్చి ఆధ్వర్యంలో నడిచే ఆరంభ, ఉన్నత పాఠశాల అయిన "అల్-హిక్మా" (జ్ఞానం అని అర్థం)లో చేరాడు. తన తోటి విద్యార్థితో కలిసి ఒక కళాశాల పత్రిక నడిపాడు, "కళాశాల కవి"గా ఎన్నికయ్యాడు. అక్కడ నాలుగేళ్ళు చదువుకుని అమెరికా బయలుదేరి 1902 మే 10 నాటికి బోస్టన్ చేరాడు.[15] అతను రావడానికి రెండు వారాల ముందు చెల్లెలు సుల్తానా 15 ఏళ్ళ వయసులో క్షయ వ్యాధి కారణంగా మరణించింది. తర్వాతి ఏడాది అదే వ్యాధితో అన్న పీటర్, క్యాన్సర్ కారణంగా తల్లి మరణించారు. ఇల్లు నడపడానికి అతని సోదరి మారియానా బట్టలు కుట్టే దుకాణంలో పనిచేసేది.[16]
వృత్తి జీవితం ప్రారంభం, వ్యక్తిగత జీవితం
[మార్చు]జిబ్రాన్ నిష్ణాతుడైన చిత్రకారుడు, ప్రత్యేకించి డ్రాయింగ్, నీటిరంగుల్లో ప్రత్యేకత సాధించాడు. 1908 నుంచి 1910 వరకూ ప్యారిస్‌లోని అకాడెమీ జూలియన్‌లో ప్రతీకాత్మకత, కాల్పనిక శైలులు అభ్యసించాడు.[17] జిబ్రాన్ తన తొలి ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను 1903లో బోస్టన్‌లోని డే స్టూడియోలో ఏర్పాటుచేశాడు.[18] ఆ ఎగ్జిబిషన్‌లో జిబ్రాన్ మేరీ ఎలిజిబెత్ హాస్కెల్‌ను కలిశాడు. ఆమె ఖలీల్ కన్నా పదేళ్ళు పెద్దది, వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయురాలు. వారిద్దరి మధ్యా స్నేహం ఏర్పడి అది జిబ్రాన్ జీవితకాలం అంతా కొనసాగింది. జిబ్రాన్‌కు సాయం చేసేందుకు హాస్కెల్ భారీ మొత్తాలు ఖర్చుచేసింది, సంపాదక బాధ్యతలు వహించి అతని ఆంగ్ల రచనలన్నిటినీ విస్తృతంగా పరిష్కరించింది. ద ప్రాఫెట్ సహా అనేక ఖలీల్ రచనలకు హాస్కెల్ చేసిన కృషి ఎంతటిదంటే, ప్రస్తుత ప్రమాణాల ప్రకారం అయితే ఆమెను సహ రచయితగా గౌరవించాల్సివచ్చేది.
వారిద్దరి అనుబంధం ఎటువంటిదన్న విషయం అస్పష్టంగానే మిగులుతోంది; కొందరు జీవితచరిత్రకారులు వారిద్దరూ ప్రేమికులనీ,[19] హాస్కెల్ కుటుంబం అంగీకరించకపోవడం వల్లనే ఎన్నడూ వివాహం చేసుకోలేదనీ నిర్ధారిస్తున్నారు,[20] ఐతే ఇతర ఆధారాలు వారిద్దరిదీ శారీరక సంబంధం కాదని సూచిస్తున్నాయి. జిబ్రాన్, హాస్కెల్ వివాహం నిశ్చయం చేసుకున్న కొద్దికాలానికే నిశ్చితార్థాన్ని జిబ్రాన్ విరమించుకున్నాడు. అతనికి వేరే స్త్రీలతో సంబంధాలుండడంతో జిబ్రాన్ హాస్కెల్‌ని పెళ్ళిచేసుకోవాలనుకోలేదు. హాస్కెల్ మరొక అతన్ని పెళ్ళాడింది, ఐతే ఆమె జిబ్రాన్‌కి ఆర్థికంగా సాయం చేయడం, అతని కెరీర్ వృద్ధిచెందడానికి తన పలుకుబడి ఉపయోగించడం కొనసాగించింది.[21] ఆమె జిబ్రాన్‌కి సంపాదకురాలిగా పనిచేసింది, అతనిని చార్లెట్ టెల్లర్ అనే జర్నలిస్టుకీ, ఎమిలీ మిషెల్ అనే ఫ్రెంచి బోధకురాలికీ పరిచయం చేసింది. వారు అతని చిత్రకళాభ్యాసానికి మోడల్స్‌గా సహకరించి, తర్వాతికాలంలో జిబ్రాన్ సన్నిహిత మిత్రులయ్యారు.