గంటి సూర్యనారాయణ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంటి సూర్యనారాయణ శాస్త్రి, కల్యాణి పత్రికా సంపాదకులు, ప్రచురణ కర్త.ఇతను విజయనగరం వాస్తవ్యులు. ఇతనికి శృంగార శాస్త్రి, ఖాదీ శాస్త్రి, కల్యాణి శాస్త్రి అను మూడు పేరుల వాడుకలో ఉన్నాయి. తెలుగునాట పూర్వప్రబంధములను సర్వాంగ సుందరంగా, సకల జననేత్రానందకరంగా ముద్రించిన కీర్తి గంటీ శాస్త్రిగారిదే. ఇతను శృంగార గ్రంథమాలయని పేరుతో మద్రాసులో ఒక గ్రంథమాల స్థాపించి అందు శృంగార ప్రబంధములైన రాధామాధవ సంవాదం, అహల్యా సంక్రందనం, సత్యభామా సాంత్వనం, రాధికాసాంత్వనం, భల్లాణ చరిత్ర మొదలగు 10 కృతులను ముద్రించి, వాని వ్యాప్తికి తోడ్పడ్డారు.ప్రతి కావ్యం శృంగార ఉపనామంతో ఉండేది. అన్నింటికంటె ముఖ్యంగా ఈగ్రంధమాలలో వెలువడింది వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం. ఈ గ్రంథ మూలంన గంటి శాస్రిగారి కీర్తి ఆంధ్ర సాహిత్య ప్రబందంన స్థిరమైంది. ఈ గ్రంథంలే కాక శాస్త్రిగారు శృంగారం అను పేరున శృంగార పదములైన పద్యాలను రాసారు. అందులో పద్యాలు రాసిన వారిలో కీ. శే. ఆచంట సాంఖ్యాయన శర్మ, కీ.శే. సెట్టి లక్ష్మీ నరసింహం మొదలగు వారు ఉన్నారు

ఇతను విజయనగరం రాక మునుపు మద్రాసులో కాశీనాధుని నాగేశ్వేరరావు సారథ్యంలో నడిచే ఆంధ్రపత్రిక కార్యాలయంలో పనిచేసాడు. అక్కడ పనిచేయుచూనే శాస్త్రిగారు శృంగార గ్రంథాల ప్రచురణ ప్రారంభించాడు. కొన్ని ప్రబంధాలను ఆంధ్రపత్రిక ముద్రణశాలలోనే ముద్రించేవాడు. దానివలన లాభం శాస్త్రిగారు పొందినా, నాగేశ్వరరావుకు కొంత నష్టం కలిగినా, అతని ఉదార స్వభావం, సాహిత్య మక్కువ ముందు ఆనష్టాన్ని పరిగణనలోకి తీసుకునేవాడుకాదు. అందువలన శాస్త్రిగారి తొలుత శృంగార గ్రంథప్రచురణకు ఆంధ్రపత్రిక కార్యాలయంమే ఆలంబనమైనదని చెప్పవచ్చును.

గంటిశాస్త్రి ఎప్పుడూ ఖాదీ వస్త్రాలను ధరించెడివాడు. పంచ-కుడితినీ-వాణీ ఇదియే అతని వేషధారణ.అతను తక్కిన వారి వలె గాంధీ ఖాదీ ఉద్యమానంతరం ఖాదీ ధరించిన వాడుకాదు.ఉద్యమ ప్రారంభంనుండి ఖాదీ ధరించిన స్వాతంత్ర్య ప్రియుడు.1921లో మహాత్మా గాంధీ స్వాతంత్ర్యద్యంతో ఖాదీ వస్త్ర ధారణ ప్రారంభమైంది. ఆ సంవత్సరంనే గాంధీగారిని ఖాదీ వస్త్రాలతో శాస్త్రి కలిసాడు. గాంధీ మీపేరేమి అని హిందీలో అడుగగా శాస్త్రిగారు తనపూర్తి పేరు వివరించగా, ఇకమీద నుంచి మిమ్మల్ని ఖాదీ శాస్త్రి అని పిలవవచ్చును అని గాంధీ అన్నారని కథనం.

సాహిత్యాన శాస్త్రి పేరు కల్యాణి శాస్త్రిగా పేరొందినది. కల్యాణి పత్రికను తొలుత శాస్త్రి శృంగార గ్రంథాలను ప్రచురించిన మద్రాసునందే స్థాపించాడు. ఆతరువాత మదరాసు వీడి, వారు విజయనగరం వచ్చి, అచ్చట స్థిరపడి కల్యాణి పత్రికను తిరిగి పునఃప్రారంభించాడు. ఈ పత్రికను శాస్త్రి మూడేండ్లు బహుసమర్ధతతో నడిపాడు. దీనికి ముఖ్య పోషకులు వసుమర్తి వీభద్రస్వామి. అదే సమయంలో విజయనగరంలో అనేక సాహిత్య సభలను నిర్వహించి అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు మొదలగు వారిని సన్మానించాడు. అదియే కాక శాస్త్రి యువకవులను ఎక్కువుగా ప్రోత్సహించేవాడు. అప్పట్లో విజయనగరం సంస్కృత కళాశాలలో చదువుచు, అటుపై పండితులైన ప్రసిద్ధి గాంచిన, కొమ్మనమంచి జోగయ్య శర్మ, యామిజాల పద్మనాభస్వామి వార్ల పద్యగద్య రచనలను తొలుత కల్యాణి పత్రికలో ప్రచురించి వారిని ప్రోత్సహించేవారు. అలాగే నండూరి సుబ్బారావు ఎంకి పాటలును శాస్త్రి మొదట ప్రచురించాడు.

కల్యాణి పత్రికి ఆగిపోయాక శాస్త్రి అప్పట్లో విజయనగర సంస్థానం ఇంజనీరు వేపకొమ్మ ఆదిశేషయ్య ఆదరణతో ఆంధ్రవిజ్ఞాన సమితి గ్రంథమాల స్థాపించి, ప్రాచీన ప్రబంధాలను మునుపటిరీతిన మనోహరంగా క్రౌను సైజులో వెలువరించాడు.శాస్త్రి ఎల్లప్పుడు ఉల్లాసంగా ఉండేవారు. చమత్కార ప్రియులు. విజయనగర సంస్థాన చరిత్రతో పాటు, తమాషా పంచాంగం అనే గ్రంథం రచించాడు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]