Jump to content

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

వికీపీడియా నుండి
(మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి నుండి దారిమార్పు చెందింది)
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
జననంమిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
జూలై 7, 1916
గుంటూరు జిల్లా లింగాయపాలెం
మరణంఫిబ్రవరి 22, 2011
విజయవాడ
మరణ కారణంమూత్ర సంబంధమైన అనారోగ్యం
ఇతర పేర్లుమిక్కిలినేని
ప్రసిద్ధిప్రముఖ తెలుగు రంగస్థల , సినిమా నటులు , రచయిత
మతంహిందూ
భార్య / భర్తసీతారత్నం
Notes
ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదు

మిక్కిలినేని గా పేరొందిన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) తెలుగు రంగస్థల, సినిమా నటులు, రచయిత.

జీవిత చరిత్ర

[మార్చు]

వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి

1949లో కేఎస్ ప్రకాశ రావు దీక్షతో మొదలై బాలకృష్ణ సినిమా భైరవద్వీపం వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు.

స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని ఐదుసార్లు జైలుకు వెళ్ళాడు, కమ్యూనిస్టు. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటుడు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవాడు, ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, ‘తెలుగువారి జానపద కళారూపాలు’ గ్రంథ రచయిత. ‘మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళావికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత. ఎనభై ఏళ్లనాడు భార్యను నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారుడు. జీవించి ఉన్న వాళ్లల్లో ఆయనతో పోల్చదగిన వారు అరుదు. గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914, జూలై 7న జన్మించారు మిక్కిలినేని. అయినవాళ్లు నష్టజాతకుడన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం గడచింది. కపిలవాయి రామనాథ శాస్ర్తి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటి పేరు ను నిలబెట్టి సార్థక నామదేయుడు అయ్యారు.

కొన్ని రోజులుగా మూత్ర సంబంధమైన అనారోగ్యంతో బాధపడ్డ ఈయన 2011 ఫిబ్రవరి 22వ తేదీన మంగళవారం తెల్లవారు ఝామున సుమారు మూడు గంటలకు తన 95వ ఏట విజయవాడని ఆసుపత్రిలో మరణించారు.[1] "మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించి వున్న తెలుగు సినీ కళాకారుల్లో తానే పెద్ద" అన్నారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుగారు.‌ నాయక పాత్రలు-అనామక పాత్రలు అనే సినీ కొలమానంతో ‘అక్కినేని ఎక్కాల్సిన మెట్లూ-మిక్కిలినేని దిగాల్సిన మెట్లూ లేవు’ అనే వాడుక లోని చమత్కారమూ నిజమే!

మిక్కిలినేని వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీయంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్-నైజాం నియంతృత్వానికి, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీల అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్యమండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని నాటక రంగానికి పరిచయం చేశారు.

పల్నాటియుద్ధం-బొబ్బిలియుద్ధం-కాటమరాజు కథ తదితర 30 చారిత్రక-జానపద కళారూపాల ద్వారా ప్రజలను సమీకరించిన ప్రజానాట్యమండలి 1940లలో నిషేధానికి గురైంది. ఫలితంగా కొందరు సినీరంగాన్ని ఆశ్రయించారు. వారిలో కేబీ తిలక్, తాతినేని ప్రకాశరావు, గరికపాటి రాజారావు, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, సి.మోహనదాసు, టి.చలపతిరావు, వి.మధుసూదనరావు, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వంటి ముఖ్యులున్నారు.

వీరిలో నాటకరంగం నేపథ్యంగా సినీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఎందరో ఉన్నారు. నాటకరంగాన్ని విడవని నాగభూషణం వంటి నటులూ ఉన్నారు. నాటక రంగానికి చెందిన 400 మంది కళాకారులను ‘నటరత్నాలు’ శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేశాడు. వీధినాటకాలు-జముకుల కథలు-బురక్రథలు ప్రదర్శించిన పాత రోజులను మరవకుండా, పాత స్నేహితాలను పునరావిష్కరించుకుంటూ తెలుగునేల నాలుగు చెరగులా తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ రచించారు. డక్కికథ అనే పేరు నుంచి బురక్రథ అనేపేరు వచ్చిందని తన రచనలలో మిక్కిలినేని వివరించారు. అరవపల్లి సుబ్బారావు, ఆరణి సత్యనారాయణ, దేవతాసుబ్బారావు, నరసింహగుప్త, రెంటచింతల సత్యనారాయణ, భీమప్ప శ్రేష్టి, వంకాయల సత్యనారాయణ, రేపల్లె వెంకటశేషయ్య తదితర నటులు తమవారని తెలుసుకున్నామని, మిక్కిలినేని పరిశోధనలకు వైశ్యప్రముఖులు నివాళి పలికారు. వివిధ సామాజిక వర్గాలు తమ వారి వేర్లను/పేర్లను గుర్తించేందుకు ఉపకరించాయి మిక్కిలినేని రచనలు.

సినీజీవితంలో ప్రవేశించేముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయన కుమారుడు డా.విజయకుమార్ వెటర్నరీ వైద్యులుగా పదవీ విరమణ చేశాడు. మిక్కిలినేనికి ఇరువురు కుమార్తెలు.

రచనలు

[మార్చు]
  • నటరత్నాలు (1980, 2002)
  • ఆంధ్ర నాటకరంగ చరిత్ర
  • తెలుగువారి జానపద కళారూపాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1992.
  • ప్రజా పోరాటాల రంగస్థలం
  • ఆంధ్రుల నృత్య కళావికాసం
  • తెలుగువారి చలన చిత్ర కళ

నటించిన సినిమాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  1. 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.
  2. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం

బయటి లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 23.02.2011