[22] 1908లో, జిబ్రాన్ రెండేళ్ళ పాటు ప్యారిస్‌లో కళ అభ్యసించేందుకు వెళ్ళాడు. అక్కడే అతను కళాధ్యయనంలో భాగస్వామి, జీవితకాలం స్నేహితుడు అయిన యూసఫ్ హాయెక్‌ని కలుసుకున్నాడు. [23] మొదట్లో జిబ్రాన్ రచనలు చాలావరకూ అరబిక్‌లోనే ఉన్నా, 1918 తర్వాత ప్రచురితమైన అతని రచనలు చాలావరకూ ఆంగ్లంలో ఉన్నాయి. ఆల్ఫ్రెడ్ ఎ. నాఫ్ ప్రచురణ సంస్థకు ఖలీల్ ఇచ్చినవాటిలో మొదటి పుస్తకం ద మాడ్‌మేన్ 1918లో ప్రచురించారు. అది బైబిల్ శైలిలోని అఫోరిజమ్స్ (జీవిత సత్యాల వంటివి), పారాబుల్స్ (నీతికథలు)తో వచనానికి, కవిత్వానికి మధ్య ఎక్కడో ఉండేలా రాశాడు. అరబ్ సాహిత్యాన్ని సుషుప్తావస్థలోంచి బయటకు తెచ్చి, నూతన జవజీవాలు ఇవ్వాలని, కొత్త తరం అరబ్ రచయితలను ప్రోత్సహించాలనీ న్యూయార్క్ పెన్ లీగ్ అన్న అరబ్-అమెరికన్ రచయితల సంస్థను 1920లో జిబ్రాన్ పున:ప్రారంభించాడు (1915-16లో ఒకమారు ప్రారంభమై మూతబడింది). అల్-మహ్‌జర్ (వలసవచ్చిన కవులు) అన్న మరో పేరు కూడా కలిగిన ఈ సంస్థలో అమీన్ రిహానీ, ఎలియా అబు మాడి, మిఖైల్ నైమి వంటి ముఖ్యమైన లెబనీస్-అమెరికన్ రచయితలు కూడా ఉండేవారు. వీరిలో అరబ్ సాహిత్య ప్రముఖుడైన మిఖైల్ నైమితో వ్యక్తిగత అనుబంధం ఉండేది, అతని వారసులను తనకు కుమారుల వంటివారనీ, అతని మేనల్లుడు సమీర్‌ని గాడ్‌సన్ అనీ జిబ్రాన్ పేర్కొన్నాడు.
మరణం
[మార్చు]
|
1931 ఏప్రిల్ 10న జిబ్రాన్ న్యూయార్క్ నగరంలో 48 సంవత్సరాల వయసులో మరణించాడు. అతిగా మద్యపానం చేయడం వల్ల కాలేయం దెబ్బతినడం (లివర్ సిరోసిస్), క్షయవ్యాధి వల్ల చనిపోయాడు. జిబ్రాన్ ద ప్రాఫెట్ ప్రచురణ అనంతరం మద్యపానానికి బానిస అయిపోయాడు. అతని మరణానికి కొన్నేళ్ళ ముందు ఎవరూ తనను కలిసే అవకాశం ఇవ్వకుండా తన అపార్ట్‌మెంటులో తాళం వేసుకుని, రోజంతా తాగుతూ ఉండిపోయేవాడు. జిబ్రాన్ తనను లెబనాన్ మట్టిలోనే ఖననం చేయాలని కోరుకున్నాడు. ఆ కోరిక, 1932లో మేరీ హాస్కెల్, జిబ్రాన్ చెల్లెలు మారియానా లెబనాన్‌లోని మార్ సర్కిస్ మాన్‌స్ట్రీని కొనుగోలు చేసి, అతని అవశేషాలను అక్కడ ఖననం చేశాకా తీరింది. అప్పటి నుంచీ ఆ ప్రదేశం జిబ్రాన్ మ్యూజియంగా మారింది. జిబ్రాన్ సమాధిపైన అతని ఈ వాక్యాలు రాశారు: "నా సమాధి మీద చూడాలనుకుంటున్నపదాలు: నేను మీలానే జీవించివున్నాను, నేను మీ పక్కనే ఉన్నాను. మీ కళ్ళు మూసుకుని చుట్టూ చూడండి. మీ ఎదురుగా మీరు నన్ను చూడవచ్చు"[24]
