Jump to content

గంగాదేవి (కవయిత్రి)

వికీపీడియా నుండి

గంగాదేవిని గంగాంబిక అని కూడా పిలుస్తారు. ఈమె 14వ శతాబ్దపు సంస్కృత భాషా పండితురాలు, కవయిత్రి. ప్రస్తుత భారతదేశంలోని విజయనగర సామ్రాజ్యానికి చెందిన యువరాణి.

జీవితం, విశేషాలు

[మార్చు]

గంగాదేవి సంస్కృత భాషా పండితురాలు. ఓరుగల్లు నివాసి. 14 వ శతాబ్దం రెండవ ప్రతాపరుద్రుని కాలంలో అగస్త్యుడు అనే గొప్ప సంస్కృత కవి ఉండేవాడు. ఇతని మేనల్లుడు, కవి పండితుడైన విశ్వనాథుని శిష్యురాలు గంగాదేవి. కాకతీయుల ఆడబిడ్డ, ఆంధ్రుల కోడలు. గంగాదేవి విజయనగర రాజు బుక్క రాయ I (c. 1360s-1370s) మూడవ కుమారుడు కుమార కంపన భార్య. [1] తన భర్త కంపరాయుడు మధుర నగరాన్ని జయించిన తరువాత అతని శౌర్యసాహసములను ‘వీరకంపరాయచరితమ్’ అను కావ్యము ద్వారా తెలియజేసినది. వీరరస స్ఫొరకమైన ఈ కావ్యమునకు “మధురావిజయం“ నామాంతరముకూడా ఉంది.[2] పద్య రచనతో పాటు, ఆమె తన భర్తతో యుద్ధంలో కూడా పోరాడింది. ఇతర మహిళలకు స్ఫూర్తినిచ్చింది. [3]

ఆమెను తెలుగు యువరాణి అని భావిస్తారు. మధుర విజయం ప్రారంభంలో, గంగాదేవి తెలుగు మాట్లాడే ప్రాంతంలోని అనేక సంస్కృత కవులను ప్రశంసించింది. ముఖ్యంగా తిక్కన్నను (ఆంధ్ర మహాభారతం రచయిత తిక్కనతో గుర్తించబడింది) మెచ్చుకుంటుంది. ఇది ఆమె తెలుగు వంశానికి చెందినది అను భావానికి బలమైన సాక్ష్యంగా పరిగణించబడుతుంది. [4] ఆమె పుట్టి, తిరిగిన నేల ప్రజల భాష తెలుగు. సంస్కృత కవయిత్రిగా పేరు పొందిన ఈమె తెలుగు కవయిత్రి కూడా[5]. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గంగాదేవిని, " తెలుగు నాట ఎఱ్ఱా ప్రగడ, నాచన సోమనాధుడు, రావిపాటి త్రిపురాంతకుడు, కాటయ వేమారెడ్డి, రేచర్ల సర్వజ్ఞ సింగభూపతి, కుమారగిరి వసంతరాయలు అను కవివరులీమెకు సమకాలికులు కావచ్చును". అని పేర్కొన్నారు. "రాజవంశ సంజాతయై పట్టమహిషియై సారస్వత వ్యాసంగమున దవిలియుండుటే అరుదు. అందును చతుర కావ్య నిర్మాణము చేయగలిగిన ప్రజ్ఞామతి యగుట ఇంకను నబ్బురము". అని ప్రశంసించారు[6].

మధురా విజయము

[మార్చు]

మదురైలో తన భర్త ముస్లింలపై సాధించిన విజయాన్ని గంగాదేవి కవిత రూపంలో వివరించారు. [3] తొమ్మిది అధ్యాయాల ఈ పద్యకావ్యం శీర్షిక మధురావిజయం. దీనిని వీరకంపరాయ చరిత్ర అని కూడా పిలుస్తారు. [3] [7] [8]

మధుర విజయం 1924 సంచిక

శ్లో|| మహాకవి ముభామ్భోజ మణి పంఞజరి శారికామ్

చైతన్య జలధి జ్యోత్స్నాం దేవీల వన్డే సరస్వతామల్ ||

మహాకవుల ముఖ పద్మాలను రత్న పంజరాలలో విహరించే గోర్వంకై, జ్ఞాన సముద్రాన్ని ఉపోంగ చేస్తున్న కౌముదీ మహోత్సవమై అలరు సరస్వతీ దేవికి నా నమస్కారము

అంటూ గంగాదేవి ప్రారంభ శ్లోకంలో రాసింది. తదుపరి వాల్మికీ మహర్షి, కాళీదాసు, భారవి,తిక్కన, అగస్త్యుడు, విశ్వనాథుడు వంటి కవులనూ స్మరించుకుంటుంది. మధురావిజయం పీఠికతో తెలుగు కవి తిక్కనను స్తుతించింది గంగాదేవి.

