Jump to content

గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళు

వికీపీడియా నుండి
కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు
కులము స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవులు గాచిన
కొండక శిశువుకు గొబ్బిళ్ళో

అంటూ అన్నమయ్య తన మృదు మధురమైన పద జాలంతో శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం, శిశుపాలుని, కంసుడిని వధించడం వంటి సాహసాలను వివరించడం ద్వారా శ్రీ కృష్ణుడే వెంకటేశ్వరునిగా జన్మించాడని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు. ఆంధ్ర దేశం లో అన్ని ప్రాంతాల్లోనూ సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటి ముందూ ఆడ పిల్లలు రక రకాలుగా రంగ వల్లులను తీర్చి దిద్ది వాటిమీద ఈ గొబ్బెమ్మ లను ఉంచుతారు. వాటిని పసుపు, కుంకుమ లతో పూలతో అలంకరిస్తారు. వీటిని గొబ్బెమ్మలని, గురుగులను గొబ్బియ్యల్లనీ ఆయా ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు.

సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మ పాటలు

[మార్చు]
సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు

సంక్రాంతి సమయంలో బజారులన్నీ గొబ్బెమ్మలతో కళకళలాడుతూ పుంటాయి. సంక్రాంతి పండుగ వస్తూందంటే ఆడ పిల్లలకి ఎక్కడ లేని ఆనందం. పంట పొలాలనుండు పంటలు ఇంటికి వచ్చి ధాన్య రాసులతో కళకళ లాడుతూ ఉంటాయి. పంట లక్ష్మిని ఇంటికి తెచ్చుకున్న రైతు బిడ్డలు ఆనందోత్సాహాలతో ఈ పండగను జరుపుకుంటారు. ముద్దు లొలికే ముగ్గులతో ఇళ్ళనన్నిటినీ శోభాయ మానంగా తీర్చి దిద్దుతారు.

ఆడపిల్లలు ఆవు పేడను తీసుకు వచ్చి వాటిని గుండ్రంగా చేసి గొబ్బెమ్మను తయారు చేస్తారు. పై భాగాన గురుగు చేసి అందులో గుమ్మడి పువ్వులను గుచ్చుతారు. వాటిని తీసుకు వెళ్ళి ముగ్గుల మధ్య వరుస క్రమంలో సుందరంగా అమర్చుతారు. వాటికి నైవేద్యంగా పండ్లను ఉంచుతారు. తరువాత రంగు రంగుల దుస్తులు ధరించిన ఆడపిల్లలు, అనందంగా అందరూ వలయాకారంగా నిలిచి, చప్పట్లు చరుస్తూ పాట పాడుతూ, పాటకు తగినట్లు అడుగులు వేస్తూ, పాట గమనాన్ని బట్టి వేగాన్ని పెంచుతూ గొబ్బి పాటలను వీనుల విందుగా పాడుతూ, తమ భక్తి శ్రద్ధలను వెల్లడిస్తారు. ఇలా ప్రతి ఇంటి ముందూ గొబ్బి పాటలు పాడుతూ ఉంటే, బజారంతా శోభాయమానంగా ఉంటుంది. అన్నమయ్య లాంటి వాగ్గేయకారులందరూ గొబ్బి పదాలను రచించారంటే వాటి ప్రాముఖ్యాన్ని మనం గమనించ వచ్చును. రాయలసీమ ప్రాంతంలో పాడుకునే ఒక గొప్ప పదాన్ని గూర్చి, ఈ.ఎల్. ఎస్. చంద్ర శేఖర్ ఇలా వివరిస్తున్నాడు:

కంచికి పోయే గాజుల సెట్టి

[మార్చు]

రాయలసీమ ప్రాంతంలో పాడుకునే పాటలో కంచికి పోయి వస్తున్న గాజుల శెట్టిని ఓ భక్తురాలు కంచిలో నెలకొన్న దేవత గురించి అడిగి తెలుసుకునే పాట ఈ విధంగా ఉంటుంది.