జిబ్రాన్ తన స్టూడియోలోని సామాగ్రి మేరీ హాస్కెల్‌కి చెందాలని కోరుకున్నాడు. 23 సంవత్సరాలుగా అతనికి ఆమె రాసిన ఉత్తరాలు ఆమెకు అక్కడ దొరికాయి. వారిద్దరి సాన్నిహిత్యాన్ని, వ్యక్తిగత అంశాలు ఆ ఉత్తరాల్లో ఉన్నాయన్న కారణంగా మేరీ వాటిని తగలబెట్టాలని మొదట అనుకున్నా, వాటి చారిత్రక విలువను అర్థం చేసుకుని దాచింది. 1964లో ఆమె మరణానికి ముందు, వాటిని, అతను ఆమెకి రాసిన ఉత్తరాలతో కలిపి నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి అందజేసింది. దాదాపు 600 ఉత్తరాల్లోని భాగాలను 1972లో "బిలవ్‌డ్ ప్రాఫెట్" (ప్రియమైన ప్రవక్త) అన్న పేరుతో ప్రచురించారు.
మేరీ హాస్కెల్ తాను దాచుకున్న వందలాది ఖలీల్ జిబ్రాన్ గీసిన చిత్రాలు, బొమ్మలను 1950లో జార్జియాలోని సవన్నాలో ఉన్న టెల్‌ఫెయిర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు దానమిచ్చింది. హాస్కెల్ టెల్‌ఫెయిర్ మ్యూజియంకు ఇచ్చిన ఈ బహుమానం వల్ల ఆ మ్యూజియం ఖలీల్ జిబ్రాన్ వేసిన చిత్రాలు అతిఎక్కువగా ఉన్న మ్యూజియంగా నిలిచింది. వీటిలో 5 ఆయిల్ పెయింటింగ్స్, అసంఖ్యాకమైన పేపర్ డ్రాయింగ్స్ ఉన్నాయి.[నోట్స్ 1] ఇవి జిబ్రాన్ లలితమైన శైలిని, అతనిపై ప్రతీకవాదం ప్రభావాన్ని పట్టియిస్తాయి. అతని పుస్తకాలపై భవిష్యత్తులో రానున్న అమెరికన్ రాయల్టీలు అతని జన్మస్థలమైన బ్షార్రీ పట్టణానికి చెందేలా, ఆ సొమ్ము అక్కడ మంచి పనులు చేపట్టేందుకు వినియోగించేలా వీలునామా రాశారు.
నోట్స్
[మార్చు]- ↑ టెల్‌ఫెయిర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఖలీల్ చిత్రాలను ప్రదర్శించే ఏర్పాటుచేయాలన్న ఆలోచన మేరీ హాస్కెల్‌కు 1914 నుంచీ ఉన్నదన్న విషయం అతనికి, ఆమె రాసిన ఒక లేఖ సూచిస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ "Gibran". Random House Webster's Unabridged Dictionary.
- ↑ Freeth, Becky (27 April 2015). "Salma Hayek is sophisticated in florals as she visits Lebanon museum". Daily Mail Online.
- ↑ 3.0 3.1 Kahlil Gibran's The Prophet: Why is it so loved?, BBC News, May 12, 2012, Retrieved May 12, 2012.
- ↑ 4.0 4.1 4.2 4.3 Acocella, Joan (January 7, 2008). "Prophet Motive". The New Yorker. Retrieved March 9, 2009.
- ↑ Jagadisan, S."Called by Life" Archived ఆగస్టు 12, 2010 at the Wayback Machine, The Hindu, January 5, 2003, accessed July 11, 2007
- ↑ "Khalil Gibran (1883–1931)", biography at Cornell University library on-line site, retrieved February 4, 2008
- ↑ "Gibran - Birth and Childhood". leb.net.
- ↑ "Kahlil Gibran (1883-1931)". Middle East & Islamic Studies. Cornell University Library. Retrieved 10 November 2015.
- ↑ 9.0 9.1 Cole, Juan. "Chronology of his Life". Juan Cole's Khalil Gibran Page – Writings, Paintings, Hotlinks, New Translations. Professor Juan R.I. Cole. Retrieved January 2, 2009.