శ్లో|| ఉపహరన్ కుసుమాని మహీరుహం, కిసలయై కలితాఞలి బన్ధన:

మధుర కోకిల కూజిత భాషితో మధుర ధైన ముపాసితు మాసదతే ||

ఈ కావ్యంలో కంప భూపాలుని సార్యభౌమునిగా వర్ణించింది. తమ భర్త కంపభూపతి శత్రురాజుల మనస్సుల్ని కంపింపజేసేలా, మలయ పర్వతం ఒక అపూర్వ చిహ్నంగా తేజరిల్లుతుంటే దక్షిణ దిశకు ప్రయాణించాడనీ, యుద్ధ సమయాన ఘాతకులైన తురుష్కులను సంహరించినపుడు రాజు తేజస్సు అనే తెల్లదనం వ్యాపించింది అని వర్ణిస్తుంది.

మధురావిజయం పత్రాలు కనుగొనబడిన తరువాత, శ్రీరంగానికి చెందిన శ్రీ కృష్ణమాచార్యులు తమిళంలో ప్రచురించారు. ఆపై అన్నామలై విశ్వవిద్యాలయం 1950లో ఆంగ్ల అనువాదాన్ని ప్రచురించింది. [3] ఈ కావ్యానికి తాడేపల్లి రాఘవ శాస్త్రి తెలుగు అనువాదం చేసారు. పోటుకుచ్చి సుభ్రమణ్య శాస్త్రి దీనికి వ్యాఖ్యానం రాసి గంగాదేవి అను నవల రాసారు.[9] సల్మాన్ రష్దీ నవల విక్టరీ సిటీ యొక్క కథానాయకుడు 'పంప' కంపనకు గంగాదేవి కీలక ప్రేరణ. [10]

ఇతర వ్యాసాలు

[మార్చు]
  1. దుర్గాప్రసాద్, జి. మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-3. గంగాదేవి -1 సరసభారతి ఉయ్యూరు.
  2. దుర్గాప్రసాద్, జి. మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-33- గంగాదేవి -2. సరసభారతి ఉయ్యూరు.

ప్రస్తావనలు

[మార్చు]
  1. William J. Jackson (3 March 2016). Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature. Taylor & Francis. pp. 97–. ISBN 978-1-317-00192-8.
  2. విశ్వనాథ శర్మ, కొరిడె (28 April 2013). "సంస్కృత సాహిత్యములో ప్రముఖ కవయిత్రులు". మాలిక పత్రిక. Archived from the original on 27 జూన్ 2023. Retrieved 27 జూన్ 2023.
  3. 3.0 3.1 3.2 3.3 Basu, Soma (February 8, 2012). "A poetic princess". The Hindu. Retrieved 11 July 2021.
  4. B. S. Chandrababu; L. Thilagavathi (2009). Woman, Her History and Her Struggle for Emancipation. Bharathi Puthakalayam. p. 230. ISBN 978-81-89909-97-0.
  5. నిహారిక, కొండపల్లి. "తెలంగాణ ప్రాచీన కవయిత్రుల కవిత్వ ప్రాభవం". తంగేడు. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.
  6. లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరి (1958). "గంగాదేవి - మధురా విజయము". ఆంధ్ర కవయిత్రులు. రాజమహేంద్రవరం: బత్తుల కామాక్షమ్మ. pp. 4–9.
  7. Suryanath U. Kamath, A Concise history of Karnataka from pre-historic times to the present, Jupiter books, MCC, Bangalore, 2001 (Reprinted 2002) OCLC: 7796041 p162
  8. Devi, Ganga (1924). Sastri, G Harihara; Sastri, V Srinivasa (eds.). Madhura Vijaya (or Virakamparaya Charita): An Historical Kavya. Trivandrum, British India: Sridhara Power Press. Retrieved 21 June 2016.
  9. భవానీ దేవి, సి (19 February 2023). "ప్రాచీన తెలుగు కవయిత్రుల రచనలు - చారిత్రిక, సామాజిక, సాంస్కృతిక దృక్పధం". సంచిక: తెలుగు సాహిత్య వేదిక.
  10. "Salman Rushdie's new novel is an ode to storytelling and freedom". The Economist. ISSN 0013-0613. Retrieved 2023-02-11.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.