Jump to content

గుబ్బి వీరణ్ణ

వికీపీడియా నుండి
గుబ్బిహంపన్నవీరణ్ణ
జననం(1891-01-24)1891 జనవరి 24
మరణం1972 అక్టోబరు 18(1972-10-18) (వయసు: 81)
బెంగళూరు (సెయింట్. మార్తాస్ ఆసుపత్రి)
వృత్తిరంగస్థలదర్శకుడు,నటుడు
పిల్లలుజి.వి. స్వర్ణమ్మ, జి. వి. మాలతమ్మ, జి. వి. చెన్నబసప్ప, జి. వి. గిరిజమ్మ, జి. వి. రేవమ్మ, జి. వి. రాజశేఖర్, జి. వి. శివానంద్, జి. వి. శివరాజ్, జి. వి. గురుమూర్తి, జి. వి. లతమ్మ, జి. వి. ప్రభ.

గుబ్బి వీరన్న (1891 – 1972) కన్నడ రంగస్థల దర్శకుడు, నటుడు. అతను కన్నడ రంగస్థలానికి విశేష కృషి చేసిన వ్యక్తులలో ఒకడు. "గుబ్బి శ్రీ చెన్నబసవేశ్వర నాటక కంపెనీ"  పేరిట అతను నెలకొల్పిన నాటక సంస్థ కన్నడ రంగస్థలం అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించింది.

కన్నడ పరిశ్రమలో తారలుగా వెలుగుతున్న రాజ్ కుమార్, బాలకృష్ణ, నరసింహరాజు, ఉదయకుమార్, జయమ్మ దర్శకులు హెచ్.యల్.యన్.సిన్హా, ఆర్.నాగేంద్రరావు, వి.ఆర్.పంతులు, జి.వి.అయ్యర్ మొదలైన ప్రముఖులు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడానికి కారణ భూతులైన వ్యక్తి గుబ్బి వీరన్న. అందుకనే కన్నడ చలనచిత్ర పరిశ్రమ గుబ్బి వీరన్నను పితామహులుగా గౌరవిస్తుంది. నిశ్శబ్దచిత్రాల కాలంలో ఆయన చిత్ర పరిశ్రమలో ప్రవేశించి, కొన్ని నిశ్శబ్ద చిత్రాలను నిర్మించాడు. అంతకు ముందు ఎన్నో నాటకాలు ఆడాడు. ఎన్నో చోట్ల ఎన్నో ప్రదర్శసలు ఇచ్చారు.

అనేక మంది కళాకారులను రంగస్థలంపై ప్రోత్సహించి, తీర్చిదిద్దడమే కాక ఆర్థికంగానూ ఆదుకున్నారు. ఉదాహరణకు, బి.వి. కారంత్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో డిగ్రీ, మాస్టర్స్ చదివేందుకు వీరణ్ణ ఆర్థికంగా సాయం చేశాడు.

గుబ్బి వీరణ్ణ నాటక సంస్థ కర్ణాటకలో స్త్రీలను నాటకాల్లో పాత్రలు వేసేలా ప్రోత్సహించిన తొలి సంస్థ[1].  కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలను నాటకంలో ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు అందులో భాగంగా ఏనుగులు, గుర్రాలు కూడా గుబ్బి వీరణ్ణ వేదిక మీదిక తీసుకురావడం సంచలనాత్మకంగా, అద్భుతావహంగా నిలిచింది. గుబ్బి వీరణ్ణ కంపెనీ కథే, కన్నడ రంగస్థలం కథ అన్న నానుడి కన్నడ రంగస్థలానికి ఆయన చేసిన సేవను తెలియజేస్తుంది. గుబ్బి వీరణ్ణ రంగస్థలమే కాక సినిమా రంగంలోకీ ప్రవేశించి సినిమాలను నిర్మించి వాటిలో నటించారు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

