గాలి మాధవీలత

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గాలి మాధవీలత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్.[1] ఆమె జియోసింధసిస్, ఎర్త్ క్వేక్ మేనేజిమెంటు మరియు రాక్ ఇంజనీరింగ్ లో విశేష సేవలనందిస్తున్నారు. ఇండియన్‌ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థ సూచనల మేరకు చీనాబ్ వంతెన డిజైన్‌ ప్రొవైడర్‌గా సివిల్‌ ఇంజనీర్‌ ప్రొఫెసర్‌ మాధవీలతను నియమించారు. ఒక తెలుగు మహిళకు భారత అత్యున్నత ప్రాజెక్టు నిర్మాణంలో అవకాశం రావడం గర్వించదగ్గ విషయం.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడులో అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి దంపతులకు జన్మించారు. వారి కుటుంబం వ్యవసాయం చేయడానికి కందుకూరుకు వలస వచ్చారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ దాకా కందుకూరులోనే చదివారు. కాకినాడలోని జేఎన్‌టీయూలో బీటెక్‌ను పూర్తి చేశారు. వరంగల్‌లోని నిట్‌లో ఎంటెక్‌ చదివారు. ఐఐటీ మద్రాసులో చేసిన పరిశోధనకుగాను పీహెచ్‌డీ వచ్చింది. గౌహతిలోని ఐఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. కొన్నాళ్లకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 14 ఏళ్ళుగా సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ద్వారానే జియోసెల్స్‌ను రూపొందించారు. సాయిల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పైనా, భూకంపాలను గుర్తించే విధానంపై పరిశోధనలు చేస్తున్నారు.[3] ఆమె ఎన్నో పరిశోధనాపత్రాలను ప్రచురించారు.[4][5][6] మాధవీలత భర్త సివిల్‌ ఇంజనీరు. వీరికి ఇద్దరు పిల్లలు.

చీనాబ్ బ్రిడ్జి డిజైన్ కు అరుదైన అవకాశం[మార్చు]

బ్రిడ్జి డిజైన్‌లో పాలుపంచుకునేందుకు మాధవీలతకు అవకాశం రావడం వెనుక ఒక విశేషం ఉంది. ఆమె జియోపాలిమర్స్‌పై పరిశోధనలు చేశారు. జియోసెల్స్‌పై భారత్‌లో పీహెచ్‌డీ చేసిన తొలి సివిల్‌ ఇంజనీర్‌గా గుర్తింపు సాధించారామె. జియోసెల్స్‌ను ప్లాస్టిక్‌, క్లాత్‌, వెదురు ఉపయోగించి ప్రయోగాత్మకంగా రూపొందించారు. రోడ్లు, భవనాలు, భారీ నిర్మాణాలు చేపట్టే ముందు పునాదులు మరింత పటిష్టం చేసేందుకు జియోసెల్స్‌ను ఉపయోగిస్తారు. మాధవీలత ప్రయోగాత్మకంగా రూపొందించిన జియోసెల్స్‌ను ఇప్పటికే భారీ భవంతులు, బ్రిడ్జిల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. వీటితో పాటు భూకంపాలను ముందుగా గుర్తించేందుకు నిరంతరంగా పరిశోధనలు చేస్తున్నారు మాధవీలత. దేశంలో జియో టెక్నాలజీపై వెలువడుతున్న ఏకైక జర్నల్‌కు మాధవీలత ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.[7] ఆమె పరిశోధనలు, ఈ రంగంలో చేస్తున్న అభివృద్ధికి గాను మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ప్రశంసలు అందుకున్నారీ శాస్త్రవేత్త.[2]

‘‘రెండు భారీ కొండల మధ్య.. అత్యంత ఎత్తున నిర్మిస్తున్న చీనాబ్‌ బ్రిడ్జి ఆరంభం నుంచి ప్రతి అడుగూ సాహసమే’’ అంటారు మాధవీలత. ‘‘ఆ కొండపైకి సాధారణంగా మనుషులు చేరుకోవడమే గగనం. అలాంటిది రోడ్డు మార్గాలు నిర్మించండం అంటే మామూలు విషయం కాద’ని చెప్పారామె. బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో 220 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంటుంది. నిర్మాణరంగంలో పటిష్టత కోసం జియోసెల్స్‌ ద్వారా బ్రిడ్జికి అనుబంధమైన పిల్లర్లను నిర్మించారు. ప్రస్తుతానికి రెండువైపులా పిల్లర్ల నిర్మాణాలు పూర్తి చేశారు.[2][8]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]