- ↑ Walbridge, John. "Gibran, his Aesthetic, and his Moral Universe". Juan Cole's Kahlil Gibran Page – Writings, Paintings, Hotlinks, New Translations. Professor Juan R.I. Cole. Retrieved January 2, 2009.
- ↑ 11.0 11.1 Mcharek, Sana (మార్చి 3, 2006). "Khalil Gibran and other Arab American Prophets" (PDF). approved thesis. Florida State University. Archived from the original (PDF) on మార్చి 4, 2009. Retrieved జనవరి 2, 2009.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ "Khalil Gibran". Cornell University Library.
- ↑ Gibran 1998: 29
- ↑ Mcharek, Sana (మార్చి 3, 2006). "Khalil Gibran and other Arab American Prophets" (PDF). approved thesis. Florida State University. Archived from the original (PDF) on మార్చి 4, 2009. Retrieved జనవరి 2, 2009.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ "Passenger Record". Records of Ellis Island. The Statue of Liberty-Ellis Island Foundation, Inc. Retrieved January 2, 2009.
- ↑ Karam 1981, p. 20
- ↑ Robin Waterfield, Prophet: The Life and Times of Kahlil Gibran
- ↑ Otto 1970 .
- ↑ Salem Otto, Annie, The Love letters of Kahlil Gibran and Mary Haskell, Houston, 1964
- ↑ Amirani & Hegarty 2012.
- ↑ Alexandre Najjar, Kahlil Gibran, a biography, Saqi, 2008, chapter 7 (p.79), "Beloved Mary"
- ↑ Najjar, op.cit, p.59
- ↑ Yusuf Huwayyik, Gibran in Paris, New York : Popular Library, 1976
- ↑ Waterfield, Robin (1998). Prophet: The Life and Times of Kahlil Gibran. St. Martin's Press. pp. 281–282.
ఇతర పఠనాలు
[మార్చు]- Abinader, Elmaz (August 30, 2000). "Children of Al-Mahjar: Arab American Literature Spans a Century". U.S. Society and Values, "Contemporary U.S. Literature: Multicultural Perspectives, Department of State, International Information Programs, February 2000. Archived from the original on August 30, 2000.
- Hassan, Waïl S (2011). "The Gibran Phenomenon". Immigrant NarrativesOrientalism and Cultural Translation in Arab American and Arab British Literature. Oxford University Press. pp. 59–77. doi:10.1093/acprof:oso/9780199792061.003.0002. ISBN 9780199919239. OCLC 772499865. Preview of first eleven article pages at Immigrant Narratives: Orientalism and Cultural Translation in Arab American, p. PA59, గూగుల్ బుక్స్ వద్ద
- Hawi, Khalil S. (1982). Kahlil Gibran: his Background, Character, and Works. Third World Centre for Research and Publishing. ISBN 978-0-86199-011-5.
- Kesting, Piney (July–August 2019). "The Borderless Worlds of Kahlil Gibran". Aramco World. pp. 28–37.
- Oueijan, Naji B.; et al., eds. (1999). Khalil Gibran and Ameen Rihani: Prophets of Lebanese-American Literature. Louaize: Notre Dame Press.
- Poeti arabi a New York. Il circolo di Gibran (in ఇటాలియన్). Bari: Palomar. 2009. ISBN 978-88-7600-340-0.
- Popp, Richard A. (2000). Al-Funun: the Making of an Arab-American Literary Journal.
బాహ్య లంకెలు
[మార్చు]- Works by ఖలీల్ జిబ్రాన్ at Project Gutenberg
- Works by or about ఖలీల్ జిబ్రాన్ at Internet Archive
- Gibran Museum, Bsharri, Lebanon
- Online copies of texts by Gibran
- Kahlil Gibran: Profile and Poems on Poets.org
- BBC World Service: "The Man Behind the Prophet"
- The Kahlil Gibran Collective, website including a digital archive of his works Archived జనవరి 4, 2023 at the Wayback Machine
- Featured Author: Kahlil Gibran in The New York Times Archives
- Articles containing Arabic-language text
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- CS1 ఇటాలియన్-language sources (it)
- Articles with Internet Archive links
- AC with 19 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with RKDartists identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- ఆంగ్ల కవులు
- 1883 జననాలు
- 1931 మరణాలు