గుబ్బి వీరణ్ణ కర్ణాటకకు చెందిన తుముకూరు జిల్లా గుబ్బిలో 1891లో జన్మించాడు. వీరన్న పినతండ్రి గారు నాటకాలు ఆడేవాడు. ఆయన ప్రోత్సాహంతోనే వీరన్న కూడా తన ఐదవ యేటనే నాటకాల్లో ప్రవేశించాడు. మొదట్లో నాటకాల్లో చిన్న పిల్లల వేషాలు వేస్తూ తర్వాత లోహితాస్యుడు పాత్ర వేసేవాడు. పాట అమోఘంగా కాకపోయినా, పాడేవాడు. నాటకాల్లో వుండడంలో చదువు మీదకు మనసు పోలేదు; చదువుకోనూ లేదు. ఏదో అప్పుడూ అప్పుడూ కాస్త చదువుకున్నాడు. అదీ వానాకాలం చదువు. అంటే వానాకాలంలో నాటకాలు ఆడడానికి ఆటంకాలు వుండేవి కాబట్టి, అప్పుడు నాటకాలు పడేవి కావు. ఆ టైములో చదివారు వీరన్న.

వీరన్నకు కాస్త వయసు వచ్చే సరికి, స్త్రీ పాత్రలు ధరించడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి లావణ్యం తగ్గింది. అప్పుడు ఆ వేషం ఈ వేషం అని వేస్తూ నాటకాల్లో పని పాటలు చేసేవాడు.

నాటకానుభవాలు

[మార్చు]

అప్పటి తమ నాటకానుభవాలు చిత్రంగా వుంటాయని చెప్పారు వీరన్న: ఆ కాలంలో గుడారాలు కట్టుకుని నాటకం ఆడేవాళ్ళు. అప్పట్లో నాటకాలకు ప్రోత్సాహం అంటూ లేనే లేదు. నాటకాలు ప్రజలు చూడాలని అతను ఉబలాట పడేవాడు. అంతే కాకుండా నాటకాల మనుషులు అంటే అసలు గౌరవం లేదు. ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. వారికి ప్రజలకు నాటక కళ మీద ఒక విధమైన అభిమానం కలగజెయ్యాలన్న తాపత్రయం వుండేది. ఎంచేతంటే వ్యాపారరీత్యా నాటకాలు ఏమాత్రం లాభసాటిగా వుండేవి కాదు కాబట్టి. ప్రజలు ముందుగా నాటకాలు చూడడం ప్రారంభిస్తే, వ్యాపారం విషయం తర్వాత ఆలోచించవచ్చు అనుకునేవాళ్ళు. ఒకసారి నాటకంలో హాస్యపాత్ర వెయ్యవలసిన ఒకాయన రాలేదు. సాయంకాలానికి ఆ విషయం తెలియగానే అతనే ఆ వేషం తయారయి, రాత్రి ప్రదర్శనలో పాల్గొన్నాడు. అతను బాగా నవ్వించాడని అందరూ అన్నారు. అప్పటినుంచీ "హాస్యపాత్రధారి" గా నిర్ణయింపబడ్డాడు. ఇది 1910వ సంవత్సరంలో జరిగిన విషయం.

అతని నాకట సంస్థ పేరు "చెన్న బసవేశ్వర కంపెనీ". ఒక్కసారి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి మొత్తంనాటకం సామానంతా గుడారాలతో సహా కాలి బూడిదైపోయింది. దాంతో కొన్నాళ్ళు నాటకాలు ఆగిపోయాయి. మళ్ళీ సంస్థ కూడుకునే సరికి కొన్నాళ్ళు పట్టింది. కాస్తో కూస్తో అప్పులు చేసి సంస్థను నిలబెట్టారు.

1917లో ఆ నాటక సంఘం ప్రొప్రయిటరు మరణం తర్వాత ఆ కంపెనీ పూర్తిగా అతని స్వాధ్నంలోకి వచ్చింది. ఆ రోజుల్లో వీధుల్లో కిరసనాయిలు దీపాలతోనే నాటకాలు ఆడేవాళ్ళు. ఒక్కో నాటకంలో సుమారు నూరు పాటలు ఉండేవి.అవన్నీ పురాణ నాటకాలే. హరిశ్చంద్ర, ద్రౌపదీ వస్త్రాపహరణం, కాళిదాసు, సుభద్ర మొదలైన నాటకాలను ఎక్కువగా ఆడేవాళ్ళు.