గొబ్బియాలో కంచికి పోయే గాజుల శెట్టీ
గొబ్బియాలో కంచిలో మాచమ్మ ఎవరాడబిడ్డ
గొబ్బియాలో సింతాకు రాసేటి శివుని బారియ
గొబ్బియాలో మరు భూములే లేటి మంగ మరదాలు
గొబ్బియాలో గాకాకు రాసేటి రాజు కోడలు.

గొబ్బి అనే పదం గర్భా అనే పదం నుంచి ఉద్భవించిందని డాక్టరు బి.రామరాజు, టి దోణప్పలు అభి ప్రాయాలను వెల్లడించారు. గర్భా అనేది ఒక నృత్య విశేషానికి సంకేతంగా ఉంది. గర్భా నృత్యాలు కొన్ని ప్రాంతాలలో ప్రచారంలో ఉన్నట్లు వినికిడి. ఏది ఏమైనా గొబ్బిపాటలు మన గేయ సాహిత్యంలో స్థానం సంపాదించు కోవటంతో పాటు ప్రముఖ వాగ్గేయ కారుల్ని కూడా ఆకర్షించాయి. కొన్ని గొబ్బి పాటల్లో కథా గేయాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో కామన్న కథను చంద్ర శేఖర్ ఇలా ఉదహరించాడు.

కామన్న కథ

[మార్చు]

కామన్న కథ సారాంశం: కామన్న తన అక్క కుమార్తె ఇంటికి వెళతాడు. తన అక్క కూరురు పట్ల ఆకర్షితుడై కామన్న ఆమెను పట్టు కుంటాడు. ఆమె వాళ్ళన్న భీమన్నకు చెపుతుంది. అతడు చెల్లెలి వేషం ధరించి, కామన్న దగ్గరికి వెళ్ళాడు. అతను మారు వేషంలో ఉన్న భీమన్నను పట్టుకుని కదిలిస్తూ మాట్లాడతాడు. కోపం వచ్చిన భీమన్న కామన్నను వధిస్తాడు. ఆ కథను ఈ విధంగా పాటలో....................

అమ్మో రావమ్మో మము గన్న తల్లో గొబ్బిళ్ళీ
నీ ముద్దు తమ్మునకు పాడె గట్టమో గొబ్బిళ్ళో
అందరిండ్ల ముందర వాలాలాడనీ గొబ్బిళ్ళో
భీమన్న ఇంటి ముందర కాకులాడానీ గొబ్బిళ్ళో
భీమన్న ఇంటి ముంద నెత్తురు కాలవలె గొబ్బిళ్ళో

ఇలా ఆ పాట సాగురుంది. గొబ్బి పాటల్లో పౌరాణిక గాథలకు సంబంధించిన పాటలు ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో గొబ్బి గౌరి వ్రతం చేస్తారు. వివిధ కోర్కెలు తీర్చమని, పాటలు పాడతారు.

సుబ్బీ గొబ్బొమ్మా సుఖము లియ్యవే
చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే
మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే.
మొగిలి పువ్వంటి మొగుణ్ణియ్యవే..


అంటూ తమకు ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. అలాగే ఇంటి ముందు కళకళ లాడే ముగ్గు లను వర్ణిస్తూ వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తూ

గొబ్బియళ్ళో, గొబ్బి యని పాడారమ్మ
కంచి వరద రాజునే గొబ్బియళ్ళో
గొబ్బియ్యళ్ళో అంచు లంచుల అరుగుల మీద
పంచవన్నె ముగ్గులే గొబ్బియళ్ళో..

అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన పాటలు అనేకం ఉన్నాయి. ఈ పాటలకూ గొబ్బెమ్మలకు ఈ నాడంత ప్రాముఖ్యత లేక పోయినా ఆనాడు అవి ప్రజలను అలరించాయి. ఆ నాటి గొబ్బి ఆట పాటల్లో నృత్యాలలో ఆడ పిల్లలు ఓలలాడారు. నాగరికత బలిసిన పట్టణాల్లో ఈ కళారూపం కనిపించ కుండా పోయినా పల్లె ప్రజలు హృదయాల్లో పదిలంగానే ఉన్నాయి గొబ్బి పాటలు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

సూచికలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]