గూడూరు శేషారెడ్డి
గూడూరు శేషారెడ్డి లేదా దేశిరెడ్డి శేషారెడ్డి (మ.1943) భారత జాతీయోద్యమకారుడు, కుస్తీ వీరుడు. జాతీయోద్యమంలో భాగంగా సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో పాల్గొని రెండు సార్లు జైలుకు వెళ్ళాడు. జైలులో ఖైదీల హక్కుల కోసం పోరాటం చేసి వార్డర్ల హింసను అనుభవించాడు. గూడూరులో మద్యపాన వ్యతిరేకోద్యమానికి నాయకత్వం వహించాడు. ప్రమాదవశాత్తూ కాలును కోల్పోయాడు. తర్వాతి కాలంలో రైతు ఉద్యమాల నుంచి విడిపోయి, జమీందారుకు అనుకూలమైన పత్రిక నెలకొల్పి నడిపడంతో అపఖ్యాతి పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధాన్ని సమర్థించి క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉండిపోయాడు. 1943లో రాచపుండు కారణంగా చనిపోయాడు.
జీవిత విశేషాలు
[మార్చు]దేశిరెడ్డి శేషారెడ్డి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణానికి చెందినవాడు. గూడూరుకు చెందినవాడు కావడంతో తోటి జాతీయోద్యమకారులు గూడూరు శేషురెడ్డి అని పిలిచేవారు, అదే స్థిరపడింది. అతను బలప్రదర్శనలు చేసే వస్తాదు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తోటి నెల్లూరు జిల్లా జాతీయోద్యమ నాయకులతో పాటుగా రాయవెల్లూరు కారాగారంలో జైలు శిక్ష అనుభవించాడు. రాజకీయ ఖైదీలను విడిగా ఉంచే పద్ధతి ఏర్పాటు కాకపోవడంతో సామాన్య ఖైదీలతో పాటుగా ఉండేవాడు. శేషారెడ్డి ఖైదీల హక్కుల కోసం జరిగిన సమ్మెకు నాయకత్వం వహించి వార్డర్ల చేతుల్లో దారుణమైన దెబ్బలు తిని, స్పృహ కోల్పోయాడు. అందరూ అతను మరణించాడనే భావించారు కానీ బ్రతికాడు.[1] చక్రవర్తి రాజగోపాలాచారి జైలు జీవిత అనుభవాలు రాసుకున్నప్పుడు కూడా అందులో జైల్లో శేషారెడ్డి సాహసాలను, త్యాగాన్ని పేర్కొన్నాడు.
జైలు నుంచి విడుదల అయ్యాకా గూడూరులో జరిగిన మద్యపాన వ్యతిరేకోద్యమానికి శేషారెడ్డి నాయకత్వం వహించాడు. అతని యువబృందం తాగుబోతులకు వణుకు పుట్టించేది. 1926లో బలప్రదర్శనల్లో భాగంగా కారును నిలువరించే ప్రదర్శన చేస్తూ డ్రైవర్ అజాగ్రత్త వల్ల శేషారెడ్డి కాలు మీద నుంచి చక్రం వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో చక్రం కింద పడిన కాలు నలిగిపోయింది. మద్రాసులో చికిత్స జరిగి కృత్రిమ పాదాన్ని ఏర్పాటుచేసినా అతను మామూలుగా నడవడం సాధ్యం కాలేదు.
1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలోనూ శేషారెడ్డి పాల్గొన్నాడు. తిరిగి జైలు జీవితాన్ని అనుభవించాడు. శేషారెడ్డి నెల్లూరు వెంకట్రామా నాయుడు అనుచరుడు. సంఘ సంస్కర్త, జాతీయోద్యమకారిణి పొణకా కనకమ్మకు, నాటి వెంకటగిరి జమీందారుతో వివాదం ఏర్పడినప్పుడు రామానాయుడు, శేషారెడ్డి వెంకటగిరిలో మకాం చేసి మధ్యవర్తిత్వానికి ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వెంకటగిరి జమీందారుతో శేషారెడ్డికి స్నేహం ఏర్పడింది. తర్వాతి కాలంలో శేషారెడ్డికీ, రైతు ఉద్యమకారులకు విభేదాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో జమీందారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో స్వతంత్ర రైతు అన్న వారపత్రిక ఏర్పాటుచేసి కొద్దికాలం నిర్వహించాడు. పేరుకు శేషారెడ్డి పత్రికే అయినా మొత్తం నిర్వహణ, పత్రికలో వచ్చిన రచనలు మొదలైనవి అన్నీ జమీందారు కనుసన్నల్లోనే సాగాయి. ఈ చర్య అతనికి మాయని మచ్చగా నిలిచింది. మరుపూరు కోదండరామరెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ "పదేళ్ళు జాతీయోద్యమంలో సంపాదించిన మంచిపేరును ఒక్క అనాలోచిత చర్యతో పోగొట్టుకొని అప్రతిష్ట మూటకట్టుకున్నాడు" అన్నాడు. 1942లో శేషారెడ్డి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా పరిగణించి కాంగ్రెస్ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలానికి రాచపుండు (carbuncle) కారణంగా 1943 జనవరి 7న శేషారెడ్డి మరణించాడు.
లెగసీ
[మార్చు]శేషారెడ్డి 1930వ దశకంలో జమీందారుకు అనుకూలమైన కీలుబొమ్మ పత్రిక నడపడం కారణంగా తాను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు కోల్పోయాడు. క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉండడం కూడా ఇందుకు తోడైంది. గూడూరు జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణలో తాలూకాలో జాతీయోద్యమంలో భాగంగా జైలుకు వెళ్ళినవారి పేర్లు చెక్కించి ఆవిష్కరించినప్పుడు శేషారెడ్డి పేరు లేదు. శేషారెడ్డి రెండోసారి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించినా సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా జైలుకు వెళ్ళాడని 1930లో శాసనోల్లంఘనలో పాల్గొన్నందుకు నేరారోపణ రుజువైందని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన గ్రంథంలో పేర్కొన్నారు.
శేషారెడ్డి జాతీయోద్యమంలో, జమీందారి రైతు పోరాటంలో నిర్వహించిన పాత్ర అక్కడక్కడ, పత్రికల్లో, చరిత్ర పుస్తకాల్లో విడివిడిగా గోచరిస్తుంది. చరిత్రకారుడు కాళిదాసు పురుషోత్తం తన పెన్నా ముచ్చట్లు గ్రంథంలో శేషారెడ్డి గురించి ప్రత్యేకించి రాశాడు.[2]
ఆధారాలు
[మార్చు]ఆధార గ్రంథాలు
[మార్చు]- అయ్యంగారు, పార్ధసారధి. కాంగ్రెస్ సేవ.
- గుద్దేటి, వీరసుబ్రహ్మణ్యం. సత్యాగ్రహ సమరచరిత్ర.
- పొణుకా, కనకమ్మ. కనకపుష్యరాగం.
మూలాలు
[మార్చు]3. Prof Regani, Who is who freedomstruggle in AP.