ఆ కాలంలో స్త్రీ పాత్రలన్నీ పురుషులే ధరించేవారు. ఆ కాలంలో ఆ సంస్థ ద్వారా ఆడినవి కన్నడ నాటకాలే అయినా, తెలుగు దేశంలోనూ, తమిళ దేశంలోనూ ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు. క్రమంగా ప్రజల ప్రోత్సాహం లభించి సంస్థ అభివృద్ధి చెందింది.

1921లో బెంగుళూరు చేరుకొని అక్కడే కేంద్రం ఏర్పాటు చేసారు. ఒక తాత్కాలిక థియేటరు కట్టుకున్నారు. స్త్రీ పాత్రలు స్త్రేలే ధరించడం కూడా అమల్లోకి వచ్చింది. కొన్ని స్త్రీ పాత్రలు పురుషులు ధరించినా, ముఖ్య పాత్రలు స్త్రీలే ధరించేవారు.

మద్రాసులోని బ్రాడ్వేథియేటరు ప్రారంభం వారి "కబీరుదాసు" నాటకంతోనే జరిగింది. అప్పుడు మద్రాసులో నాలుగు నెలలు ఉండి అక్కడక్కడా ప్రదర్శనలు ఇచ్చారు. సర్ సి.పి.రామస్వామి అయ్యర్ వంటి ప్రముఖులు ఆ నాటకాలు చూసి ప్రశంసించారు.

మైసూరు మహారాజా వారి భవనంలో ఒక సారి నాటకం ప్రదర్శించారు. మహారాజా వారు "వెర్సటైల్ కమెడియన్" అన్న బిరుదూ, బంగారు పతకాన్ని బహూకరించారు.

1934లో ఆ నాటక సంస్థను అభివృద్ధి చేసారు. "కురుక్షేత్ర" అన్న నాటకం తీసారు. ఆ నాటకంలో 100 రథాలు చేయించి, ఏనుగులు, గుర్రాలు ఏర్పాటు చేసారు. ఊరూరా తిరిగి ప్రదర్శనలిచ్చారు.[3]

సినిమా జీవితం

[మార్చు]

1924లో బెంగుళూరులో కొత్త థియేటరును నిర్మించారు. వారు ప్రదర్శిస్తున్న "కబీరుదాసు" నాటకాన్ని చిత్రంగా తియ్యాలనే ఉద్దేశ్యంతో రంగయ్య నాయుడు అనే ఆయన అడిగాడు. కావలసిన పరికరాలు తెప్పించి థియేటరులోనే ఆయన ఆ చిత్రాన్ని నిశ్శబ్ద చిత్రంగా తీశాడు. కొంత మాత్రం భద్రావతీ ప్రాంతాల అవుట్ డోర్ లో తీసారు. పాత్రధారులందరూ ఆ నాటక సమాజం వారే. ఆ విధంగా అతనికి సినిమా రంగ ప్రవేశం జరిగింది.

ఆ తర్వాత సినిమా నిర్మాణం పట్ల ఉత్సాహం కలిగి సొంతంగా సినిమాలు తియ్యాలనే కోరిక అతనికి కలిగింది. బెంగళూరులోనే ఒక పెద్ద బంగళా తీసుకొని, సినిమా తియ్యడానికి కావలసిన పరికరాలు తెప్పించి, "హరిమాయ" అన్న నిశ్శబ్ద చిత్రం తీసారు. ఆ కంపెనీ పేరు కర్ణాటక ఫిలిం కంపెనీ. వై.వి.రావు ఆ చిత్రాన్ని డైరక్టు చేసాడు. డిస్ట్రిబ్యూషన్ కూడా వై.వి.రాజు చేసాడు. ఆ తర్వాత "హిజ్ లవ్ ఎఫైర్" అన్న సాంఘిక చిత్రం తీసారు. దాన్ని ఆల్ గుడ్ అనే ఆయన దర్శకత్వం వహించాడు. 1927 నుండి అతని భార్య బి.జయమ్మ కూడా ఆ సంస్థ నాటకాల్లోనూ, సినిమాల్లోనూ నటించసాగింది.

1940 లో గుబ్బి కంపెనీ పేరిట పూనాలో "సుభద్ర" చిత్రం తీశారు. ఇది టాకీ కన్నడం. హొన్నపప్ భాగవతార్ నటించారు. పి.పుల్లయ్య ఈ చిత్రాన్ని డైరెక్టు చేశాడు. చిత్ర ప్రారంభోత్సవంలో శాంతారామ్ పాల్గొని, కెమేరా 'స్విచ్ ఆన్' చేశారు. 1942 లొ 'జీవన నాటక' అనే సాంఘీక చిత్రం కోయంబత్తూరులో తీశారు. జయమ్మ, కెంపరాజ్ మొదలైనవారు నటించారు. ఆ తర్వాత, మద్రాసు న్యూటోన్ లో "హేమారెడ్డి మల్లమ్మ" చిత్రాన్ని నిర్మించారు. అతనూ, అతని భార్య జయమ్మ ఇందులో నటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ రాష్ట్రాలలో కూడా విజయవంతంగా నడిచింది. "మల్లమ్మ" షూటింగు సమయంలోనే జయమ్మ "స్వర్గసీమ" చిత్రంలో నటించింది. ఐతే అతను ఏ చిత్రాన్నీ డైరక్టు చెయ్యలేదు. నిర్మాతగానే వున్నాడు. కొన్ని చిత్రాల్లో నటించాడు.

వీరన్న ఆ తర్వాత, గుబ్బి కర్ణాటక ఫిల్ము, అన్న సంస్థను ఆరంభించి, చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. 'గుణసాగరి' అన్న చిత్రాన్ని కన్నడ, తమిళ భాషలలో నిర్మించారు. తర్వాత ఏ.వి.యమ్. స్టూడియోతో కలిసి, బేడర కణ్ణప్ప (తెలుగులో 'కాళహస్తి మహత్మ్యం') ఆదర్శవతి, సదారమ మొదలైన చిత్రాలు తీశాడు. కన్నడ హీరో రాజ్ కుమార్, అంతకు ముందు చిన్న పాత్రలు ధరించినా, 'బేడర కణ్ణప్ప' లో ముఖ్యపాత్ర ధరించి పేరు సంపాయించారు. 'సదారమ' చిత్రం తెలుగులో కూడా తీశాడు. జానకి, రేలంగి, వీరమ్మ మొదలైన వారు నటించారు. "పారాల్ పసి తీరుమ్" అన్న తమిళ చిత్రాన్ని కూడా తర్వాత నిర్మించాడు. పై చిత్రాలే కాక, వీరన్న మరికొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయనకు నలుగురు భార్యలు, వారిలో ముగ్గురి పేర్లు: సుందరమ్మ, భద్రమ్మ, జయమ్మ. నాటక రంగం పట్ల ఆయన తిరుగులేని నిబద్ధతతో కృషిచేశారు. దీనికి తార్కాణంగా ఒక సంఘటన చెప్తారు, గుబ్బి హంపణ్ణ రెండో భార్య సుందరమ్మ మరణించిన సంగతి రంగస్థల వేదికపై  ఉండగా  తెలిసింది.  పిల్లలతో  కూడి  నటనలో  నిమగ్నమైన  ఆయన  ప్రదర్శనను  ఆ కారణంగా ఆపడం కానీ, వేదిక  దిగి  వెళ్ళడం  కానీ  చేయలేదు.  నాటకం  పూర్తయ్యాకనే వెళ్ళారు. 

పురస్కారాలు

[మార్చు]

నాటక రత్న బిరుదు, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1955లో సంగీత నాటక అకాడెమీ ద్వారా నటన రంగంలో సంగీత నాటక అకాడెమీ పురస్కారాన్ని[4], కళారంగానికి చేసిన సేవకుగాను భారత ప్రభుత్వపు నాలుగవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్నారు. 

మూలాలు

[మార్చు]
  1. Deepa Ganesh. "Dramatic silences". Online Edition of the Hindu, dated 6 March 2003. 2003, the Hindu. Archived from the original on 22 December 2004. Retrieved 19 June 2007.
  2. ప్లాష్ బ్యాక్, గతకాలపు సినీ స్మృతులు -  కౌముది ప్రచురణ సంఖ్య 158
  3. K. Chandramouli (17 October 2002). "All the city was a stage for them". The Hindu. Chennai, India. Archived from the original on 21 October 2010. Retrieved 19 June 2007.
  4. "SNA: List of Akademi Awardees". Sangeet Natak AkademiOfficial website. Archived from the original on 31 మార్చి 2016.